Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్
Jhansi-Laxmibhai

వీరత్వం అనేది ప్రతి మనిషిలోనూ ఉండే, ఉండవలసిన సహజలక్షణం, ధర్మం. ఆ లక్షణం మన ఆలోచనలలో స్థిరంగా ఉండి భౌతికంగా ధృడంగా ఉన్నప్పుడు ఆ ధర్మం ద్విగుణీకృతము అవుతుంది. సహజంగా మగవారు దేహధారులు కనుక వీరత్వం అనేది మగవారిని ఉద్దేశించి వీరుడు అని నిర్వచించి ఆ పదమే వాడుకలోకి వచ్చింది. కానీ స్త్రీలు కూడా ధీరోదాత్తులే అని నిరూపించి సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య దాష్టికానికి ఎదురొడ్డి ధైర్యంగా పోరాడి అసువులు బాసిన వీర వనిత, ఎంతో మంది మహిళలకు వారిలో సహజంగా నిద్రాణమై ఉన్న ధీరత్వాన్ని, ధైర్యాన్ని గుర్తించి వారిని వీర నారీమణులుగా, వీర మాతలుగా తీర్చిదిద్దిన శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయ్ నేటి మన ఆదర్శమూర్తి.

అత్యంత సంప్రదాయకర కుటుంబంలో 1828 వ సంవత్సరంలో పుట్టి సాధారణ బాలికగా ఎదిగిన ఝాన్సీ రాణి అసలు పేరు మణికర్ణిక. బాల్యంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి సంరక్షణలో ఎదిగింది. ఆ పిమ్మట బాజీరావు పీష్వా ఆమెను ఆదరించి తన పిల్లలతో పాటు అన్ని విద్యలూ ఆమెకు నేర్పించారు. రాజరికపు విద్యలైన కత్తిసాము, గుర్రపుస్వారీ చేస్తూ కత్తి యుద్ధం చేయడం వంటి ఎన్నో కృత్యాలను అత్యంత ప్రతిభతో ఆమె నేర్చుకొని అన్నింటిలోనూ అత్యంత ప్రావీణ్యతను సాధించింది.

1842 వ సంవత్సరంలో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర రావు నెవల్కర్ ను పరిణయమాడి ఝాన్సీ కి మహారాణి అయ్యింది. పుట్టిన బిడ్డ మరణించడం, భర్త అనారోగ్యం కారణంగా దామోదర రావు అనే పిల్లాడిని 1953 లో దత్తత తీసుకొని భర్త మరణానంతరం రాజ్య భారంతో పాటు పిల్లాడిని కూడా తనే పెంచి పెద్ద చేసింది. తన రాజ్యంలో ఉన్న ఎంతో మంది మహిళలకు స్వీయ రక్షణ విద్యలలో తనే శిక్షణ నిచ్చి వారిని ధైర్యవంతులుగా తీర్చిదిద్దింది. అలాగే తన రక్షణ దళంలో పురుషులతో పాటు సమానంగా స్తీలకు కూడా అవకాశం కల్పించి వారిని సుశిక్షుతులుగా తయారుచేసింది.

అప్పుడే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతొ భారత దేశంలో ప్రవేశించిన బ్రిటిష్ వారు నెమ్మదిగా తమ రాజ్యకాంక్ష ను పెంచుకొంటూ తమ అధికారాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. మాతృభూమి మీది మమకారం, దేశభక్తి, పుట్టిపెరిగిన గడ్డ ను వేరే దేశం వాళ్ళు వ్యాపార దృక్పథంతో వచ్చి ఆ పిమ్మట నెమ్మదిగా ఆక్రమించి తమ రాజ్యాధికారాన్ని ఆపాదించి తమను పాలించడం మొదలుపెడితే చేతగాని వాళ్ళ లాగా చూస్తూ కూర్చొని వారికి తలవొంచి సర్దుకుపోతూ ఉన్న విధానం ఆమెకు నచ్చలేదు. అందుకే పోరాటపటిమతో ఎదురు తిరిగి శత్రుసైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలని ధృడంగా నిర్ణయించింది. 1857 లో ఆంగ్లేయుల రాజ్యాధికారాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన మొట్టమొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది.

ఆమె చూపిన పరాక్రమము, వెనుదిరగని వివేకము, మొక్కవోని ధైర్యము ఆమెను 19 వ శతాబ్దములో ఒక గొప్ప చారిత్రక ధీరోదాత్త మహిళగా ఎందఱో మహిళలకు స్ఫూర్తిగా నిలిపింది. ఆంగ్లేయ అధికారులు ఆమెను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆమె రాజ్యాన్ని, అధికారాన్ని, సంపదను దోచుకోవడానికి ప్రయత్నించినపుడు, అంతా కోల్పోయినను ఆత్మ విశ్వాసంతో భయపడి పారిపోకుండా వేలమంది సైనికులు, ఆయుధసంపత్తి కలిగిన బ్రిటిష్ వారితో తన చివరి శ్వాస వరకు పోరాడి, వీరమరణం పొందిన ఝాన్సీ లక్ష్మీ బాయి నేటికీ ఎంతోమంది దీరోదాత్తులకు, దేశభక్తి పరాయణులకు ఒక మహోత్తర ప్రకాశ ధ్రువతార గా నిలుస్తున్నది.

Posted in July 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!