Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

సమగ్ర ఆంధ్ర సాహిత్యం – 4వ యుగం ప్రారంభం
పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

పద్మనాయక రాజులు:

పద్మనాయక రాజులను గూర్చి ఆరుద్ర వివరణ: రేచర్ల వారు వెలమ వీరులు. వీరినే పద్మనాయకులంటారు. కాకతీయుల సామ్రాజ్యంలో గణపతిదేవ చక్రవర్తి కాలం నుండి వీరు సేనానులుగా ఉండేవారు. రుద్రమదేవి రాజ్యానికి వచ్చినప్పుడు ఆడది గద్దెక్కడం సహించలేని సామంతులు, సేనానులు తిరగబడినప్పుడు రేచర్ల ప్రసాదిత్యనాయకుడు ఆమె పక్షం వహించి పోరాడాడు. అందుకే అతనికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు వచ్చింది. అతని మనుమడు దాచానేడు ప్రతాపరుద్రుని వద్ద సేనాపతిగా ఉండేవాడు....” పేజీ 469.

ఆరుద్ర ఇచ్చిన పై వివరణ వల్ల రేచర్ల వెలమనాయకులను మాత్రం పద్మనాయకులు అంటారు అని తెలుస్తున్నది. వీరు వెలమ నాయక కులం వారు.

రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రునికి అమ్మమ్మ. తన అమ్మమ్మకు సహాయం చేసినందుకు కాబోలు ప్రతాపరుద్రునికి ఈ పద్మనాయకులైన వెలమ వీరులపై ఉన్న గౌరవంతో వారికి ఉన్నత పదవులను ఇవ్వడం వల్ల ఇతర వర్ణాల నాయకులు తిరగబడ్డారు (నాయక అనేది ఒక పదవి. కాకతీయ సామ్రాజ్యంలో 72 మంది నాయకులు ఉండేవారని వడ్డాది అప్పారావు గారు ఒక పట్టిక తయారు చేశారు. వీరిలో బ్రాహ్మణులు, రెడ్లు, వెలమలు, క్షత్రియులు మొదలైన అన్ని కులాలవారు ఉండేవారు). అప్పుడు క్రీ.శ. 1314 ప్రాంతంలో గండికోటలో చేరి ఈ నాయకులంతా పితూరీ చేశారు. ప్రతాపరుద్రుడు దానిని అణిచేశాడు. పద్మనాయకులైన వెలమ నాయకులు దక్షిణాన విజయం సాధించి ప్రతాపరుద్రుని కీర్తిని పెంచారు. అందుకే వారికి “పంచ పాండ్య దళ విభాళ”అనే బిరుదు వచ్చింది. దాచానేడు కుమారుడు సింగమ నాయకుడు ప్రతాపరుద్రునికి ప్రీతిపాత్రుడు. అందుకని ఈ సందర్భంగా ప్రతాపరుద్రుడు సింగమనాయకునికి ఎనభై వరాలు ఇచ్చాడట. సంస్కృతంలో ఎనభై అంటే “అశీతి” అంటారు. అందుకే సింగమనను ”అశీతి సింగమ నాయకుడు” అని పిలిచేవారు.

మహమ్మదీయులు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తినప్పుడు ఈ నాయకులందరూ ఒక్క తాటిపై నిలబడి ప్రతాపరుద్రునితో కలిసి శత్రువులతో పోరాడారు. ఈ పోరాటానికి నాయకత్వం వహించినది ముసునూరు నాయకులు. ఈ నాయకుని పేరు ముసునూరు ప్రోలయ నాయకుడు. మహమ్మదీయులపై తాత్కాలికంగా విజయం సాధించారు. ప్రతాపరుద్రుని మరణంతో తురుష్కులకు వశమైన ఓరుగల్లుకు 1338 లో విముక్తి లభించింది. మళ్ళీ ఓరుగల్లు కోట కొత్తళం మీద ఆంధ్రపతాకం ఎగిరింది. “ఆంధ్ర దేశాధీశ్వర. ఆంధ్ర సురత్రాణ’ బిరుదులతో ముసునూరి కాపయ నాయకుడు తెలుగు దేశానికి అధిపతి అయ్యాడు.

దేశానికి ప్రమాదం తప్పిందని తెలుసుకున్న రేచర్ల సింగమ నాయకుడు చెలరేగి ముసునూరి నాయకుని మరియు దక్షిణ దిశనున్న నాయకులను ఓడించి తన రాజ్యాన్ని కృష్ణానది వరకు విస్తరింపజేశాడు. కాపయ నాయకునితో యుద్ధం చేశాడు. జల్లిపల్లి కోటను ముట్టడించి అక్కడ ఉన్న క్షత్రియ వంశీయుల చేతిలో మరణించాడు. సింగమ నాయకుని కుమారులు, అనపోత నాయకుడు, మాదా నాయకుడు ఇద్దరూ తమ తండ్రిని చంపినందుకు చెలరేగి జల్లి కోటను ముట్టడించి అక్కడి రాజులను, అందరినీ చంపి ఆ రక్తంతో తండ్రికి తర్పణం వదిలారు. ఈ వెలమ సోదరులు అనేక యుద్ధాలు చేశారు. ముసునూరి కాపయ నాయకుని చంపి అనపోత నాయకుడు ఓరుగల్లును వశపరుచుకొన్నాడు. ఆంధ్ర రాజధాని ఓరుగల్లును జయించినా తన రాజధాని రాచకొండనే ఉంచుకొన్నాడు. దీనిని గూర్చి చెబుతూ “అనపోత నాయకుని కాలం నుంచి ఆ పద్మ నాయకుల చరిత్రే ఇప్పటి తెలంగాణా చరిత్ర అయింది. పశ్చిమాన ఉన్న బహుమనీ సుల్తానులతో సహజీవనం మంచిదని పద్మ నాయకులు భావించారు కాబోలు వాళ్ళతో సంధి చేసుకొన్నారు. గోలుకొండ ప్రాంతాన్ని వారికి వదిలివేశారు. అప్పుడు పద్మ నాయకులు అలా చేయబట్టే గోలుకొండ, భాగ్యనగరం రాజధానులుగా ఉత్తరోత్తరా తెలుగు రాజ్యాన్ని నవాబులు పాలించారు.” అని అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. 469-471).

పద్మనాయక-రెడ్డిరాజుల యుగం – ఈ పేరుకు ఉన్న చారిత్రక సంబంధం:

“పద్మనాయకులు విజృంభించి తెలంగాణలో తమ రాజ్యాన్ని విస్తరింప జేసుకొంటున్న సమయంలోనే అద్దంకి సీమలో రెడ్డి రాజులు స్వతంత్రించి రాజ్యం నిర్మించుకొన్నారు. ఒక రకంగా పద్మనాయకులు, రెడ్డి రాజులు ఆనాటి తెలుగు చరిత్ర కధానికి రెండు చక్రాలవంటి వారు అందుకే కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన తరువాత విజయనగరం విస్తరించి రాయల యుగం మొదలయ్యేదాకా ఉన్న మధ్య కాలం 150 సంవత్సరాలలో పూర్వార్ధాన్ని పద్మనాయక యుగమని, ఉత్తరార్ధాన్ని రెడ్డిరాజుల యుగమని పేర్కొంటున్నాం. పద్మనాయక యుగంలో ఇతర రాజుల పోషకంలో ఉన్న కవులు కూడా వస్తారు. క్రీ.శ.1375 దాకా పద్మనాయక యుగమని చెప్పుకొందాం.” అని ఆరుద్ర ఈ కాలం యొక్క విశేషాలను వివరించారు. సాహిత్య చరిత్రకు ఆయా కాలాల చరిత్ర, రాజుల చరిత్ర ఒక పరిపూర్ణత్వాన్ని సిద్ధింపచేస్తుందన్న ఒక గొప్ప సత్యాన్ని గుర్తించిన మహా మనిషి, సద్విమర్శకుడు, సాహిత్యకారుడు అని ఈ సందర్భంగా ఆరుద్రను ప్రస్తుతించడం మన కనీస ధర్మం. ఒక రకంగా చరిత్ర తెలుసుకోకుండా సాహిత్య చరిత్ర తెలుసుకోవడం, తలలేని శరీరాన్ని గూర్చి తెలుసుకోవడమే అవుతుంది.

రెడ్డిరాజుల యుగం : రెడ్ల పుట్టుపూర్వోత్తరాలు

రెడ్డి రాజ్య స్థాపకుడు వేమారెడ్డి. యితడు క్రీ.శ. 1325 -53 మధ్యకాలం వాడు. ఇతడు అశీతి సింగమనాయకునికి సమకాలికుడు. ఇతడు అద్దంకి సీమను పాలించాడు. కవిత్రయంలో మూడో వాడైన ఎఱ్ఱాప్రెగ్గడ ఇతని ఆస్థానంలో ఉండినాడు. ఈ సందర్భంగా ఆరుద్ర పద్మనాయక రాజులైన ఐదుగురిని, వారి కాలాలను, అలాగే రెడ్డి రాజులైన నలుగురి పేర్లు, వారి కాలాలను సూచించారు. ఈ శతాబ్ది కవులను వారి చరిత్రను అర్థం చేసుకోవడానికి కొంతైనా రాజకీయ చరిత్ర తెలుసుకోవాల్సి వచ్చిందని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు. రెడ్డిరాజుల కాలం నాటి ఆంధ్రదేశాన్ని ఒక పటంలో చూపించారు ఆరుద్ర.

రెడ్ల యొక్క ప్రాచీనత: రెడ్డి రాజ్య స్థాపనకు సుమారు ఏడొందల ఏళ్ళ ముందు క్రీ.శ.7 వ శతాబ్దిలో ప్రతి ఊళ్ళోనూ రెడ్లు ఉండేవారని శాసన ప్రమాణం ఉంది. (స.ఆం.సా. పేజీ 476).

అయితే అప్పుడు వారిని ‘రట్టగుళ్ళు’ అనే పేరుతో పిలిచేవారు. క్రీ.శ. 632 లో ప్రథమ విష్ణువర్ధనుడు వేయించిన చీపురుపల్లి శాసనంలో ‘రాష్ట్ర కూట ప్రముఖాన్ కుటుంబినః’ అనే పదానికి ‘సేద్యం చేసేవాళ్ళు’ అని అర్థం. రెడ్లను గూర్చి ఆరుద్ర వివరణ ఇది. (స.ఆం.సా. పేజీ 476).

ఆదిమ కాలంలో కాడి పట్టుకొని సేద్యం చేసే ఈ పంట రెడ్లు కాకతీయుల కాలం నాటికి కత్తి పట్టి కదనంచేసే స్థాయికి ఎదిగారు. కాకతీయుల తర్వాత పద్మనాయకులు రాచకొండ, దేవరకొండ రాజ్యాలను, పంట రెడ్లు కొండవీటి రెడ్డి రాజ్యాన్ని, సంగమ వంశీయులు విజయనగర రాజ్యాన్ని స్థాపించుకొని పాలనను సాగించారు. ప్రస్తుతం రెడ్డి రాజుల చరిత్ర చెప్పుకోవడం జరుగుతుంది.

రెడ్డి రాజ్య స్థాపన క్రీ.శ. 1325 లో జరిగింది. దీనిని స్థాపించి, విస్తరింపజేసిన వాడు ప్రోలయ వేమారెడ్డి. తన తనుజులకు, అనుజులకు పెద్ద రాజ్యాన్ని సంపాదించి ఇచ్చాడు. అయితే పద్మనాయక రాజుల ధాటికి తట్టుకొని ఈ రెడ్డిరాజ్యం క్రీ.శ.1353 -64 మధ్య ఉన్న అనపోతారెడ్డి కాలం దాకా కొనసాగింది. అయితే తర్వాత కొమరగిరి రెడ్డి రాజుగా ఉంచి అతని బావమరిది కాటయవేముడు రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. అందువల్ల 1376 నుండి రెడ్డి రాజుల యుగాన్ని లెక్కగట్టారు ఆరుద్ర.

ప్రోలయ వేమారెడ్డి అన్న యొక్క రాజ్యం చందవోలు. ప్రోలయ కొండవీడు రాజధానిగా చేసుకొన్నాడు. ఇదే సమయంలో పద్మనాయక, పంట రెడ్లే కాక మరికొందరు సొంత రాజ్యాలు ఏర్పరుచుకొన్నారు. వారిలో హరిహర రాయలు, బుక్క రాయలు ముఖ్యులు. వీరిరువురు సోదరులు. ఈ కంపిలి రాజ్యమే తరువాత విజయనగర సామ్రాజ్యంగా పరిణమించింది. పద్మనాయక, రెడ్డిరాజుల, కంపిలి రాజుల చరిత్ర ఏక కాలానికి చెందినదే. ఈ విధంగా పద్మనాయక రెడ్డి రాజుల యుగం యొక్క చరిత్రను ఆరుద్ర మొదట పరిచయం చేసి, అటు పిమ్మట ఆయా రాజుల కాలంనాటి సాంఘిక, సాహిత్య చరిత్రలను గూర్చి తనదైన శైలిలో చర్చించారు. అందులో కొన్ని ముఖ్యాంశాలను, కవులను గూర్చి ప్రస్తుతం వివరించడం జరుగుతుంది. దీని తర్వాత యుగాన్ని ‘తొలి రాయల యుగం’గా ఆరుద్ర పేర్కొన్నారు.

రెడ్డి రాజుల పేర్లను గూర్చి ఆరుద్ర కొంత వివరణ ఇచ్చారు. అది “రెడ్డి రాజులలో ‘వేమ’ అనే పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను సగిగా గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళను, తండ్రి పేరుతో కలిపి పిలిచేవారు. ‘కాటయ వేముడు’ అంటే ‘కాటయ రెడ్డి కుమారుడైన వేమా రెడ్డి’ అని అర్థం. ‘పెదకోమటి వేమారెడ్డి’ అంటే తండ్రిపేరు పెదకోమటి.” (స.ఆం.సా. పేజీ 482).

**** సశేషం ****

Posted in July 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!