Menu Close
alexa
అలెక్సా (కథ)
ఆర్ శర్మ దంతుర్తి

ఆఫీసు గదిలో కూర్చుని సీరియస్ గా పనిచేసుకుంటున్న మోహన్ రావు దగ్గిరకొచ్చి అన్నాడు కొడుకు “డాడ్, నాకో లాప్ టాప్ కొనాలి ఈ రోజు.”

“అదేవిటి, ఇప్పటికే నీకు సంగీతం వినడానికి ఐ-పోడ్, ఆడుకోవడానికో టాబ్లెట్, ఇక్కడ మరో డెస్క్ టాప్ ఉన్నాయిగా? నిండా పదకొండేళ్ళు లేవు గానీ ఇవన్నీ నీకెందుకురా అసలు?”

“కోవిడ్ వల్ల స్కూళ్ళు మూసేసారుగా, ఇప్పుడు పాఠాలన్నీ ఇంటర్నెట్ మీద చెప్తున్నారు. హోమ్ వర్క్ ఏదైనా ఉంటే గూగిల్ డాక్యుమెంట్లు వాడాలి. అస్తమానూ డెస్క్ టాప్ మీద కూర్చోవడం కుదరదు ఒకే రూములో, బోరు కొడుతోంది. అందుకే…”

మాట్లాడే కుర్రాణ్ణి మధ్యలో ఆపి చెప్పేడు, మోహన్ రావు, “మీ స్కూల్ వాళ్ళు అందరికీ తలో చిన్న క్రోమ్ బుక్ ఇస్తున్నారుగా అది తీసుకో.”

“క్రోమ్ బుక్ దరిద్రం డాడ్, అది బాగోదు. నాకు విండోస్ సిస్టం కావాలి.”

మొహం జేవురించింది మోహన్ రావుకి. కోపం చూపిస్తూ చెప్పేడు, “ఇంక మాట్లాడకు, ఫో. డబ్బులు చెట్లకి కాస్తున్నాయనుకుంటున్నావా? నెలకి మూడేసి వందలు ఈ కంప్యూటర్లమీదే పోతోంది. అదీ గాక నెట్ ఫ్లిక్స్ అనీ డిస్నీ అనీ అమెజాన్ అనీ వేరు వేరు గా నెలకింత అని తగలేస్తున్నారుగా?”

కుర్రాడికి ఏడుపొచ్చింది కాబోలు, వెళ్ళబోతూ చెప్పేడు, “అవున్లే నువ్వు అక్క ఏది అడిగినా కొంటావు గానీ నా దగ్గిరకి వచ్చేసరికి నీ దగ్గిర డబ్బులుండవు.”

కోపం తారాస్థాయి అందుకుంటూంటే చెప్పేడు మోహన్ రావు, “గెట్ ఔట్!”

కోపం వస్తే తండ్రి మామూలు మనిషి కాదని తెలిసినవాడే కనక కుర్రాడు బయటకెళ్ళిపోయేడు. మోహన్ రావుకి మనసు లోపల కుత కుత ఉడికినట్టైంది. ఇటువంటి విషయాల్లో అస్తమానూ గుర్తొచ్చే గతం మరోసారి గుర్తొచ్చింది – వద్దనుకుంటున్నా.

*** *** ***

ఇండియాలో ఉన్నప్పుడు, ఏడో క్లాసు చదివే రోజుల్లో తండ్రి, మోహన్ రావుని ఊళ్ళో ఏడాదికోసారి వచ్చే గుడిలో పూజకి, అక్కడ పెట్టిన తీర్థానికి తీసుకెళ్ళేవాడు. తండ్రి చేసే చిన్నపాటి ఉద్యోగానికి ఎప్పుడూ కట కటే తిండికీ, బట్టకీ ఆఖరికి ఇంటికిచ్చే అద్దెకీను. అలాగని పెద్ద ఖర్చుపెట్టే సంసారం కూడా లేదు మోహన్ రావు తండ్రికి. ఏదో రెక్కడితే కానీ డొక్కాడని ఉద్యోగం. ఏ దురలవాట్లూ లేకపోయినా వచ్చే డబ్బులు సరిపోయేవి కాదు. ఏడాదికోసారి వచ్చిన ఈ తీర్థం కోసం మోహన్ రావు, అక్కా, తమ్ముడూ ఎదురు చూడ్డానిక్కారణం – ఆ రోజు మోహన్ రావు తండ్రి పిల్లలకి తలో రూపాయి ఇచ్చేవాడు తీర్థంలో ఖర్చుపెట్టుకోమని. అయితే ఒకటే కండిషన్. ఏది కొన్నా అది కొంతకాలం మన్నేదిగా ఉండాలి. ఏ చవకరకం ప్లాస్టిక్ ముక్క అయినా కొన్నాక అది విరిగిపోతే డబ్బులు దండగ కనక వీపు విమానం మోత మోగేది పిల్లలకి. అందువల్ల ఆ రూపాయి ఎలా ఖర్చు పెట్టాలనేదానికి మోహన్ రావు, అక్కా తమ్ముడూ మూడు రోజుల ముందు నుంచీ ఆలోచించేవారు. ఖర్జూరం పళ్ళూ, జీళ్ళూ అవీ కొనడం కుదరదు – అవి ఆర్నెల్లు రావుకదా? ఏ చిన్న విమానం బొమ్మో కొంటే ఎలా వాడాలో ముందే ఆలోచించాలి. అలా మోహన్ రావు ఓ సారి మంచి శబ్దం వచ్చే విజిల్, మరోసారి తూనీగలా ఎగిరే మరో ప్లాస్టిక్ ది ఏదో కొన్నాడు. తండ్రి కోపం తెల్సిన వాడు కాబట్టి ఆ రెండింటినీ దాదాపు నాలుగేళ్ళు వాడాడు. కొడుకు వృద్ధిలోకి వస్తూంటే తండ్రికి సంతోషమే కానీ ఏనాడైనా డబ్బులు దుబారా అని తెల్సినా విరుచుకుపడేవాడు. ఇప్పుడు తన కొడుకు అడిగినట్టూ ఏనాడూ తాను తండ్రిని ఇది కావాలి అది కావాలి ఇది లేకపోతే బతకలేను అది లేకపోతే బతకలేను అని అడగలేదు.

ఎంత విచిత్రం, ఇప్పుడీ కుర్రాడికి మూడు కంప్యూటర్లు ఉన్నాయి అయినా అవి చాలవుట, మరో లాప్ టాప్ అర్జెంట్ గా కావాలిట. తాను ఎలా బతికాడు, ఎంత జాగ్రత్తగా డబ్బులు దుబారా చేయకూడదనుకున్నా వీళ్ళేమిటి ఇలా తయారౌతున్నారు? పోనీ లేప్ టాప్ కొందామా అంటే అవి అసలే మూడు, నాలుగు వందల మధ్య ఉన్నాయి. డబ్బు మాట అటుంచితే అసలు ఇది వీడికి అవసరమా కదా అనేది కదా ముఖ్యం? మూడు కంప్యూటర్లు ఉన్నవాడికి నాలుగోది ఎందుకు? అదీ పదకొండేళ్ల పిల్లాడికి? ఏమైనా ఇంత ఆలోచించాక మోహన్ రావుకి తెల్సిన విషయం ఇదీ. తన జీవితం వేరు. తన పిల్లల జీవితం వేరు. తన తండ్రికి ఉన్న చటుక్కున వచ్చే కోపం – అదీ రూపాయి దుబారా చేస్తే వచ్చేది - మాత్రం తనకి అంటుకుంది. జాగ్రత్తగా ఉండకపోతే హాని జరిగేది తనకే. పిల్లలని మార్చడం – అందులోనూ ఖర్చులు తగ్గించమనడం, కొత్త కొత్త గాడ్జెట్ లు కొనడం వద్దని చెప్పడం అసంభవం. తన చిన్నప్పుడు తీర్థంలో కొత్త కొత్త బొమ్మలు వచ్చినట్టే ఇప్పుడు పిల్లల జీవితాల్లోకి ఈ ఫోన్లూ, టాబ్లెట్లూ, లేప్ టాప్ లూ ప్రవేశించాయి. తాను వద్దన్నా ఇవి కొనడం తప్పకపోవచ్చు.

కోపం ఎక్కువౌతూంటే లేచి కుర్రాడి గదిలోకి వెళ్ళాడు, ఏదో మాట్లాడి నచ్చచెప్పడానికి. తండ్రిని చూడగానే మొహం ముడుచుకున్న కుర్రాడు, ఏవిటన్నట్టూ చూస్తే చెప్పాడు మోహన్ రావు, “ఒరే ఇప్పుడు నీకు మరో కంప్యూటర్ అనవసరం కదా ఉత్తినే డబ్బులు తగలేయడం దేనికీ?”

ఈ సారి కుర్రాడు స్థిరంగా చెప్పాడు, “అక్కకి మొన్నంటే మొన్న లాప్ టాప్ కొనిచ్చావుగా వెయ్యి డాలర్లు పెట్టి, నాకు మూడు వందలు పెట్టి కొనమంటే ఏమిటి అంత కష్టం నీకు?”

“ఒరే నాయినా, ఆవిడకి కొన్నది ఈ మధ్యన కోవిడ్ వల్ల గవర్నమెంట్ వారిచ్చిన ‘స్టిములస్’ డబ్బులతో. అదీ కొనకూడదనే అనుకున్నాను కానీ ఈవిడ హై స్కూల్ అవగానే చిన్న ఉద్యోగంలో చేరింది కదా, అప్పుడు వచ్చిన జీతానికి టాక్స్ పేపర్లు పంపించాల్సి వచ్చింది. అందువల్ల ఆవిడకి వేరేగా టాక్స్ డిపార్ట్ మెంట్ వారు డబ్బులిచ్చారు. అది అక్కకి తెలియకుండా దాద్దామని చూశాను కానీ ఈవిడ టేక్స్ డిపార్ట్ మెంట్ వారి వెబ్ సైట్లో తన సోషల్ సెక్యూరిటీ నెంబర్ చెక్ చేసి నా బేంక్ కి డబ్బులు పంపించారని తెలుసుకుని నా పీకలమీద కూర్చుంది. అందువల్ల తప్పలేదు.”

అక్కడితో ఊరుకున్నాడు కుర్రాడు కానీ మరో పదిరోజులకి మరోసారి మొదలెట్టాడు నస. ఈ సారి కుర్రాడి వాదనేమంటే, అక్కకి టేక్స్ డిపార్ట్ మెంట్ డబ్బులు ఇచ్చినట్టే చిన్న పిల్లలున్నవారికి కూడా వేరేగా ఇస్తున్నారుట. తాను అడిగింది ఆ డబ్బులివ్వమనే కదా? తండ్రి జేబులోంచి కాదే? ఇంకా దేనికి గోల? ఈ సారి ఇండియాలో తన తండ్రి తీర్ధంలో తాను రూపాయి దుబారా చేస్తే ఎలా కోపం తెచ్చుకునేవాడో అలా కోపం తెచ్చుకున్నాడు మోహన్ రావు. తాను టేక్స్ డిపార్ట్ మెంట్ సంగతి కుర్రాడితో చెప్పేసరికి వీడు గూగిల్ చేసి మిగతా విషయాలు పట్టేడన్నమాట. డబ్బులిస్తున్నారు సరే కానీ తన ఘోష ఏమిటంటే, అసలు పనికిరావి వస్తువులు కొనడం దేనికీ?

అయితే మోహన్ రావు ఎంత గింజుకున్నా లాభంలేకపోయింది.

ఇంక తప్పదు కనక బెస్ట్ బై అనే షాపులో ఓ లాప్ టాప్ కొన్నాడు కుర్రాడికి. కొనేది ఎలాగా మంచిది కొనడం బాగు అని సేల్స్ లో ఉండే కుర్రాడు అనే సరికి మూడు వందలతో పోతుందనుకున్న లాప్ టాప్ ఇంటికొచ్చేసరికి ఆరువందలైంది టేక్స్ తో కలిపి. ఆ రోజు రాత్రి మోహన్ రావు కోపం కట్టలు తెంచుకుంది – పైకి చెప్పలేదు కానీ తనకున్న జీతానికి - ఇంటికి మోర్గేజీ, నీళ్ళకి, ఎలెక్ట్రిసిటీ, మళ్ళీ మిగతా యుటిలిటీస్, ట్రాష్ పికప్ కి, నెల నెలా రెండు కార్లకి కట్టాల్సిన  డబ్బులు, మళ్ళీ వాటికి ఇన్స్యూరెన్స్. మెడికల్ ఇన్స్యూరెన్స్, డాక్టర్ ఖర్చులు వేరే – అన్నీ కలిపితే మిగిలేది దాదాపు సున్నా. అదృష్టం కొద్దీ ఇంకా కోవిడ్ ఇంట్లో ఎవరికీ తగల్లేదు కానీ అది కానీ అంటుకుని ఏ హాస్పిటల్లోనో వెంటిలేటర్ మీద తేల్తే? వెన్ను వణికింది మోహన్ రావుకి. ఇంట్లో పిల్లలక్కానీ అర్థాంగికి కానీ చీమ కుట్టినట్టైనా లేదు. అసలింత దుబారా దేనికి? తిండి దగ్గిరా అంతే. కంచంలో పెట్టిన అన్నం పరబ్రహ్మ స్వరూపం అది ఎప్పుడూ పారేయకూడదు అని చెప్పినా తిన్నంత తినేసి, పారేసినంత పారేయడం. అయినా ఇంతకంటే ఎక్కువ తినలేను అని తెల్సినా కంచంలో వడ్డించుకోవడం దేనికీ? తాను ఏమి చెప్పినా తానో వెధవనన్నట్టూ చూడ్డం, మళ్ళీ తర్వాత అంతా మామూలే. ఇప్పుడు కొన్న లాప్ టాప్ ఎన్నాళ్ళు వస్తుందో, వీళ్ళు చూసే వెబ్ సైట్ల నుండి ఏ వైరస్ అంటుకున్నా మళ్ళీ దానికో రిపేరు, క్లీనింగ్ లేదా మరో లేప్ టాప్ కొనాలా? బుర్ర వేడెక్కుతుంటే నిద్రకి ఉపక్రమించేడు.

మరో మూణ్ణెల్లు గడిచాయి. ఇదిగో పోతుంది అదిగో పోతుంది అనుకున్న కోవిడ్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు సరికదా కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. దిన దినగండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు తయారౌతోంది పరిస్థితి. మోహన్ రావుకి కోపం వచ్చే అంశాలు ఎక్కువౌతున్నాయి తప్ప తగ్గట్లేదు. దీనిక్కారణం మళ్ళీ పిల్లలే. ఓ సారి గ్రోసరీ షాపులో సరుకులు కొంటున్నప్పుడు కొడుకు అడిగితే తన దగ్గిరున్న రసీదు ఇచ్చాడు. రెండు వారాల పోయిన తర్వాత తెల్సిన విషయం, ఈ రసీదులన్నింటినీ వాడు ఫోన్ మీద స్కాన్ చేస్తున్నాడు, ఏదో వెబ్ సైట్ వారికి. అలా చేస్తే వాళ్ళు ఏవో డబ్బులిస్తారుట. ఇప్పటికే వాడు పదమూడు డాలర్లు సంపాదించాట్ట ఈ విధంగా. అగ్రహోదగ్రుడైపోయేడు మోహన్ రావు. ఆ వెబ్ సైట్ ఏమిటో, రసీదులమీద ఉన్న తన క్రెడిట్ కార్డ్ నెంబర్ కాపీ చేస్తే ఎటుతిరిగి ఎటొస్తుందో అనే చింత. అసలే సైబర్ క్రైమ్ దారుణంగా ఉందీ మధ్య. రసీదులమీద పూర్తి కార్డ్ నెంబర్ ఉండకపోయినా, కొన్ని నెంబర్లుంటాయి. ఏ క్రోగర్ షాపో అయితే వారిచ్చే డిస్కౌంట్ కార్డ్ నెంబర్ మరోటి ఉంటుంది. ఈ రెండూ ఉంటే కాస్త బుర్ర ఉన్న ఏ హాకర్ అయినా తన ఐ.డి కొట్టేయవచ్చు.

ఆసలు విషయం ఆ మర్నాడు తెల్సింది మోహన్ రావుకి. కుర్రాడు సంపాదించిన పదమూడు డాలర్ల డబ్బులతో అమెజాన్ నుంచి అలెక్సా అనేదాన్ని వాడే ఆర్డర్ చేసి పారేసాడు. ఆ పేకెట్ వచ్చేసరికి మోహన్ రావు ఇందులో ఏముందా, తానేం ఆర్డర్ చేసాడా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడొచ్చిన కుర్రాడు పేకెట్ లాక్కుని తన గదిలోకి వెళ్ళాక వాణ్ణి అనుసరించాడు తండ్రి. లాప్ టాప్ అన్నాడు బాగానే ఉంది, డెస్క్ టాప్ సరేసరి. ఫోన్, ఐ-పోడ్, టాబ్లెట్ తప్పవు అన్నారు సరే. మరి ఈ అలెక్సా? వల్లకాట్లో రామనాధాయ అన్నట్టూ అసలీ అలెక్సా దేనికి? దానికి సమాధానం కుర్రాడే చెప్పాడు. పేకెట్లో మరో రెండు బల్బులు ఉన్నాయిట. అవి కూడా ఇంటర్నెట్ వైర్ లెస్ కి తగిలిస్తే అలెక్సా ఆ లైట్లని ఆర్పగలదు, వెలిగించగలదు! మంచం మీద పడుకుని ‘అలెక్సా లైట్స్ ఆఫ్!” అంటే చాలు; వేలు కూడా కదపక్కర్లేదు. అలెక్సా బల్బు రంగులు కూడా మార్చగలదు. కొంచెం మ్యూజిక్కూ వాయించగలదు. అలాగే మరో రెండు మూడు చూపించాడు – అలెక్సా, ఈ రోజు ఫుట్ బాల్ స్కోర్ ఎంత? అలెక్సా, ఈ రోజు టెంపరేచర్ ఎంత, వగైరా. మోహన్ రావు కి కోపం వచ్చి ‘అలెక్సా కెన్ యు వాష్ మై బట్’ అనేసరికి, సమాధానం వచ్చింది, “అదేంటో నాకు తెలియదు,” అని. కుర్రాడైతే నవ్వాడు కానీ మోహన్ రావు ఆ అలెక్సాని తీసి కిటికీలోంచి విసిరేద్దామనుకున్నాడు. అయితే ఈ అమెరికాలో తాను చేసేది ఎవరింట్లో పెట్టిన కెమెరా రికార్డ్ చేస్తుందో మనకి తెలియదు. ఎవరు పోలీసులకి కాల్ చేసి సమాచారం అందిస్తారో అసలే తెలియదు. జాగ్రత్తగా ఉండకపోతే జేరేది శ్రీకృష్ణ జన్మస్థానానికే.

కోపంతో ఊగిపోతూ మోహన్ రావు కుర్రాడితో దెబ్బలాట పెట్టుకున్నాడారోజు. తానేం చెప్పబోయినా కుర్రాడు చెప్పేదొక్కటే – వాడు రసీదులు కాపీ చేసి పెట్టిన వెబ్ సైటు మంచిదే. వాడి స్నేహితులందరూ పెడుతున్నారు కూడా. తనకి ఉచితంగా డబ్బులొస్తాయి కూడా. మధ్యాహ్యం మొదలైన దెబ్బలాట సాయంత్రం దాకా సాగింది. సాయంత్రం అయ్యేసరికి పిల్లాడికి బెదురు పుట్టుకొచ్చింది – కోపంలో తండ్రి ఏం చేస్తాడో? అసలే తండ్రి అగ్రిహోత్రావధాన్లు వంటి వాడు. వాడు సాయత్రం మెల్లిగా ఇంట్లోంచి బయటకొచ్చి మూడు వీధుల అవతల ఉండే వాడి స్నేహితుడు – జేక్ అనే అమెరికన్ ఇంటికి వెళ్ళిపోయేడు. ఇంట్లో ఉంటే తండ్రి చర్మం వలుస్తాడని ఎందుకో అనిపించింది ఆ రోజున వాడికి. ఆ రోజున మోహన్ అరుపులు వీధిలో ఏడు ఇళ్ల ఆవల వరకూ వినిపించాయి జనాలకి. అమ్మగారికి ఇటువంటి అరుపులు ఇరవై ఏళ్ళ పైబడి తెలుసు కనక ఆవిడ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్.

సాయంత్రం గడిచి రాత్రి అవుతూంటే మోహన్ రావు పిల్లాడు ఇంట్లో లేకపోవడం గమనించాడు, కానీ ఫోన్ లో మెసేజ్ పెట్టడానికీ, ఫోన్ చేయడానికీ అహం అడ్డొచ్చింది. రాత్రి తొమ్మిదింటికి ఇంక ఊరుకోలేక మెసేజ్ పంపాడు కుర్రాడికి – ఎక్కడున్నావురా అంటూ. పది నిముషాలు గడిచాక సమాధానం వచ్చింది – “జేక్ పిలిచాడు నన్ను వాళ్ళింటికి ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటున్నా.” ఫోన్ మెసేజ్ ల మీద ఏం మాట్లాడితే ఎవరు చూస్తారో, అది ఏ పోలీసు చూసినా ఏమౌతుందో తెలియదు కదా? అక్కడితో ఊరుకున్నాడు మోహన్రావు.

అసలే కోవిడ్ రోజులు. ఎవరి దగ్గిరకీ వెళ్లవద్దని గొంతెత్తుకుని చెప్తున్నారు అయినా వీళ్ళు వినిపించుకోరేం? మెల్లిగా తగ్గుతోందనుకున్న కోపం ఎక్కువైంది మోహన్ రావుకి. కోపం వచ్చినప్పునప్పుడు పిచ్చికోతిలా గెంతులేసే మోహన్ రావుని ఏనాడూ పడగ్గదిలోనికి రానీయదు వాళ్ళావిడ. అందువల్ల ఆయన మరోచోట పడుకోవాల్సిన పరిస్థితి. పిల్లాడు ఇంట్లో లేడు కనక వాడి మంచంమీదే పడుకున్నాడు. పక్కనే కుర్రాడు అమర్చిన అలెక్సా నిశ్శబ్దంగా ఉంది. చాలాసేపు అటూ ఇటూ పొర్లాక ఏదో కలత నిద్ర.

అర్ధరాత్రి దాటాక ఎందుకో మెలుకువ వచ్చింది మోహన్ రావుకి. వళ్ళంతా చెమట. దాహం తో గొంతు ఆర్చుకుపోతోంది. కిచెన్ లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అని లేవబోతే తెల్సిన విషయం – తాను లేవలేకపోతున్నాడు. గుండెలమీద ఏనుగు కూర్చున్నంత నెప్పి. కప్పుకున్న దుప్పటి తీయడానిక్కుడా చేతులు సహకరించడంలేదు. చుట్టూ చిమ్మ చీకట్లో దూరంగా గోడమీద చిన్న వెల్తురు – బెడ్ లైట్ ది. ఆ నీలం వెల్తుర్లో తన తండ్రి మొహం కోపంగా కనిపిస్తోంది – తీర్ధంలో రూపాయి దుబారా చేసినందుకు బెత్తం పట్టుకుని తరమడానికొస్తున్నాడు. మొహంలో ఎందుకో అంత కోపం? తాను దుబారా చేసినది ఒక్క రూపాయే కదా? మోహన్ రావు శరీరం కొద్దిగా కంపించింది. కళ్ళు మూసీ తెరిచీ పరీక్షగా చూస్తే గుడ్డి వెల్తుర్లో తండ్రి మరి కనిపించలేదు. కల కాబోలు. తన చిన్నప్పటి రోజులు మర్చిపోవాలంటే అంత సులభంగా కుదురుతుందా? అసలు ఇవి తన బుర్రలోంచి పోతాయా తాను చితిమీదకి చేరేలోపు? ఓ, చితి అంటే గుర్తొచ్చింది, తన తండ్రి ఇలాగే ఓ రోజు కోపంతో ఊగిపోతూ హార్ట్ ఎటాక్ తెచ్చుకుని పోయాడు. హా ..ర్ట్   ఎ…టా…క్!!! తనక్కూడా ఈ రోజు హార్ట్ ఎటాక్ రాలేదు కదా? మరోసారి లేవడానికి ప్రయత్నంచేసాడు; కుదర్లేదు. అరుద్దామంటే నోటమ్మట మాట రావడంలేదు. గుండెలమీద ఏనుగు కూర్చున్నట్టూ ఉంటే అది హార్ట్ ఎటాక్ అవ్వొచ్చంటారే? ఇప్పుడు ఇలాగేనా తాను పోయేది? తల తిప్పి పక్కకి చూసాడు. కుర్రాడు తన గదిలో కొత్తగా అమర్చిపెట్టుకున్న అలెక్సా కనిపించింది. అప్పుడొచ్చిందో ఆలోచన. తాను అరుస్తున్నాననుకుంటూ చెప్పిన అతి తక్కువ స్వరంతో అన్నాడు. “అలెక్సా 911 కి ఫోన్ చేయగలవా?”

“నేను చేయలేను. అదేమిటో తెలియదు.”

చిన్నగా నిట్టూర్పు; ఓ వైర్ లెస్ ఫోన్ దీనికి అనుసంధానం చేస్తే అలెక్సా ఫోన్ చేయగలిగేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఎడమ చేతి మణికట్టు దగ్గిర మెల్లగా మొదలైన నెప్పి పైకి పాకుతున్నట్టూ తెలుస్తోంది. మరెలా?

“అలెక్సా లైట్ ఆన్ చేయగలవా?”

రెండు మూడు సెకన్ల తర్వాత లైట్ వెలిగింది. “అలెక్సా లైట్ ఆఫ్,” చెప్పాడు మోహన్ రావు.

లైట్ ఆరిపోయింది. పదీ పదిహేను సెకన్ల తర్వాత మోహన్ రావు చెప్పేడు, “అలెక్సా ఈ లైట్ ను అలా ఆర్పి, వెలిగిస్తూ బ్లింక్ చేస్తూ ఉండు.”

ఆ తర్వాత మరో రెండు నిముషాలకి మోహన్రావుకు స్పృహ తప్పింది. అలెక్సా మాత్రం తనకి చెప్పిన పని చేస్తూనే ఉంది. బల్బు రంగులు మారుతూ వెలుగుతూ ఆరుతూ అలా పనిచేస్తూనే ఉంది. చిన్నగా మ్యూజిక్ కూడా. మోహన్ రావు అర్ధరాత్రి పడగ్గదిలోకి రాకుండా తలుపు బిగించుకుని పడుకున్న అమ్మగారిక్కానీ, జేక్ ఇంట్లో పడుకున్న మోహన్ రావు కుర్రాడిక్కానీ ఇవేమీ తెలియలేదు.

*** *** ***

పావుగంట పోయాక మోహన్ రావు ఎదురింట్లో ఉండే జాన్సన్ గారికి మెలుకువొచ్చింది. కళ్ళు తెరిచి చూసాడు. రంగు రంగులతో ఆరే, వెలిగే ఎదురింట్లో బల్బు తనని నిద్రపోనీయడంలేదు. కిటికీకి ఉన్న తెర తొలగించి చూసాడు. మోహన్ రావు ఇంట్లోంచి వచ్చే ఈ లైట్ ఆరకపోతే తనకి నిద్ర అసంభవం. ఆయన 911 కి ఫోన్ చేసి చెప్పేడు ఎదురింట్లో జరిగే తతంగం – ఆ లైట్ ఏదో పార్టీ వల్ల వస్తోంది కాబోలు, అంత అర్ధరాత్రి తన నిద్ర ఎలా పాడౌతోందో వగైరా. అయినా ఇంత అర్ధరాత్రి వరకూ పార్టీ చేసుకోవడానికి పర్మిట్ తీసుకున్నారా? ఇదో తప్పని గోల కనక ఓ పోలీసాయన వచ్చాడు చూసిపోవడానికి. సాధారణంగా ఓ వార్నింగ్ ఇస్తే చాలు ఇటువంటి చోట. వాళ్ళే ఊరుకుంటారు.

మోహన్ రావు ఇంటి బయట కారు పార్క్ చేసి కాలింగ్ బెల్ కొట్టాడు. మొదటగా లేచినది అమ్మగారు. ఆవిడకి ఠారెత్తింది అర్ధరాత్రి ఎవరు వచ్చారో అనుకునేసరికి. లేచి చూస్తే కుర్రాడి గదిలో మోహన్ రావు తెలివిలేకుండా పడి ఉన్నాడు. గదిలో లైట్ ఆరుతూ వెలుగుతూ రంగులు విరజిమ్ముతోంది, అలెక్సా లోంచి చిన్నగా మంద్రస్థాయిలో మ్యూజిక్. మొగుడి దగ్గిరకెళ్ళి చూసింది ఆవిడ. మొహంలో జీవం లేదని తెలుస్తూనే ఉంది. కంగారు రెట్టింపైంది. దుప్పటి తీసి చూస్తే మోహన్ రావు వంటినిండా చెమట. కాలింగ్ బెల్ ఇంకా మోగుతూనే ఉంది. కంగారుగా తలుపు దగ్గిరకెళ్ళి చూసింది. ఎవరో నుంచుని ఉన్నారు బయట, “ఎవరది? ఏం కావాలి?” అడిగిందావిడ తలుపు తీయకుండా.

“నేను ఊరి పోలీసాఫీసర్ని. మీ ఎదురింటాయన ఫోన్ చేసారు మీ ఇంట్లో వెలిగి ఆరే దీపం వల్ల ఏదో పార్టీ జరుగుతోందేమో అని. ఆ లైట్ వల్ల మీ ఎదురింటాయనకి నిద్ర పట్టడం లేదుట…..”

ఏదో చెప్పబోతున్న పోలీసాయన, తలుపు తెరుచుకోవడంతో ఆగి బయటనుండే చెప్పాడు, “పార్టీ ఆపాలి, మీకు పర్మిట్ ఉందా ఇలా అర్ధరాత్రి దాకా చేసుకునే పార్టీకి?”

కంగారుగా చెప్పింది మోహన్రావు వాళ్ళావిడ - పార్టీ ఏమీ లేదు. మోహన్రావు ఇలా వళ్ళు తెలియకుండా పడి ఉన్నాడు. కుర్రాడికీ ఈయనకీ సాయంత్రం ఏదో వాగ్యుద్ధం, వగైరా వగైరా. ఈసరికి లోపలకి వచ్చిన పోలీసాఫీసర్ అడిగాడు “నేను వెళ్ళి చూడొచ్చా?”

“ఆ, ఆ, రండి, కాస్త చూసి హెల్ప్ చేయగలరా, నాకు కాలూ చేయీ ఆడడం లేదు.”

ఇటువంటి కేసులెన్ని చూసాడో కానీ లోపలకి వెళ్ళిన పోలీసాయనకి పరిస్థితి అర్ధం అయింది. వెంఠనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసాడు. పదే పది నిముషాల్లో మోహన్ రావు ని స్ట్రెచర్ మీద ఆంబులెన్స్ లో లోడ్ చేసుకుని ఇంటావిడని వెనక కారులో రమ్మని చెప్పి హాస్పిటల్ కేసి దూసుకుపోయింది ఆంబులెన్స్.

మోహన్ రావు పడుకున్న గదిలో లైట్ ఆర్పేసి, వణుకుతున్న మోహన్రావు వాళ్ళావిడతో చెప్పేడు పోలీసు, “నేను వెళ్ళాలి, మీరు తయారై హాస్పిటల్ కి వెళ్ళండి. మీ కుర్రాడు క్షేమమేనా?”

“వాడు వేరే మెసేజ్ పంపాడు నాకు; రాత్రికి వాడి స్నేహితుడి ఇంట్లోనే ఉంటానని. పొద్దున దాకా బెంగలేదు.”

“సరే అయితే పొద్దున్నే మీరు కుర్రాణ్ణి తీసుకురండి ఇంటికి. మీకేమైనా కావాలిస్తే మరోసారి 911 కి ఫోన్ చేయండి. గుడ్ లక్,” సాగిపోయేడు పోలీసు.

*** *** ***

హాస్పిటల్లో డాక్టర్ చెప్పేడు మోహన్ రావు వాళ్ళావిడతో, “మీ ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. రెండు కవాటాలు దెబ్బ తిని ఉండొచ్చు. అయినా వయసు యాభై దగ్గిర కదా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ వర్క్ చూసాం. కొలెస్టరాల్, ట్రై గ్లిసరీడ్స్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఫర్వాలేదు కానీ ముందు మరింత జాగ్రత్త అవసరం. ఇంకేమైనా అనారోగ్యాలు ఉన్నాయా ఆయనకి?”

“డయాబెటిస్ మొదటి స్టేజ్, అదే ప్రి-డయాబెటిస్ ఉంది. వాళ్ల ఫామిలిలో అందరికీ డయాబెటిస్ ఉంది. తిండి విషయం అసలు పట్టించుకోరు…. “ అంటూ ఏదో తటపటాయిస్తుంటే డాక్టర్ అడిగాడు, “చెప్పండి ఆగారేం?”

“కోపంలో ఆయనో అగ్రిహోత్రావధానులు. ఈ రోజు సాయంత్రమే పదకొండేళ్ళ మా అబ్బాయితో అమెజాన్ మీద అలెక్సా అనేది కొన్నందుకు గొడవపడ్డారు. ఇలా ప్రతీ విషయానికీ అరవడం, అది ఊరంతా వినిపించడం సర్వ సాధరణం.”

డాక్టర్ మొహంలో కనీకనబడని చిరునవ్వు, “ఆ కోపం తగ్గడానికో తెరపీ తీసుకోమనండి. తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతావి మీ కార్డియాలజిస్ట్ చెప్తారు.”

మర్నాడు పొద్దున్నే పిల్లాణ్ణి తీసుకుని మరోసారి హాస్పిటల్ కి వెళ్లింది మోహన్రావు వాళ్ళావిడ. మరో రెండు రోజులు ఉండాలిట ఆరోగ్యం కుదుటబడే దాకా. ఆ రోజు మధ్యాహ్నం కళ్ళు తెరిచి చూసాడు మోహన్రావు. ఎదురుగా డాక్టర్, నర్స్, కొడుకూ, భార్యా కనిపించేరు. నీరసంతో మాట మెల్లిగా వచ్చీ రానట్టుంది. పడుకోమని చెప్పి మరో మందు ఎక్కించి డాక్టర్ వెళ్ళిపోయాడు.

మూడోరోజు ఇంటికి పంపే రోజు. భార్యా కొడుకూ దగ్గిరే ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి చెప్పేడు, “మీకు వచ్చినది హార్ట్ ఎటాక్. మీ భార్యా కొడుకులతో నేను మాట్లాడాను విడివిడిగా. మీ తిండి అలవాట్లు బాగాలేవనీ మీ కోపం తారాస్థాయిలో ఉంటుందనీ అంటున్నారు. ఈ రెండూ తగ్గించుకోవాలి. అయినా ఎందుకొచ్చింది ఇంత కోపం మీకు?”

“డబ్బులు తగలేస్తున్నారండి వీళ్ళు, ఏది కనిపించినా కొనడం; అవి అవసరమా కాదా అనేది చూడొద్దా?”

“డాడ్ నేను అలెక్సా కొన్నది కేవలం పదమూడు డాలర్లతో; అదీ నీ డబ్బులతో కాదు. నువ్వు గ్రోసరీ స్టోర్ లో ఖర్చుపెట్టిన రసీదులు స్కాన్ చేసి సంపాదించినది,” కొడుకు చటుక్కున అన్నాడు.

“మిస్టర్ రావు, నిజంగానే మీ అబ్బాయి ఓ అయిదు వందలు తగలేసాడనుకోండి. అది మీరు హార్ట్ ఎటాక్ తెచ్చుకునేంత అంత విషయమా? ఇప్పుడీ ఎటాక్ వల్ల మీరు చనిపోయి ఉంటే ఏమై ఉండేది? డబ్బులు వస్తాయి, పోతాయి, మీ జీవితం కంటే ఎక్కువా అవి? అయినా మీరు కాస్త మెల్లిగా చెప్తే వింటారు కానీ అరిచి గీపెడితే ఎవరు వింటారు? మీరు విన్నారో లేదో కానీ ఒక బేరల్ వెనెగార్ తో కన్నా ఒక స్పూన్ తేనె తో అనేక ఈగలని రాబట్టవచ్చు. ఆలోచించండి, ఇప్పట్నుండి, మీ ఆరోగ్యం కోసం మీరు కార్డియాలజిస్ట్ తో మాట్లాడండి. ఇంతకీ మీరు పడుకున్న గదిలో లైట్ వెలిగి ఆరడం ఎలా జరిగింది? దానివల్లే పోలీస్ మీ ఇంటికొచ్చి చూసాడు కదా? ఆ లైటే మిమ్మల్ని రక్షించిందని చెప్పుకోవాలి.”

కాసేపు ఆలోచనలు తిరగతోడి చెప్పేడు మోహన్ రావు, “హార్ట్ ఎటాక్ కి ముందు మెలుకువ వచ్చింది, అరుద్దామన్నా నోట్లోంచి మాట రావడంలేదు. అలెక్సా లైట్ ఆఫ్, లైట్ ఆన్ అనేవి చెప్తే దగ్గిర్లోనే ఉన్న అలెక్సా  పనిచేయడం గమనించి చెప్పేను ‘అలెక్సా లైట్ అఫ్, అన్ చేస్తూ అలాగే బ్లింక్ చేస్తూ ఉండు’ అని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.”

“ఆ తర్వాత మీ ప్రాణం పోయే స్థితిలో పోలీసు మిమ్మల్ని ఇక్కడకి రావడానికి సహాయం చేసాడు, అదీ మన నైబర్ ఫోన్ చేయడం వల్ల. మీ ప్రాణం కాపాడింది అలెక్సా ఆ రోజున.” భార్య చెప్పింది వెంఠనే.

“చూసావా నాన్నా, నేను కొన్న గాడ్జెట్లన్నీ పనికిరానివి అంటావు కదా? ఇప్పుడు చెప్పు అలెక్సా మంచిదేనా?” కొడుకు నవ్వుతూ అన్నాడు.

డాక్టర్ తో సహా అందరూ నవ్వుతూంటే మొహమాటంగా నవ్వుతూ బయటకొచ్చాడు మోహన్ రావు. ఈ సారి మనసులో నిశ్చయంగా నిర్ణయించుకుని – తాను ఒకప్పుడు తీర్ధంలో వాడిన రూపాయి, తన ఇండియా జీవితం వేరు. వాటిని శ్మశానంలో పాతి కొత్త జీవితంలో, “ప్రస్తుతంలో” ఉండకపోతే ఆ పాత జ్జాపకాల వల్ల తాను మరో హార్ట్ ఎటాక్ తెచ్చుకోగలడు. జీవితంలో చూడాల్సింది ముందుకి. ఏనాడు వెనక జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తు తెచ్చుకుని ప్రస్తుత జీవితం నాశనం చేసుకోరాదు. అందుకే కదా అంటారు “కారులో కూర్చుంటే ముందు దారి కనిపించే అద్దం పెద్దదీ, వెనకకి చూసే అద్దం చిన్నది,” అని?

హాస్పిటల్లోంచి బయటకొచ్చి కారు దగ్గిరకి నీరసంగా నడుస్తూ తనకి తెలియకుండానే కుర్రాడి భుజం పట్టుకున్నాడు మోహన్ రావు. కుర్రాడు కూడా ఆగి తండ్రి చుట్టూ ఆసరాగా చేయి వేసి నడిపించాడు. కారులో ఎక్కాక కుర్రాడు ఎప్పట్లాగే ఫోన్ మీద ఎవరికో మెసేజ్ పంపిస్తున్నాడు. ఏమో తన గురించే కాబోలు. తండ్రి బతికి బయటపడ్డాడని చెప్తున్నాడో, కోపంగా తిట్టే తండ్రి దరిద్రం తనకి ఇంకా వదల్లేదని చెప్తున్నాడో? వాడి తప్పు ఏవుంది అయినా? ఇదంతా తాను చేసుకున్న స్వకపోల కార్యం. ఒక్కసారి దారుణమైన నీరసం, దానివెంటే ఉధ్ధృతమైన ఏడుపు తన్నుకొచ్చాయి మోహన్రావుకి. భార్య డ్రైవ్ చేసే బండి ముందుకి కదులుతూంటే, వచ్చే కన్నీళ్ళు కనబడకుండా కళ్ళు మూసుకున్నాడు మోహన్ రావు.

********

Posted in July 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!