Menu Close
Page Title
ఆనందాన్వేషణతో బ్రహ్మాన్ని చేరాలనే మానవుని తపన
(Greying Gracefully)

'ఆనందో బ్రహ్మ' అన్నది ఉపనిషద్వాక్యం. జీవి ప్రాధమిక లక్ష్యం ఆనందంగా బ్రతకడమే. యిహ సాధనాలే తృప్తిని, సౌఖ్యాన్నిస్తాయనే భ్రాంతితో వాటి కోసమే మానవుని ధనార్జన, దానితో చుట్టూ పరివారాన్ని పెంచుకోవడం, వాటిని చూసి మురిసిపోవడం, అవసరానికి మించి వసతి సౌకర్యాలు కలిగించుకోవడం, అహంభావంతో గొప్పలకిపోయి పేరు ప్రఖ్యాతులకై ఆరాటపడడం మొదలైనవి ప్రత్యేకంగా చెయ్యాలని కాకపోయినా ఆమార్గంలో ప్రయత్నిస్తూనే ఉంటాడు మానవుడు. ఆఖరికి పుణ్యకార్యాలు చేసినా, దైవ కార్యాలు చేసినా ఫలితంగా లభించబోయే పుణ్యం వల్ల లభించబోయే స్వర్గ సుఖాలపై గల ఆపేక్ష అటువైపు లాగుతూ ఉంటుంది. రోజూ మనం ఎదుర్కొనే చిన్నవి, పెద్దవీ అయిన సమస్యలు, కష్టాలు తల బొప్పికట్టిస్తున్నా వాటిని అంతగా పట్టించుకోకుండా చివరలో లభించబోయే ఆనందం కోసమే అర్రులుజాచడం మానవ నైజం. ఆకష్టాలు మరీ భరించరానివై జీవితాన్ని అంతం చేసుకుందామనుకున్నవారికి కూడా అటు పిమ్మట సమస్యలు తొలగిపోయి ఆనందం లభిస్తుందన్న ఆశే మనో నిబ్బరం పై దెబ్బ తీసి అంచు చివరకు తోస్తుంది.

మనిషి ఆరోగ్యంగా ఉండడానికి తృప్తి ముఖ్య ఆలంబనమైతే - అదిచ్చే సంతోషం, మనస్థైర్యం ముఖ్య ఉపాధులు. చిన్నప్పుడు యింటిలో పెరిగిన వాతావరణం, కొంచం పెద్ద అయ్యాక విద్యా సంస్థలలోని సహాధ్యాయుల ఆలోచనా ప్రవాహంలో తేలిపోతూ, మరింత పెరిగాక తోటి స్నేహితులు, సన్నిహితుల వాదప్రతివాదనల ధోరణుల వాహినిలో కొట్టుకుపోతూ, చుట్టూ సమాజపు తీరుతెన్నుల సుడిగాలిలో సుళ్ళుతిరుగుతూ, పెళ్లయ్యాక సహచరి పెరిగిన పరిస్థితులు తనపై చూపే ప్రభావానికి యిష్టంగానో అయిష్టంగానో లోనవుతూ నిమిత్తమాత్రంగా రోజులు దొర్లించడం, యివన్నీతెలియకుండానే సంసారయానంలో కొట్టుకుపోవడంలో అందులో భాగమే. అది ధర్మపద్ధతిని అంటే పెద్దలు నడిచిన మార్గాన్నే జరిగిపోతే తృప్తి తో బాటు నలుగురిలో సన్మార్గ జీవితాన్ని గడిపిన ఖ్యాతికూడా దక్కుతుంది. ఎదురు తిరిగితే ఎదుర్కోవలసిన పరిస్థితులు ముందు అంతగా భయపెట్టకపోయినా కాలం గడచినకొద్దీ పశ్చాత్తాపంతో ఎందుకు తెగించామా అని పునరాలోచింప చేస్తాయి. వాటి ఫలితాలు ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాము.

చిన్నప్పుడు తల్లి ఇచ్చేపాలు తాగుతూ వేగంగా ఎదగడానికి సులభంగా జీర్ణించుకోవడానికి కావలిసిన పౌష్టిక ఆహారంతో బాటు వాటిని తాగుతూ ఆనందాన్ని అనుభవిచడం పిల్లాడి ముఖంలోను, యిస్తున్న తల్లి ముఖంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. అప్పటినుంచే నేర్చుకోవాలనే తపన క్రొత్తవి తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రారంభమై అతడికి తెలియకుండానే భౌతిక, మానసిక వికాసాలకు పునాది అవుతుంది. చిన్నప్పుడు అతి కొంచెం తిన్నా శీఘ్రగతిని శరీరానికి అవుసరమైన విటమిన్లు, ఖనిజాలవంటి సూక్ష్మ పోషకపదార్ధాలని సులభంగా పీల్చుకోగలుగుతుంది. అదే ఏభై తరువాత వయస్సు పెరిగిన కొద్దీ ఆ పీల్చుకునే శక్తి తగ్గి అవే ఎక్కువ మోతాదులోగాని లేక అవి సులభంగా శరీరం పీల్చుకునేందుకు సహాయపడే ఉత్ప్రేరకం 'డి' విటమిన్ వంటి దోహదకారుల అవుసరం ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ పదార్ధాలు తగిన మోతాదులో శరీరానికి అందించకపోతే శరీర సంరక్షణావసరాలికి తగినంత పోషకాలు లభించక శరీరం క్షీణించడం ఆరంభిస్తుంది. క్రమంగా ఏవి లోపించి ఏ అవయవం సరిగ్గా పనిచెయ్యడం మానేస్తుందో సరిగ్గా ఊహించడం కష్టం. అందుకోసం ముందు జాగ్రతకోసం వైద్యుల సలహాపాటిస్తూ మన శరీర పరిస్థిని మనమే పర్యవేక్షించుకుంటూ వైద్యులకు మనం ఇవ్వగలిగే 'ఇన్ ఫుట్' యిచ్చినట్లైతే మన ఆరోగ్య సంరక్షణకు మనమే దోహదకారులమవ్వగలము.

చిన్నతనం నుంచి ఎటువంటి ప్రత్యేక ప్రయత్నము లేకుండానే తింటూ తిరుగుతూ, తోటివారితో ఆడుతూ పాడుతూ, పెద్దల దగ్గరా గురువుల దగ్గరా విద్యాబుద్దులు నేర్చుకుంటూ అనందంగా ఎదగడం అందరికి సాధాహరణంగా లభించే అదృష్టం. అల్లా క్రమంగా ఎదుగుతూనే వక్ర బుద్ధులు, స్వార్ధం, అసూయ, సాధిస్తున్న విజయాలతో కూడిన అహంభావం, అది క్రమంగా పెంచుతున్న ఆత్మవిశ్వాసం తో పాటు అహంకారం, వరుస ఓటములతో న్యూనతా భావం, దానితో తాను నిష్ప్రయోజకుడనే నిరుత్సాహం నిస్పృహ, గురువులు, పెద్దలు నేర్పుతున్న విద్యా సంస్కారాలతో బాటు పెరిగి నిర్దుష్ట మానవునిగా తీర్చిదిద్దే సంకేతాలిస్తాయి. సంఘంలో తోటి వ్యక్తులతో జరిగే సంభాషణా భావ సంఘర్షణా ప్రభావాల వల్ల ఉత్పన్నమైన మానసిక విస్ఫోటాలు మనస్సులో ధృడంగా నాటుకుంటూ, ప్రభావితం చేస్తూ పెరిగి తక్కిన గుణసంపదని అణగద్రొక్కి మనిషి మానసిక తత్వాన్ని పరిధిని స్థిరీకరించి ఆ మానవునికి ఒక ముద్రని (తత్త్వవేత్త అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సంఘ సేవకుడని, సంఘ విద్రోహి అని, విద్యా వేత్త అని, అసమర్థుడని, దొంగ అని, మోసగాడని, సంఘ సంస్కారి అని అనేక గుణాల వల్ల) ఆపాదిస్తాయి. దీనినిబట్టి మానవుని ఔన్నత్యపతనాలకి సంఘం ఎంత బాధ్యతాయుతమౌతుందో మనమూహించగలం. అలాగని ప్రత్యేకంగా ఏ ఒక్కరిని వేలెత్తిచూపడం సాధ్యం కాదు. ఎందువల్లనంటే ఎవరి మాటలు ఆవ్యక్తి పై ఎంత బలమైన అదృశ్య ప్రభావాన్ని చూపిస్తాయో బహుశా ఆక్షణంలో అతనికే తెలియదు. క్రమంగా తెలుసుకుంటాడు, అతనితో పాటు ప్రపంచమంతా కూడా తెలుసుకుంటుంది. అందుకే చిన్నప్పటినుచి పిల్లలని ఆనందంగా పెద్దల ఇష్టాఇష్టాల ఛాయలు, వారి కోరికల ప్రతిరూపాలు, వారు చిన్నతనంలో పోగొట్టుకున్న అభిలాషల క్రీనీడలు పడకుండా చూడడం తలిదండ్రుల బాధ్యత. అది చెప్పినంత సులభంకాదు, ఎందుకంటే దానికి పర్యవేక్షణ, మార్గ పరిరక్షణ చేసేవారే ఎప్పటికప్పుడు తాము నడుస్తూ పిల్లల్ని నడిపే మార్గం సరైనదో కాదో పరాయి వ్యక్తి వలె నిలబడి పర్యావలోకనం చేసుకోవాలి. దానిని బట్టి తలిదండ్రుల, విశ్వసనీయ గురువుల, పిల్లల సంక్షేమ దారుల బాధ్యత ఎంత ఉన్నతమైనదో, క్లిష్టమైనదో అర్ధం చేసుకోవచ్చు. వాళ్ల విధినిర్వహణలో బాధ్యతా లోపాలు ఎత్తి చూపడం సులభమే, కానీ వాటిని సంస్కరించుకుంటూ ముందుకిపోవడం చాలా సంయమనంతో కూడిన పని. అయినా సమాజపు వివిధ ఛాయల పరిణామ ప్రభావము పిల్లలపై పడడం, దాని బాధ్యత వాళ్ళ తలిదండ్రులు మోయడం మనం చూస్తూనే ఉన్నాము.

చిన్నప్పటినుంచి పిల్లలు ఆనందంగా పెరగ గలిగితే వాళ్ళు స్వచ్ఛమైన మనోవికాసంతో, ఆరోగ్యవంతముగా పెరిగిన తరువాత మంచి చెడుల బేరీజు వారంతట వారే వేసుకోగలిగి ఉన్నత స్థితిని సాధించగలరని మనస్తత్వవేత్తల పరిగణిత అభిప్రాయము. తలితండ్రులు వాళ్ళ బిడ్డలనుండి ఎక్కువగా కోరుకునేది అదే కదా? చిన్నప్పుడు పిల్లల ఆహారంలో పాలు, ఆకుకూరలు ఎక్కువగా వాడితే శరీరానికి అవసరమైన లవణాల వంటి పోషకపదార్ధాలు, పీచుపదార్ధాలు చేరి వాళ్ళ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతాయి. దానికి వాళ్ళు పరుగెత్తి ఆడుకునే ఆటలు, కోతికొమ్మచ్చి వంటి వ్యాయామ క్రీడలు వారి శరీర దారుఢ్యాభివృధికి, మారుస్తున్న క్రియా వ్యాయామాలవల్ల మానసిక ఉత్సాహానికి, పెరగడానికి కొత్తవి నేర్చుకోవాలనే ఆసక్తి కి ఎంతగానో దోహద పడతాయి. చదువులలో కూడా ప్రతి ఘంటా, రెండుఘంటలకి పాఠ్యాంశం మారుస్తుంటే మేధస్సు విసుగుచెందకుండా కొంగ్రొత్త విషయాలని సులభంగా గ్రహించి గుర్తించుకోగలుగుతుంది. మధ్యలో ఆటల అనుసంధానం, పాఠ్యాంశం లో మార్పు విద్యార్థి మెదడుకి అలుపుని తొలగించి ఉత్సాహాన్ని పెంచుతుంది. అందుకే పాఠశాలలో, కళాశాలల్లో ప్రతి ఘంటకి పాఠ్యాంశం మార్పుచేస్తుంటారు.

వయస్సుతో బాటు వచ్చే శారీరక మార్పులు వాటి ప్రోద్బలంతో పెరిగే లైంగిక వాంఛలు, దానితో జీవిత భాగస్వామి కై వేట, వారి సహకారంతో తీర్చుకుంటూ ఆరోగ్యకర వ్యాయాయమై, శారీక సుఖంతో బాటు మానసిక ఉత్సాహాన్ని, తృప్తిని కలిగించి ఆనందపుటంచులు చూపిస్తూ పిల్లల్ని కనడం వారి తో సంతోషంగా ఆడుతూ పాడుతూ జీవితానికి మరో అధ్యాయము జత చెయ్యడం అవసరమైన ఒక ఆనంద ప్రహేళికే.

చతుషష్టి కళలలో సామాన్యంగా గాన, సంగీత, సాహిత్య, నాట్య, వాయిద్య పరికరాల విన్యాసంలో ప్రావీణ్యత విశేషానుభూతి కలిగించి దాని ద్వారా ఆనంద స్థితికి కొనిపోయే ఉన్నత వెదికే. వయసు పెరుగుతున్నకొద్దీ క్రీడా వ్యాయామ, ఆహార, పానీయ వ్యవహారాల్లో మార్పులు వచ్చి శరీర తత్త్వం వారి వారి డిఎన్ఏ ప్రభావాలవల్ల మారి అనుకోని విధంగా వ్యాధులుగాని ఆరోగ్య సమస్యలలో (బీపీ & షుగర్) యిరుక్కుని, బరువు పెరిగి, చిన్నవే అయినా వంశానుగుణంగా వచ్చే దీర్ఘకాలిక అనారోగ్య చింతనలలో సతమతమవడము, ఎటూ తేలక విసుగు చుట్టుప్రక్కల వాళ్ల పై గొంతుపెంచి మాట్లాడడము, తనని సమాజం క్రమంగా మెయిన్ లైన్ లోంచి లూప్ లైన్లోకి తప్పిస్తున్నట్టు బాధపడడము,  మారుతున్న జీవితాధ్యాయమే. రోజులుగడుస్తున్నకొద్దీ కాలగతి భారమై, నడకతీరు మారి, మోకాళ్ల, కీళ్లనెప్పులు అధికతరమై నడక వేగం తగ్గి, వాటి పీడని తగ్గించే మందుల అవుసరం పెరిగి, అందుకు ఖర్చులకూడా పెరిగి, ఇంట్లోని పిల్లలకి, పెరుగుతున్న వయస్సుకి భారమై, దైవచింతన అధికమై, దైవ ప్రార్ధనతో, భక్తి రసాస్వాదనలోనే ఆనందాన్ని వెదుక్కుంటూ, దొరికినంత వరకు అనుభవిస్తూ రోజులు దొర్లించడమే ఒక వ్యాపకమై మిగులుతాడు మనిషి.

'జాతస్య హి ధృవో మృత్యుః, ధృవం జన్మ మృతస్య చ' అంటాడు గీతాకారుడు శ్రీ కృష్ణ భగవానుడు. అనగా పుట్టినవానికి మరణం తప్పదు మరణించినవానికి పునర్జన్మా తప్పదు. కానీ మన అకుంఠిత దీక్ష, ప్రార్థనా బలం దాని నుండి ఉత్పన్నమయ్యే బాధలనుండి రక్షించ వచ్చు. ఆ రక్షణ ఏవిధంగా ఉండొచ్చు అంటే, శైవులకి కైలాస ప్రాప్తి, వైష్ణవులికి వైకుంఠ ప్రాప్తి, ఎటువంటి ప్రత్యేక ఆలంబన లేనివారికి స్వర్గ ప్రాప్తి, అద్వైతికి మోక్ష ప్రాప్తి అనగా చైతన్య మూర్తి అయిన ఆపరమాత్మతో ఐక్యమవ్వడం వంటివి వాటి ఫలితాలు. ఆఖరి క్షణాలు ఎల్లా ఉంటాయో అని అతృతతో ఎదురుచూపులు. కానీ ఎప్పుడో అప్పుడు చివరిదశ ఎదుర్కొనక తప్పదని తెలిసిన ప్రజ్ఞుడు దానికై నిరీక్షించక మనస్సుని దైవధ్యానంలోనే నిమగ్నం చేసి బ్రహ్మాన్ని చేరుకుంటాడు.

-o0o-

Posted in July 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!