Menu Close
SirikonaKavithalu_pagetitle

చాలు -- గంగిశెట్టి ల.నా.

నువ్వు కచ్ఛపివైతేనేం
మహతి వైతేనేం
శబ్దమైతేనేం
నిశ్శబ్దమైతేనేం
ఏ ఇంట కొలువుంటేనేం
ఏ లోకాన్ని ఏలుతుంటేనేం
నా మూలింట
స్వాయత్తమంతా కట్టగట్టి
అరచేతుల మణిదీపం దిట్టంగా పట్టి
అనాహతంగా నీ లయ ఒడిలో
విశుద్ధుణ్ణయి
నీ ఆజ్ఞాబద్ధుణ్ణై
వేయి రేకుల పువ్వునై వికసిస్తాను
నీ వెలుగు రేకుగా పరిమళిస్తాను
అదితి తనయా!
ఈ నీటికుండలోకి
నీ కిరణాలను కొన్ని ఒంపు చాలు
ఈ దితి మండలం లో
నీ ప్రేమద్యుతి కాస్త నింపు చాలు

(ఉపద్రష్టగారి శ్రీనాథ పద్యవివరణ చదివి, కనులు మూసుకు కాస్సేపు గడిపి పొందిన అనుభూతి... ఇది వారి మాటల వెన్నెలకు అంకితం)

వెలుగు - చీకటి -- స్వాతి శ్రీపాద

మసక మునివేళ్ళు కనురెప్పలపై
నునులేత చిలకల్లా వాలీవాలక మునుపే
మళ్ళీ కొత్తగా పుట్టినట్టుగానే ఉంటుంది.
జారిపోతున్న చీరకొంగూ సోలిపోతున్న తనువూ
సవరించుకోకుండానే
పారిపోతాయి స్వప్న సౌందర్యాలు.
వెలుగు సౌరభాలు ఇంటి నలుమూలలా
అగరు పొగలవుతాయి.
సుదీర్ఘ మౌనం తరువాత గొంతువిప్పిన
ఉషోదయం గండు కోయిల కుహూ రవాలు
కుంభవృష్టిలా ఆద్యంతం తడిపేస్తాయి

ఇహ మొదలు
ఎన్ని రూపాలో మారుస్తూ అలరింపు సేవ
రాత్రికి రాత్రి జానెడు పెరిగిన వెదురుమొక్కలా
అరవిప్పిన చూపులా వికసించే పొద్దుతిరుగుడు పువ్వులా
అర్ధరాత్రి ఎదురొచ్చిన సూర్యోదయంలా
రోజువారీ పనులను స్వాగతిస్తూ
పసికూన మనసును సమాయత్తపరుస్తూ
ఒంటికి నలుగై కంటికి మెరుపై
ఒకేసారి యజమానిగా, సేవకుడిగా
అదలిస్తూ అదలింపు స్వీకరిస్తూ
మయూఖ ప్రభంజనం

సాయంత్రపు నీరెండ పాలిపోయి పవళించే వరకూ
రెక్కలు మొలిచిన పక్షినవుతాను
యంత్రం అమర్చిన మరమనిషినవుతాను
మళ్ళీ రంగూరుచీ వాసనా సోకని చీకట్లో
నీటిలో కరిగిన ఉప్పునవుతాను
అయితే మాత్రం
కరిగినా మరిగినా ఆగనివేకదా
వెలుగు చీకట్లు

సూక్తిముక్తావళి -- డా. వజ్జలరంగాచార్య

కళలవి రచ్చబండకడ కన్పడు వేళల
యూరివారటన్
కళకళలాడు మోములను కల్వల
మాదిరి విచ్చి నవ్వుచున్
పొలుపగు ముచ్చటల్, కలిమి పొందని కష్టము లాడుకొంచు,వి
ద్యలగని తస్మయస్థితిని తారు సుఖిం
చరె పూర్వకాలమున్

పెంచిన చెట్టు పూలనిడు, పెంచిన
గేదెలు పాలనిచ్చు, యే
కొంచెము బెట్ట కుక్కదిని కూర్మిని
జూపదె యింటిబంటుగా
కొంచెపు చేష్ఠలేమిటి?సుఖోదయ
రాగ సతీ ప్రియాంగుళిన్
బాంచెనటంచు పట్టితివి బాయగ,
తమ్మి యిదేమి న్యాయమే
(బాంచెను అన్నది తెలంగాణా మాండలికము బానిసను అని అర్థం)

చందన మెన్ని రీతులుగ చేరి మను
ష్యుల మెప్పుగూర్చు, కా
మందుల , కార్మికాళి,జన మన్నన
బొంది పరీమళించు, నీ
వందరి వాడవై హితము వర్ధిల
వర్తిలు సాయమిచ్చుచున్
పొందెడు తృప్తికన్న మరి పూజ్యత
యుండునె సంఘజీవిగాన్

ముసురు -- పి.లక్ష్మణ్ రావ్

ముసురు
ఓ చలి వెచ్చని జ్ఞాపకం!

అగ్గి రాజేసిన కుంపటిని
నులక మంచం నడుం క్రింద పెట్టి
దుప్పటి ముసుగేసుకొని
పడుకుంటే
చలికి వేడిసెగ తగిలి
ఊష్టమొచ్చినట్లుండేది!

నట్టింట్లో
బొగ్గుల పొయ్యి చుట్టూ
నలుగురం కూర్చొని
అరచేతులను వేడిచేసుకుంటూ
వెచ్చని కబుర్లు చెప్పుకుంటుంటే
చలిపులి బెదిరిపోయి
మా నుండి పారిపోయేది !

పచ్చిమిరపకాయలతో
బజ్జీలు చేసుకొని
ఇంటి చూరు అరుగు మీద
కూర్చొని తింటుంటే
వగరు తగిలిన నోటునుండి
చలి మొత్తం ఎగిరిపోయేది

ఆరుబయట
తాటాకుల మంట చుట్టూ చేరి
చలి కాచుకుంటూ
పరాచికాలాడుకుంటుంటే
నవ్వుల చిటపటలకు
చలి మొత్తం పటాపంచలయ్యేది!

ముసురేసిన ముసుగు తొలగి
సూర్యుడు సరికొత్తగా దర్శనమిస్తే
తెరిపిచ్చిన సంతోషం
మరలా ముసురు కోసం
ఎదురుచూసేది!

ముసురంటే
మాకు ఎప్పటికీ
చలి వెచ్చని జ్ఞాపకమే !

అద్దంలో నువ్వు.... -- రాయదుర్గం విజయలక్ష్మి

అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నపుడు
తరచూ  నీ కళ్ళు నేల వాలుతున్నాయా ?
నీ రూపం నీకన్నాభిన్నంగా కనిపిస్తోందా?
కుడి ఎడమల మార్పే గాక,
అవస్థాభేదాలను కూడా అద్దం చూపుతోందా!?
అయితే ఆలోచించు!

అధర్మం ధర్మాన్ని నెట్టేసి
ముందుకు దూకుతున్నపుడు
కనీసం ఒక్కసారైనా నీ గుండె ఉద్రేకపడిందా!?
నువు రోడ్డుమీద నడుస్తున్నపుడెపుడైనా
ఏ ఒక్క జత కనులైనా
నిపట్ల కృతజ్ఞతగా చూశాయా!?
ఏ ఒక్క నిరాశోపహతమైన నిట్టూర్పు అయినా,
నీ ఆలంబనలో వెలువడకే ఆగిపోయిందా!?
మరణపత్రంమీద అంగీకారసంతకం చేయబోతున్న
నిరాసక్త, నిర్జీవపు చూపులేవైనా
నీ స్నేహంతో కాంతులు పుంజుకున్నాయా!?

దీపం క్రీనీడలో బల్లి పురుగును తరిమినపుడో...
నీ అక్వేరియంలో చిన్న చేప మాయమైనపుడో…
స్నేక్ పార్క్ లో ఒకే పామును చెరోవైపు
దిగ మ్రింగుతున్న కాలనాగులను చూసినపుడో…
నీ కళ్ళముందే అన్యాయం గొంతు చించుకొని
వేదికలెక్కి న్యాయ విచారణ చేస్తున్నపుడో…
నీడనివ్వాల్సిన చెట్టు
ఊడలతో మెడకురిబిగించినపుడో….
నీకళ్లు ఎపుడైనా
రెండంటే రెండు కన్నీటి చినుకులను వర్షించాయా?
నీ పిడికిలి ఒక్కసారైనా బిగుసుకుందా?

ఆలోచించు! ఇందులో ఒక్కటంటే  ఒక్కటైనా
నీ అనుభవంలో లేనపుడు,
నీలో ఉండవలసిన కరుణ మాయమైనపుడు,
అద్దంలో నీ చూపులు నేలవాలకేం చేస్తాయి??

అదే కల -- పద్మావతి రాంభక్త

కొన్నాళ్ళుగా
ఆ కల నన్ను వెంటాడుతోంది
నీలిఆకాశం నవ్వినట్టు
నక్షత్రాలు మెరిసినట్టు
అదే అందమైన కల
పదే పదే పలకరిస్తోంది
నిదుర లేచాక
ఆ కల కోసం
కన్ను కలవరిస్తోంది

చిన్న కునుకు స్పర్శిస్తే చాలు
కల నన్ను గోరువెచ్చగా
కౌగిలిస్తోంది
నన్ను పూలతోటను చేసి
హరివిల్లుపై ఊయలలూగిస్తోంది

రెప్పల కింద
బంగారుచేపలా ఈదుతూ
ఆ కల
స్వర్గపుటంచుల దాకా
నన్ను తీసుకెడుతోంది

అది ఎంతటి
కాంతిమంతమైన కల
చిమ్మచీకట్లో
మిణుగురులను దోసిట్లో పోసి
మురిపించినట్టు
నన్ను నదిని చేసి
అలల మువ్వల సవ్వడితో
ప్రవహింపజేస్తోంది

ఇప్పుడు మెలకువ
నాకు శత్రువై భయపెడుతోంది
నా కలను కాళ్ళ కింద తొక్కి
నలిపేస్తోంది

సమూహాలు సమూహాలుగా
మనుషులు
కరచాలనాలతో
ఆలింగనాలతో
జతగూడినట్టు
కేరింతలతో బృందగానం
ఆలాపిస్తూ
నాట్యమాడినట్టు
భుజాలపై చేతులు వేసుకుని
కలివిడిగా తిరిగినట్టు
ఒకరి నోటికి మరొకరు
గోరుముద్దలు తినిపించుకున్నట్టు
ఒకటే కల
పరిపరి విధాలుగా
రంగులురంగులుగా కల

కల ఎప్పుడు నిజమవుతుంది?
అలాగని అదేమీ
ఖరీదైన కల కాదుగా

అవును
ఈ కల నన్ను
నిలువనీయకుండా
నీడలా వెంటాడుతోంది
నేటి రోజున
గొంతెమ్మ కోరికై
గుండెకు
లోతుగా గాయం చేస్తోంది

Posted in July 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!