Menu Close
సూర్యుఁడు
- అయ్యగారి సూర్యనారాయణమూర్తి -

“ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్” అన్నారు పెద్దలు. సకలసృష్టికి చైతన్యశక్తిభుక్తిప్రదాత సూర్యుడు. ఆలయాలు తక్కువైనా, అందఱికీ కనిపించే దైవము సూర్యభగవానుడు. వందనప్రియుడైన ఆ రవి పేరు దాల్చిన కవిగా నేను నమస్కరిస్తూ, సమర్పిస్తున్న పద్యపుష్పార్చనే ఈ కవిత.

ఉ.
సూర్యుఁడు సర్వసృష్టికిఁ బ్రచోదనుఁడై యుదయించు నిత్య మా
అర్యముఁడే కదా గ్రహము లన్నిటికిన్ దగు నాథుఁ డౌచు నే
చర్యలకైన సాక్షి యయి చక్కని పచ్చదనంబుఁ బెంచి సౌం
దర్యము గూర్చి భుక్తి నిడు ధాత్రి వసించెడి ప్రాణికోటికిన్ 1

పంచచామరము
అనంతసౌరశక్తి కాది యాతఁడే; సమస్తమున్
ఘనంబుగా విశుద్ధిసేయుఁగా సమంబుగా భువిన్;
కనన్ జనన్ మనన్ బ్రశాంతిగా జనంబు లాతపం
బనర్ఘమౌఁ(1) గదా, సదా నిశాంత(2) మెంతొ కాంతమౌ(3) 2
............(1) అమూల్య మగును (2) తెల్లవారువేళ (3) సుందర మగును

శా.
ప్రాణాధారజలంబు భూతలముఁ జేరన్ వార్ధినీరంబులన్
తానే యాతపశక్తి నావిరిగ మింటన్ జేర్చు మేఘాలుగా
వానల్ గొండల భూములన్ బడి స్రవింపన్ దాహమున్ దీర్చుచున్
భానుం డీ సమతుల్యకారకునిగా వర్తించు నిత్యం బొగిన్(1) 3
............(1) విధిక్రమముగా
శా.
ఆరోగ్యంబు నొసంగు సూర్యకిరణా; లాకాశసామ్రాట్టుగా
తేరున్ దీరుగ నెక్కి సాగు రవి దీప్తిన్ వ్యాప్తిఁ జెందించుచున్
సారం బెంతయొ గూర్చు వృక్షములకున్ బత్రాతపస్నేహ(1) మే
పారన్(2); జీవుల కెల్ల శ్రీకరుఁడు(3) ప్రత్యక్షంబుగా నర్కుఁడే(4) 4
............(1) ఆకులకు సూర్యరశ్మికి మధ్య మైత్రి
............(2) ఏపారన్ = వృద్ధిపొందగా
............(3) విష్ణువు / శుభములు కలిగించువాడు
............(4) అందఱిచే అర్చింపబడువాడు (సూర్యుడు)
కం.
దినకరుఁ డను నామంబే
దినచర్యకు నాందిపలుకుఁ; దిరుగుచు హనుమన్
తనదిశకు మొగము నుంచుచు
కొనుమని బోధించె విద్య గురువర్యుండై 5
కం.
ఆదిత్యు హృదయ మందున
సాదరముగ జప మొనర్చి(1) యనితరజయమున్
మోదింప విశ్వ మంతయు
నాదరణీయుండు రాముఁ డని(2) సాధించెన్ 6
............(1) అగస్త్యమహాముని ఉపదేశించిన ఆదిత్యహృదయమును
..................జపించి
............(2) యుద్ధములో
కం.
ప్రతియొకరికిఁ దా నొకఁడై
ప్రతినిమిషముఁ గానుపించు రవి దైవంబై
ప్రతిదినమున; ప్రారంభము
ప్రతిభాన్వితభవిత కెపుడు ప్రత్యూషంబే(1) 7
............(1) ప్రాతఃకాలమే
కం.
తనశాక్త్యావశ్యకతను
తనహద్దులు మీఱి పెంచి, తగిన యుపాయం
బని పునరుత్పాదకశ
క్తిని(1) మనుజుం డాశ్రయించెఁ దృప్తియె కఱవై 8
............(1) Renewable Energy
ఉ.
అందున సౌరశక్తి యొక యద్భుతసృష్టివరంబు గాఁగఁ దా
నందఱికిన్ లభించుగతి నా రవి నిత్యము మండి పంచఁగా
నెందఱు తా మెఱింగి యిది యించుక మెత్తురొ? గౌరవంబుతో
ముందఱ నిల్చి మ్రొక్కెదరొ? ముందుకు మన్గడకీలకం బిదే 9
తే.గీ.
భువి శిలాజేంధనమ్ముల(1) పొగలు(2), సెగలు(3)
చనఁగ స్వచ్ఛమ్ము(4) నగ్గువౌ(5) శక్తి నొసఁగు
సౌరఫలకాల(6) నెలకొల్పె శ్రద్ధ తోడ
మానవుఁడు; సూర్యకృపలేక మనువు గలదె? 10
............(1) Fossil fuels (2) Air Pollution
............(3) Thermal Pollution (4) Clean
............(5) అగ్గువ+ఔ = Less costly (6) Solar Panels
Posted in July 2022, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *