Menu Close
calling-bell
కాలింగ్ బెల్ (కథ)
సౌందర్య కావటూరు

శాంతమ్మ దుప్పటిలో ముడుచుకుని పడుకుంది. అప్పుడప్పుడు మూల్గుతోంది. పైన అద్దెకున్న రామకృష్ణ కుటుంబం మొత్తం నిన్నటి నుండి అక్కడే ఉంది. శాంతమ్మ ఆ ఇంటి యజమానురాలు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు రమేష్ ఉద్యోగరీత్యా చెన్నై లో భార్యా పిల్లలతో ఉంటాడు. తల్లిని తనతో రమ్మని ఎంత బ్రతిమాలినా ఆమె ససేమిరా రానంది. అందుకు కారణం, తన భర్త సంపాదించి తన పేర వ్రాసిన ఆ ఇల్లే. భర్త లాగే తనూ అక్కడే రాలి పోవాలని ఆమె కోరిక. రామకృష్ణ తెల్లవారగానే డాక్టర్ ని పిలవటానికి  బయటికి వెళ్ళాడు. అప్పుడే శాంతమ్మ కొడుకు రమేష్ బ్యాగ్ తగిలించుకుని కార్ దిగి లోపలికి వచ్చాడు. రమేష్ ని చూడగానే అక్కడ కూర్చున్న జయ, వాళ్ళ నాన్న రామేశం లేచి అతన్ని పలుకరించారు. విషయమంతా వివరించారు. శాంతమ్మ కి నిన్నటి నుండి విపరితమైన జ్వరం. ఆహారం కూడా లేదు. నిన్న ప్రొద్దున్న పాల వాడు తలుపు తట్టితే ఎంతకి తెరవక పోవడంతో వాడు ఆ విషయం తమకు చెప్పి వెళ్ళాడు. తాము అప్పుడే లోపలి మెట్ల తలుపు తెరుచుకుని శాంతమ్మ పడుకున్న బెడ్రూం లోపలికి వచ్చి చూసారు. ఇలాంటి అవసరాల కోసమే ఆ లోపలి మెట్ల తలుపు గొళ్ళెం పెట్టరు. కానీ తాము ఎప్పుడు ఇలా దిగరు. తమ మెట్ల దారి బయటే ఉంటుంది. అప్పటికే శాంతమ్మ విపరీతమైన జ్వరంతో ఉంది. అప్పుడు టైం ఉదయం ఏడు గంటలు దాటింది. ఆమెను పలుకరిస్తే ఏదో లోకంలో ఉన్నట్టు చూస్తోంది కానీ జవాబు మాత్రం లేదు. తమ దగ్గర ఉన్న జ్వరం మాత్రలు ఇచ్చి చూసారు. కానీ జ్వరం ఏ మాత్రం తగ్గలేదు. అందుకే రమేష్కి కూడా ఫోన్ చేసి విషయం చెప్పారు.

రమేష్ పిల్లలకి పరీక్షలు కావటముతో ఒక్కడే వచ్చాడు. ఒంటరిగా ఉన్న తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే రమేష్ చాలా కంగారు పడతాడు. బ్యాగ్ పక్కన పడేసి తల్లి దగ్గర కూర్చుని ఆమె చేతిని తన చేతి లోకి తీస్కోని మెల్లగా నిమురుతూ అమ్మా అని పిలిచాడు. కొడుకు గొంతు విని శాంతమ్మ కళ్ళు తెరిచి చూసింది. ఇంతలో రామకృష్ణ డాక్టర్ని తీసుకుని వచ్చాడు. ఆయన శాంతమ్మని టెస్ట్ చేసి వైరల్ ఫీవర్ ఉండొచ్చని మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. రామకృష్ణ కూడా తనకు ఆఫీస్ టైం అయిందని, ఏదైనా అవసరమైతే తనకు ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. రమేష్ ని చూసి శాంతమ్మ లేచి కూర్చోవటానికి ప్రయత్నించిoది. రమేష్ ఆమెకి హెల్ప్ చేసి కూర్చోపెట్టాడు. అప్పుడు మెల్లగా గొంతు విప్పింది శాంతమ్మ. మొన్న రాత్రి దెయ్యాన్ని చూసానురా అబ్బాయి అనింది. రమేష్ కి ఏమి అర్ధం కాలేదు. అమ్మ జ్వరంలో ఏదో మాట్లాడుతుంది అనుకున్నాడు. శాంతమ్మ ఇంకా చెప్ప సాగింది. రాత్రి పన్నెండు గంటలకి కాలింగ్ బెల్ మ్రోగింది. కిటికీ లోంచి చూస్తే ఎవ్వరు లేరు కానీ అని ఆగింది. రమేష్ కి కూడా సస్పెన్స్ అనిపించింది. ఎవరమ్మా ఆ టైములో బెల్ కొట్టింది? అంటూ జవాబు కోసం చూసాడు. “అప్పుడు నాకు జామ చెట్టు కింద ఒక తెల్లని ఆకారం కనిపించింది” అని శాంతమ్మ భయంతో కొడుకు చేయి గట్టిగ పట్టుకుంది.

రమేష్ కిదంతా నమ్మబుద్ధి కాలేదు. అసలే అతను చదివింది సైన్సు సబ్జెక్ట్. సరే తరువాత ఏమైందో చెప్పు అన్నాడు కొంచం విసుగ్గా. అప్పుడు ఆ ఆకారం కదిలి నా వైపు రాసాగింది అన్నది శాంతమ్మ భయంగా చూస్తూ. తర్వాత నేను కిటికీలు మూసేసి మంచం మీద ముసుగేసి కదలకుండా పడుకున్నాను. మళ్ళీ రెండో సారి బెల్ మ్రోగింది. నేను కదలలేదు. ఆ జడుపు తోనే నాకు జ్వరం పట్టుకుంది. మరి రామకృష్ణ వాళ్ళకి విషయం చెప్పలేక పోయావా అన్నాడు రమేష్ కొంత విస్మయంగా. అప్పుడు శాంతమ్మ, ఇంకా నయం నువ్వు వాళ్ళకేమి చెప్పకు. ఇంట్లో దయ్యం ఉందంటే వాళ్ళు ఖాళీ చేసి వెళ్లి పోతారు. మళ్ళీ నాకు మంచి పార్టీ దొరకరు. నేను ఒంటరిగా ఉండలేను” అనింది. “సరే చెప్పనులే” అంటూ రమేష్ స్నానానికి వెళ్ళాడు. కానీ యీ దెయ్యం సంగతి రాత్రికి తేల్చాలని నిర్ణయించు కున్నాడు. రాత్రి అవగానే తలుపులు అన్నిమూసి వేసారు. మందులు వేస్కొని రమేష్ తెచ్చిన ఇడ్లీలు తిని ముసుగు తన్నింది శాంతమ్మ. జ్వరం కొంచం తగ్గింది కానీ భయంతో వచ్చిన నీరసం మాత్రం అలాగే ఉంది. రమేష్కి ఆసక్తిగా ఉంది దెయ్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలని. ఏదో బుక్ చదువుతూ పన్నెండు వరకు కూర్చున్నాడు. ఆకాశం మబ్బుగా ఉంది అప్పుడప్పుడు చల్లని గాలి వీస్తోంది. ఎంతటికీ కాలింగ్ బెల్ మ్రోగక పోవటముతో కిటికీ దగ్గరకు వెళ్లి చూసాడు. అమ్మ చెప్పింది నిజమే. జామ చెట్టు కింద తెల్లటి ఆకారం కదులుతోంది. తన దగ్గరకు వస్తుందేమోనని అలాగే చూస్తున్నాడు. అది అక్కడే కదుల్తోంది కానీ ముందుకు రావటము లేదు. బహుశా తనంటే భయమేమో. పెద్ద వాన మొదలవటంతో కరెంటు కూడా పోయింది. చేసేది లేక రమేష్ కూడా అమ్మ ప్రక్కన వేసిఉన్న మంచంఫై పడుకుని ఆలోచించసాగాడు. ప్రొద్దునే లేచి కాలింగ్ బెల్ సంగతి కూడా చూడాలని  నిశ్చయించుకుని నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారగానే బయటకు వెళ్లి జామ చెట్టు క్రింద పరిశీలనగా చూసాడు. అక్కడ వానకు తడిసి పడి ఉన్న తెల్లటి పంచె కనపడింది. రాత్రి అది గాలికి ఊగటముతో అమ్మకి ఏదో ఆకారం కదిలినట్లు అనిపించి ఉంటుంది. రమేష్ చిన్నగా నవ్వుకున్నాడు. ఇంకా కాలింగ్ బెల్ రిపేరేర్ వస్తే దాని సంగతి కూడా తేలుతుంది. అదే విషయం శాంతమ్మ కి కూడా వివరంగా చెప్పాడు తన సైన్సు జ్ఞానాన్ని జోడించి. కాని శాంతమ్మ ఏది అంత తొందరగా నమ్మదు. రిపేర్ వాడు రానే వచ్చాడు. కాలింగ్ బెల్ ఓపెన్ చేసి చూసాడు. అందులో రెండు బల్లులు చచ్చి పడి ఉన్నాయి. సంగతి అర్ధమయింది అందరికి. అంతలో క్రింద సందడికి రామకృష్ణ వాళ్ళు కూడా దిగి వచ్చారు. రమేష్ వాళ్ళకి విషయమంతా చెప్పాడు. రామకృష్ణ మామగారు, తేలిగ్గా నవ్వుతూ, ఆ పంచె నాదేనోయ్. పైన ఆరవేస్తే మడిబట్ట పిల్లలు ముట్టుకుంటారని ఫైనుండి చెట్టు మీద వేసుకుంటున్నాను. అది గాలికి క్రిందకి జారింది. అదీ సంగతి అంటూ పెద్దగా నవ్వాడు.

మరి కాలింగ్ బెల్ కథ ఏమిటని శాంతమ్మ ఆసక్తిగా అడిగింది. దానికి రిపేరేర్ బదులిచ్చాడు. రెండు బల్లులు ఒకదాని తర్వాత ఒకటి కాలింగ్ బెల్ లో దూరటంతో వాటి బాడీ తగిలి కరెంటు షార్ట్ అయి రెండు సార్లు బెల్ మ్రోగింది. వెంటనే అవి చచ్చి పోయాయి. కానీ రాత్రి కావటముతో అమ్మగారు జడుసుకున్నారు. వాడి మాటలు విని శాంతమ్మతో సహా అందరూ తేలిగ్గా నవ్వారు. కానీ శాంతమ్మ మాత్రం బల్లులను చూసిన తర్వాతే వాడి మాటలు నమ్మింది. ఇంత సిల్లీ విషయానికి అమ్మ అంతగా భయపడిందని ఆమె అజ్ఞానానికి రమేష్ కొంచెం విసుగ్గా నిట్టూర్చాడు. జరిగినదంతా మద్రాసు లోని తన భార్య శారద కి కూడా ఫోన్ చేసి చెప్పాడు. కొన్ని సార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటే ఇదేనేమో. తేలిక పడ్డ మనస్సుతో రమేష్ ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు. తెచ్చుకున్న ధైర్యంతో శాంతమ్మ కూడా తిరిగి తన రొటీన్ లో పడింది.

Posted in July 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!