Menu Close
శ్రీ శ్రీ శ్రీ రుద్రమూర్తి యోగీంద్రుల పరిచయం
-- గౌరాబత్తిన కుమార్ బాబు --
Rudrayya-Swamy

చాతుర్వర్ణములను ఖండించి, సర్వ మానవ సమానత్వాన్ని ప్రభోదించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల శిష్య పరంపరకు చెందిన వారే శ్రీ రుద్రమూర్తి యోగీంద్రులు. వీరు దేవళ సంప్రదాయానికి, గాంగేయ మహర్షి గోత్రానికి, మనులాలపేట గ్రామానికి చెందిన వారు. మనులాలపేట నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోకి వస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి శిష్యులైన సిద్ధయ్య, వీరవుసేనయ్యలు కడపజిల్లాకు చెందిన దూదేకుల కులస్తులు. శ్రీ రుద్రమూర్తి స్వామి వీరవుసేనయ్య దగ్గర శిష్యరికం చేసి భక్తి జ్ఞాన కర్మయోగాలను సమన్వయం చేసుకుంటూ నిత్యమూ శ్రీ కాళహస్తీశ్వరస్వామిని ఉపాసించి శివైక్యం చెందారు. కందిమల్లయ్య పల్లెలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి చెందిన 82 సంవత్సరాలకు, మాంచాల గ్రామంలో శ్రీ రాఘవేంద్రస్వామి జీవ సమాధి చెందిన 5 సంవత్సరాలకు అనగా క్రీ.శ 1676వ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమినాడు మనులాలపేట గ్రామంలో శ్రీ రుద్రమూర్తి స్వామి జీవసమాధి చెందారు. అప్పటి నుండీ ప్రతి ఏటా గ్రామస్తులు ‘రుద్రయ్య ఒరటు’ పేరిట మార్గశిర మాసం శుద్ధ పంచమినాడు ఉత్సవం చేస్తూ వస్తున్నారు.

మనులాలపేట పూర్వ నామం సీతారామపురం. వెంకటగిరి సంస్థానాధీశులు నాడు సంస్థానంలో కీలక బాధ్యతలు నిర్వహించిన లాలాలకు ఈ గ్రామాన్ని దానం చేయడం వల్ల సీతారామపురం మనులాలపేటగా నామాంతరం చెందింది. వెంకటగిరి సంస్థానం 1693వ సంవత్సరంలో ఏర్పడింది. అందువల్ల శ్రీ రుద్రమూర్తి స్వామి జీవసమాధి చెందిన ఘటన సంస్థాన చరిత్రలో నమోదు కాలేదు. పూర్వీకులు తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసిన శ్రీ రుద్రమూర్తి స్వామి జీవితచరిత్ర కాలగర్భంలో కలసిపోయింది. ఇటీవలే శ్రీ రుద్రమూర్తి స్వామి దేవస్థాన ఆలయ కమిటీవారు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి శ్రీ రుద్రమూర్తి స్వాముల వారు అచ్చ తెలుగులో రచించిన ఏబది అయిదు తత్వాలను కడప జిల్లాలో సేకరించగలిగారు. శ్రీ రుద్రమూర్తి స్వాముల గురించి ఇంకా విస్తృత స్థాయిలో పరిశోధన జరిగితేగానీ వారి సంపూర్ణ చరిత్ర వెలుగులోనికి రాదు.

శ్రీ రుద్రమూర్తి స్వాములవారు తమ తత్వాలను 'వీరవుసేనయ్య యీశ్వరాయ' అను మకుటంతో రచించారు. 'వేమన వాక్యంబు వేదసారము సుమ్మి' అంటూ ప్రజాకవి వేమన చెప్పిన పద్యాల గొప్పతనం గూర్చి చెప్పారు. ’యెందెందుచూచిన అందెందుయున్నది, అందెందువున్నాడు యందు చూచినగాని, హృదయాంతరంగుడై వెలుగుచుండు’ వంటి పంక్తుల్లో శివుడు సర్వాంతర్యామి అన్న శృతివాక్యాన్ని, హృదయంలోనే శివుడిని దర్శించగలమన్న సత్యాన్ని సూటిగా చెప్పారు.

‘నయనమధ్యమందు నిలిచియున్నాడయా మాయతెలియనీదు మోసపుచ్చి’ అన్న పంక్తుల్లో మాయావాదాన్ని, ‘కామక్రోధంబులు కడతేరనియ్యవు కామమును ఖండించి కడతేరవలెనయా’ అన్న పంక్తుల్లో బౌద్ధ ధర్మ మూలసూత్రాన్ని బోధించారు.

‘వక్కప్రొద్దుయని వుపవాసములువుండి ఆకుఅలుములుతిని అడవులందు మేకవలెమేసేరు మూర్ఖులందరుయిల’ అంటూ మూఢభక్తి, ఢంబాచారాన్ని ఖండించారు.

‘మనసుకు ముగుదాడు మరకుండావేసి, మనసుపదిలముజేసి మనసుతాతెలసిన, మనసులోనున్నట్టి మహిమగన్న, మనసు పరంజ్యోతి, మనసు పరమాత్మయా’ అన్న పంక్తుల్లో మనసును నిలువరించుట యెంత ముఖ్యమో, నిలువరించిన ఫలమేమి కలుగునో బోధించారు.

‘అతడె వీరవుసేను యితరులెవరున్నారు, అతడు కానిది యేమి వకటిలేదు, అతడె అన్నిటనిండి అన్నితానైనవాడు’ అన్న పంక్తుల్లో తన గురువును దేవుడిగా భావిస్తూ అద్వైత వేదాంత సారమేమిటో తెలియజెప్పారు.

రుద్రమూర్తి స్వాములవారు రచించిన మరికొన్ని తత్వంబులు :-

కన్నుల పైగాను వున్నది గోప్యంబు
మిన్నుజూచి నీవు మేనుమరచి
తిన్నగానుమాటు తీసితే దొరుకును
వీరవుసేనయ్య యీశ్వరాయ.

భావము:- కన్నులపైగా ఉన్నదేదీ - ఆజ్ఞా చక్రమునుండి సహస్రా చక్రమునకు వెళ్ళు మార్గమున అతి గోప్యముగా బ్రహ్మము ఉన్నది. అతి జాగ్రత్తగా ప్రయత్నిస్తే లభ్యమగును అని భావము.

సోధించిసోహమున భేదించి కుండలమున
పాదుకొనినిటలమున బయలుపలచి
చెదరకచూడుడీ చేకూరు మోక్షంబు
వీరవుసేనయ్య యీశ్వరాయ.

భావము:- సోహం అంటే అది నేనే, నేనే అది. బ్రహ్మమే నేను. అహం బ్రహ్మాస్మి. కుండలినీ యోగము ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం అనగా మోక్షం లభిస్తుంది.

ఎరుకలోని ఎరుక ఏకస్వరూపంబు
నయనమందున విశ్వమెల్లయుండు
విశ్వంబు తెలిసిన తేజప్రకాశమౌ
వీరవుసేనయ్య యీశ్వరాయ.

భావము:- ఎరుక అంటే ఏదైతే మన ఎరుకలో ఉంటుందో అదే మన అనుభూతిలో ఉంటుంది. లేనిది ఉండదు. అంటే సావధానత. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా సావధానంగా ఉండటం గురించే నొక్కిచెప్పారు. సావధానంగా ఉన్నప్పుడే నయనమధ్యమున అనగా ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న బ్రహ్మను అనుభూతి చెందగలం. బ్రహ్మ యేవ ఇదం విశ్వం ఇదం వరిష్టం అనగా బ్రహ్మమే విశ్వంగా పరివ్యాప్తం చెందింది. అట్టి బ్రహ్మాన్ని అనుభూతి చెందితే మనసు ప్రకాశవంతమవుతుంది.

అతడె పరమశివుడు అతడె త్రిమూర్తులు
అతడె అందరియందు అలరుచుండు
అతడెపో పరబ్రహ్మఅతడె
వీరవుసేనయ్య యీశ్వరాయ.

భావము:- పరమశివుడు అందరియందు అలరుచున్నాడు.

ఆనందమైనంత అన్నిటనుండురా
అర్ధమై విజయమై అలరుచుండు
నిత్యమై సత్యమై సుస్ధిరంబైయుండు
వీరవుసేనయ్య యీశ్వరాయ.

భావము :- సత్ చిత్ ఆనందం అను శృతి వాక్యం గురించే యీ పద్యం. ‘సత్‌’ అంటే ఎన్నటికీ నశించనిది. అన్ని కాలాల్లోనూ ఉండేది. చిత్ అంటే ఎల్లప్పుడూ ఉండే జ్ఞానస్వరూపము. సత్‌’ కన్నా వేరుగా ‘చిత్‌’ ఉండే అవకాశం లేదు. సత్తే చిత్తు. అదే సత్యం కనుకనే ‘సత్తయాహిచిత్‌’ అని రమణులు చెప్పారు. నిజమైన ఆనందం, శాశ్వత ఆనందం, దివ్యమైన ఆనందం అయినది ఆత్మయే. ఆత్మ ఒక్కటే. సత్తే చిత్‌, చిత్తే ఆనందం. అంటే ఎల్లప్పుడూ ఉండే జ్ఞానస్వరూపమే, ఆనంద స్వరూపమే ఆత్మ అని భావం.

పాల్ బ్రన్ టన్ తన రహస్య భారతం అను గ్రంథంలో యీ విధంగా రాశారు "ఈనాటి భారతదేశాన్నించి పాశ్చాత్య ప్రపంచం నేర్చుకోవలసింది ఏమీ లేదంటే నేను కాదనను. కానీ భారత దేశపు గత యోగుల నుంచీ, ప్రస్తుతం జీవించి ఉన్న బహుకొద్ది మంది నుంచీ నేర్చుకోవలసింది చాలా ఉన్నదని నిస్సంశయంగా ఘంటాపధంగా చెప్పగలం." భారత దేశాన్ని సందర్శించే యాత్రికుల గురించి చెబుతూ వివేచనాపరుడైన యాత్రికుడు మన విశ్వవిద్యాలయాల్లో ఎక్కడా బోధించని వివేచనను వెలికి తెచ్చే సజీవ యోగులను అన్వేషించుతాడు. యీ వివేచన ప్రస్తుత భారతానికి కాక ప్రాచీన భారతానికి చెందుతుంది అని రాశారు. పాల్ బ్రన్ టన్ ఎటువంటి యోగులకై అన్వేషించారో అటువంటి యోగియే శ్రీ రుద్రమూర్తి స్వాములవారు. ఇటువంటి యోగులే మతమనే మార్గం గుండా ఆధ్యాత్మికత అనే లక్ష్యాన్ని చేరుటలో సాయపడేవారు.

Posted in July 2022, వ్యాసాలు

2 Comments

  1. G.Kumar Babu

    జీవసమాధిలో ఇంకా భౌతిక దేహంతో ఉన్నారని నేను భావించట్లేదు. జీవ సమాధి చెందిన మహాయోగి కచ్చితంగా శివైక్యం చెందివుంటారని అలా రాశాను. ఒక వేళ సూక్ష్మ రూపంలో కొలువై ఉండవచ్చు….కానీ అద్వైతిని కాబట్టి జీవాత్మ పరమాత్మల మధ్య అబేధాన్ని నమ్ముతున్నాను. సామాన్యులు తమ సూక్ష్మ శరీరంతో మరొక దేహాన్ని పొందుతారు కదా.

    రాఘవేంద్ర స్వామి సైతం తన భౌతిక దేహం 76వ ఏట చాలిస్తానని. తరువాత సుమారు ఐదారు వందల ఏళ్లనుకుంటాను సమాధిలో ఆత్మ రూపంలో ఉంటానని అన్నారు.

  2. M V Raghavulu

    Rudara Murthy swamy ,sivikyam Ani rasaru marala rendavapanktilo jeeva samadhi Ani rasaru ,sivikyam anaga sivudilo aikyam anaga bhowthikadeham thyaginchadam,Mari jeevasamadhi Ela ayyadu ,clarify

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!