Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

కాకతీయ యుగం – మారన, అధర్వణాచార్యుడు

మార్కండేయ పురాణం

గన్నయ పండిత సభకు ఆహ్వానించి మారనను నూతన కథావిస్తారమై యోగ్యమైన మార్కండేయ పురాణాన్ని వినాలనే కోర్కెను తెలియజేశాడు. కృతి కర్త, కృతి భర్త ఇద్దరిదీ ఒకే కోరిక.

మారన మార్కండేయ పురాణాన్ని 2,547 గద్య పద్యాలలో అనువదించాడు. ఇందులో 4,5 కథలే రమణీయంగా కమనీయంగా చెప్పడానికి పనికి వస్తాయి. వాటిని మారన చక్కగా అనువదించాడు. మిగతా భాగాలన్నీ ధర్మ పన్నాలే. వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధ నియమాలు మొదలైనవే. ఉదాహరణకు –

తృతీయాశ్వంలో మదాలస తన కుమారుడైన అలర్కునికి రాజధర్మాలు బోధిస్తుంది. దీనిని గూర్చి చెప్తూ ఆరుద్ర “ఇది ఒక మైనర్ విజ్ఞానేశ్వరీయం” అన్నారు. ఈ సందర్భంగా చెప్తూ “అసలు మార్కండేయ పురాణం ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికే పుట్టింది.” అని ఆ విషయాన్ని వివరించారు. అది –

వ్యాసుని శిష్యుడు జైమిని. ఇతనికి అనేక సందేహాలుంటాయి. ద్రౌపది ఎందుకు ఐదుగురిని వివాహమాడింది? ఇత్యాది సందేహాలను తీర్చుకోవడానికి జైమిని మార్కండేయ మహాముని వద్దకు వెళతాడు. ఆయన జైమినిని నీ సందేహాలు తీర్చడానికి వింధ్య నగరం దగ్గర నలుగురు ధర్మపక్షులున్నారు వెళ్లి వాళ్ళనడుగు అని చెప్పగా జైమిని అక్కడికి వెళ్లి ఆ పక్షులను అడుగగా వారు జైమిని సందేహాలను తీరుస్తారు. 1 వ ఆశ్వాసం లోనే 187 వ గద్యం అయ్యేసరికి సందేహాలు తీరిపోతాయి. ఆఖరి సందేహం మాత్రం తీరకుండా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. అది హరిశ్చంద్రుని కథ. ఇలా మలుపులు తిరిగి చివరకు తృతీయ అధ్యాయం దాకా సాగుతుంది. అటు తర్వాత పురాణ లక్షణాలైన సర్గ, ప్రతి సర్గాది అయిదు లక్షణాలను గూర్చి మార్కండేయుడు క్రోష్ఠికి అనే మునికి చెప్పిన వాటిని ధర్మపక్షులు జైమినికి చెప్పగా అతడు తృప్తి పొందాడు.

మారన మూలానికి దగ్గరగానే అనువదించాడు. శేషాద్రి రమణ కవులు “మొత్తము మీద మారన కవి యాంధ్రీకరణము భారత యాంధ్రీకరణము కంటే మూలమునకు జేరువుగా నుండును...” అన్నారు.

మూలం లోని వాటిని మార్చడం కూడా జరుగుతుంటుంది. ఈ విషయాన్ని గూర్చి వ్రాస్తూ ఆరుద్ర .....ఆహార విహార నియమాలను మూలంలోవి మార్చేస్తున్నారని చెప్పి వాల్మీకి రామాయణంలో జింక మాంసం తో భూతతృప్తి చేసినట్లు ఉన్నదానిని, వాల్మీకి రామాయణాన్ని అనువదించిన శ్రీనివాస శిరోమణి గారు మార్చేసి కమలా ఫలాలు నైవేద్యం పెట్టినట్లు వ్రాశారు...అని తెలిపాడు ఈ సందర్భంగా.

రచనా విధానం – పాత్ర చిత్రణ

హరిశ్చంద్రోపాఖ్యానాన్ని 144 గద్య పద్యాలలో మారన రమణీయంగా అనువదించాడు. పాత్ర చిత్రణ, మనస్తత్వ నిరూపణ చక్కగా ఉన్నాయి. భాష సరళమైనా భావాలు లోతై పాఠకుని కంట కన్నీరు పెట్టిస్తాయి. హరిశ్చంద్రుని భార్య పేరు చంద్రమతి కాదు. ఇందులో శ్యేబ. ఆమెను అమ్మేటప్పుడు, అటు తర్వాత పద్యాలు పాఠకుని కంట నీరు తెప్పిస్తాయి

“పురజనులారా! నా పత్నినమ్మెద – నే దాసిగా నెల యెరిగి పట్టె ....”

శ్యేబ అమ్ముడు పోయిన తరువాత ఆమె తల వెంట్రుకలను పట్టుకొని- ఆమెను కొన్న యజమాని ఈడ్చినపుడు

“విడవ వయ్యా తండ్రీ! తడయక వచ్చెద ..నాకొడుకు ఏడ్చుచున్నాడు. బుజ్జగించి వచ్చెదనని కుమారుని జూచి, ‘అన్నన్న నన్ను ముట్టకు .. మన్న నృప తనూజ! దాసీ, నశుచి ననుచుబై...’ తాను కన్న బిడ్డను నన్ను తాకవద్దు అని చెప్పే తల్లిని చూచి ఏ హృదయం ద్రవించదు. సంభాషణలు సహజంగా ఉన్నాయి.

జాతీయాలు – సామెతలు:

“చిచ్చు చీరను కట్టడం” “సూదికి రెండు మొనలు గలవే! యౌవ్వనం” “అడవిగాచిన వెన్నెల” మొదలైనవి. ఆనాటి సాంఘీకాచారాలు రాచవీధుల్లో మాలవాండ్రు ఎలా నడిచేవారో చెప్పే ఈ పద్యం మారన, వర్ణనా నైపుణ్యానికి నిదర్శనం.

‘జల గోల దట్టుచు ‘సం
బళి సంబళి’ యనుచు గ్రందు పడు జనములకున్
దొలగుచు, నొదుగుచు నా, భూ
తలపతి కదా కరుగు దెంచి తానిట్లనియెన్’

మార్కండేయ పురాణం దేవీ మహత్యాన్ని ముఖ్యంగా ప్రకటిస్తుంది. శుంభ నిశుంభాది వధా సందర్భాలలో మారన ఉత్తేజంగా అనువదించాడు. లయగ్రాహి, మాలిని, మహాస్రగ్ధర దండకం మొ|| ఛందస్సులను వాడాడు. సాధారణంగా తెలుగు కవులు లయగ్రాహిలో వసంత వర్ణన చేస్తారు. కాని మారన యుద్ధ వర్ణన చేశాడు.

మారన తనను గూర్చి చెప్పుకోలేదు. కానీ కృత్యాదిని భారతీదేవిని స్తుతిస్తూ తన వైదుష్యాన్ని పరోక్షంగా చెప్పుకొన్నాడు. ప్రతాపరుద్రుణ్ణి ఢిల్లీ సుల్తాను పట్టుకుపోయినప్పుడు కృతి భర్త అయిన గన్నయమంత్రి ముస్లిం గా మారి మల్లిక్ మఖ్బూర్ అని పేరు మార్చుకొని ఆ రాజ ప్రతినిధిగా వరంగల్లుకు వచ్చాడు. కాని ఓరుగల్లు నందు నిలవలేక పోయాడు.

ఈ విషయాలన్నీ వివరంగా శ్రీ నేలటూరి వెంకటరమణయ్య గారు 1939 ఫిబ్రవరి భారతి లో వ్రాశారు. మతం మార్చుకొన్నాక గన్నయ మారనను కలుసుకొని ఉంటే ఏమి జరిగేదో ఊహించి ఈ గ్రంథ కర్త (ఆరుద్ర) “ఈశ్వర అల్లా తేరేనామ్” అనే నాటిక రచించాడు.

గన్నయ చర్యను గర్హిస్తూ మార్కండేయ పురాణ పీఠికలో ‘అతడిమ్మేదిన్’ అన్న పద్యంలో క్రూరమైన వ్యంగ్యం అవ్యక్తంగా ధ్వనించిందని, అయితే ఈ పద్యం చివర “ఈ దివ్య పురాణ రత్నమును మార్కండేయమే చెప్పగాంచితి పుణ్యాత్ముడనైతి జన్మము ఫలించెన్ లోకసంభావ్యమై” అని మారన అత్యంత ప్రమోదం పొందాడు అని చెప్పిన ఆరుద్ర “తెలుగులో దొరికిన మొదటి పురాణం కనుక ఇది నిజంగా లోక సంభావ్యమే” అని అన్నారు. (స.ఆం.సా పేజీలు 454-458).

అధర్వణాచార్యుడు

సంస్కృత వ్యాస భారతాన్ని నన్నయ ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో కొంత భాగం తెనిగించాడు. తిక్కన సోమయాజి విరాటపర్వం మొదలు మొత్తం పదిహేను పర్వాలను తెనిగించి ఆంధ్రమహాభారతం మనకందించాడు. ఎఱ్ఱన అరణ్యపర్వం కొరవ పూర్తిచేసి భారత రచనను సంపూర్ణం చేశాడు. అయితే తిక్కన లాగే మరొక కవి కూడా భారతానువాదం చేశాడు. అతడే అధర్వణుడు. ఈ పేరును గూర్చి చెబుతూ “ఇటువంటి పేరు తెలుగు వాళ్ళలో ఉండదు కనుక ఇది పెట్టుడు పేరేమో అని కొందరి అనుమానం” అన్నారు ఆరుద్ర.

“ఆచార్య దోణప్ప గారు వికృతి వివేక కర్తృత్వం అనే వ్యాసాన్ని ఇటీవల వ్రాశారు. అంతరంగికమైన అనేక సాక్ష్యాలతో వికృతి వివేకం అధర్వణ కర్తృత్వం కాదని అహోబిల పండితుడే దీనిని సృష్టించి అధర్వణునికి అంటగట్టాడని నిరూపించారు.” అని ఆరుద్ర దోణప్ప గారి వ్యాసాన్ని సాక్ష్యంగా ప్రస్తావించారు.

రచనలు-అందలి విశేషాలు

1. అధర్వణుడు రచించినట్లు చెప్పే కారికావళి అతని కృతి కాదు. అతను వ్రాసిన భారతం గాని ఛందస్సు గాని దొరకలేదు. అయితే అతని పద్యాలు పేర్కొన్న వాళ్ళ గ్రంథాల వల్ల తిక్కనకు సమకాలీనుడని తెలుస్తున్నది.

అధర్వణుని పేర్కొన్న ప్రాచీనుడు గౌరన. యితడు క్రీ.శ.1445 మధ్య జీవించాడు. లక్షణ దీపిక అనే ఛందోగ్రంథం రచించాడు. అందులో అధర్వణుని ఛందాన్ని పేర్కొన్నాడు.

‘అధర్వణుని శైలి కఠినమైనందువల్ల కవిత్రయ భారతం ముందు అధర్వణుని భారతం నిలబడలేక పోయిందన్న పండితుల వాదంలో నిజం లేకపోలేదు.’ అని ఆరుద్ర అధర్వణుడు చేసిన దుర్యోధనుని వర్ణనను తెల్పే పద్యం ఉదహరించాడు.

“నతనానావని నాధయా ధమకుటన్యస్తాబ్జ రాగోజ్వల .....”

ఈ సమాస రచన ఆంధ్రసాహిత్యంలో శ్రీనాథుని ప్రవేశానికి దారి తీస్తున్నది అని ఆరుద్ర మాట. సుదీర్ఘ సమాసాలతో పాటు విడివిడిగా పదాలు వాడి రసపుష్టి  కలిగించడం కూడా అధర్వణునికి తెలుసు. అని వెల్లంకి తాతం భట్టు ఉదహరించిన ఉద్యోగ పర్వంలోని పద్యం తెలుపుతున్నది. (స.ఆం.సా. పుట 462).

అధర్వణుడు జాతీయత ఉట్టిపడే తెలుగు మాటలు వాడడంలో కూడా సిద్ధహస్తుడు.

పది దినము లయిదు ప్రొద్దులు
పదపడి రెన్నాళ్ళు నొక్క పగలున్ రేయున్
గదనంబు జేసి మడిసిరి
నదిసుత గురు కర్ణ శల్య నాగ పురీశుల్!

ఈ పద్యాన్ని కూచిమంచి తిమ్మకవి తన ‘సర్వలక్షణ సార సంగ్రహంలో ఉదాహరించాడు.  (స.ఆం.సా. పుట 463).

భారతంలో ఎక్కడినుండి ఎక్కడిదాకా అనువదించాడో చెప్పే సాక్షాలు అతని పద్యాలే. అవి.

ఆంద్ర కౌముదీ కర్త – మండ లక్ష్మీ నరసింహాచార్యులు రచించిన సంస్కృత కావ్యంలో “అధర్వణ భారతీ ద్రౌపదీ వివాహే సఖీం ప్రత్యర్జున వాక్యం” అని 45 వ పుటలో ఉదహరించాడు. “ఆ తరిని చెలికి నిచ్చిన – రోతొడవులు తొడిగె నా సరోజదళాక్షి....” అనేది ఈ పద్యం.

2. అరణ్య పర్వాన్ని అందులోని ఉపాఖ్యానాలతో సహా అనువదించినట్లు రామాయణ కథలోని పద్యం తెలుపుతుంది.

‘నయమార రాఘవుడు నా వయెక్కి...’ ఈ కందంలో ఒక అందం ఉంది. 2,3 పాదాలలో వయెక్కి, నియచ్చ అని జగణాలు ఉన్నాయి. నాలుగింట జగణం వాడి ఆ అందాన్ని తిక్కన గారు ప్రస్ఫుటం చేశారు. అలాగే అధర్వణుడు కూడా నాలుగింట జగణం వాడడంలో నేర్పరి’ అన్నారు ఆరుద్ర. సమయం వచ్చినప్పుడల్లా ఛందస్సును, వ్యాకరణాన్ని గూర్చి వివరించి పాఠకులను ఆహ్లాదపరచడంలో ఆరుద్ర  కూడా ఎంతో నేర్పు, లోతు ఉన్నవారనడంలో అతిశయోక్తి లేదు.

౩. కర్ణ పర్వం దాకా వచ్చినట్లు “కురుపతి రవిసుతుని’ అనే పద్యం విరాట పర్వంలోనిదైన ‘ఇక నొకసారి బల్కిన ఘలీలని చిందునో నోటి ముత్యముల్...’ అన్న పద్యం కర్ణ, విరాట పర్వాలు రచించినట్లు తెల్పుతున్నాయి. ముత్యాల చప్పుడు ఘలీల్ అని వ్రాసి చూపించడంతో పాటు “నీ నోటి ముత్యాలు రాలి పోతాయా” అనే చక్కని జాతీయాన్ని గూడా అధర్వణుడు వాడడం ముదావహం.

“మొత్తం మీద ఈ ఉదాహరణలన్నీ చూస్తూ ఉంటే ఒక చక్కని భారత రచన మనకు దక్కలేదే అన్న చింత ప్రతి సాహిత్య ప్రియునికి కలుగుతుంది. అతని ఛందస్సు లోనివని లాక్షిణికులు ఉదాహరించిన పద్యాలను గమనిస్తే అతని గ్రంథం సమగ్రమైనదేమో అనిపిస్తుంది. ఆనంద రంగరాట్చందంలోనే అతనివి 26 పద్యాలు పేర్కొన్నాడు.” అంటూ ఆరుద్ర అధర్వణుని భారతం, ఛందస్సు తప్పక దొరకాలని ఆకాంక్షించారు. ఆరుద్ర గారి ఆకాంక్ష నెరవేరితే ఆంధ్రులకు మరొక మంచి భారత రచన బహుమతిగా లభిస్తుంది. ఆ అదృష్టానికై వేచి చూద్దాం.

ఇంతటితో కాకతీయ యుగం సమాప్తం.

**** సశేషం ****

Posted in June 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!