Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

సిరిమల్లె పాఠకులందరికీ, మీ సాదరాభిమానంతో ఇన్నాళ్లు నేను చూసిన కొన్ని విశేషాలతో ఒక శీర్షికలాగా మీ అందరికీ నా అనుభవ పూర్వక దక్షిణ భారత తీర్థాల విశేషాలు కొన్ని అందించాను. ఈ నెల ఆఖరి వ్యాసం. కంచి వరదరాజ స్వామి వారి ఆలయం మీద. నాకు చాలా ఇష్టమైన, నన్ను బాగా ఆశ్చర్యపరిచిన ఆలయం ఇది. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను. త్వరలో ఇంకొక శీర్షికతో మీ దగ్గిరకి వచ్చే ధైర్యం చేస్తాను.-మీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు.

వరదరాజ స్వామి ఆలయం

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నాతో మాట్లాడుతూ, ఇవాళే మీరు మీ తీర్థయాత్రల కథలు పూర్తి చేశారు, కానీ ఇవాళ కంచిలో గొప్ప ఘోరం జరిగింది (తొక్కిసలాటలో ప్రాణనష్టం గురించి), అందువల్ల మీరు ఇవాళ మీ యాత్ర ముగించవద్దు. కంచిలో ఇంకేదైనా స్థలం గురించి రాయమన్నారు. నేను వెంటనే "మేము ఇదివరకు కంచిలోనే వరదరాజ స్వామి వారి ఆలయ దర్శనం చేసాము; దాని గురించి రాస్తా' నన్నాను. ఆయన తప్పక రాయండి, మనసు బాగాలేని రోజున ఎందుకు ఈ శుభకార్యం ఆపాలి? అని అన్నారు. అందువల్ల ఇవాళ నన్ను చాలా ప్రభావితం చేసిన శ్రీ వరదరాజ స్వామి ఆలయం గురించి తెలియజేస్తాను. ఇది మూడు సంవత్సరాల క్రితం చేసిన యాత్రలో చూసినది; కానీ ఒకొక్క విశేషం ఇంకా కళ్ళకి కట్టినట్లే ఉన్నది.

కంచిలో రెండు భాగాలున్నట్లు అనిపిస్తుంది. దక్షిణ, తూర్పు కంచిలలో శివ ప్రాభవం ఎక్కువ కాబట్టి దాన్ని శివ కంచి అంటారు. అలాగే ఉత్తర, పడమరలలో వైష్ణవ ప్రభావం ఎక్కువ కాబట్టి దాన్ని వైష్ణవ కంచి అంటారు. అలాగని ఇటూ అటూ ఇంకా ఏ వైష్ణవ గుడి కానీ,శైవ గుడి కానీ లేవని కాదు. అసలు గొప్ప అద్వైత భావం మీకు ఏకామ్రేశ్వర ఆలయంలోనే ఉన్నట్లు మనవి చేసాను. ఆ ఆలయంలో శివుడు, విష్ణువు, కలిసి ఉన్నారు.

ఈ వరదరాజ స్వామి ఆలయం వైష్ణవులు అతి ముఖ్యంగా భావించే 108 దివ్యదేశాలలో ఒకటి. అసలు ఈ దివ్యదేశమనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆళ్వార్లు - అంటే వైష్ణవ భక్తికి ప్రతీకలుగా మనకి కనిపించే ముఖ్యులు - వాళ్ళు ఈ 108 చోట్లకి వెళ్లి విష్ణు దర్శనం చేసుకున్నారని, అందువల్ల ఈ 108 క్షేత్రాలూ దివ్యదేశాలనీ చెపుతారు. ఇక్కడ దేశం అంటే మనం క్షేత్రం అని దేన్ని భావన చేస్తామో అది అన్నమాట. శ్రీ రామానుజులవారు ఇక్కడ నివసించేవారని ప్రతీతి. ఈ గుడి పదకొండవ శతాబ్ది కాలంలో కుళోత్తుంగ చోళుడు కట్టించాడనీ, ఆ తర్వాత విక్రమ చోళుడు విస్తరింప జేసి ఇప్పుడు కనిపిస్తున్న గొప్ప గోపురాలు కట్టించాడనీ శాసనాలు కనబడుతున్నాయి. 17వ శతాబ్దంలో - 1688 లో ముస్లిములు ఘోరంగా దాడి చేసి ఈ ఆలయాలు ధ్వంసం చెయ్యడానికి దాడులు చేసినప్పుడు, ఈ ప్రధాన మూర్తులని రాత్రికి రాత్రి ఉదయర్పాలంకి తరలించారు. మళ్ళీ వారి సమస్య తొలిగిపోయింతరువాత 1710లో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసారు. ఇలా ముస్లిములు మనకి నష్టం చెయ్యలేదని వాదించేవారు ఇక్కడకి వచ్చి చూడాలి. ఈ ప్రధాన మూర్తిని తరలించినప్పుడు ఒక అత్తి పళ్లతో చేసిన విగ్రహాన్ని అక్కడ ఉంచారు. అలా దాదాపు 40 ఏళ్ల పాటు ఈ అత్తి విగ్రహానికే పూజలు జరిగాయి.

సాళువ వీర నరసింగరాయ నాయకులు, విజయ నగరాన్ని పాలించిన అచ్యుతరాయ నాయకులు గొప్ప భక్తి కలిగిన రాజులు. వారు ఈ ఆలయంకోసం చాలా గ్రామాల మన్యం ఏర్పాటు చేసి, ఆలయం అభివృద్ధి చెందేలా చేసారు. గుర్తించారా? వీరు తెలుగు పరిపాలకులు. కంచిలో తెలుగు ప్రధాన భాషగా ఉండేదనడానికి ఇది ఒక తార్కాణం. మన చరిత్ర తెలియని ఆంధ్రులు తెలుగునే వదిలేస్తున్నారు!

ఈ ఆలయమొక బృహదాలయం. 23 ఎకరాలలో కట్టినది. మా బంధువు ఒకాయన అక్కడే ఉంటారు; ఆయన మమ్మల్ని తీసుకు వెళ్లి అక్కడ అర్చకులకు కూడా పరిచయం చేసి, చాలా గొప్ప దర్శనం చేయించారు. ఈ ఆలయం ఏ శైవాలయం కంటే కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. మరి శైవులు అంత అందంగా వాళ్ళ క్షేత్రాలని ఎందుకు ఉంచుకోరో నాకు అర్థం కాని విషయం. దీని ప్రధాన గోపురం అత్యద్భుతంగా ఉంటుంది. సరిగ్గా ఏకామ్రేశ్వరుడి ఆలయ గోపురంలాగా దేవతాశిల్పాలు లేకుండా ఉంటుంది. 7 అంతస్తులతో, 9 కలశాలతో గొప్పగా అలరారుతుంటుంది. ఆ గోపురంలో ఎంత పెద్ద ద్వారమో! ఆ ద్వారం దాటగానే మీకు ఆలయం ఎంత విస్తృతమైనదో తెలుస్తుంది. ముందుకు ఒక నూరు అడుగులు వేస్తే ఒక చిన్న, కానీ చాలా ఎత్తైన మంటపం కనిపిస్తుంది. ఈ మంటపం ఎత్తు సరిగ్గా గోపుర ద్వారం ఎంత ఎత్తున్నదో అంత ఎత్తుంటుంది. దీనికి పైన బంగారు రంగు వేసి ఉన్నది. దీనిలో ఏ దేవతా ఉండదు. భక్తులు కూర్చుని సేద దీరుతున్నారు. దానికి ఇంకొక 100 అడుగులు ముందుకు వెళితే ధ్వజ స్తంభ మంటపం కనిపిస్తుంది. ఈ మంటపానికి ముందర ధ్వజ స్తంభం -దాదాపు 50 అడుగుల పొడుగున్నది - దాని వెనకాల ఇందాక వర్ణించిన ఖాళీ మంటపం వంటిదిఉన్నది. దానికి కుడిచేతి వైపు ఒక ఆలయం, ఆ ఆలయానికి దక్షిణంగా ప్రసాదాలు అమ్మే శాల ఉన్నాయి. నేను ఏకామ్రేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పినప్పుడు ఇలాంటి వ్యవస్థ అక్కడ ఎందుకు లేదా అనే బాధతోనే రాసాను. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఆకాశంకిందే ఉన్నాయి.

ఈ ధ్వజ స్తంభానికి ఎడంచేతివైపు - ఒక సుందరమైన మంటపం ఉన్నది. దీనిని వెయ్యి స్తంభాల మంటపం అని అంటారు. అసలు ఈ మంటపంలో శిల్పకళ చూసితీరాలి. మధురలో కామాక్షి గుడితో పోటీ పడుతూ ఉంటుంది. కొద్ధి ఏళ్ల క్రితం అక్కడ రెండు కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చింది. పావురాళ్ళు విపరీతంగా రావడంవల్ల, 'bats' అంటే గబ్బిలాలు అక్కడ చాలా చేరిపోవడం వల్ల, ఆ మంటపానికి మొత్తం ఇనప ద్వారాలు చేయించి కట్టడి చేసారు. అందువల్ల సులభంగా లోపలకి వెళ్లలేము కానీ, దాని వైభవం తెలియడానికిది అడ్డం కాదు. ఇక్కడ ఒకొక్క స్తంభం ఎంత అందంగా చెక్కి ఉన్నదిఅంటే మధురలోను, శ్రీరంగం లోను నేను వర్ణించి, ఫోటోలు చూపించినంత అందంగా ఉంటాయి. అదే కాక, ఒక రెండు లంబాలు కలిసిన (corner లో) ముఖ్య స్తంభం మూడు వైపులా మూడు అశ్వాలమీద స్వారీ చేస్తున్న యోధులతో చాలా పెద్దగా చాలా అందంగా చాలా వివరంగా ఉంటుంది. ఒకసారి చూస్తే జీవితాంతం మరచిపోలేము. గొప్పతనం ఏమిటంటే ఈ స్తంభంలో ముందర భాగాన్ని ఒక రాతి చైను (! ! !) అదే రాతిలో చెక్కినది - మోస్తూ ఉంటుంది! కొన్ని స్తంభాలమీద గరుత్మంతుడా అనిపించేంత పెద్ద గద్ద పైన కూర్చుని ఉన్న యోధులు పెద్ద డాలు పట్టుకుని కనిపిస్తారు. విష్ణువునే గరుత్మంతుడి పైన శిల్ఫీకరించారా అని అనిపిస్తుంది. ఇవన్నీ 'యాళీ శైలి' లో చెక్కారు. ఈ మంటపంలో దశావతారాలున్న స్తంభాలున్నాయి. వాటిలన్నిటిలో నాకు కొన్ని చాలా ఆశ్చర్యంగా కనిపించాయి. ఒకదానిలో వామనావతారంలో విష్ణువు ఉంటాడు. మనకి వామనుడంటే ఒక వటువుగా ఒక నిర్దిష్టమైన భావన ఉన్నది. కానీ ఇక్కడ వామనుడు విష్ణుమూర్తిలాగా శంఖ చక్రాలతో, గొప్ప కిరీటంతో ఉంటాడు. ఒక కాలు కింద బలి చక్రవర్తి కలశంతో నీళ్లు ధారపోస్తూ ఉంటాడు. పక్కన ఆయన భార్య కనిపిస్తుంది. విష్ణుమూర్తి ఇంకొక కాలు పూర్తిగా పైకెత్తి, నభోంతరాళాలు కప్పుతూ ఉంటాడు. ఇంకొక స్తంభంలో ఆదిశేషువు కింద కూర్చుని ఉన్న నరసింహ స్వామి కనిపిస్తారు. సరిగ్గా ఈ రకమైన శిల్పాలే మనకి సింహాచలంలో చాలా స్తంభాలమీద కనిపిస్తాయి. స్తంభాలమీద రకరకాలైన జంతువులు, వాటిని సంహరిస్తున్న యోధులు ఉంటారు. దీని అర్థం ఏమిటి? అని ఆలోచించాను. ఎందుకు లోపల ఉన్న స్తంభాలపైన దశావతారాలు, బయటనున్న స్తంభాలపైన యోధులు? ఇలా ఆలోచిస్తే మన దేవతా మూర్తులని మనమే రక్షించుకోవాలని మన పూర్వీకులు మనకి చెప్పక చెపుతున్నట్లు నాకు అర్థం అయింది. దీనికి వేరే ఇంకేదైనా సమాధానం ఉన్నదా? పెద్దలు ధృవీకరించాలి.

అలాగే ఎడమ చేతివైపు వెళితే ఈ మంటపం వెనకాల పుష్కరిణి ఉన్నది. ఇక్కడ రెండు పుష్కరిణులు ఉన్నాయి. ఒక దానిలో 3 విమానాలుంటాయి. ఆ పుష్కరిణి శుభ్రంగా, చాలా అందంగా ఉన్నది. ఇంకో పుష్కరిణిని అలక్ష్యం చేసినట్లనిపిస్తుంది. దీని చుట్టూ కొన్ని చిన్న చిన్న ఆలయాలున్నాయి. భక్తులు ఎవరైనా ఈ చిన్న ఆలయాలని బాగు పరిచే బాధ్యత తీసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఏమీ చెయ్యదు కాబట్టి, మనమైనా పూనుకుని ఇలాంటి పనులు చేయించవలసిన బాధ్యత ఉన్నది.

ఇపుడు మనం ప్రధాన ఆలయం లోకి అడుగు పెడుతున్నాము. ఇది ఇందాక చెప్పిన ధ్వజ స్తంభం ముందు - అంటే ప్రధాన గోపురం ఎదురుగా ఉన్నది. ఈ ఆలయ గోపురం మీద శిల్ప సౌందర్యం కనిపిస్తుంది. 5 కలశాలతో చాలా అందంగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఒక వేరే సంప్రదాయం చూసాను. వైఖానసాగమము పాటిస్తే విమాన గోపురం మీద సుదర్శన కలశం ఉండాలి. అలా కాక 5 కలశాలతో ఎందుకుంది? ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటని ప్రశ్నిస్తే వైష్ణవాగమం ఒకటే కాదు; చాలా ఉన్నాయి. ఇక్కడ పాటించే ఆగమంలో సుదర్శనం కలశ ప్రయోగం స్వామి వారి గర్భాలయం మీదనే ఉంటుందని చెప్పారు. అలాగే రాజగోపురం పైన సుదర్శన కలశం ఉన్నది. బంగారు తాపడంతో ఎంతో అందంగా, తిరుపతిని గుర్తుకు తెస్తూ అద్భుతమైన గోపురం కనిపించింది.

ముఖ ద్వారం చాలా పెద్దది; అందంగా ఉంటుంది. అక్కడనించి లోపలకి వెళితే ఎడమ వైపు చాలా పొడుగైన, అందమైన శిల్ప స్తంభ ప్రాకారం - ఇప్పటిదాకా చాలా ఫోటోలు అలాంటివి మీకు చూపించాను - ఉన్నది. ఇలాంటివి మూడున్నాయి. చాలా శోభగా ఉంటుంది. అక్కడనించి ఎడమ వైపు తిరిగి, చిన్న చిన్న ఆలయాలు, కప్పుతో ఉన్న దారిలోంచి ప్రధాన ఆలయం వెనక్కి వెళ్ళాము. మామూలుగా భక్తులందరూ వచ్చే దారి ఇది కాదనీ, ఆ ద్వారంలో వెళితే సాయంత్రందాకా లైను లోనే ఉంటాము కాబట్టి ఈ దారిలో తీసుకొస్తున్నానని చెప్పి, గుడి గోపురం వెనకకి తీసుకు వెళ్లారు. అక్కడ ఎవరికో చెప్పి ఒక చాలా ఎత్తున్న మెట్ల దారిలోకి ప్రవేశ పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది; ఎన్నో గుళ్ళకి వెళతాం, కానీ ఇలా ఇన్ని మెట్లు ఎందుకు ఎక్కుతున్నాం? విమానం పెద్దదే, కానీ ఇంత ఎత్తా? అని. అలా పైకెక్కి క్యూలోనే ఒక చిన్న గదిలాంటి ప్రదేశంలోకి వెళ్ళాము. దాంట్లో మళ్ళీ మెట్లు, పైకెక్కాము. అక్కడ పైకప్పు మీద ఒక పెద్ద బంగారు బల్లి ఉన్నది. ఆ బల్లిని చూస్తే చాలు, జన్మ ధన్యమవుతుందనీ, అది ముట్టుకుంటే చాలా మంచిదనీ చెప్పారు. ఒక నిచ్చెన లాంటి దానిమీద పైకెక్కి ఆ బల్లిని ముట్టుకుని, పాప నాశనం అయిందని సంతోషించి మళ్ళీ తిరిగి అంతరాలయంకి వచ్చాము. విపరీతమైన రద్దీ ఉన్నది. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే మళ్ళీ మెట్లెక్కాలి. మోకాలి పర్వతంలాంటి మెట్లు. కింద నుంచి చూస్తే గర్భాలయం కనిపించదు. స్వామి ఎక్కడో అంత ఎత్తులో ఉన్నాడు. ఈ ముందు ద్వారం పక్కల గొప్ప ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. అలా నెమ్మదిగా ఒకరి తరువాత ఒకరు ఎక్కుతూ స్వామి సన్నిధికి చేరుకున్నాము. ఈ సన్నిధి 130 అడుగుల ఎత్తులో ఉన్నది! అంటే రాజగోపురం గాలిగోపురం కంటే కొంచెం చిన్నదిగా ఉన్నది!

జన్మ ధన్యమయింది. వరదరాజ స్వామి, లక్ష్మీ దేవి సహితంగా వెలసి ఉన్నాడు. నిలుచుని ఉండి, కూర్చుని ఉన్న అమ్మవారితో కలిసి భక్తులకి అద్వైతాన్ని చాటుతున్నాడు. . అత్యద్భుతమైన మూర్తులు. అభయ హస్తం, వరద హస్తం, శంఖ చక్రాలతో విలసిల్లుతున్నాడు. గొప్ప చిరునవ్వుతో భక్తులని అనుగ్రహిస్తున్నాడు. చూస్తే తల తిప్పుకోలేం. మామూలుగా అయితే తిరుపతిలో లాగా రెండు క్షణాల్లో బయటకి తోసేస్తారు. కానీ మాతో వచ్చినాయనని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కావలసినంత సేపు చూడనిచ్చారు. అదృష్టం కదా? నన్ను ఆకర్షించిందేమిటంటే స్వామి అభయ హస్తానికి బంగారు ఆభరణం చేయించారు. అరచేతిలో "శ్రీ" అని అరవంలో రాసి ఉన్నది. ఆ మూర్తి అందానికి బాగా ప్రభావితుడనైనాను. అమెరికా తిరిగి వచ్చాక మా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామికి అలాగే భక్తులనొప్పించి ఒక డాక్టరుగారు - నందమూడి శారద ఆవిడ పేరు, భర్తపేరు రాజా గారు - వారిచ్చిన డబ్బుతో స్వామికి అదే హస్తాభరణం చేయించాను. కాకపోతే "శ్రీ" తెలుగులో ఉంటుంది. విషయాంతరంలోకి వెళ్లినందుకు క్షంతవ్యుణ్ణి.

అమ్మవారు, అయ్యవార్ల ఉత్సవ విగ్రహాలు ఎదురుగానే అదే చోట ఉంటాయి. స్వామికి మొక్కుకుని, కిందకి వచ్చాము. అప్పుడు తేరి చూస్తే ఆ మెట్ల కింద ఉన్న అంతరాలయం ఒక యజ్ఞ శాల. ఆ శాలకి ఎడమ చేతివైపు గణపతి ఆలయం ఉన్నది. ఇక్కడ చాలా విశేషాలున్నాయి. ఒక రజత పెట్టెలో 10 అడుగుల పడుకుని ఉన్న రంగనాథుడి విగ్రహం నీళ్లలో మునిగి ఉంటుందిట - ఉన్నది. మాకు ఈ దర్శనం కాలేదు. 40 ఏళ్ళకొక సారి ఆ విగ్రహంలో నీళ్లు ఒంపేసి, మళ్ళీ నింపి, ఇంకొక 40 ఏళ్ళు ఉంచుతారుట. ఒక చోట శిల్పాన్ని మొత్తం చేతితో నొక్కితే ఎందుకో మెత్తగా ఉన్నట్లుంటుంది. ఆశ్చర్యం. ఇక్కడే తులాభార మంటపం ఉన్నది. పూర్వం రాజులు వచ్చి, వారిని తులాభారంలో మోసినన్ని బంగారు, రత్నాభరణాలు స్వామివారికి అర్పించేవారట. ఎంత వైభవం! అలాగే కిందకి వచ్చి కింద ఉన్న ఆలయాలన్నీ దర్శించాము. ఇందాక ధ్వజస్తంభ మంటపంకి కుడి చేతివైపు ఒక ఆలయం ఉన్నదని చెప్పానే, దానిలో ఆంజనేయుడు సంజీవనీ పర్వతం మోసుకుని వస్తున్న దృశ్యం చెక్కబడి ఉన్నది. ప్రధానాలయం చుట్టూతా ఉన్న గుళ్ళలో గణపతి ఆలయం ప్రధానమైనది. చాలా అందమైన విగ్రహం.

ఇవన్నీ చూసి, తరించామని నమ్మకం కలిగి, అక్కడ అమ్ముతున్న అరిసెలు - ఇవి స్వామి వారికి చాలా ప్రీతి అట - కొని ప్రసాదంగా స్వీకరించాము. అత్యద్భుతమైన ఈ ఆలయం ప్రతివారూ చూడదగ్గది. ఆలయంలో మంచి అనుభూతి కలగాలంటే ఇలాంటి మంచి వాస్తు ఉన్న ఆలయాలని దర్శించాలి. ఇవి మన సంస్కృతికి, విజ్ఞానానికి కొలతలు. వీటిని అధ్యయనం చేస్తే, ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనం వీటికి వారసులం కాబట్టి, మనమే వీటిని కాపాడుకుని వచ్చే తరాలవారికి అందించాలి.

### సమాప్తం ###

Posted in June 2022, వ్యాసాలు

1 Comment

  1. వెన్నెలకంటి సుబ్బు నారాయణ

    చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. నేరుగా చూసిన అనుభూతి కలిగింది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!