Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి --

క్రితం నెల పద్యంలో దూర్వాసుణ్ణి హరిచక్రం ఎలా తరమడం మొదలుపెట్టిందో చూసాం. ఇప్పుడు వైకుంఠంలో మహావిష్ణువు దగ్గిరకొచ్చి మొరపెట్టుకున్నాడు, బ్రహ్మ మహేశ్వరులు తమవల్ల కాదన్నాక. విష్ణువు దూర్వాసుడితో ఏం చెప్తున్నాడో అనేదే చంపకమాల వృత్తంలో పోతన రాసిన ఈ నెల పద్యం.

చ.
చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిషభక్తిలతాచయంబులన్
నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్;
వలలకుఁ జిక్కి భక్తజన వత్సలతం జనకుందుఁ దాపసా!

మనసులో పట్టుదలతో (చలమున) బుధ్ధిమంతులైన సాథులు – అంటే ఈ సంసారం లో సుఖంలేదనీ భగవంతుడొకడే శాశ్వతమనీ తెల్సిన సాథువులు ఏం తెల్సుకుంటున్నారంటే, భగవల్లీలలు (నా హృదయంబులీల). అవి విష్ణువు దగ్గర్నుంచి కొల్లగొట్టుకు పోతున్నారు (దొంగిలి కొనిపోవుచుండుదు). ఎలా కొల్లగొడుతున్నారు అని చూస్తే, అకిల్బిషభక్తిలతాచయంబులన్ – మలినం లేనట్టి నిర్మలమైన భక్తి తో. అలా భగవంతుడి లీలని తీసుకెళ్ళాక ఏం చేస్తున్నారంటే, మదపుటేనుగుని తాళ్లతో కదలకుండా కట్టేసినట్టూ (మదకుంభికైవడిన్) భగవంతుణ్ణి తమ మనసులో నిలబట్టి నేర్పుతో కట్టేస్తున్నారు అదే భక్తితో (నిలువుగబట్టి కట్టుదురునేరుపుతో). మరి తనని అలా కట్టేస్తే భగవంతుడేం చేస్తున్నాడు? ఆ భక్తి అనే వలలకి చిక్కిపోయి తప్పించుకోలేక ఆ భక్తుడివెంటే వెళ్తున్నాడు (భక్తజన వత్సలతం జనకుందు).  ఈ పద్యంలో చివరి పదంలో తాపసుడంటే దూర్వాసుడు.

దేనినుంచైనా భగవంతుడు మనకి అందకుండా తప్పించుకోవచ్చుకానీ నిర్మలమైన భక్తికి అందకుండా తప్పించుకోలేడు. దీనినే స్వామి సత్యానందగారు చెప్తున్నారు చూడండి ఓ వాక్యంలో. “భగవంతుడా మన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓపిక ఉందో పందెం వేసుకుందాం. నేను నీ గుమ్మం ముందు నువ్వు నన్ను పిలిచేదాకా వేచి ఉండగలను కానీ నువ్వు అలా నేను గుమ్మం దగ్గిర పడిగాపులు పడుతూ ఉంటే వేచి ఉండగలవా?”

దూర్వాసుడు వైకుంఠానికి వచ్చేలోపుల తనమీదకి వచ్చే సుదర్శనానికి ఒక్కో జడ సమర్పించుకుంటూ, తల పూర్తిగా బోడి అయ్యి, మనసులో తాను చేసిన తప్పు తెల్సుకున్నాక పశ్చాత్తాపం కలుగుతుంది. అయినా అన్నింటికీ అతీతుడైన భగవంతుడి ముందా జడ తీసి ఆయన ఆయుధాన్ని ఆపేది? అన్నీ పోయాక అప్పుడు శ్రీహరిని అడుగుతాడు ఈ చక్రం నుంచి రక్షించమని. అప్పుడు “నేనీ చక్రాన్ని అంబరీషుడికి రక్షగా ఇచ్చాను. అయినా నువ్వు చేసిన తప్పు అంబరీషుడికి కనక వెళ్ళి ఆ రాజునే అడుగు” అని చెప్తాడు విష్ణువు. ఇక్కడ తల బోడి అవడం అంటే అహంకారం పూర్తిగా పోవడం అని అర్థం చేసుకోవచ్చు. ఇదే తిరుపతీ, అన్నవరం వెళ్ళి తలనీలాలు సమర్పించుకోవడంలో ఉన్న అర్థం. నేను అహంకారం పోగొట్టుకుంటున్నా, లేకపోతే కనీసం దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం అని భగవంతుడికి చెప్పుకోవడానికి.  దూర్వాసుడు ఏ కోపంతో అయితే అహం ప్రదర్శించాడో అది భగవత్కృపతో పోయింది. ఇప్పుడు మిగిలినది శరణాగతి. వెళ్ళి అంబరీషుడికి మొరపెట్టుకుంటాడు ఇలా తనమీదకి వచ్చే చక్రాన్ని ఆపమని.

అంబరీషుడెటువాంటివాడంటే వెనక్కొచ్చిన దూర్వాసుణ్ణి మనసులో కల్మషంలేకుండా వెనక్కి ఆహ్వానించి, చక్రాన్ని కీర్తిస్తూ “దయచేసి ఈ మునికి హానిచేయకు” అని మొరపెట్టుకుంటాడు. అది అదృశ్యమయ్యాక దూర్వాసుడికి భోజనం పెట్టి తనని దయగా చూడమని అడుగుతాడు. తనకి జరిగిన అవమానం చటుక్కున మర్చిపోయి మంచి మాత్రం బాగా గుర్తుపెట్టుకునేవాడే కదా మంచి మనిషి? అసలీ అవమానాన్నీ మంచినీ, శీతోష్ణ, సుఖ దుఖాలనీ సమానంగా చూసేవాడే సిసలైన భక్తుడని అటువంటివాడే భగవంతుడికి ప్రియమైనవాడనీ మనకి భగవద్గీత భక్తియోగంలో తెలుస్తుంది. అంబరీషుడు అటువంటివాడు కనక ఆయనకి భగవంతుడి/చక్రం రక్ష ఎల్లవేళలా ఉందని అర్థం.

సమఃశత్రౌచ మిత్రేచ తథామానావమానయో, శీతోష్ణ సుఃఖదుఃఖేషు సమఃస్సంగ వివర్జితః
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టోయేనకేనచిత్, అనికేతఃస్థిరమతిర్భక్తిమాన్మే ప్రియోనరః (భక్తియోగం 18, 19)

అంబరీషోపాఖ్యానం “అసలు నువ్వింతటి భక్తుడవని తెలియదు నువ్వే నన్ను క్షమించాలి” అని దూర్వాసుడు రాజుతో అనడంతో కథ ముగుస్తుంది. వ్యాస భాగవతంలో ఉందో లేదో మనకి తెలియదు కానీ మరో చోట ఎవరో అంటారు, దూర్వాసుడు అంబరీషుణ్ణి చేపగా, కూర్మంగా, పందిగా… మనిషిగా పది జన్మలు ఎత్తమని శపించాడనీ భక్తుణ్ణి రక్షించడం కోసం విష్ణువే ఆ దశావతారాలు భక్తుడి బదులు ఎత్తాడనీ మరో కథ.

మరో సారి పద్యం చదివితే తెలిసేదేమంటే, మొదటిసారి కానీ, ఏదో ఒకసారి కానీ భగవంతుడి పట్ల భక్తితో ఉండడం కాదు ఇందులో అసలు తాత్పర్యం. మనకి కుదురుకున్న ఆ భక్తి నిలుపుకుంటూ భగవంతుణ్ణి మన మనసులో కదలకుండా మదపుటేనుగును కట్టేసినట్టూ కట్టేసి ఉంచాలి – అంటే ఏ భక్తితో అయితే భగవంతుణ్ణి తెలుసుకున్నామో అదే భక్తితో ఆయనని నిరంతరం సేవిస్తూండడం. దీన్నే త్యాగరాజ స్వామి అనడం ప్రకారం, “మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే…” ఆ మూర్తి చూసాక, దాన్ని నిరంతరం మనసులో ఉంచుకోవడం; ఎందుకలా ఉంచుకోవడం? ఎందుకంటే మనసుని నిరంతరం సానబెడుతూతూ ఉండాలి లేకపోతే మనసు అనేది వంకరి టింకరి కుక్కతోక కనక ఎప్పటికప్పుడు సాథన చేయకపోతే వెనకటిలాగే తయారవుతుంది.

****సశేషం****

Posted in June 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!