Menu Close
దైవోపహతుడు
-- వెంపటి హేమ --

తలుపు తట్టిన చప్పుడు వినిపించగానే పరంధామయ్యగారి కోడలు ఉష, ఆన్ లైనులో తాను ఆర్డర్ చేసిన సరుకులు వచ్చాయనుకుని వేగంగా వచ్చి తలుపు తీసి చూసి, నిర్ఘాంతపోయింది. వెంటనే తమాయించుకుని, పెద్దాయనవైపు గుర్రుగా చూసి, “ఏవండోయ్! ఎవరొచ్చారో చూడండి” అంటూ, పడక గదిలో మంచం మీద కూర్చుని, "లాప్టా టాప్" ఒళ్ళోపెట్టుకుని ఆఫీసు పని చేసుకుంటున్న భర్త నుద్దేశించి ఒక కేక పెట్టి, తిరిగి వంట గదిలోకి వెళ్ళిపోయింది ఆమె.

కోడలు లోపలకు పిలవకపోడంతో పరంధామయ్య ఖంగు తిన్నారు. లోపల అడుగుపెట్టడానికి సంశయిస్తూ గుమ్మంలోనే నిలబడిపోయారు ఆయన. గదినుండి బయటికి వచ్చిన మాధవ తండ్రిని చూసి, “అలా నిలబడిపోయావేమిటి నాన్నా, లోపలకురా! చెప్పాపెట్టాకుండా ఇలా వచ్చేశావేమిటీ” అంటూ కంగారుగా అడిగాడు.

వెంటనే ఆయన, “అదేమిటిరా మాధవా! హోమ్ వాళ్ళు నీకు ఫోన్ చేశారు కదా, హోమ్ మూసేస్తున్నామని! నేనూ నీకు ఫోన్ చేసి ఆమాట చెప్పాను కదా? మర్చిపోయావా” అని అడిగారు ఆయన.

మాధవ గతుక్కుమన్నాడు. తండ్రివైపు మిడుతూ మిడుతూ చూస్తూ, "పని తొందరలో మర్చిపోయాను; సారీ నాన్నా! మళ్ళీ ఒకసారి ఫోన్ చెయ్యవచ్చుకదా" అన్నాడు.

“ఈ రోజే హోమ్ ని మూసేసే రోజు. నిన్నటినుండి నీకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. నిన్న నువ్వసలు ఫోను ఎత్తలేదు. ఈవేళయితే అసలు నీ ఫోను మ్రోగనేలేదు. తలుపులు మూసి తాళం వెయ్యడానికి యజమాని ఉదయమే వచ్చాడు. దిక్కు తోచని స్థితిలో సిటీబస్ స్టాపులో సిమెంట్ బెంచీమీద కూర్చుని, ఏమిచేయాలో, ఎటువెళ్ళాలో తోచక అఘోరిస్తూంటే, ఆ దైవమే పంపించినట్లుగా ఒక పోలీసాయన అక్కడకు వచ్చాడు. ఆయన దయవల్ల నేను ఇక్కడికి చేరుకున్నాను. లేకపోతే ఏమైపోయీ వాడినో!" దుఃఖంతో పరంధామయ్య కంఠం ఒణికింది.

మాధవ్ ఏమీ మాటాడకుండా భార్యవైపు చురుక్కున ఒక్క చూపు చూసి, తనలోనే అనుకున్నాడు, "నేను ఐఫోను కొనుక్కుని, నా పాతఫోను ఉషకు ఇవ్వడం తప్పయింది. ఎంత పని చేసింది!".

అటకెక్కించిన పరంధామయ్యగారి మంచాన్ని మళ్ళీ కిందకు దించారు. మొత్తానికి ఆయన తన మనుమడి గదిలో ఒక మూలగా వేసిన తనదైన మంచంపై స్థిరపడ్డారు. ఆయన తన గదిలోకి చేరడం నచ్చని 14 ఏళ్ళ మనుమడు, తన ప్రయివసీ చెడిపోయినందుకు ఆయన వైపు కోపంగా చూడసాగాడు. పలుకరించబోతే పట్టించుకోకుండా విసురుగా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

మనుమడిచేత "తాతయ్యా" అని పిలిపించుకోవాలని ఆయనకున్న గొప్ప కోరిక తీరే దారి ఎక్కడా కనిపించలేదు. నిరాశగా నిట్టూర్చారు ఆ ముసలాయన.

ఆయనకు ఆ రాత్రి ఒక పేపరుప్లేట్లో కొంచెము అన్నం, కూరా, పేపర్ కప్పులో మజ్జిగ, ప్లాస్టిక్ గ్లాసుతో మంచి నీళ్ళూ మంచం దగ్గరకే తెచ్చి ఇచ్చాడు మాధవ. పెట్టినదేదో తిని, మారడగడానికి మనసురాక, అర్ధాకలితో అలాగే పడుకుని నిద్రపోయారు పరంధామయ్య.

******

వెలుగు ఇంకా పూర్తిగా రాకముందే, అలవాటుగా పరంధామయ్య మాష్టారికి మెలకువ వచ్చేసింది. ప్రతిరోజూ ఉదయం హోంలోని వృద్ధ మిత్రులతో కలిసి కొంతసేపు నడక సాగించి రావడం ఆయనకు అక్కడ ఉండగా అలవాటయ్యింది. ఈ వేళకూడా కాసేపలా రెండు వీధులు నడిచి రావాలనిపించింది ఆయనకు. ఇంట్లో ఎవరూ ఇంకా నిద్ర లేవలేదు. చప్పుడు లేకుండా వీధి తలుపు తీసుకుని బయటకు వెళ్లి, తలుపును దగ్గరగా లాగి, తాళం పడేలా చేసి, వాకింగుకని బయలుదేరారు ఆయన.

వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సుమారుగా కిలో మీటర్ దూరం నడిచి ఆయన వెనక్కి తిరిగారు. కొంతదూరం వచ్చిన తరువాత, పక్కవీధినుండి మలుపు తిరిగి వచ్చిన కొందరు ఆయనకు ఎదురుగా పరుగెత్తుకు రాసాగారు. వాళ్లకి తాను అడ్డు రాకూడదనుకున్న పరంధామయ్య రోడ్డు వారకు వెళ్లి ఒద్దికగా నిలబడిపోయారు. కానీ వాళ్లలో ఒకడు ఆయన సమీపంలోకి రాగానే కాలు బెసికి, తూలిపోయి ఆయనను పట్టుకు నిలబడాలనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇద్దరూ కలిసి దబ్బుమనే పెద్ద శబ్దంతో నేలమీద పడ్డారు. అది తెలిసి ముందరికి పరిగెత్తిన వాళ్ళు వెనక్కి వచ్చి, ఇద్దరినీ లేవదీశారు. ఇంతలో వీళ్ళని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు అక్కడకు చేరుకున్నారు. ఇరు పక్షాల మధ్య కొట్లాట జరిగింది. వాళ్ళు ఒకరి నొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రచ్చరచ్చ చేశారు. ఆ కొట్లాట మధ్యలో చిక్కుకున్నారు పరంధామయ్య. ఆయనకి కూడా బాగా దెబ్బలు తగిలాయి. కట్టుకున్న బట్టలు చిరిగిపోయాయి. ఎంతో కష్టం మీద వాళ్ళని తప్పించుకొని బయటికి రాగలిగారు ఆయన.

ఇల్లుజేరి తలుపు తట్టిన పరంధామయ్యకి కొడుకు తలుపు తీశాడు. మట్టి కొట్టుకుని, బట్టలు చిరిగిపోయి ఒంటిమీద గాయాలతో ఉన్న తండ్రిని ఆశ్చర్యంగా చూసి ఏమి జరిగిందని అడిగాడు మాధవ. జరిగింది చెప్పక తప్పలేదు ఆయనకు. అంతా విన్న కోడలు వెంటనే భర్తతో ఇంగీషులో ఏమేమో చెప్పింది. "సరే" నన్నట్లుగా తలవూపాడు మాధవ.

ఒక స్టూలు తెచ్చి గుమ్మం బయట వేసి, తండ్రిని అక్కడ కూర్చోమన్నాడు మాధవ. మౌనంగా వెళ్లి స్టూలు మీద కూర్చున్నారు పరంధామయ్య. బాగా దెబ్బలు తగలడంతో ఆయనకు ఒళ్ళంతా నెప్పులతో సలపరంగా ఉంది.

మాధవ కోపంగా తండ్రి వైపు చూస్తూ, “నాన్నా! నువ్వు చాలా పెద్ద తప్పుచేశావు. ఊరంతా కరోనా వ్యాధి భయంకరంగా వ్యాపించి ఉంది. నువ్వు వెళ్లి గుంపులో చిక్కుకున్నావు. వాళ్ళలో "కరోనా కేరియర్" ఎవరైనా ఉండి ఉంటే, నీకు ఈ సరికి కరోనా వ్యాధి అంటుకుని ఉండవచ్చు. అలా జరిగి ఉన్నా కూడా, సుమారుగా నాలుగైదు రోజుల తరువాత గాని నీలో కోవిడ్ లక్షణాలేమీ కనిపించవు. నాలుగైదు రోజుల తరువాత చేసిన పరీక్షలో నీకు కరోనా లేదని తేలితే, నువ్వు ఇంటికి వద్దువుగాని. అంతవరకూ నువ్వు "క్వారెంటైన్" లో ఉంటేనే మంచిది" అనిచెప్పి, ఆపై "అసలు నువ్వు ఎవరూ లేవకముందే, ఎందుకు వాకింగుకి బయలుదేరావు" అని అడిగాడు కోపంగా.

నోటమాట రాలేదు పెద్దాయనకి. “బుద్ధి: కర్మానుసారిణి" అనుకున్నారు మనసులో. పైకి ఏమీ మాటాడకుండా తల వాల్చుకుని గుమ్మం బయట స్టూలు మీద కూర్చుండిపోయారు పరంధామయ్య.

ఆయన మనసంతా అల్లకల్లోలంగా ఉంది. “అవశ్య మనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం.” ఎవరికయినా సరే, చేతులారా చేసుకున్నాక అనుభవించక తప్పదు కదా - అనుకున్నారు ఆయన నిరీహతో.

*****

పరంధామయ్య “ఐసోలేషన్ సెంటర్” లో చేరి నాల్గురోజులు గడిచేసరికి ఆయనలో కరోనా లక్షణాలు కనిపించసాగాయి. టెస్టు జరిగింది. పాజిటివ్ వచ్చింది. ఆ సంగతి ఐసోలేషన్ సెంటర్ వాళ్ళు ఆయన కొడుక్కి తెలియజేశారు.

వెంటనే మాధవ తండ్రికి ఫోన్ చేశాడు, “చూశావా ఏమి జరిగిందో! ఆరోజు నువ్వలా వాకింగుకి వెళ్లకపోయి ఉంటే నీకీ దుర్దశ వచ్చేది కాదు కదా” అన్నాడు నిష్టూరంగా.

“బుద్ధి: కర్మానుసారిణి“ అన్నారు పరంధామయ్య మాష్టారు కొడుకుతో ముక్తసరిగా.

“నిన్ను "క్వారెంటైన్" లో పెట్టమని చెప్పి, నీ కోడలు మంచి పనే చేసింది. లేకపోతే నీ పుణ్యమా - అని, ఇల్లంతా చుట్టేసేది కరోనా” అన్నాడు కొడుకు మళ్ళీ.

“ఔను, నేనూ అదే అనుకుంటున్నాను” అన్నారు క్లుప్తంగా పరంధామయ్య. వెంటనే కొడుకు ఫోన్ కట్ చేసేశాడు. ఆపై అతడు తండ్రికి మళ్ళీ ఫోను చెయ్యలేదు.

*******

ఊరంతా లాక్ డౌన్ లో జోగుతూన్నా, ఆసుపత్రులు మాత్రం కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. పరంధామయ్యని ఐసోలేషన్ షెల్టర్ నుండి గవర్నమెంటు ఆసుపత్రికి తరలించి, కోవిడ్ వార్డులో చేర్చారు. ఈ వ్యాధికి తగిన మందుని ఇంకా ఎవరూ కనిపెట్టి ఉండకపోవడంతో వైద్యులు రోగికి వచ్చిన అవలక్షణాలను బట్టి, అవి తగ్గడానికి తగిన మందులు ఇస్తూ, మరో దారేదీ లేకపోడంతో తమకు చేతనైనంత మటుకు తూతూమంత్రంగా వైద్యం చేస్తున్నారు. ఆయుశ్శు ఉంటే బ్రతుకుతున్నారు, లేకపోతే చనిపోతున్నారు. అలాని సరిపెట్టుకోక తప్పడంలేదు జనానికి. ఆసుపత్రినుండి శవాలని స్మశానానికి తరలించని రోజు ఒక్కటి కూడా ఉండడం లేదు. చనిపోయిన వారికి అపరకర్మలు చెయ్యడానికి, ఎంతటి ఆత్మీయులైనా కూడా, కరోనా భయంతో వణుకుతున్నారు. అనాధ ప్రేతలుగానే మృతులకు సామూహికంగా దహనాలూ, ఖననాలూ జరిపించేస్తున్నారు పారిశుధ్య కార్మికులు.

ఈ మహా యజ్ఞంలో, ఎందరో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులూ సమిధలు కాక తప్పడంలేదు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా వాతను పడుతూనేవున్నారు. ఒక్క భారత్ మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా కరోనా వ్యాధితో పోరాడుతూ అల్లకల్లోలంగా ఉంది.

ఆసుపత్రి మంచం మీద నిస్త్రాణగా పడుకుని ఉన్న పరంధామయ్యకి ఎడతెగని పొడి దగ్గువల్ల డొక్కలు చాలా నెప్పిగా ఉన్నాయి. ఈ రోజు ఉదయంనుండీ ఆయనకు ఆయాసం కూడా మొదలయ్యింది. పెద్ద వయసు కావడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అంతంత మాత్రమే! రోజు రోజుకూ ఆయన పరిస్థితి దిగజారుతోంది. వైద్యం జరుగుతోంది, కానీ ఫలితం శూన్యం. కరోనా వల్ల వచ్చిన బాధలు పడలేక, తను పూజించే దైవానికి తనపై దయ తప్పిందని అనుకున్నారు పరంధామయ్య.

దైవ కృప తనపై ఉంటే తనకిన్ని అగచాట్లు వచ్చేవికావు కదా! భార్య చనిపోయింది, కోడలికి తనంటే కిట్టలేదు, పోనీ హోంలో బాగానే ఉందిలే - అనుకుని సరిపెట్టుకుంటుంటే, హోమ్ మూసేశారు. అవన్నీ చాలక, తగుదునమ్మా- అని, తాను ఒక్కసారి బయటకు వెళ్లేసరికి, అయాచితంగా వచ్చి తనపై వాలింది ఈ కరోనా మహమ్మారి! తనను విడవకుండా వెన్నంటి వస్తోంది తన దురదృష్టం! ఒక్క జీవికి ఇన్ని కష్టాలా? ఈ ప్రశ్నకు బదులిచ్చే వారెవరు?

తానొక దైవోపహతుడన్న నిర్ణయానికి వచ్చేరు పరంధామయ్య. ఆయనకు తాను ఎనిమిదవ తరగతిలో బోధించిన భతృహరి రాసిన సుభాషితాల్లోని "ధర ఖర్వాటుడొకండు ..." అన్న పద్యం గుర్తొచ్చింది.

అప్రయత్నంగా ఆయన కళ్లలో కన్నీరు ఉబికింది. “పండిన పండు ఏదో ఒక రోజున చెట్టునుండి రాలిపోక తప్పదు. "జాతస్య మరణం ధృవం!" కానీ కరోనా వల్ల చస్తే, నా ఏకైక పుత్రుడు మాధవ, నాకు తలకొరివి పెట్టడానికైనా వస్తాడో, రాడో“ అనుకున్నారు ఆయన బాధగా .

ఆ భావం మనసులోకి రాగానే ఆయనకు ఇక కన్నీరు ఆగలేదు. కన్నీరు, చెంపల వెంట ధారలై కారుతూండగా నిస్సహాయంగా మంచాన్ని కరిచిపట్టుకుని దగ్గుతూ, ఆయాసపడుతూ పడివున్నారు పరంధామయ్య మాష్టారు.

కరోనా రోగులకు మందులు ఇచ్చే వేళ అవ్వడంతో, డ్యూటీ చేస్తూ అక్కడకు వచ్చింది, ఆపాదమస్తకం మాస్కు ధరించి ఉన్న, కుర్ర నర్సు , వైద్య సరంజామాతో ఉన్న బండిని తోసుకుంటూ. ఆమె ఆయన కన్నీరు చూసి కళవెళ పడింది. దగ్గరగా వెళ్లి, "తాతయ్యా" అంటూ ఆత్మీయంగా పిలిచింది.

ఈ కరోనా మూలంగా తనవాళ్లకు దూరమైనందుకు ఆయన దుఃఖిస్తున్నాడనుకొంది ఆమె. రెండు ఓదార్పు మాటలు చెప్పి ఆయన దుఃఖానికి ఉపశమనం కల్పించడం తన విధ్యుక్త ధర్మంగా భావించింది. వెంటనే, “తాతయ్యా! మనుమలు దగ్గర లేరని విచారిస్తున్నావా ఏమిటి! ఇటుచూడు, నేను నీ మనుమరాలిని కానా” అని ప్రేమగా అడుగుతూ ఒక టిష్యూ పేపర్ తీసి ఆయనకు అందించింది కళ్ళు తుడుచుకోడానికి.

ఆమె ప్రేమపూరిత వచనాలతో పరంధామయ్యకి సంతోషం కలిగింది. ఆమె ప్రేమ ఉట్టిపడుతున్న స్వరంతో “తాతయ్యా” అన్నందుకు మనసారా ఆనందించాడు ఆయన. ఆత్మీయతతో కూడిన ఆ పిలుపు కోసమే కదా తాను మొహం వాచి ఉన్నది! అంత బాధలోనూ కూడా ఆయన మొహంలో రవంత ఆనందం తొంగిచూసింది. ఆమె వైపు ప్రేమగా చూశాడు. ఆయన టెంపరేచర్, "ఆక్సీ మీటర్" రీడింగులు తీసుకుని, ఆయనకు ఇంజక్షన్ చేసి, "మళ్ళీ వస్తా తాతయ్యా” అని చెప్పి, డ్యూటీ మీద వెళ్ళిపోయింది ఆ కుర్రనర్సు.

పరంధామయ్యగారి ఆరోగ్యం మరునాటికి మరీ క్షీణించిపోయింది. ఆయాసం ఎక్కువై ఆయనకు ఊపిరాడని పరిస్థితి వచ్చింది. వెంటనే ICU లోకి మార్చారు ఆయన్ని. వెంటిలేటర్ అవసరమయ్యింది, కానీ అప్పటికే ఆ ఆసుపత్రిలో ఉన్నవెంటిలేటర్లన్నీ డ్యూటీ చేస్తున్నాయి. ఒక్కటంటే ఒక్క "వెంటిలేటర్" కూడా ఖాళీగా లేకపోడంతో దానికి బదులుగా ఆయనకి ఆక్సిజన్ పెట్టారు. ఊపిరాడని బాధతో ఉన్నారు ఆయన. ఆ పెద్దాయనకి చివరి ఘడియలు సమీపించాయని అర్ధమైపోయిన డాక్టర్లు కొడుక్కి ఫోన్ చేసి ఆ సంగతి చెప్పారు.

ఆయాసంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతున్న పరంధామయ్యకి హఠాత్తుగా బాధలు తగ్గి, తెరిపిచ్చినట్లనిపించింది. సరిగా అప్పుడే, ఆ కుర్రనర్సు డాక్టర్లు పంపగా, కడసారి ప్రయత్నంగా ఆయనకు ఒక ఇంజక్షన్ ఇచ్చే పనిమీద అక్కడకు వచ్చింది.

ఆ నర్సు రాగానే అంది, "తాతయ్యా! బాధగా ఉందా” అంటూ దగ్గరగా వచ్చి ఆప్యాయంగా పలకరించింది. ఆయనకు నోటమాట రావడంలేదు. విపరీతమైన దాహంతో ఉన్న ఆయన, ఎంతో కష్టం మీద "మంచి నీళ్లు కావాలి" అన్నట్లుగా సైగచేసారు. వెంటనే ఆమె మంచం పక్కనున్న షెల్ఫులోంచి మంచి నీళ్ల సీసా బయటకు తీసి, మూతతో ఆయన నోటిలో కొద్దికొద్దిగా నీరు పోసింది.

ఆమె వైపు ప్రేమతో చూస్తూ ఆ నీరు రెండు గుటకలు వేశాక పరంధామయ్య, నెమ్మదిగా చేతితో “చాలు” అన్నట్లు సైగచేశారు. ఆ కుర్ర నర్సు సీసాకి మూతపెట్టి షెల్ఫులో ఉంచి, ఆయనకు ఇంజక్షన్ చేసే సన్నాహంలో పడింది. పెద్దాయనకు ఊపిరి తిత్తులు శిధిలమైనప్పటికీ మెదడు బాగానే పనిచేస్తోంది. ఏవేవో ఆలోచనలు ఫ్లాష్ న్యూసులా గబగబా తలలో పరుగులు తీశాయి. ఆయన దైవాన్ని తలపోశాడు …

“ఓయి భగవంతుడా! ఏమి మాయలయ్యా నీవి! ఐనవాళ్ళని కానివాళ్లుగా, ఏమీ కానివాళ్లను ఐనవాళ్లుగా చేసి, ఈ కోవిడ్ పేరుతో మనుష్యుల్ని ఒక ఆట ఆడిస్తున్నావు కదయ్యా! నా సొంత మనుమడు నన్ను "తాతయ్యా" అని పిలవడు. "ముసలాయన" అంటాడు. ఈ పిల్ల, ఏ అమ్మ కన్న బిడ్డో కూడా నాకు తెలియదు, కాని నన్ను “తాతయ్యా”! అని ఎంతో ఆత్మీయంగా నోరారా పిలిచి, నాకు పరిచర్యలు చేస్తోంది, ఇది ఏ నాటి ఋణానుబంధమో కదా! ఈమె నా మనుమరాలు కాదని నేనెందుకు అనుకోవాలి!”

అంతలో ఆయనకి మరో ఆలోచన వచ్చింది, ఆకలిగొన్న వేళలో తనకు అన్నం పెట్టిన ఇల్లాలు, ఆపదలో తనను ఆదుకుని కొడుకు ఇంటికి చేర్చిన పోలీసు గుర్తు వచ్చారు. “బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు కదా మనకు - కలియుగం ముదిరినకొద్దీ విలువలు తారుమారు ఔతాయి - అని! అదే జరుగుతోంది ఇప్పుడు. ఈ బొందిలో ప్రాణం ఉన్నంతవరకే కదా జీవికి "నేను," "నాది" అన్న దోరాటం! ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోయాక, ఆ నిర్జీవ కళేబరంతో ఆత్మకు ఏమీ సంబంధం ఉందదు. ఆ కళేబరాన్ని ఏమిచెయ్యాలి అన్నది బంధువుల బాధ్యత గాని, ఆ విముక్త జీవిది ఎంతమాత్రం కాదు. అలాంటప్పుడు నీ తలకొరివి ఎవరు పెడితే నీకు ఏమిటి? ఈ వయసులో, ఈ స్థితిలో ఇలాంటి తాపత్రయాలు నీకు అవసరమా?” ఆ ఆలోచన రాగానే ఆయన మనసు తేలికపడింది. శరీరం కౌడ్ 9 మీద తేలిపోతున్నట్లు హాయిగా ఉంది మనసు, తనువూ కూడా! ఆపై ఆయనకు అంతా మబ్బు కమ్మినట్లుగా అయోమయంగా తోచింది. ఇకపై ఆయనకు ఏ ఆలోచనా రాలేదు.

సిరంజి లోకి మందు ఎక్కించుకుని ఆయనకు ఇంజక్షన్ చెయ్యడానికని ఇటు తిరిగిన కుర్రనర్సు, ఆయన కళ్ళు తేలవెయ్యడం చూసి కంగారుపడింది. చేతిలో ఉన్న సిరంజిని పక్కన పెట్టి, గ్లోవ్సులో ఉన్న తన రెండు చేతులా ఆయన చేయి పట్టుకొని “తాతయ్యా!” అంటూ ఆక్రోశించింది.

ఆయన  పెదవులు సంతృప్తితో కూడిన చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మరు క్షణంలో పరంధామయ్య మాష్టారి ప్రాణవాయువులు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. ఆయన నిర్జీవుడయ్యాడు. కరోనా మరణాల లెక్క మరొక అంకె పెరిగింది.

**సమాప్తం**

Posted in June 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!