Menu Close
Kadambam Page Title
ఒక ఎండా కాలపు దాహం
గవిడి శ్రీనివాస్

ఈ వేసవి కాలం
దోసిళ్ళ లోంచి క్షణాల్ని ఒంపుకుంటూ
గొంతులోని తడిని ఎగరేసుకుపోతూ
ఎండను రాల్చుకుంటుంది.

ఇంటిలోంచి కళ్ళు బయట ఆరేస్తే చాలు
పిల్లలు మూగిన ఐస్ క్రీం బండి
బాధ్యత రెక్కల్ని విప్పుతుంది.

కన్నీటి దుఃఖాల్ని
లోలోపల ఆరేసుకుంటుంది.

ఇంటి  లోపల ఉతికిన వస్త్రాల్ని చూస్తే చాలు
బయట ఎండలో
వయసు భారాన్ని లెక్కచేయని
ఇస్తిరి పెట్టి ముసలివాడు
బొగ్గుల నిప్పుల్లోంచి జీవితాన్ని చూపిస్తాడు.

ఎండ పేలిపోతున్న
బండి కదలదు.

శ్వాస ఆగిపోతున్న
బతుకు పోరాటం ఆగదు.

చూపులు తిప్పుకుని
నీటి టబ్బు వైపు చూస్తే చాలు
గడపలో నీటి కోసం కాకులు
ఊగుతుంటాయి.
నీట మునుగుతుంటాయి.

ఒక ఎండా కాలం నీటి స్పర్శ కోసం
గొంతులు మధన పడుతుంటాయి.

నా చుట్టూ ఎండను తీసి
గొడుగులా  కాసి
ఒక్కో గొంతులో నీటినిపోసి
స్వచ్ఛంగా  స్వేచ్ఛగా
పక్షిలా బతకాలనుంటుంది.

ఒక ఎండాకాలపు దాహం
మనిషిని కాల్చకుంటే ఎంతబావుణ్ణు.
చినుకునై కురిస్తే ఇంకెంత బావుణ్ణు.

Posted in June 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!