Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
పద్మశ్రీ స్వామి శివానంద
Padmasri-swami-sivananda
Photo credit: Twitter / President of India (@rashtrapatibhvn)

ఆదర్శమూర్తులు అంటే వారి జీవితానుభవాల సారాన్ని పదిమందికి పంచి, సత్సంకల్పంతో సమాజ అభివృద్ధిని ఆకాంక్షించేవారు. వారిలో రెండు రకాలు ఉంటారు. మొదటి వర్గం వారు పుట్టుకతోనే సంపన్నులై అన్నీ సౌకర్యాలను కలిగివుండి, సామాజిక స్పృహతో వారి వారి పలుకుబడిని, సంపదను సమాజ శ్రేయస్సుకై వెచ్చించి తద్వారా సమాజంలో మార్పును ఆశించేవారు. ఇక రెండవ వర్గం కష్టాలు, సామాజిక అసమానతలు, పేదరికం తదితర జీవన్మరణ సమస్యలను పుట్టుకతోనే పొంది వాటిని అధికమించి జీవితంలో రాణించి వారి ఆశయాలను నెరవేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలిచేవారు. రెండు వర్గాలలోనూ ఒకటే ఆశయం, ఆకాంక్ష. అదే సమాజ శ్రేయస్సు, అభివృద్ధి. అయితే మొదటి వర్గానికి లభించిన పేరు, గుర్తింపు రెండో వర్గంలోని  అందరికీ లభించదు. అటువంటి వారిని గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే వారు దైనందిన జీవన సమస్యలను అనుభవిస్తూ వాటిని అధికమించి వారి అనుభవపూర్వక జీవన శైలిని అందరికీ చూపిస్తారు. ఇతరులకు మేలు చేయాలనే చేతలు తప్ప మాటలు అంతగా ఉండవు.

ఎల్లప్పుడూ డబ్బు సంపాదించాలనే కోరిక, కుటుంబ స్థితిగతులను పెంచుకొని అందరూ తమను గుర్తించాలనే కీర్తి కండూతి మరియు సామాజిక ఉన్నతికై ఆరాటపడే స్వార్థ చింతన వంటివి ఏమీ లేకుండా సాధారణ కుటుంబ జీవన శైలితో నివసిస్తున్న ఎంతోమంది సామాజిక సేవామూర్తులు మన నిజజీవితంలో తారసపడుతుంటారు. అటువంటి వారికి ఎటువంటి రుగ్మతలు దరి చేరవు, మానసిక ఆందోళనలు ఉండవు. అటువంటి జీవన సూత్రాలతో అత్యంత సాధారణ దైనందిన జీవన కార్యాలు, సదా ఉత్తేజపూరిత ఆలోచనలు, ఆచరణలతో నిత్య సంతోషంగా నివసిస్తున్న శ్రీ స్వామి శివానంద నేటి మన ఆదర్శమూర్తి.

1896 సంవత్సరం, ఆగష్టు 8న జన్మించిన శివానంద, పేదరికంలోనే పుట్టి పెరిగారు. అతి చిన్న వయసులోనే తల్లితండ్రులను కోల్పోయి, స్వయంకృషితో జీవనాన్ని సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినను ధైర్యాన్ని కోల్పోకుండా తన తల్లి నేర్పిన సాత్విక ఆహార అలవాట్లను అలాగే కొనసాగించి బతకడం నేర్చుకొన్నారు. యుక్త వయస్సు వచ్చేసరికి అతను పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లో గురు ఓంకారానంద గోస్వామి వద్ద శిష్యరికం చేసి యోగాతో సహా ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. అదే యోగ విద్య ఆయన జీవితం అయ్యింది. తన ఆరోగ్య రహస్యం కూడా అయ్యి నేటికీ అంటే నూట ఇరవై ఐదేళ్ళ వయసులో కూడా ఆయనను చైతన్య వంతునిగా నిలిపింది.

చదువుతో సామాజిక స్పృహ ఏర్పడి అందరూ సమాజం కొరకు ఎన్నో మంచి కార్యాలు చేస్తారనే భావన మనందరిలో ఉంటుంది. కానీ "ప్రపంచమే నా ఇల్లు, దాని ప్రజలు నా  తల్లితండ్రులు, వారిని ప్రేమించడం మరియు వారికి సేవ చేయడం నా మతం" అనే గొప్ప ఆలోచన కలిగిన శివానంద ఎటువంటి చదువుకు నోచుకోలేదు. కానీ సమాజంలోని ప్రతి వ్యక్తిని తన జ్ఞాన దృష్టితో ఆసాంతం చదివేశారు. ఎదుటి వ్యక్తి లోని మంచిని మాత్రమె గ్రహించే స్థితిలో మనందరం ఉండాలని స్వామి శివానందను చూస్తే అర్థమౌతుంది.

కేవలం సాత్విక ఆహారం, క్రమశిక్షణతో కూడిన తన జీవితం, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆశించడం, నిస్వార్థ దృష్టితో సాటి మనిషికి చేతనైన సేవ చేయడం తదితర ధర్మాలు తనను నేటికీ ఆరోగ్యంగా ఉంచుతున్నాయని స్వామి శివానంద చెబుతున్నారు.

భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలైన వారణాసి, పూరి, హరిద్వార్, నబద్వీప్ తదితర ప్రాంతాలలో ఎన్నో నిత్యకృత్య నిర్విరామ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ, సంకల్ప బలంతో సాధన చేస్తే వయసుతో నిమిత్తం లేకుండా మన విధులను నిర్విఘ్నంగా నిర్వహించడానికి తగిన బలం వస్తుంది అని నిరూపించి మనలోని ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఈ క్రింది వీడియో లో ఆయన స్వయంగా తన గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు వినవచ్చు.

Video credit: Virtual Bharat

స్వామి శివానంద తన కృషికి తగిన గుర్తింపు లభిస్తున్నదా అని కాకుండా తన చేస్తున్న సేవ వల్ల ఎంతమంది జీవితాలలో ఆనందాన్ని నింపుతున్నానే భావనతో తన సేవలను చేస్తున్నారు. ఆయన యోగా రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం ఆయనను ఈ సంవత్సరం వరించింది. అది నిజంగానే ఒక పెద్ద సంతోషకరమైన వార్త. ఆ పురస్కారం ఆయనను ఏనాడో వరించాలి. కానీ ఆయనకు అంత పరపతి లేదు కదా. ఏది ఏమైనా ఎన్నో సామాజిక సేవలతో, ఆరోగ్యకర జీవన క్రమశిక్షణతో తన జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న శ్రీ స్వామి శివానంద ఎంతో మందికి చైతన్య స్ఫూర్తి.

Posted in June 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!