Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
మర్మదేశం (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

మీకు తెలియదు కదూ! ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్ లు నిర్మించినది వీరే. ఆంజనేయ స్వామి, పరశురాముడు, అశ్వత్థామ లాంటి చిరంజీవులు అందరూ ఇక్కడే సంచరిస్తూ ఉంటారు. దేవతలు ఇక్కడికి వచ్చి వెళతారు.

అంతే కాదు ఇక్కడ నివసించే ప్రజలు భవిష్యత్తును చూడగలుగుతారు. అందుకే భవిష్యత్తులో వచ్చే రోగాలు కూడా వీళ్ళు అందించిన ఆయుర్వేదంలో మందు దొరుకుతుంది". అని చెప్పాడు మేథా.

"నీ దయవల్ల మేము ఇవన్నీ చూడగలిగాము. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాము. థాంక్యూ మేథా అంకుల్." అంది శార్వాణి.

"మీరు మా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. క్షమించండి." అన్నాడు మేథా బాధగా.

"అలా అనకు అంకుల్ మాకు ఎన్నో విషయాలు తెలియజేశావు. అంతకన్నా గ్రహాలన్నీ చూపించావు. అప్పటి పరిస్థితులను అనుభవించేట్టుగా చేశావు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము." అన్నారు పిల్లలందరూ ఏకకంఠంతో.

"సర్లే ఇంక మీరు బయలుదేరండి మీ ఇళ్ళకు చేరుస్తాను." అన్నాడు మేథా.

వారి ముందు బంగారు రంగులో మెరిసి పోతూ ఉన్న ఒక యు.ఎఫ్.ఒ వచ్చి ఆగింది. పిల్లలందరూ అందులోకి ఎక్కి కూర్చున్నారు.

అక్కడి ప్రజలు పిల్లలకు వీడ్కోలు చెప్పారు. యు ఎఫ్ ఓ గాల్లోకి లేచింది.

ఆ సంబాల నగరం మధ్యలో తొమ్మిది అంతస్తుల క్రిస్టల్ పర్వతం కనిపించింది. దానిమీద లోటస్ ఆకారంలో కాలచక్రం మండలం ఉంది. అది చాలా బాగుంది.

"అబ్బా భలే ఉంది అది." అన్నాడు చరణ్.

దానిని మొదటి రాజు అయిన సుచేంద్రుడు కట్టించాడు." అన్నాడు క్రేన్.

“దీనికి కాపిటల్ ఏది?" అని అడిగాడు కౌషిక్.

"దీని క్యాపిటల్ కలాపా" చెప్పాడు డింగూ.

“దీనినే ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్ అని కూడా అంటారు." చెప్పాడు క్రేన్. యు.ఎఫ్.ఒ వారి ఊరి పొలిమేరలలో వదిలిపెట్టింది.

పిల్లలు వాళ్ళ ఇళ్లకు రమ్మని మేథా బృందాన్ని ఆహ్వానించారు.

"మేము రాకూడదు మీరు వెళ్ళండి." అని చెప్పాడు మేథా.

"ఏమి ఎందుకు రాకూడదు?" అమాయకంగా అడిగాడు దినేష్.

భూమ్మీద అడుగుపెట్టగానే పూర్వజన్మ జ్ఞానం పోయింది దినేష్ కు. మునుపు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉన్నాడు.

"అదంతే లేనాన్నా. కొన్ని దేవరహస్యాలు పిల్లలకి చెప్పకూడదు." చెప్పాడు మేథా.

పిల్లల మనస్సులు బరువుగా ఉన్నాయి. ఆత్మీయులను దూరం చేసుకుంటున్నామన్న బాధ వారిని చుట్టుముట్టింది.

అది గ్రహించిన మేథా "మీరేం దిగులు పడకండి మేము ఎప్పుడు మీతోనే ఉంటాం. మీరు తలుచుకోగానే మీకు మేము కనబడతాము." అని చెప్పాడు.

వారు ఏ టైంలో అయితే యు.ఎఫ్.ఓ ఆకాశయానం సాగించారో అదే సమయానికి వారు ఆ ప్లేస్ కి చేరుకున్నారు.

మేథా వాళ్ళెక్కిన యు.ఎఫ్.ఓ మెల్లిగా గాల్లోకి తేలింది. పిల్లలు వారికి వీడ్కోలు చెప్పి ఇంటి దారి పట్టారు.

***సశేషం***

Posted in June 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!