Menu Close
Page Title

ఆకర్షణల వల

aakarshanala-vala

తెల్లరంగు ఈకల మధ్య అక్కడక్కడ రంగు పూసుకున్నట్లుండే నల్లని ఈకలతో, ఎర్రని వంపు తిరిగిన రంగు ముక్కు తో అందంగా వయ్యారాలుపోతూ నీటిపై ఆడుతూ ఎగిరే చేపల్ని ఒడుపుగా పట్టుకుని నీటిపై ఎగురుతూ చూడనింపుగా పల్టీలు కొడుతూ సముద్రతీరాన్న, నదీ మేటలలో ఎగురుతుండే మమ్మల్ని మీరు చూసే ఉంటారు. అక్కడక్కడ నల్లని రంగు ఈకలతో తెల్లని పక్షులమై ఎగురుతున్న మమ్మల్ని 'సముద్ర గుల్' అని పిలుస్తారు. సాధారణంగా చేపలు, పురుగులు, నత్తలని, గింజల్ని వెదుక్కుని తింటూ తీరం నుంచి వెనక్కి వెళ్లే ఆలల ని తరుముతూ సముద్రతీరాన కనిపిస్తాము. నేను, నా సఖుడు మా యితర పక్షిగణంతో కలిసి సముద్రతీరాన్న ఆడుకునే పిల్లలతోటి, మనుషులతోటి కలిసి తిరుగుతాము. మేము వాళ్లకి ఎటువంటి హాని తలపెట్టం గనుక మాకు మానవులంటే భయంలేదు, వాళ్లూ మమ్మల్ని ఏమీచెయ్యరు, వాళ్ళు తినే ఆహారాన్నే మాకూ వేస్తుంటారు. అలా మనుషులమధ్య ఎగురుతూ వారి మాటలు, పాటలు వింటూ మా పని మేము చేసుకుంటూ ఆనందిస్తాము, వారికి ఆనందాన్ని పంచుతాము. మాకు వారి చేష్టలని అర్ధంచేసుకునే తెలివితేటలు లేవనుకుంటారు ఈ మానవులందరూ. నిజానికి మేము పరిమాణంలో చిన్నవారమైనా తెలివితేటల్లో మరీ తీసిపారెయ్యవలసిన వాళ్లమేమి కాదు. మాకు వారి తీరుతెన్నులు తెలిసినా పట్టించుకోకుండా తిరుగుతుంటాము. అలాగా నేను తన్మయత్వంతో చూసిన సంఘటనల వివరాలు చెప్పాలని ఉంది.

ఆమె అతడిని రాము అని సంబోధిస్తుంది, అతడు ఆమెని సుధా అని పిలుస్తుండగా విన్నాను. వారిద్దరిని చూస్తే ప్రేమలో పడ్డట్టే అనిపిస్తుంది. ఇక్కడ సాధారణంగా ప్రేమికులమధ్య కనిపించే కౌగలింతలు ముద్దులివ్వడాలు లాంటివి వాళ్లమధ్య చూడలేదు. ఒక్కోసారి తీరానున్న అలలతో పాదాల్ని తడుపుకుంటూ నవ్వుకుంటూ నడుస్తూ, మరొకసారి కొంచం దూరంలో ఇసుక తిన్నెలపై కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ కనిపించేవారు. ఒక్కోసారి ఆమె ఉద్రేకంగా మాట్లాడుతూ తీవ్ర వాదనలో ఉన్నట్టు కనిపించినా అతడు నిమ్మకునీరెత్తినట్లు ఎటువంటి ఆవేశం చూపించకుండా ఉండేవాడు. ఒక్కోసారి ఏదో వారిరువురి మధ్య జరిగే వాదనలలో ఆమె కళ్ళల్లో నీరు చిప్పిలు తున్నట్టు అనిపించినా అతడు చిరునవ్వుతో సర్దేస్తుండేవాడు. మరోసారి ఇద్దరూ నవ్వుతూ సాగర అలలతో పోటీ పడి పరుగెడుతూ కేరింతలతోటి సరదాగా తిరుగుతూ ఉంటే మాకు ముచ్చటవేసేది. ఏమైనా ఇద్దరూ అలా ఆనందంగా తిరుగుతుంటే చిలకా గోరికలంటారే – అలాగే ఉంటారనిపించేది మాఇద్దరికి. వారిద్దరూ తరుచు సాయంకాలాలు సముద్రతీరాన్న చల్లగాలికోసమో, జనాలమధ్య కలిసి గడపడానికో, సూర్యాస్తమయాలు చూసి ఆనందించడానికో వస్తుంటారనుకొంటాను. వాళ్ళు మెల్లగా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకోవడం వల్ల కావచ్చు, సముద్రహోరు వల్ల గాని, తీరాన్న ఆడుకొంటున్న పిల్లల సందడివల్లో గాని వారి మాటలు మాకు స్పష్టంగా తెలిసేవి కావు. మేము కూడా మా ఆహార వేటలో మునిగి దూరాన్నుంచే వారి చేష్టలు పరికించుతూనే ఉన్నా వాళ్ళగురించి అంతగా పట్టించుకునే వాళ్ళము కాదు కూడా.

ఒకనాడు ఇద్దరు వయస్సు మళ్ళిన దంపతులకుంటాను, వాళ్ళతో వచ్చారు. కొత్తవాళ్లతో రావడంవల్ల కుతూహలం పెరిగి మరికొంచం నిశితంగా పరీక్షించాను. అతడు వారికి గౌరవ మర్యాదలు యిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమె ప్రవర్తనా తీరు చూస్తే మాత్రం జాగ్రత్తగానే మాట్లాడుతున్నట్లున్నా కొంచెం  నిర్లక్ష్యధోరణి కనిపిస్తోంది. బహుశా వారు ఆమె తలిదండ్రులు కావచ్చు అనిపించింది. వాళ్ళు గడిపిన సమయం సరిగ్గా తెలియదుకాని ఆ పిల్లతో కలిసి ఆ దంపతులు ముందే వెళ్లిపోయారు. అతడు మాత్రం చాలాసేపు సముద్రకెరటాలనే చూస్తూ ఇసుకలో కూర్చుని ఉండిపోయాడు. చివరకి ఎప్పుడు వెళ్లిపోయాడో నేను గమనించలేదు. ఆ తరువాత మళ్ళీ కొన్నాళ్ళు ఆ అమ్మాయి గాని ఆ వయస్సు మీరిన దంపతులుగాని కనబడలేదు. ఆ అబ్బాయి మాత్రం రోజూ సాయంసమయాల్లో సముద్రతీరానికి వచ్చి కూర్చుని ఒడ్డుకు చేరుతూ తమ జాడ విడిచిపోతూ తరలిపోతున్న కెరటాలని చూస్తూ ఏవో ఆలోచనలతో సతమతమవుతున్నట్టు కనిపించేవాడు.

కొన్నాళ్ళ తరువాత ఒక రోజున మళ్ళీ ఇద్దరు కలిసి ఆనందంగా చేతులు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ సముద్రతీరాన్నే అటునిటు నడుచుకుంటూ కనిపించారు. నాసఖుడు కూడా వాళ్ళ సంతోషం చూసి ఆనంద పడి 'చూడు వాళ్ళని చూస్తుంటే ప్రపంచములోని సంతోషమంతా కుప్పచేసి వాళ్ళ మీదే పోసినట్లు లేదూ' అన్నాడు. నాకూ అది నిజమే ననిపించింది. కొన్నాళ్ళు వాళ్లిద్దరూ రోజూ సాయంకాలాలు సంతోషంగా మాట్లాడుకుంటూ గడిపారు. వాళ్ళని చూస్తుంటే మా ఇద్దరికీ కూడా ఏదో తెలియని ఆనందం, మాకిష్టమైన చేపలన్నీ ఒకేసారి గుంపుగా మాముందుకి వచ్చినట్టయి తృప్తిగా అనిపించేది.

ఒకరోజున వాళ్లిద్దరూ మంచిబట్టలు వేసుకుని ప్రత్యేకంగా అందంగా అలంకరించుకుని చాలా మంది స్నేహితులనుకుంటాను, వాళ్లతోను, యిదివరలో కనిపించిన వయస్సు మీరిన దంపతులతోను, మరొక వయస్సుమీరిన జంట తోనూ నవ్వుకుంటూ తింటూ, తాగుతూ చీకటి పడ్డ తరువాత చాలాసేపటివరకు ఆనందంగా గడిపారు. వాళ్ళని చూస్తుంటే చెప్పొద్దూ మాకూ ముచ్చటేసింది. మేము కొంచం సేపు మా తిండి ధ్యాస వదలిపెట్టి వాళ్ళను చూస్తూ అటుయిటు తిరుగుతూ ఆనందంగా గడిపాము.

ఎంతకాలం గడిచిందో గుర్తులేదుగాని, ఒక రోజు సాయంకాలం ఒక చిన్న బాబుని తోపుడు బండి లో పడుకోబెట్టుకుని తోసుకుంటూ ఇద్దరు పక్కనే నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో బండిలో ఉన్న బాబుని పలకరిస్తూ అటుయిటు చాలాసేపు తిరిగారు. ఆ బాబు బహుశా వాళ్ళ అబ్బాయేమో. ఆ తరువాత కూడా తరుచు అల్లాగే తిరుగుతుండేవారు. చాలాకాలం గడిచిన తరువాత ఆ తోపుడు బండి లోని బాబు పెద్దవాడై బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఇసుకలో పడుతూలేస్తూ తిరుగుతుండే వాడు. అలాగే తల్లి తండ్రి చెయ్యి బట్టుకుని నడుస్తూ ఎదగడము చూస్తున్న మాకు ముచ్చటగా ఉండేది. వాడి అల్లరికూడా మాకు మా పిల్లలు చేపపిల్లల్ని పట్టుకోవాలని ప్రయత్నించి పట్టుకోలేక వెనక్కి వెళ్లే సముద్రపుటలల తాకిడికి పడుతూలేస్తూ కొత్తగా అప్పుడే నేర్చుకుంటున్న ఎగరడంలా అనిపించేది. పిల్లలు ఎక్కడైనా ఎదుగుతూ చేస్తుండే అల్లరి వాళ్ళ తల్లిదండ్రులకే కాక చూసే వాళ్ళకి కూడా ముచ్చటేస్తుంది. మా పక్షి పిల్లలలాగే ఆబాబు కూడా ఎదగడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. ఆపిల్లాడికి వాళ్ళ తండ్రి 'ఐస్ క్రీం' కొనిపెడితే తింటూ సగం ఒంటినిండా పులుముకోవడం, జారిపోతున్న దానిని పట్టుకుని మళ్ళీ తినడానికి ప్రయత్నించడం చూస్తుంటే నవ్వొచ్చి ముద్దొచ్చేది. ఆ బాబు మా పిల్లల్ని తరుముతూ ఆడుకుంటుంటే మా పిల్లలికి కూడా ఆనందంగా ఉండేది. రోజు రోజుకి ఆ బాబు మా 'గుల్' పిల్లల లాగే పెరుగుతుండడం, వాళ్ళ అల్లరి చూస్తూ ఆనందించడం మా ఆహారపు వేట లో భాగంగా మా దైనందిన చర్య అయిపొయింది. కొన్ని రోజులు రాము వచ్చేవాడు కాదు, బహుశా అతడు వేరే పనిమీద బయట ఊరు వెళ్లిఉంటాడనుకున్నాము. ఆ పిల్ల ఒకత్తే చిన్నవాడిని తీసుకు వస్తుండేది. కొన్నాళ్ళకి వాడు పెద్దవాడవడం వల్ల కాబోలు తోపుడు బండి వాడడం మానేశారు. ఆ బాబు కూడా ఇసుకలో నిలదొక్కుకుని క్రమంగా నడవ గలుగుతున్నాడు. ఇప్పుడు ఆ బాబు మా పక్షులని తరుముతూ పరుగులు పెడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుండడం మాకూ బాగుంది.

మేముంటున్న తీరంలో పక్షుల సమూహం పెరిగి క్రమంగా ఆహారం దొరకడం కష్టమవ్వడం ప్రారంభించింది. మా 'గుల్' జాతి పక్షులం మూడు గుంపులుగా విడి కొంచం దూరతీరాలకు ఎగురగలిగే శక్తి గల ఒక గుంపు తీరంవెంటనే ఉత్తరానికి బయలుదేరాము. మా పిల్లలు కూడా వాటి రెక్కల బలం పెరగడంతో దూర తీరాలకు ఎగరడానికి ఉత్సాహం చూపారు. అంచలు అంచలుగా మజిలీలు చేసుకుంటూ ముందు పరీక్షించి నిర్ణయించిన పధ్ధతిని ఆహారం విరివిగా దొరుకుతుందనుకున్న తీరానికి ప్రయాణం కట్టాము. మేము ఎంచుకుని చేరిన క్రొత్త ప్రదేశం చేరుకోవడం, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడే సరికి ఎంత కాలం గడిచిందో గుర్తులేదు. ఈ క్రొత్త ప్రదేశం మాత్రం జనవాసం తక్కువగా ఉండే చోటులా ఉంది. ఇక్కడి వారి ఆహార పద్ధతులు కొంచెం వేరుగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు తింటూ పెట్టే ఆహారం మాకు భిన్నరుచులు చూపి, వాటిని పెంచి ఉత్సాహాన్ని రేకెత్తించేది.

ఇక్కడ మా ఆచార పద్ధతులు కొన్ని చెప్పాలి. మాది చాలా తెలివైన పక్షిజాతిగా ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకి మేమంతా కాళ్ళు తాడిస్తూ రాబోయే వర్షపాత తీవ్రతని తెలుపగలం. దున్నుతున్న పొలంలో నాగలి చార వెనుకనే కష్టపడకుండా లభించే ఆహారాన్ని ఏరుకుతింటుంటాం. మాలో మానవులలోలా వివాహమనే వ్యవస్థ లేదుకానీ ఒకసారి జంట కుదురుతే ఇద్దరి జీవితాలు ఆబంధముతోనే ముగుస్తాయి. ఆడ పక్షి పెట్టిన గుడ్లని పొదగడంలో మగపక్షి కూడా సమంగా పాలు పంచుకుంటుంది. పొదిగిన పిల్లల రక్షణ, వాటి బతుకుతెరువుకై చేపల వేటకై శిక్షణలో కూడా ఆ తలిదండ్రులిద్దరు కూడా సమాన బాధ్యత వహిస్తారు. వివిధ స్వరకల్పనలతోటి, శరీర చలనాలద్వారా క్లిష్ట సమాచారాన్ని మా గుంపుకి, అర్ధంచేసుకోగల ఇతర గుంపులకి ప్రసారం చెయ్యగలం. మేమొక్కళ్ళమే చెయ్యగల పని, తక్కిన పక్షులుచెయ్యలేని పని సముద్రపునీరు మంచినీరుగా మార్చుకుని త్రాగటం ఆపైన ఉప్పుని నోటిద్వారా వదలివెయ్యడం. దానికి మాకంటి క్రింద ఉన్న గ్రంధులు ఉపయోగపడతాయి. సముద్రం సువిశాలమైనది గనుక మాకు త్రాగునీటి సమస్యే రాదు. 'యుటా' వంటి రాష్రాలలో వచ్చే మిడతల దండుని ఎదుర్కొనేందుకు మేము చాలా ఉపయోగపడతాము. అక్కడి ఉప్పునీటిసరస్సు వల్ల మాకు ఎటువంటి సమస్య రాలేదు, పైగా మాకా ఆహారం పుష్కలంగా లభిస్తుండేది. అందువల్లే 'యుటా' లో మేము 'రాష్ట్ర పిట్ట' గా లెక్కింపబడుతున్నాము.

రాము, సుధ, వాళ్ళ బాబు ఉన్న వూరు వదలి చాలానే రోజులవడం వల్ల వాళ్ళు మెల్లగా మరపు పొరల్లోకి జారుకుంటున్న సమయంలో ఒక రోజు సాయంకాలం హఠాత్తుగా రాము మేము ఉంటున్న సముద్ర తీరంలో కనబడ్డాడు. బహుశా అక్కడ దగ్గరలోనే ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడేమో అనుకున్నాము. అదేమిటి, అతడితో సుధా, పిల్లడు కాకుండా వేరే అమ్మాయి ఉంది? ఆమెతో ఒక చిన్న బొచ్చు కుక్క పిల్ల కూడా ఉంది. దాన్ని ఆమె ఎంతో ప్రేమతో చూసుకోవడం చూసాము. కొంపదీసి రాము వేరే పెళ్లి గాని చేసుకున్నాడా? సుధా, పిల్లాడు ఏమయ్యారు? ఈ మనుషులకి నీతినియమాలు లేవేమో? పక్షులమైనా మేమే నయం ఒకరితో సంబంధం కుదిరాక మళ్లీ వేరొకరి వంక ఆ దృష్టితో చూడం. సుధకి అతడు ఇక్కడ ఉన్నట్లు తెలుసా? తెలియకపోతే ఎట్లా తెలియజేసేది? ఏమి పాలుపోక ఉండిపోయాను. రోజులు గడుస్తున్నాయి.

ఊహించని విధంగా ఒక రోజున సుధా వాళ్లబ్బాయి అదే సువిశాల సముద్ర తీరంలో వేరొకచోట ఆడుకుంటూ కనబడ్డారు. సుధ ఎట్టాగో రాము జాడ తెలుసుకుని వచ్చిందేమో. ఇక్కడ గుంపులో ఆమె తోటివారు ఎక్కువమంది కనిపిస్తున్నారు. అంటే ఇక్కడి బంధువుల దగ్గరికి వచ్చిందో, లేక ఉద్యోగరీత్యా వచ్చిందో, లేక అతగాడి ప్రేమవ్యవహారం తెలిసే వచ్చిందో అర్ధంకాలేదు. నా సఖుడు, పిల్లలు కూడా అదే ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. ఆమె ముఖాన్న విషాదఛాయలుగాని, ఆందోళనా సూచనలుగాని కనబడటం లేదు. ఆ పిల్లవానితో సంతోషంగా ఆడుకుంటూ కనబడేది. అంటే రాము ప్రేమోదంతం తెలియకుండానే వచ్చిందేమో అనిపించింది.

ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం అప్పుడే సూర్యాస్తమయం అవుతూండగా, సుధ కొడుకు వెనకాల పరుగెడుతూ ఆడిస్తోంది. ఆ అబ్బాయి తల్లి పట్టుకోవడానికి దొరక్కుండా పరుగెత్తి ఆమెని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అనుకోకుండా వాళ్లను చూసి ముద్దుగా ఉండే ఒక బొచ్చు కుక్క పిల్లకూడా వాడితో కలిసి పరుగెడుతూ ఆడడం కనిపించింది. వాళ్ళ వెనకాలే సుధ కూడా పరుగెత్తడం చూసాము. మేము మా తిండివేట సాగిస్తూనే వాళ్ళ వాళ్లపై ఒక కన్ను వేసి ఆటచూస్తూ ఆనందిస్తున్నాము. అనుకోకుండా ఆ పరుగెడుతున్న పిల్లాడు ఒకాయన దగ్గరకెళ్ళి గబుక్కున రెండు కాళ్ళూ కదలకుండా పట్టేసుకుని వాటేసుకున్నాడు. సుధ కూడా చటుక్కున ఆగిపోయి అతడిని చూసి నిర్ఘాంతపోయింది. అతడి మొఖంలో కూడా ఆశ్చర్యం మొక్కబోయినట్లు నిలిచింది. ఉలుకు పలుకు లేకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతడెవరా అని చూస్తే రాము, ఆ అబ్బాయి తండ్రే. అయిదేళ్ళుంటాయేమో అబ్బాయికి, చాలారోజుల తరువాత చూస్తున్నాడో ఏమో తండ్రి మొహం లోకి చూస్తూ ఎత్తుకోమని గోల. ప్రక్కనే ఉన్న అతడి ప్రియురాలు అనుకుంటాను, ఆశ్చర్యం తో ఏమిచేయాలో పాలుపోక నిశ్చేష్ట అయి చూస్తోంది. ఆ బొచ్చుకుక్క పిల్లకూడా వారి చుట్టూ తిరుగుతూ గొడవచేస్తూంది. మొదట తేరుకున్న అతడి ప్రియురాలు ఆ అబ్బాయిని రాము నుంచి విడదీయాలని ప్రయత్నించింది. కానీ ఎదురుగా వున్న సుధని చూసి ఆప్రయత్నం మానుకుని సుధనే చూస్తూ ఉండిపోయింది. అందరు నిలదొక్కుకుని పరిస్థితిని అర్ధం చేసుకునేసరికి చాలానే సమయం పట్టింది. తేరుకున్న సుధ అతడి ప్రియురాల్నిగుర్తుపట్టినదనుకుంటాను, పరిస్థితిని అర్ధంచేసుకున్నట్లున్నది, బహుశా ఆమె సుధకి చిరకాల సన్నిహితురాలు కూడా అయిఉండొచ్చు, స్నేహ భావంతో చిరునవ్వు ఆమె ముఖంపై పొడచూపింది. తను ప్రేమిస్తున్న రాము కాళ్లు పట్టుకుని ఆ ఎత్తుకోమని గోలపెడుతున్న పిల్లాడు రాము కొడుకేనని అర్ధం చేసుకోవడంతో ఆ అమ్మాయి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళల్లో నీరు చిమ్మడం, ఆమె కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యడం మేమంతా స్పష్టంగా చూసాము.

ఈ లోగా మాపిల్లలు ఏదో అవసరమున్నట్టు దూరంనుండి శబ్దసంకేతం ఇవ్వడంతో నేనటు అత్యవసరంగా ఎగరాల్సి వచ్చింది. ఆ అవసరం తీరి నేను తిరిగి వచ్చేసరికి అందరూ ఒక చోట కూర్చుని చర్చించుకుంటున్నారు. ఆ బొచ్చుకుక్క తోకనూపుకుంటూ వాళ్ళ మధ్యన అటునిటు తిరుగుతూ ఉండగా రాము సుధల మధ్య వాళ్ళ బాబు కూర్చొని నవ్వుతూ, కేరింతలతో ఏవో కబుర్లు చెబుతున్నాడు. అతడి ప్రియురాలు కొంచం దూరంగా మోకాళ్ళ మీద ముఖం పెట్టుకుని వాళ్ళ వైపు చూస్తూ ఆలోచనా తుఫానులో కొట్టుమిట్టాడుతున్నట్టనిపించింది. ఎంతసేపుగడిచిందో గాని, సూర్యుడు సముద్రం వెనక్కి వెళ్లి తొంగిచూస్తూ మెల్లగా ఇబ్బందితో ముఖంఎర్రబారగా వీడుకోలు చెబుతున్నాడు. అస్తమిస్తున్న సూర్యకాంతిలో తన పరిస్థితికి సిగ్గుబడుతున్నట్లు ఆమె ముఖం కూడా ఎర్రబడింది. చాలాసేపటికి క్రమంగా ఆమె ముఖం మబ్బు విడిపోయిన ఆకాశంలా నిర్మలంగా మారింది. కొంచంసేపున్న తరువాత ఆమె మెల్లగా లేచి అందరికి 'బై' చెప్పి ఆ బొచ్చు కుక్కపిల్లని తీసుకుని మెల్లగా నడుచుకుంటూ అప్పుడే అలముకొంటున్న చీకట్లలో కలిసిపోయింది. చాలా దూరం పోయేవరకు ఆ కుక్కపిల్ల "కుయ్ కయి"లు ఆమె ఆలోచన తరంగాలలా వారందరిని వెంబడిస్తూనే ఉన్నాయి. ఆ సందిగ్ద వాతావరణంలో క్రమంగా దూరమవుతూన్న కుక్క మూలుగులు బహుశా వారిరువురిలోను ఆలోచనలు రేపుతూ వారి దీనావస్థని క్షాళన చేస్తుండగా రాములోని అపరాధ భావనా విక్షేపం సర్దుమణిగేవరకు వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయారు.

ఆ తరువాత ఆతడి ప్రియురాలు, ఆ బొచ్చుకుక్క మళ్ళీ ఆ ప్రాంతాలలో కనబడలేదు. వాళ్లు ముగ్గురు మాత్రం ప్రతిరోజూ కాకపోయినా చాల సార్లు ఆ తీరంలోనే ఆడుకుంటూనో, కబుర్లు చెప్పుకుంటూనో, ఐస్ క్రీములు తింటూనో కనిపిస్తుంటారు. ఇక ఫరవాలేదు, రాము ఆకర్షణల వలలో చిక్కుకుని బయటపడ్డాడనిపించి మాయిరువురికి గుండెల్లో ఏదో బరువు దిగిపోయినట్లనిపించింది.

-o0o-

Posted in June 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!