Menu Close
SirikonaKavithalu_pagetitle

సఖీగీతం -- గంగిశెట్టి ల.నా.

గాలి గుసగుసగా నీ గుర్తు చెప్పిన మాట
గాలిబాటపై నన్నింకా నడిపిస్తూనే ఉంది
'ఎంత కాలం బ్రతకాలనుకోటం కాదు
బ్రతుకులో కలగనటానికి ప్రతిపూటా  కొంత కాలం మిగిల్చుకో
అక్కడే మనం కలుసుకొనేది
కల మన సంగమస్థలి
కల- కాలం మన నెచ్చెలి'

గుర్తొస్తుందో రాదో అంటూ
పిల్ల గాలిలా వెంట వస్తూ
సుతారాంగా చెవుల్ని స్పృశిస్తూ
ఏవేవో చల్లటి రాగాలాపనలు వినిపిస్తుంటావ్
స్మర సంగతుల్లా స్వర సంగతులు వేస్తుంటావ్
చిలిపి చిలిపిగా గిలిగింతలు పెట్టి వెళ్తుంటావ్...

కలకంటే ముందు ఆ కలి గుర్తొస్తే
కలికిలా చేరి, అమ్మలా మారి అన్నీ చూస్తుంటావ్...
అద్భుతమనిపించినప్పుడల్లా
కల నీ యింటిపేరుగా చేసుకొని మహాప్రాణంగా మారి, ప్రాణం పోస్తుంటావ్...
బ్రతుకులో ఇన్ని సౌందర్యాలను కట్టెదుట నిలిపి,
బ్రతుకే ఒక సౌందర్య యజ్ఞమని తెలిపి
సకలం కోసం కలగనమంటూ,
కల కోసం బ్రతుకు దాచుకోమంటూ
బ్రతుకే ఒకకల అని తేల్చేయటం ఏం న్యాయం చెప్పు
ఇలాదేవి కడుపు నిట్టూర్పులు నీకు వినపడవా, కనపడవా
వాటి ఆంతర్యాల చిక్కుముడులు నువ్వే విప్పు....

ఇల, కల వేరుపడని జీవితంగా కదా
నిన్ను నేను  కోరుకొన్నది..
సగం ఇల, సగం కల అంటూ
రెంటి కలయికే మన సంయోగం అంటూ
రెండింటిని కలిపి చూడటమే యోగం...అంటూ
దృశ్యాదృశ్య యోగమాయ లోకి లాక్కెళ్తే ఎలా
అంతటా నువ్వు సగం సగం కనిపిస్తే ఎలా
అపరిపూర్ణతలో నిలిపి పూర్ణతను దర్శించమంటే ఎలా
నిన్ను పూర్ణంగా పొందడానికి ఎన్నిసార్లు నన్ను నేను పోగొట్టుకోను?
ఎన్ని సార్లు శాశ్వతంగా కళ్ళు మూసుకొని
విహాయసమై ఎగిరిపోను?
జీవత్కాష్ఠ క్షణాలను పలుజీవవేదనలతో రగిల్చి
జన్మవిముక్తి పేరిట నీ దిగంత బాహువుల్లో పూర్ణంగా కరిగిపోటానికి
ఎగిరి పరితపించను...
జననాంతర సఖీ! కరుణిస్తే 'పూర్ణ'వై కరుణించు
కాదంటే కలగా, కళగా, దహించు!!
ఎటైనా నన్ను నీ అక్షరంగా బ్రతికించు!!!

సూక్తిముక్తావళి -- డా. వజ్జలరంగాచార్య

వాడిన పూలమొక్కలకు వంగి మొదళ్ళకు మట్టిదీసి, పా
రాడగ నీరు, సూర్యుని కరమ్ములు
తాకి హసించు నట్లుగా
చూడవె, పూలతీగలన సొమ్ములు
నింటికి దివ్వెసిమ్మెలౌ
వాడలవారి కన్నులకు పండుగ
నర్తన సాలభంజికల్

పరుగిడునీరు, పండ్లబరువాప శిరమ్మును మొగ్గు వృక్షముల్
కురిసెడివాన, పిచ్చుకల గూడుల
యల్లిక నేర్పు కూర్పులున్
వరుసగ నీకు వీరమును,భాగ్య
దశస్థ నిగర్వ వర్తనల్
మురియుచు దానధర్మములు,
ముగ్ధమనోహరమిల్లు తీర్చగా
గురువులు కాదె జీవనము గొప్పది
కాదె పరోపకారికిన్

భంగము లేనిభాగ్యములు,భక్తి
నిధుల్ సదయానురాగముల్
పొంగని కీర్తి దుగ్ధములు, పూజ్యత
బొందెడి వాగ్విధానముల్
సింగమువంటి ధైర్యము ,విజేతగ
నిల్పెడి తెల్వితేటలున్
కృంగని చిత్తదార్ఢ్యత,చిగిర్చిన నవ్వె
కదా సఖావరాల్

మాటలేమీ వద్దు ......... -- స్వాతి శ్రీపాద

మాటలేమీ వద్దు
కాస్సేపు మౌనంగానే మనసులు వడబోసుకుందాం.
తూర్పు గాలికి రాలిపడుతున్న పండుటాకుల
చెక్కు చెదరని నైర్మల్యం తో పడమటి కనుమల్లో
శిశిరం రాగాలాపన చేస్తూనే ఉంది.
దిక్కులూ నలుమూలలూ కలయదిరుగుతీరెండ వెలుగుల్లో
వెంటపడుతున్న చల్లగాలులను శ్వాసిస్తూ శాసిస్తూ
శిశిరం కూనిరాగాలు తీస్తూనే వుంది.

నునువెచ్చని బంగారపు నీరద్దిన
నీరెండ వెలుగుల్లో చలికాచుకుంటూ
పొగమంచుకమ్మిన ప్రపంచం నడినెత్తిన
విలయతాండవహేల నర్తిస్తూ
హరిత పత్రాల వెలుగులు సేవిస్తూ
మౌన వనాల రహస్య వచనాలు
ప్రవచనాలుగా మసకబారిన గుసగుసలతో
శిశిరం ఆకాశం దిగివచ్చిన అచ్చరలా నటిస్తూనే ఉంది.

మధ్య మధ్య అగ్నికి ఆజ్యంలా
విపత్తుకు చెయ్యందిస్తూ నింగీనేలా ఏకం చేసే
ప్రకృతి చిత్తడి రోదన
చలిగాలుల జోల పాటల సందడి మధ్య
పండుటాకుల మెత్తని దుప్పట్ల కింద
కాస్సేపు విశ్రమించరాదూ
గతం కాస్సేఏపు మరచి వసంతాన్ని స్వప్నిస్తున్న
కంటి చూపుల్లో ఉదయపు వెలుగులు మొలిచేలా
కాస్సేపు కనుమరుగు కారాదూ
మాటలేమీ వద్దు
మౌనాన్నే అనుసరిద్దాం

గవి మఠం -- కైలాస్ నాథ్

ఊరిబయట కాలిబాటను ఆనుకొని
నిలబడనూలేక పడిపోనూలేక
సగం వంగి నిలుచున్న మఠాన్ని
ఎప్పుడో వందలఏళ్ళకిందట
బాటసారులకు అండగావుంటానని కట్టారు ...

నా పక్కనే రావిచెట్టు, వేపచెట్టు
వాటిచుట్టూ కట్టకట్టి నిలిపిన
కళలు కోల్పోయిన నాగశిలలు
ఈశాన్యంలో పాడుపడ్డ పాల బావి
ఆవరణ చుట్టూ నిద్రగన్నేరు పూలచెట్లు
ఆపై అంతటా బ్రహ్మ జెముడు, కంప చెట్లు ....

ఒకనాడు నా చుట్టూ ఎంత కోలాహలం
మంటపం నిండా బాటసారులు
కాషాయ వస్త్రాల భైరాగులు
పెరగడం మానేసిన  గడ్డాలతో
బుర్రకథలోల్లు ఒక వైపు
డూ డూ బసవవ్నలొకవైపు
గాజులవ్యాపారస్తుల ముచ్చట్లు ఒక పక్క
రోజూ గొర్రెల మందతో వచ్చే మల్లన్న
గొరవయ్యల సవాళ్ళు ఒక పక్క
పిల్లలు బావిలోకి రాళ్ళు విసురుతూ నవ్వే నవ్వులు
రాళ్ళు పేర్చి బువ్వలువండే అడాళ్ళ ముచ్చట్లు
అందరికీ నేనో పెద్ద దిక్కును ....

కాలం మారింది
రాజులు పోయారు
ప్రజలే రాజులంట
ఊర్లనిండా హోటళ్ళంట
నా అవసరం తీరిపోయిందంట

ఒకనాడు నేను రససిధ్ధుల గవిమఠాన్ని
నేడు నేనో శిథిల మంటపాన్ని!
కాల ప్రవాహనికి
తలవొగ్గిన మసిబట్టను!!

నాకూ కలలున్నాయి -- స్వర్ణ శైలజ

మౌనం మోయలేని ఆశల భారాలు
పెదవి దాటని ఊహల భావాలు
లిప్తపాటులో మనసును మోసిన సంబరాలు
రెప్పల చీకట్ల వెనుక
రెక్కవిచ్చుకున్న మరోప్రపంచం
రాత్రిని అలరించే ఆ చిరు కాంతుల జలపాతంలో తడుస్తూ
ఉదయాలను నడిపించే
ఆలోచనా స్రవంతిలో కరిగిపోతూ
ఏకాంతం మరింత కొత్తగా...

నిదుర కొలనులో వికసిత కలువలై
తప్పిపోయిన సమయాలను దోసిటనింపుతూ...
అనుభూతి పర్వాలను
సరికొత్త సోయగాలతో అలంకరిస్తూ...
కలతల కతల్ని నిద్రలేపుతూ...
చిరునవ్వులతో
కరిగిన జ్ఞాపకాలతో
చీకటిని అలంకరిస్తూ...
వేకువను మేల్కొలుపుతూ...
ఊహలకూ నిజాలకూ మధ్య విరిసిన
తటిల్లతా తరంగాలు.

వాలిన చీకటిని వెలిగించే
వెలుగు పూలలా...
ఆశల వేకువకి ఎదురొచ్చే
వెన్నెల దీపాల్లా...
కంటిపాపలకి కర్పూర హారతులు పడుతూ
నాకూ ఎన్నో కలలున్నాయి.

Posted in June 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!