Menu Close
Abhiram Adoni
భళా సదాశివా.. (ఉగాది)
అభిరామ్ ఆదోని (సదాశివ)

మేము చేసిన బట్టలు రోజూ మారుస్తమయ్యా
నువ్వు వేసిన బట్ట (దేహం) వందేళ్లు ఉంటదయ్యా
నీ అభివృద్ధి ముందు మా అభివృద్ధి అధోగతి పాలయ్యా
నీ అభివృద్ధి నమూనా మా చెవులో చెప్పవా
నీ పేరు చెప్పుకుని నాలుగు రాళ్ళెనుకేసుకుంటాము...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

చినుకులు పడ్డాయయ్యా
మొదటి గింజ నీకు పెడుతున్నానయ్యా
మొక్కపెంచి మానుచేసి పంట చేతికిచ్చి
అప్పు గుంజానికి కట్టేయబడ్డ నన్ను విడిపించవయ్యా...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

ఏనుగేమిటో...
ఎలుకను ఎక్కుటేమిటో...?
లింగమేమిటో...
జంగముడికి ఇష్టమేమిటో...?
నీదంతా తిరకాసు తత్వమయ్యా...
మా తింగరి బుర్రకు అర్థమవదయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

తీపి పలుకుల చిలకవి
కారుకూతల కాకివి
మధురపాటల కోకిలవి
మరణ సూచన తీతువువి
అంతా నువ్వే... బ్రతుకు సంతా నువ్వే...
అయినా మాకు చింతేలరా...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

రాతిలో కొలువుంటవు
మాచే కోతి పనులు చేయిస్తవు
మోహములో మూతి కాల్పిస్తవు
మా బ్రతుకే నేతిబీరకాయలో నెయ్యి చేసి గొయ్యిలో వేస్తవు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

స్వామీ నువ్వు ఒట్టి మాయలమరాటివంటా
శవాల కాటికి అధిపతివంటా
నిన్ను నమ్మితే మిగిలేది బూడిదంటా
ఇక నువ్వు నాకెందుకు...? నేను ఉంటా...!
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

బూదే గర్వమయ్యా
బూదిలోనే మర్మమున్నదయ్యా
బూదిలోనే సర్వము ఉన్నదయ్యా
బూదిలోనే భూతమును దాచిన భూతనాధా...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

ఎవరిని చూసిన నేననే ఆహపు బుసలైయ్యా
పసలేని వాదనల రుసరుసలయ్యా
నువ్వు తలుచుకుంటే బుసలుంటయా...
పసలేని వాదనల రుసరుసలుంటయా...
ఈ నిజం తెలిసి కూడా నస పెడతారయ్యా...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

ఆదుకునే ఆప్తుడువి నీవే...
సాయం చేసే స్నేహితుడివి నీవే...
ఇబ్బందులు పెట్టె శత్రువువు నీవే
అంతా నువ్వైనప్పుడు బెంగెందుకు...?
ఈ దుంగ ఏమైతదన్నా కృంగెందుకు...?
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

నువ్వు జన్మనిచ్చే అమ్మవో...
పెంచిపోషించే నాన్నవో...
తోడుగుండే మిత్రుడివో...
ఆసరాగా ఉండే కొడుకువో...
ఆయువు తీసే దొంగవో...
అంతుపట్టుట లేదు
అంతే లేకుండా ఆలోచించే నా మనసుకు
అయినా నువ్వెవరో..
నీ ఆట ఏమిటో చెప్పవా...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in June 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!