Menu Close
Galpika-pagetitle

ట్రాఫిక్ లైట్స్ -- అరవిందా రావు

ట్రాఫిక్  లైట్స్ ఎరుపైయ్యాయి. కార్లన్నీ వరసగా ఆగి ఉన్నాయ్. కార్లలో ఉన్న కొంతమంది అసహనంగా  లైట్లవంక  చూస్తున్నారు. ఆ పిల్ల పరిగెత్తుకుని వచ్చింది. సుమారు పదకొండేళ్ళు ఉంటాయేమో! తైల సంస్కారం లేని జుట్టు, తెలిసీ తెలియని అమాయకత్వం, ఎదిగీ ఎదగని వయస్సు,. చిరిగిన పరికిణీ జాకెట్టుతో దబ దబ కార్ల దగ్గరికి వెళ్ళి దీనంగా "అమ్మా! అయ్యా! పైసలమ్మా! పెయ్యి నొస్తుందమ్మా! తిని దో దిన్ అయిందమ్మా! ఆకలైతదమ్మా! దానం చెయ్యండమ్మా” అనడుగుతూ మధ్య మధ్య ఆదుర్దాగా లైట్ల వంక చూస్తొంది. కొంతమంది చీదరించుకొని "ఫో! ఫో! పొద్దునలేస్తే పనిలేదు అడుక్కోడం తప్ప" అన్నారు. స్కూటర్ మీద అబ్బాయిలు అదోలా నవ్వి ఈల వేసారు. ఓ పెద్ద మనిషి "ఒంటి నిండా బట్ట లేనప్పుడు ఇలా బైటికొచ్చి అడుక్కోకూడదమ్మా! అన్నాడు. ఆ పిల్ల అర్ధమయీ అవనట్లు నవ్వి "నీ బాంచనయ్యా! ధర్మం సేయ్ బాబు! అని పల్కింది దీనంగా. కాని లోపల సిగ్గుతోనూ, బాధతోనూ కుంచించుకు పొయింది. అమ్మకు జెప్పిన బొక్కల్లున్న బట్టలొద్దని కోపంతో అనుకుంది మనస్సులో.

ఇంకో పెద్దావిడ జాలిపడి ఓ ఇరవై పైసలు ఇచ్చి వదుల్చుకుంది. ఆటోలో ఉన్న ఇద్దరు కాలేజీ పిల్లలు "సో సేడ్ నా!" అన్నారు. ఇంతలో పచ్చ లైట్  వచ్చేసింది. ఆ పిల్ల బిక్క మొహం వేసుకుని రోడ్డు పక్కకి వెళ్ళిపోయింది. ఇంతలో మెల్లగా చీకటి పడిపోయింది. ఆ పిల్ల తల్లి ఇంకో వైపు నుంచి వచ్చి "ఎన్ని పైసల్లొచ్చినై?" అంది. ఆ పిల్ల బిక్క మొహం వేసుకొని "ఇగ్గో" అని ఓ రెండు రూపాయలు తల్లి చేతిలో పెట్టింది. ఆ పిల్ల చెంప చెళ్ళుమంది. "ఇంతేనా" అంది కోపంగా. "కూడెట్లొస్తుంది ఇయ్యాల? గింతే దెచ్చినవ్” అంది. ఆ సచ్చినోడు! మీ అయ్య దినమంతా తాగొస్తడు. బొక్క లిర్రగొట్తడు. పైసల్ దెచ్చేదేమిటిలేదు" అని ఆ పిల్లకి ఇంకో రెండు తగిల్చింది. దానికి రోషమొచ్చి "బట్టల్న బొక్కలున్నై. రోడ్దుకాడ అందరు నంజూసి నవ్వుతున్నర్"!  పోరగాళ్ళు ఇకిలిస్తున్నరే"! అంది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ.

తల్లి ఒక్కసారిగా పిల్లని దగ్గరికి తీసుకుంది. "గట్ల ఏడుస్త్ర గెవ్వరైనా? అని కళ్ళు తుడిచింది. “నీకో మంచి ఖబరుంది. చెప్పేదే" అంది దాన్ని సముదాయిస్తూ. చెప్పన్నట్లు పిల్ల చూసింది. నిన్న గాయమ్మ ఇంట్ల పని చేస్తి గదా! అన్నం, తొక్కు ఇచ్చి ఓ పాత లంగా ఇచ్చింది. గదేస్కుని రేపు పైసలడుక్కోనికి ఫో!" అంది. ఆ పిల్ల కళ్ళు మెరిసాయి. "నిజంగనా"అంది. "పద, డబల్ రోటి కొనుక్కుని పోదం" అంది తల్లి పిల్ల చేయి పట్టుకొని వాళ్ల చిన్న పూరి గుడిసె వైపుకి నడుస్తూ.

రాత్రంతా ఆ పిల్ల ఆ లంగా గురించి ఆలోచిస్తూ కలలు కంటూ పడుకుంది. రేపు ఆ లంగా వేసుకుని వెళ్తే మస్తుగ పైసల్ దొరుకతై! ఆ పోరగాండ్లు నంజూసి ఇగ నవ్వరు. అమ్మకు మస్తుగ పైసల్ తెచ్చి ఇస్త. రేపు అమ్మ కోడి కూర తినిపిస్తదో ఏమో అనుకుంటూ నోరు చప్పరించింది.

పొద్దున్నే లేచి వేళ్ళతో అ జడలు కట్టిన జుట్టు సవరించుకుని, చన్నీళ్ళతో మొహం కడుక్కుని విరిగన అద్దం ముక్కలో మొహం ఒకసారి చూసుకొని తల్లి ఓ పాత సంచీలోంచి తీసి ఇచ్చిన లంగా చూసి ఎగిరి గంతేసింది. దాని కళ్ళు మిల మిలా మెరిసాయి. ఆ లంగా మీద ఎరుపూ పసుపు చారలు, అక్కడక్కడ అద్దాలు కుట్టి, తళుకులతో చాలా అందంగా ఉంది. కొన్ని తళుకులు, అద్దాలు అక్కక్కడ లేవు. బట్ట  కొద్దిగా వెలిసిపోయింది. చీకుడు బారింది. అయినా ఆ పిల్ల కళ్ళకి అది దేవుడు ఇచ్చిన దేవతావస్త్రాలలా అనిపించాయి. గబా గబా స్నానపానాలు లేని, అన్నపానాలు లేక శుష్కించిన దేహం మీద లంగా జాకెట్టు వేసుకుని "అమ్మ నే బోతున్నా! మస్తుగ పైసల్ తెస్త ఇయ్యాల" అంది తూనీగలా పరిగెడుతూ. తల్లి పిల్లని చూస్తూ మురిసిపోతూ కళ్లల్లో నీళ్ళు పెట్టుకుంది. "నీ యెంబడే నేనూ వస్తుంటీ గదనే! మీ అయ్యకి ఇంత గంజి బోసి" అంది.

ట్రాఫిక్ లైట్స్ మారాయి. యెర్ర లైట్ వచ్చింది. పిల్ల గర్వంగా గంతులేసుకుంటూ వచ్చి ఆగిన కార్ల దగ్గరికి పరిగెత్తింది. ఇవ్వాళ రోజూ కంటే తొందరగా వచ్చేసింది. కొత్త కార్లు, కొత్త మనుష్యులు. అయినా చాలా ఉత్సాహంతో "అమ్మా! అయ్యా! ఆకలైతదయ్యా! తినక దో దిన్ అయ్ తున్నదయ్యా!" అని అందరినీ బతిమలాడుతోంది. కొందరు దాన్ని చీడ పురుగులా చూసారు. కొందరు వినిపించుకోలేదు. కొందరు కారు అద్దాలు పైకెత్తేసుకున్నారు. ఒకావిడ కళ్ళు ఉరిమి చూస్తూ చక్కటి బట్టలు వేసుకున్నావు. నీకు బిచ్చమేమిటి? హాయిగా పని చేసుకోక! అంది. ఇంకోడు ఇకిలిస్తూ "ధగ ధగా మెరుస్తున్నావు! పనిలో పెడతా రా"! అన్నాడు. దానికి అర్ధం కాలేదు. పరికిణీకి బొక్కల్లేకపోతె పైసలొస్తాయనుకుంది. కొందరు అద్దాల పరికిణీలో అడుక్కుంటున్న దాన్ని వింతగా చూసి పెదవులు విరిచారు.

మిట్ట మద్యాన్నమయింది. ఎండ తీవ్రంగా ఉంది. దాని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇన్ని గంటల శ్రమకి ఓ మూడు రూపాయలు దొరికాయి. అంతే!  దాహంగా ఉంది. ఆ బండివాడి దగ్గర కూల్డ్రింక్స్ ఉన్నాయి. ఊరికే ఏమి ఇవ్వడు! అంతేకాక అదోలా చూస్తాడు. కళ్ళు తిరుగుతున్నాయి. కోడి కూర మీద ఆశ వదిలేసుకుంది. ఆ మెరిసే లంగాలో ఉక్కపోయడం మొదలెట్టింది.  దీనికంటె బొక్కలున్న లంగానే బావుందనుకుంది.

ఇంతలో ఇటువైపూ అటువైపూ లైట్స్ మారాయి. ఆశగా అటువైపు పరిగెత్తింది. ఒక కారు కీచుమనే శబ్దంతో ఆగింది. ఒక నిమిషం అక్కడ మౌనం తాండవం చేసింది. కాలుతున్న ఎండలో దాని లంగా తళుకులు  మెరిసాయి.

బుస్సు కాదు తుస్సు -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

చిత్తారణ్యంలోకి కొత్తగా వచ్చింది ఒక గుంట నక్క. అడివంతా కలియ తిరిగింది. ఒక కుందేలు కనిపించింది. దాని మాంసం చాలా రుచిగా ఉంటుంది. కానీ తనకి వేటాడే అలవాటు లేదు. వేటాడటానికి కావలసింది శక్తి. వేటాడకపోయినా కడుపు నింపుకోవడానికి కావలసింది యుక్తి. ఆ నక్కకి తన జిత్తులమారి తనాన్ని ఉపయోగించాలనే ఉంది. కానీ తనకి ఆ అడవి కొత్త. అందుకే కష్టం ఎక్కువైనా కుందేలుని పట్టాలనుకుంది. నక్కను చూడగానే పరుగందుకుంది కుందేలు. అయినా అది నక్కంత వేగంగా పరిగెత్తలేకపోయింది. ఇంకేముంది, రెండు అంగల్లో పట్టుకుంటుందనగా ఒక కోతి వచ్చి కుందేలు చెవుల్ని అందుకుని చెట్టుమీదకి లాక్కుపోయింది. ఇలా కుందేలుని కోతులు రక్షించడం ఆ నక్క ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. అందుకే దానికి ఆశ్చర్యం కలిగింది.

అలా ఆకలితోనే నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ నడవటం ప్రారంభించింది నక్క. ఒక చోట ఏదో జంతువు వేటాడిన ముళ్ళపంది మాంసం కనిపించింది. దాన్ని తిన్నంత తింది. అక్కడే ఒక బొరియ తవ్వి మిగిలినదాన్ని అందులో దాచింది. దాని పక్కనే కాసేపు కునుకు తీసింది.

నిద్ర లేవగానే నక్కకి కుందేలు, కోతి గుర్తొచ్చాయి. కుందేలుని కోతి ఎందుకు రక్షించిందో కూపీ లాగడానికి బయలుదేరింది.

చిత్తారణ్యంలో ఒక చోట పెద్ద చింతమాను కనపడింది. దానికింద కోతి, కుందేలు కబుర్లు చెప్పుకుంటున్నాయి. అంతలోనే చిలుక వచ్చి వాళ్ళతో కలిసింది. వచ్చీ రాగానే ముక్కున కరుచుకుని తెచ్చిన జాంపండు వాళ్ళకిచ్చింది. కుందేలు, కోతి దాన్ని పంచుకుని తినడం ప్రారంభించాయి.

వాటిని చూడగానే ఆ మూడూ స్నేహానికి ప్రాణం ఇస్తాయని నక్కకి అర్థమైపోయింది. అలాంటి అమాయకులని మోసం చెయ్యాలంటే ముందు వాళ్ళతో స్నేహం చెయ్యాలి. అందుకే వాటిని పరిచయం చేసుకుంది. కుందేలుతో, "నిన్ను సరదాగా ఆట పట్టించానంతే. కానీ కోతిబావేమో నేను నిజంగానే తరుముతున్నానని భ్రమపడి నిన్ను రక్షించాడు. మీకు తెలియనిదేముంది? మేమెవ్వరమూ వేటాడము. ఏ పులో సింహమో తినగా మిగిలిందాన్నే దాచుకుని తింటాము" అంటూ మొదలు పెట్టి నెమ్మదిగా స్నేహం కలిపింది. అప్పటినించీ వాటికి ఇష్టమైనవి ఎక్కడ దొరికినా తెచ్చిపెట్టేది. క్రమంగా కొంత కాలానికి వాటి నమ్మకాన్ని కూడా గెలుచుకుంది.

తన పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేసింది కోతి.

ఆ మరునాడే నక్క కడుపు పట్టుకుని కిందపడి పొర్లుతూ ఎక్కడ లేని బాధా నటించసాగింది . "నిన్నటి తిండి నాకు సరిగ్గా పడినట్టు లేదు. అందుకే కడుపులో విపరీతంగా పోటు పెడుతోంది. దాన్ని తట్టుకోవడం నావల్ల కావడంలేదు. నన్నెవరైనా కాపాడండ్రా బాబోయ్"అంటూ శోకన్నాలు పెట్టింది. దాంతో "నీ పోటు తగ్గడానికి ఏమి చెయ్యమంటావో చెప్పు" అని అడిగింది కోతి.

సరిగ్గా ఈ మాట కోసమే ఎదురు చూస్తోంది నక్క. "మొన్న వైద్యుడి దగ్గరకు వెళితే వేపపళ్ళ రసం తాగమని చెప్పాడు. అది తాగితే పోటు క్షణంలో తగ్గిపోతుంది. కానీ నేను చెట్లెక్కలేను. కాయలు కొయ్యలేను. రసం తియ్యలేను. నేను ఈ కడుపులో పోటుతోనే చావాలని రాసిపెట్టినట్టుంది" అంటూ మరింత గట్టిగా గుండెలు బాదుకోవడం మొదలు పెట్టింది.

"నువ్వేం బాధపడకు మిత్రమా" అంటూ మూడూ కలిసి వేపచెట్టు దగ్గరకి బయలు దేరాయి. ఆ వేపచెట్టు దగ్గర కొండ చిలువ ఉంటుంది. దానికి కోతి గుండెకాయ అంటే ఇష్టం. కాబట్టీ అది కోతిని చూసిందంటే వదిలి పెట్టదు. ఈలోగా తను వెళ్ళి కుందేలు పని పట్టచ్చు. ఆ చిలకొచ్చినా ఏమీ చెయ్యలేదు. అందుకే కొంచెం దూరం నుండి వాటిని వెంబడించడం ప్రారంభించింది నక్క.

అంతా నక్క అనుకున్నట్టే జరిగింది. చెట్టెక్కబోతున్న కోతిని పట్టుకుంది కొండచిలువ. అది కోతిని పట్టుకోగానే చిలుకకి సైగ చేసింది కుందేలు. చిలుక సమయం కోసం కాసుక్కూర్చుని ఉంది.

కొండచిలువ పట్టు బిగిస్తున్నకొద్దీ గాలిని ఎక్కువ పీల్చుకుంటుంది. దాంతో బుడగలాగా కొద్ది కొద్దిగా లావు పెరుగుతూ ఉంటుంది. తను ఏ జంతువును చుట్టుకుందో ఆ జంతువు తన కడుపులో పట్టేంత గాలి నింపుకుంటుంది. ఆ సమయంలో దేంతో అయినా పొడిస్తే దాని చర్మం చిట్లిపోతుంది. ఈ విషయం చిలుకకి తెలుసు. సరిగ్గా కోతిని మింగడానికి నోరు తెరిచే సమయంలో తన ముక్కుతో కొండచిలువ కడుపులో బలంగా పొడిచింది చిలుక. లోపల నిండిన గాలి బైటకి పోవడంతో కొండ చిలువ పట్టు సడలి పోయింది. కోతి వెంటనే పట్టు విడిపించుకుని బయటికి దూకింది. మూడూ కలిసి కొండ చిలువకి అందనంత దూరం పారిపోయాయి. అక్కడ ఒక వేపచెట్టు ఉంది. మూడూ కలిసి నక్కకోసం వేప పండ్లు కోసి రసం తియ్యడం మొదలు పెట్టాయి.

"ఆ వేపరసం తాగడం కంటే చావడమే నయం"అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా నక్క పరుగో పరుగు.

వైభోగం-దారిద్య్రం - English original: Aristocracy Versus Hash - తెలుగుసేత: డా.కోడూరు ప్రభాకరరెడ్డి

రోలింగ్ స్టోన్ పత్రిక స్నేక్ రిపోర్టర్ YMCA నుండి రాత్రి ఇంటికి వెళ్తుండగా దారిలో గుంటలు పడ్డ పెద్ద కళ్ళతో, చిందర వందర జుట్టుతో, ఆకలితో నక నక లాడుతున్న ఒక బక్క మనిషి అతని దగ్గరికి వచ్చి నీరస స్వరంతో "ఈ వూళ్ళో పేదలుండే ప్రాంతమేదో చెప్తారా?" అని మర్యాదగా అడిగాడు.

"మీరడిగేదేమిటో నాకు సరిగ్గా అర్థం కాలేదు" అన్నాడు స్నేక్ రిపోర్టర్.

"అదేమిటో మీకు వివరిస్తాను" అంటూ తన చూపుడువ్రేలిని రిపోర్టర్ గుండె బొత్తంలో దూర్చి అక్కడున్న బంతిపువ్వును చిదిమేసి "నేను సోప్ టౌన్ మండలకేంద్రం నుండి వచ్చాను. నా యూత్కుఉమ్మెబానికి ఉండటానికి ఇల్లూ-వాకిలీ లేవు, నిలువ నీడ లేదు. వారం నుండీ పస్తులు. నా కుటుంబం కూడా నాతో వచ్చింది. హోటల్లో ఉండటానికి స్తోమతు లేక ఇంటికోసం వెతుకులాట మొదలుపెట్టాను. భాగ్యవంతులుండే ప్రాంతంలో ఒక ఇంటి యజమానురాలిని కలిసి ఇంటికోసం అడిగాను. హుందాగా వున్న మహిళ ఒకచేత్తో లేస్ చేతి రుమాలుతో, మరొక చెయ్యి విలాసంగా నడుముపై ఉంచి గదిలోకి ప్రవేశించింది. నా కుటుంబానికి బాడుగ ఇల్లు కావాలని ఆమెనడిగాను. ఆమె తన హోదాను తగ్గించుకొని నన్ను లోపలికి ఆహ్వానించింది. షరతుల విషయం అడగ్గానే వారానికి 300 డాలర్లని చెప్పింది. ఆ మాట వింటూనే అదిరిపడి టేబుల్ పైన పడి నేను పగలగొట్టిన అందమైన టీ పాట్ కు పరిహారంగా నా జేబులో వున్న రెండు డాలర్లు చెల్లించాను" అన్నాడా వ్యక్తి.

Posted in June 2022, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!