Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

అయితే మరో గండం సంధ్య రూపంలో వస్తుందని స్మరణ ఊహించలేదు. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే ధుమ, ధుమలాడుతూ వచ్చింది సంధ్య.

హాలులో సోఫాలో కూర్చుని టివి చూస్తున్నాడు ఆంజనేయులు. కోడలు లోపలికి రాగానే అలవాటుగా నవ్వుతూ పలకరించాడు... “ వచ్చావా... నీ కోసమే ఎదురుచూస్తున్నాను”.

సంధ్య మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆయన భ్రుకుటి ముడిపడింది.. “ ఏమైందో! ఆఫీస్ లో గోడవేమన్నా అయిందేమో” అనుకున్నాడు.

సంధ్య బట్టలు మార్చుకుని వచ్చి “నేను మొత్తుకుంటుంటే ఇంట్లో మీరు కానీ, మీ అబ్బాయి కానీ పట్టించుకున్నారా.. నేను భయపడినంత అయింది” అంది దుఃఖం నిగ్రహించుకుంటూ..

“ఏమైందమ్మా” అడిగాడు.

“ఇంకా ఏమవుతుంది చెప్పండి.. మీ మనవరాలు నిన్న ఎవరో కుర్రాడితో మాల్ లో కనిపించిందిట మా కొలీగ్ కి... నేను చెబుతూనే ఉన్నానా... ఈ రోజుల్లో పిల్లలు ఇలా వయసు రాగానే అలా ప్రేమించడం మొదలు పెడుతున్నారు.. దానికి ఇరవై మూడేళ్ళు నిండుతున్నాయి పెళ్లి చేద్దాం అని.. ఇప్పుడు అనుకున్నంతా అయిందా. అతను ఏం కులమో.. ఏంటో..వాడితో కలిసి మాల్ కి వెళ్ళింది.”

“అయితే!”

సంధ్య తన పక్కన పెద్ద బాంబు ఏదో పడినట్టు ఉలిక్కిపడి వెర్రిదానిలా ఆయన మొహంలోకి చూసింది..

ఆయన వాత్సల్యంగా నవ్వాడు.. “అవునమ్మా తప్పేముంది? ఈ రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలూ కలిసి చదువుకుంటున్నారు.. కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు. కలిసి అమెరికా దాకా ప్రయాణాలు చేస్తున్నారు.. కలిసి మాల్ కి వెళ్తే తప్పేంటి? అసలు నీకు చెప్పిన వాళ్ళు ఎవరు?”

“అదేంటి మావయ్యా! తప్పేంటి అని అడుగుతారేంటి? రేపు ఏకు మేకై వాడినే పెళ్లి చేసుకుంటాను అంటే ఏం చేస్తారు?”

“సంధ్యా! చదువుకుని ఉద్యోగం చేస్తున్న నువ్వు మీ నానమ్మలాగో, అమ్మమ్మ లాగో మాట్లాడకు.. మీ ఆఫీస్ లో మగవాళ్ళు లేరా!”

“ఉంటే!”

“నువ్వు వాళ్ళతో మాట్లాడవా! కలిసి పని చేయవా...”

సంధ్య నోట మాట రానట్టు ఉండిపోయింది.. డెబ్బై దాటిన ఈయన మాట్లాడాల్సిన మాటలేనా.. ఈయనకి చదవేస్తే ఉన్న మతి పోతోందా.. స్మరణ మగపిల్లలతో కలిసి ఉద్యోగం చేస్తే వాళ్ళతో కలిసి అడ్డమైన చోట్లకి తిరగచ్చా! రేపేవరి తో నైనా లేచిపోయినా ఈయన తప్పేముంది అనేటట్టున్నాడు.. నేరకపోయి బతిమాలి మరీ తీసుకువచ్చాను.. కొంప మునిగిపోయేలా ఉంది.. దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈయన బుద్దే మందగిస్తున్నట్టు ఉంది.

ఆయన స్వరం గంభీరంగా వినిపించింది. “సంధ్యా.. నువ్వు ఒక ఆడపిల్ల తల్లిగా ఇలా టెన్షన్ పడడం తప్పని నేననడం లేదు.. నువ్వు తల్లివి.. నీ ధ్యాస ఎప్పుడూ నీ కూతురి క్షేమం మీద ఉంటుంది. ఆ ధ్యాసలో అనేక రకాలైన ఆలోచనలు నీలో కలగడం సహజం. అనుక్షణం తను ఎలాంటి తప్పు చేయకూడదని, తన మీద ఎవరి దృష్టి పడకూడదని, ఎలాంటి హానీ కలగొద్దని ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ దాన్ని కాపాడాలనుకుంటూ నీకు తోచిన నిబంధనలు పెడుతూ ఉంటావు. కానీ గుర్తుంచుకో.. ఆధునిక యువతులని ఎంత నిర్బంధిస్తే అంతగా ఎగరాలని కోరుకుంటారు. వాళ్ళని ఓ కంట కనిపెడుతూ స్వేచ్ఛనివ్వాలి.. తప్పు చేయద్దన్న భావన వాళ్ళల్లో సహజంగా కలగాలి.. నువ్వు తప్పు చేస్తావేమో అని నిత్యం మనం అనుమానిస్తూ ఉంటే పరోక్షంగా తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే.. పెద్దవాడిని చెబుతున్నాను... కొన్నాళ్ళు స్మరణని స్వేచ్చగా వదిలేయ్.. టీనేజ్ లో లేదు కదా! విచక్షణ ఉన్న పిల్ల..  ఏం చేయకూడదు? ఎలా ఉండాలి అనే విషయాలు నీకన్నా, నాకన్నా బాగా తెలుసు తనకి. ఎంత తెలివైనది కాకపోతే ఈ ఉద్యోగం సంపాదించుకుంటుంది! నువ్వు సాయం చేసావా.. నువ్వు గైడ్ చేసావా.. తన తెలివితేటల తోటేగా సంపాదించుకుంది!”

నోరుతెరుచుకుని వింటున్న సంధ్య గేటులోపలికి వచ్చిన స్మరణ బండి శబ్దం విని గేటు వైపు చూసింది. స్మరణ, ఆమె వెనకాల బదరీ లోపలికి వస్తున్నారు.

సంధ్య గబుక్కున లేచింది..

“హాయ్ తాతయ్యా... హాయ్ మమ్మీ ... హి ఈజ్ బదరీ... మై కొలీగ్” ఉత్సాహంగా పరిచయం చేసింది.

“నమస్తే తాతయ్యా.. నమస్తే ఆంటీ” బదరీ చేతులు జోడించాడు.

ఆంజనేయులు రక్తం చుక్క లేనట్టు పాలిపోయిన మొహంతో చూస్తున్న సంధ్య వైపు చూసాడు.. ఆయన పెదవుల మీద చిరునవ్వు విరిసింది.

బదరీ వైపు చూసి “రా బాబూ కూర్చో...” అంటూ తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు.

సంధ్య కొన్ని క్షణాలు అలాగే చూసి చివ్వున లోపలికి వెళ్ళిపోయింది.

స్మరణ తల్లి ప్రవర్తనకి బిత్తరపోయి తాతగారి వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

“అమ్మ కూడా ఇప్పుడే వచ్చింది... టీ పెట్టడానికి వెళ్లినట్టుంది.. నాకు ఆకలిగా ఉంది పకోడీ చేయమని చెప్పమ్మా” అంటూ కనుసైగ చేసాడు లోపలికి వెళ్ళు అన్నట్టు.

స్మరణకి అర్ధమైంది... నవ్వు మొహంతో తల్లి దగ్గరకు వెళ్ళింది.

సంధ్య సీరియస్ గా టీ కోసం నీళ్ళు స్టవ్ మీద పెట్టి టీ పొడి డబ్బా తీయడం కోసం షెల్ఫ్ వైపు తిరిగింది. స్మరణ వెనక నుంచి వెళ్లి ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అంది...” నాకు, తాతయ్యకి, నా బదరీకి ఆకలిగా ఉంది.. పకోడీ చేస్తావా”

సంధ్య చివ్వున తలతిప్పి స్మరణ మొహంలోకి చూసింది.

స్మరణ మధురంగా నవ్వింది..

“ఎవరతను” అడిగింది సంధ్య.

“ చెప్పానుగా నా కొలీగ్...”

“ అయితే! వందమంది కొలీగ్స్ ఉంటారు.. అందరినీ ఇంటికి తీసుకురావడం... మాల్స్ కి తిరగడం అవసరమా!”

మూతి సున్నాలా చుట్టి, కళ్ళు పెద్దవి చేసి హావభావాలు ప్రదర్శిస్తూ “ఓ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా! గుడ్.. ఇంతకీ ఎవరు ఆ స్పై?” కుతూహలంగా అడిగింది స్మరణ.

“నోర్ముయ్...పిచ్చి, పిచ్చివా వాగకు.. నీ వేషాలు నాకు తెలియవు అనుకోకు..”

ఆ మాటతో స్మరణ మొహం ఎర్రబడింది.. “అమ్మా!” సీరియస్ గా పిలిచింది. ఉత్తప్పుడు మమ్మీ అంటూ కొంటెగా పిలిచినా, ఏదన్నా సీరియస్ విషయం వచ్చినపుడు మాత్రం అమ్మా అనే పిలుస్తుంది.. సంధ్య అలాగే మండిపడుతూ చూసింది.

“ఒకమ్మాయి, ఒకబ్బాయి కలిసి కనిపించగానే వాళ్ళ మధ్య ప్రేమో, శారీరక సంబంధమో ఉంటుందని భ్రమించే సంకుచితభావాలు ఎవరికైనా ఉంటే పట్టించుకోను.. నా ఇంట్లో ఉంటె మాత్రం భరించను.. నీతో తరవాత మాట్లాడతా.. ఇప్పుడు ఒకటే చెప్తున్నా విను.. బదరీ నాకు మంచి ఫ్రెండ్.. అంతే.. బదరీ స్థానంలో సుభద్ర అనే అమ్మాయి ఉంటే ఎలా ప్రవర్తిస్తావో అలాగే ప్రవర్తించు..అయినా కనిపించిన ప్రతి వాడిని ప్రేమించడానికి నా మనసేం పుష్పక విమానం కాదు..అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు... నా మనసు పాడుచేయకు..” గిరుక్కున వెనక్కి తిరిగి హాల్లోకి వచ్చింది.

తాతగారు బదరీతో కులాసాగా కబుర్లు చెప్పడం చూసిన స్మరణ అమ్మకన్నా తాతగారు ఎన్నేళ్ళు వెనక పుట్టి ఉంటారు అని మనసులో లేక్కలేయసాగింది.. అప్పుడే దీపక్ కారు పార్క్ చేసి రావడం చూసి, చిరునవ్వుతో “హాయ్ డాడీ” అంది.

దీపక్ ఉల్లాసంగా స్మరణకి హగ్ ఇచ్చి “ఏంట్రా ఇవాళ నువ్వు, నేను కూడా త్వరగా వచ్చాము ప్రపంచానికి ఏదన్నా ప్రళయం సంభవిస్తోందా” అన్నాడు.

“ప్రపంచం సంగతి ఏమో గానీ మన ఇంట్లో మాత్రం ఒక విశేషం జరిగింది.. ఇదుగో వీడు బదరీ అని నా కొలీగ్.. చిన్న అంబానీ” అంది బదరీని చూపిస్తూ.

“నమస్తే అంకుల్” అనబోతున్న బదరీ “హాయ్” అంటూ తన భుజం మీద చేయెసి పక్కన కూర్చున్న దీపక్ చొరవకి తెల్లబోతూ హాయ్ అంటూ స్మరణ వైపు చూసాడు.

“మా డాడీ నీకన్నా, నాకన్నా మోడరన్” అంది స్మరణ బదరీ మొహంలో భావాలు చూసి నవ్వి.

“మీ ఇద్దరూ సేం బాచ్చా” అడిగాడు దీపక్.

“ఎస్.. ఇద్దరం ఒకేసారి ఇంటర్వ్యూ కి వెళ్లాం.. సెలెక్ట్ అయాం ... ఒకే రోజు ఒకే టైం లో జాయిన్ అయాం” స్మరణ చెప్పిన తీరుకి ముగ్గురూ నవ్వారు.

వంటగదిలో పకోడీలు వేస్తున్న సంధ్య అసలే చిర్రు, బుర్రు లాడుతోందేమో భర్త కూడా వచ్చి వాళ్ళతో కలిసిపోడంతో మండిపడింది. తండ్రి, కొడుకులు ఇద్దరూ మగవాళ్ళు కదా అందుకే వాళ్లకి తన బాధ, ఆందోళన అర్ధం కావు.. అది ఏ తప్పు చేసినా తల్లి సరిగా పెంచలేదు అంటారు కానీ తండ్రి, తాత సరిగా పెంచలేదు అనరు.. వాళ్ళకేం తెలుస్తుంది! సిగ్గులేకుండా ఆ కుర్రాడితో ఈయన ఇక, ఇకలేంటో..

“సంధ్యా! మంచినీళ్ళు కావాలి” అని దీపక్ కేకేయడంతో “ఉన్నాగా పనిమనిషిని ఇస్తా” కసిగా అనుకుంటూ పకోడీ ప్లేట్స్, మంచినీళ్ళ జగ్ తీసుకుని హాల్లోకి వచ్చింది.

“హాయ్” అన్నాడు దీపక్.

“ఏం ఇప్పుడే జర్మనీ ఫ్లైట్ దిగి వస్తున్నారా.. ఈ కొత్త పలకరింపులేంటి?” అంది చిరాగ్గా. భార్య మూడ్ బాగాలేదని వెంటనే గ్రహించిన దీపక్ స్మరణ వైపు చూసి ఏమయింది అన్నట్టు సైగ చేసాడు. స్మరణ ఏమో అన్నట్టు భుజాలెగరేసి అంది.

“డాడీ నేను, బదరీ గురువారం రాజమండ్రి వెళ్తున్నాం... నాకు కార్ కావాలి.”

సంధ్యకి చిర్రెత్తు కొచ్చింది... “ఎందుకిప్పుడు రాజమండ్రి ఎవరున్నారక్కడ?”

“కందుకూరి వీరేశలింగం గారున్నారు..డొక్కా సీతమ్మగారున్నారు..”

“చంపేస్తాను పిచ్చి వాగుడు వాగకు...” అరిచింది సంధ్య,.

“అరుస్తావెందుకు? నాకు ధవళేస్వరం బ్రిడ్జ్ మీద రెండు రోజులు తిరగాలని ఉంది సరేనా!” మొండిగా అంది స్మరణ... ఆమెకి చికాగ్గా ఉంది.. అమ్మ టూ మచ్ చేస్తోంది.. ఈవిడని ఎలా మార్చడం అని ఆలోచిస్తూ.

“మూసీనది మీదకో, ట్యాంక్బండ్ మీదకో వెళ్ళు.. అదే గోదావరి అనుకుని తిరుగు..”

“థాంక్స్ ఫర్ యువర్ ఉచిత సలహా” .. వెక్కిరింతగా అంటూ తండ్రితో అంది “పాపం వీడికి అటువైపు ఏమి తెలియదు.. సరదాగా తిరిగి వద్దాం అని నేనే అన్నాను.. మీరు కూడా వస్తే రండి.. లేకుంటే మేమిద్దరం వెళ్తాము..” నిర్లక్ష్యంగా పకోడీ కొరుకుతున్న కూతురి వైపు కోపంగా చూసింది సంధ్య.

ఆమె ఏదో అనేలోపల దీపక్ అన్నాడు... “ఓ కె నాలుగు రోజులు సరదాగా వెళ్దాము... ఏం నాన్నా నీకు ఓకేనా..”

చిరునవ్వుతో తండ్రి, కూతుళ్ళ వైపు చూస్తూ వాళ్ళ మాటలు వింటున్న ఆంజనేయులు ఓ పెద్ద విస్ఫోటనం జరిగినట్టు అదిరిపడి మనవరాలి వైపు చూసాడు.. “రాజమండ్రిలో ఒకరోజు మేమిద్దరం అన్నీ తిరిగి నర్సాపూర్ వెళ్తాము” అంటోంది స్మరణ తండ్రి మెడ చుట్టూ చేతులు పెనవేసి గారంగా..

నర్సాపూర్... ఆయన గుండె దడ, దడలాడింది.. నర్సాపూర్.... స్మరణకి అక్కడ ఏం పని?

“నర్సాపూర్ ఎందుకు? ఎవరున్నారు అక్కడ” అడిగాడు దీపక్..

“ఊరికే బదరీ ఎప్పుడూ చూడలేదు... అందుకే గోదావరి జిల్లాల్లో అందమైన ప్రదేశాలు చూపిస్తా అని మాట ఇచ్చా... కొబ్బరితోటలు, గోదావరి నది... పిల్ల కాలువలు, అన్నట్టు డాడీ.. పాపి కొండలు కూడా వెళదామా!”

ఆంజనేయులు ఊపిరి పీల్చుకున్నాడు.. ఇది కేవలం వినోదయాత్ర లాంటిది... నర్సాపూర్ తో తనకి ఉన్న అనుబంధం స్మరణకి తెలియదు కదా... ఎందుకీ ఉలికిపాటు! అనుకున్నాడు.

“సరేలే ... మనకున్న టైం ని బట్టి ప్లాన్ చేద్దాం” అన్నాడు దీపక్.

మరునాడు ఉదయం ఏడు గంటలకల్లా బయలుదేరేలా మాట్లాడుకుని, బదరీని ఆరున్నర కల్లా ఇంటికి వచ్చేయమని చెప్పెంది స్మరణ. అందరి దగ్గరా సెలవు తీసుకుని బయలుదేరాడు బదరీ.

మరునాడు అనుకున్న సమయానికి పక్షిలా వాలాడు బదరీ.. అందరూ సిద్దంగా ఉన్నారు. సంధ్య అందరికీ కాఫీలు ఇచ్చింది.

బ్రేక్ ఫాస్ట్ దారిలో చేయడానికి నిర్ణయించుకున్నారు. సామాను కారులో పెట్టడానికి దీపక్ కి సాయం చేసాడు బదరీ.. ఆంజనేయులు చేయి పట్టుకుని స్మరణ కారు వైపు నడుస్తొంటే, సంధ్య హ్యాండ్ బాగ్ భుజాన వేలాడ దీసుకుని తాళం వేసింది.

కారు బయలుదేరింది. దారంతా స్మరణ, బదరీల కబుర్లు, అల్లరితో సందడిగా గడిచింది. కనిపించిన ప్రతి చెట్టు, ఎగిరే ప్రతి పక్షిని ఫోటోలు తీసుకున్నాడు బదరీ. వాళ్ళ అల్లరిలో తాత్కాలికంగా అన్నా మనసులోకి ఎలాంటి అనుమానాలు రాకుండా చిరునవ్వుతో భర్తతో మాట్లాడుతూనే ఉంది సంధ్య.

కారు రాజమండ్రి చేరింది. ఇంటిముందు కారు ఆగగానే సింహాచలం, లక్ష్మి ..పరిగెత్తుకుంటూ వచ్చారు. “అయ్యగారూ ఎలాగున్నారండి..” ఆత్మీయంగా అడుగుతూ ఇద్దరూ ఒంగి ఆంజనేయులు పాదాలకు నమస్కరించడం వింతగా చూసాడు బదరీ.

ఆయన కూడా ఎంతో ఆత్మీయంగా సింహాచలం భుజం మీద చేయెసి “ఏరా! ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు లక్ష్మి?” అని అడుగుతుంటే దీన్నేనా మమతానుబంధం అంటారు అనిపించింది.

ఇల్లంతా పరిశుభ్రంగా ఉంది. వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేకపోయినా అందరూ ఉంటున్నట్టే కళ కళ్ళాడుతూ ఉంది.

“అమ్మగారూ ఎలాగున్నారు” అంటూ సంధ్య పక్కకి వచ్చింది లక్ష్మి. సింహాచలం దీపక్ చేతిలో బదరీ చేతిలో ఉన్న బ్యాగులు అందుకుని రండి బాబూ అంటూ తన సొంత మనుషులను ఆహ్వానిస్తున్నట్టుగా మర్యాదగా లోపలికి దారి చూపిస్తుంటే స్మరణ వైపు చూసి నవ్వాడు బదరీ. ఆ నవ్వులో ఎంత మంచి చోటుకి తీసుకువచ్చావు స్మరణా అన్న భావన కనిపించింది స్మరణకి. బదులుగా తనూ నవ్వింది. అందరూ స్నానాదికాలు కానిచ్చి వచ్చేసరికి ఘుమఘుమలాడుతున్న కాఫీ వేడిగా తీసుకువచ్చి ఇచ్చింది లక్ష్మి.

సంధ్య పక్కగా చేరి రహస్యంగా అడిగింది లక్ష్మి “అమ్మాయిగారి అబ్బాయిగారాండీ ఆరు” అంది బదరీ వైపు చూసి.

సంధ్య ఇబ్బందిగా కదిలింది.. “కాదు మా బంధువులబ్బాయి” అంది మనసులో స్మరణ ని తిట్టుకుంటూ. ఇదేమన్నా అమెరికానా.. నా కూతురి ఫ్రెండ్ అని చెబితే ఆహ్వానించి ఎర్ర తివాచీ పరవడానికి.. ఎక్కడ ఉన్నా మనషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి.. ఇప్పుడు లక్ష్మి అడిగిన ప్రశ్న ఇంకాసేపట్లో పక్కింటివాళ్ళు... ఎదురింటివాళ్ళు అడుగుతారు.. ఏమని చెప్తుందో... వీడిని తీసుకుని ఊరమ్మట తిరుగుతాను అని అది బాహాటంగా చెప్పడం.. ఇద్దరు మగాళ్ళు తందానా అంటూ తాళం వేయడం.. ఏమన్నా అంటే నువ్వు ఏకాలంలో ఉన్నావు అంటూ తనని హేళన చేయడం... నర్సాపూర్ ఎందుకు అని అడిగితె చిరంజీవి చదివిన కాలేజ్ చూసి వస్తాము అని పెంకె జవాబు అది చెప్పడం.. ఈయన ఆహాహా అంటూ నవ్వడం.. అదేవిటో ఈ ఒక్క విషయంలో పెద్దాయన ఏమి మాట్లాడలేదు.. గంభీరంగా ఉన్నాడు..

సంధ్య ఆలోచనలు చెదరగొడుతూ “నేనలా వెళ్ళొస్తానమ్మా” అంటూ ఆంజనేయులు బయటకు వెళ్ళడానికి లాల్చీ తొడుక్కున్నాడు.

స్మరణ “రా బదరీ మా తాతయ్య పెంచిన వెజెటబుల్ గార్డెన్ చూపిస్తా” అంటూ పెరటి వైపు వెళ్ళింది.

పెరటికి అవతల వైపు గోడ, దాని వెనక మొత్తం ఖాళీ స్థలం... వేప, రావి చెట్లు, ఉమ్మేత్తపూల చెట్లు.. ఆ ఖాళీ స్థలం దాటి కొంచెం దూరం వెళితే గోదావరి కనిపిస్తుంది. అప్పటికి సాయంత్రం ఆరవుతోంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయాక బయలుదేరారు. ముందు స్మరణ, బదరీ వెళ్తానంటే సంధ్య అడ్డుచెప్పడంతో దీపక్ ఒక్కడే వాళ్లకి తోడుగా వెళ్ళాలి అనుకున్నాడు.. తరవాత సంధ్య, ఆంజనేయులు కూడా బయలుదేరడంతో అందరూ వచ్చారు. సంధ్య త్వరగా లేచి ఇడ్లీలు చేసింది.. బదరీ ఉదయం ఏడున్నరకే తన బండి మీద వచ్చేసాడు. మొహం మాడ్చుకుని బయలుదేరినా దారిలో బదరీ, స్మరణల మాటలు, ప్రవర్తన వాళ్ళ మధ్య ఉన్న నిష్కల్మషమైన స్నేహం చూసి మెల్లగా తనకి తాను సర్దిచేప్పుకుంది సంధ్య..

కారు కదిలిన దగ్గర నుంచీ ఇద్దరూ ఆఫీస్ విషయాలు, వాళ్ళ హెచ్.ఆర్ మేనేజర్ గురించి, వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, మధ్య, మధ్య  పచ్చటి ప్రకృతిని చూస్తూ అల్లరి చేసారు. చిన్న పిల్లల్లా ఆనందించిన ఆ ఇద్దరి మీద సదభిప్రాయమే కలిగింది. కాకపొతే ఆవిడ చిన్నప్పటి నుంచీ జీర్ణం చేసుకున్న సనాతనభావజాలం నుంచి బయటపడలేకపోతోంది. అందుకు కారణాలు రెండు.. ఒకటి ఆమె తన జీవితంలో ఎప్పుడూ తన పరిధి దాటి అడుగు కూడా ముందుకు వేయలేదు.. ఏనాడూ ఆమె జీవితంలో ఎవరినన్నా ప్రేమించడం, ప్రేమించబడడం జరగలేదు.. సంధ్య అందంగానే ఉంటుంది.. కానీ ఆమెకి ప్రేమ విషయంలో ఎలాంటి అనుభవాలు లేకుండానే పెళ్లి అవడం, దీపక్ తో జీవితం ప్రారంభించడం జరిగింది. రెండు... స్వేఛ్చ పట్ల ఆధునిక యువతుల భావజాలం ఆమె సమర్ధించలేకపోవడం.. ఆ భావజాలం తన కూతురులో ఉండడం ఆమెకి మింగుడు పడడం లేదు. ఏది ఏమైనా స్మరణ కోరిక ప్రకారం బదరీని తీసుకుని రాజమండ్రి వచ్చినా ఓ కంట వాళ్ళని కనిపెట్టడం మాత్రం మానలేదు.

అప్పటికే సూర్యాస్తమయం అవుతున్నది... ఎర్రటి గోళంలా మారి చెట్ల చాటున దోబూచులాడుతూ నీటి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటున్నాడు సూర్యుడు. ఏటి గాలి చల్లగా వీస్తోంది. గాలికి పూల చెట్లన్నీ కదుల్తూ నేలమీద పూల తివాచీ పరుస్తున్నాయి. . లక్ష్మి చిక్కుడుకాయలు, పొడుగ్గా ఉన్న పొట్లకాయ తెంపుకుని లోపలికి వెళ్ళింది వంట ప్రయత్నాలు చేయడానికి.

స్మరణ ఒక చిక్కుడుకాయ తెంపి ఒలిచి గింజలు తింటూ చెప్పసాగింది “నా చిన్నప్పుడు తాతయ్య రోజూ గోదావరి ఒడ్డుకి తీసుకెళ్తు ఉండేవాడు.. తడి ఇసకలో ఏవేవో గూళ్ళు కడుతూ, చెరిపేస్తూ, భలే ఆడుకునే దాన్ని.. ఇక్కడికి దగ్గరలో కోటిలింగాల రేవుంది.. చాలా ఫేమస్.. రోడ్డుకి ఒక పక్క  రేవు, ఒక పక్క శివాలయం.. ఎంత బాగుంటుందో తెలుసా!

“నాకెప్పుడు చూపిస్తావు..”

స్మరణ ఆలోచిస్తూ అంది “అదే ఆలోచిస్తున్నాను బదరీ! మనిద్దరం మాత్రమే వెళ్ళాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి... ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. తాతయ్యా, డాడీ ఒప్పుకుంటారు.. మా అమ్మని ఒప్పించడమే కష్టం... తనూ వస్తానని బయలుదేరితే నా ప్లాన్ పాడవుతుంది. ఇది టోటల్ గా నా పర్సనల్..”

బదరీ ఆశ్చర్యంగా చూసాడు.. “పర్సనలా.. అంటే”

“చెప్తా.. డిన్నర్ అయాక మనం గోదావరి దగ్గరకు వెడదాం అక్కడ చెప్తా. పద లోపలకి వెళ్ళిపోదాం చీకటి పడింది.. పురుగులవీ తిరుగుతుంటాయి..” ఇద్దరూ లోపలికి  వెళ్ళిపోయారు.

డిన్నర్ తరవాత, లాంగ్ డ్రైవ్ చేసి అలసిపోయిన దీపక్, అంత దూరం ప్రయాణం చేసినందుకు ఆంజనేయులు త్వరగా పడుకున్నారు. లక్ష్మి సంధ్య కబుర్లు చెప్పుకుంటూ మండువాలో కూర్చున్నారు. “మేమలా వెళ్ళొస్తాము మమ్మీ బదరీకి వెన్నెల్లో గోదారి చూపిస్తాను” అంటూ బయటకు నడిచింది స్మరణ. బదరీ ఆమెని అనుసరించాడు.

“త్వరగా వచ్చేయండి” అరిచినట్టు  చెప్పింది సంధ్య.

రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోయాయి.. అక్కడక్కడ కొందరు ఫస్ట్ షో సినిమా చూసి ఇళ్ళకి వెళ్తున్నట్టున్నారు... గొడవగా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ నెమ్మదిగా వీధి చివరకు వచ్చారు. వరసగా ఉన్న ఇళ్ళ ముందు అప్పటికే కళ్ళాపి చల్లి ముగ్గులేసేసారు. వెన్నెలచుక్కలు పెట్టినట్టుగా ఉంది ఆ వీధంతా. ముందుకు నడిచి ఎడం పక్కకు తిరిగారు. మెయిన్ రోడ్డు, అవతల బారేజీ కనిపిస్తోంది.. అదే అంటూ చేయి చాచి చూపించింది ఉత్సాహంగా.

“వావ్ బ్యూటిఫుల్” రాజమండ్రి నేల మీద చీనీ చీనంబరాలు పరచినట్టున్న ఆ జీవనదిని దగ్గరగా చూడగానే అతని మొహం విచ్చుకుంది .. కళ్ళల్లో నక్షత్ర మండలం ఆవాసం ఏర్పరచుకున్నట్టు తళ, తళ మెరుస్తున్నాయి అతని కళ్ళు.

రోడ్డుమీద వాహనాలు మాత్రం పల్చగా తిరుగుతున్నాయి. ఒడ్డున ఒకదాన్నొకటి తాళ్ళతో కట్టేసి ఉన్న రెండు ఖాళీ పడవల దగ్గర ఆగింది స్మరణ. నిలబడి తలెత్తి ఒక్కసారి విశాలంగా పరచుకుని, ప్రశాంతంగా ఉన్న గోదావరిని, వెన్నెల నదిలో జలకాలాడుతున్న తారలను చూస్తూ ఆ సౌందర్యాన్ని గుండెనిండా పదిలపరచుకుంది.

****సశేషం****

Posted in June 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!