Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

స్మరణ ఆఫీస్ కి తన బండి మీదే వెళ్తుంది.. ఆరోజు ఆమెలో ఒక కొత్త ఉత్సాహం కదం తొక్కుతోంది. బండి పార్క్ చేస్తుండగా పక్కనే బదరీ బండి కూడా ఆగడంతో హుషారుగా పలకరించింది “హాయ్ బదరీ!”

“హాయ్ స్మరణా! ఇవాళ ఇంటి దగ్గర స్టార్ట్ అయేముందే అనుకున్నాను “స్మరణ గేటులోనే ఎదురైతే ఎంత బాగుండు అని..” దగ్గరగా వస్తూ అన్నాడు.

ఎందుకు? అడిగింది.

“ఎందుకంటే ఇవాళ నా బర్త్ డే... నీ విషెస్ తో పాటు నీ అంగీకారం కూడా కావాలి.”

“ఓ ... విష్ యు మెనీ, మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే” చేయి కలిపి అభినందిస్తూ అడిగింది "ఇంతకీ అంగీకారం దేనికి”

ఈవెనింగ్ నీకు పార్టీ ఇస్తాను.. నాతో కొంచెం టైం స్పెండ్ చేయాలి..

ఓ ... ష్యూర్...దానికోసం ప్రణాళిక అవసరమా!” నవ్వింది.

“థాంక్ యూ... స్మరణా.. థాంక్ యూ వెరీ మచ్” వెలిగిపోతున్న మొహంతో అన్నాడు.

అతని మొహంలో కనిపించిన ఆనందం, ఆ కళ్ళల్లో తొణికిస లాడే భావం ఆమెకి తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. మధ్య, మధ్య అతను తన భావాలను వ్యక్తపరచడానికి చేసే ప్రయత్నాలు కూడా అర్థం అవుతాయి. అతను తనని ప్రేమిస్తున్నాడన్న విషయం గమనించినప్పుడల్లా ఉలిక్కిపడుతూ ఉంటుంది.. అతని ప్రేమని ఆస్వాదించే శక్తి కానీ, అంగీకరించే మనసు కానీ తనకి లేదు.. అలాంటప్పుడు అతన్ని ఎక్కువకాలం ఆశ అనే అంధకారం లో ఉంచడం శాడిజం కదా! ఇప్పుడు అతను సాయంత్రం తనకి మాత్రమే పార్టీ ఇస్తాను అని అడగడంలోనే తెలిసిపోతోంది.. ఈ ఉత్సాహం దేనికో ప్రోత్సాహం అని.. ఒకవేళ అతను ఇవాళ తన మనసులో మాట చెబితే ఎలా రియాక్ట్ అవాలి! పుట్టినరోజునాడు నిరాశ పరచడం భావ్యం కాదు... ఎలా? స్మరణ ఆలోచిస్తూనే పని చేసింది. లంచ్ అవర్ లో పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్ కి వెళ్లి మంచి గిఫ్ట్ కొంది. సున్నితమైన మనసు బదరీది... మంచి వాడు.. అతను బాధ పడకుండా సున్నితంగానే తిరస్కరించాలి.. ఒకవేళ అతను తను ఊహిస్తున్న ప్రపోజల్ తీసుకురాకపోతే చాలా మంచిది.. తెస్తేనే చిక్కు..

ఐదున్నర అవగానే బదరీ టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు కింద వెయిట్ చేస్తుంటాను అని.

సన్నగా నిట్టూర్చింది. కొద్ది నిమిషాల తరవాత సిస్టం షట్ డౌన్ చేసి కిందకి వచ్చింది. అప్పటికే బదరీ బండి దగ్గర నిలబడి ఎదురుచూస్తున్నాడు. స్మరణ తన బండి దగ్గరకు వెళ్తూ ఎక్కడికి వెళ్దాం అడిగింది. అతను చెప్పాడు. ఓకే అంటూ బండి స్టార్ట్ చేసింది. అమీర్ పేట లో ఉన్న సితార హోటల్ లో కూర్చున్నాక తను తెచ్చిన గిఫ్ట్ పాకెట్ ఇచ్చి మరోసారి అభినందనలు తెలిపింది.

గిఫ్ట్ ఎందుకు స్మరణా! ఎప్పుడు వెళ్లి తెచ్చావు అడిగాడు.

మధ్యాహ్నం లంచ్ టైం లో..

“మంచిదానివే .. అప్పుడు వెళ్లి తేవడం అవసరమా! అయినా నాకీ గిఫ్ట్ కాదు కావాల్సింది.. నీ అభిమానం, ప్రేమా.”

“అవి సదా ఉంటాయి బదరీ!” మృదువుగా అంది.

అతని కళ్ళల్లో మెర, మెరలాడుతూ మెరిసిందో ఆశ.. వెయిటర్ వచ్చి మెనూ ఇవ్వడంతో ఆమె చేతికి ఇస్తూ “నువ్వే ఆర్డర్ చేయి స్మరణా! ఛాయిస్ నీదే” అన్నాడు.

స్మరణ మెనూ చూస్తూ అంది “బర్త్ డే పార్టీ కి నీ ఫ్రెండ్స్ ని పిలవలేదే బదరీ!”

“నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ స్మరణా “ అన్నాడు.

స్మరణ గుండె దడ, దడ లాడింది... తల వంచుకుని మెనూ చూస్తూ కూర్చుంది.

“స్మరణా! నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను” నెమ్మదిగా అన్నాడు. వచ్చేసింది..  వచ్చేసింది.. ఊహించిన క్షణం వచ్చేసింది.. తలెత్తి అతని మొహం లోకి చూసింది. ఆరాధనగా చూస్తున్నాడు.

“బదరీ!” మృదు, మధురంగా పిలిచింది.

గుండె తలుపులు టప, టప కొట్టుకున్నాయి. చెప్పు అన్నట్టు చూసాడు.

స్మరణ క్షణంలో సగం సేపు మౌనంగా ఉండి అంది “నేనే నీతో ఒకమాట చెప్పాలనుకుంటున్నాను.”

బదరీ ఉద్వేగంగా చూసాడు. గుండె వేగంగా కొట్టుకోసాగింది.. దీన్నేనా కోరని వరం అంటారు..కళ్ళ ముందు కాంతి పుంజాలు...హృదయంలో ధమరుకం ....

స్మరణ చెప్పసాగింది. “బదరీ! మా అమ్మా, నాన్నలకి నేను ఒక్కతే కూతుర్ని.. నాకు అన్నదమ్ములు లేరు, అక్కాచెల్లెళ్ళు లేరు. అమ్మా, నాన్నా ఇద్దరూ ఉద్యోగస్తులే.. స్కూల్కి సెలవలు రాగానే నన్ను తాతగారి దగ్గరకు పంపేవాళ్ళు.. పెద్ద క్లాస్ లకి వస్తున్నా కొద్దీ అలా వెళ్ళడం తగ్గింది.. ఇంట్లోనే ఒక్కదాన్నే ఉండేదాన్ని అమ్మ, నాన్న ఆఫీస్ నుంచి వచ్చేవరకు. అప్పుడు చెప్పలేనంత ఏడుపు వస్తుండేది.. అందరిలా నాకూ ఓ తమ్ముడో, చెల్లెలో అన్నో ఉంటే ఎంత బాగుంటుంది అనుకునే దాన్ని.”

స్మరణ చెప్పడం ఆపి గాజు గ్లాస్ లో నీళ్ళు తాగింది. బదరీ ఆమె ఏం చెప్పబోతోందో అన్నట్టు కదలకుండా శిలలా అలాగే కూర్చున్నాడు. “నేను చదువుకునే టప్పుడు కానీ, నా చుట్టుపక్కల ఇళ్ళల్లో మగపిల్లలు కానీ నాకెవరూ నచ్చలేదు.. నేను ఎవరితో స్నేహం చేయలేదు. ఒకే ఒక్క వ్యక్తి”

బదరీ గుండెల్లో చిరుగంటలు మోగాయి.. ఉద్విగ్నత తొలగి చిరునవ్వు పరుచుకుంది మొహం మీద.

“నిన్ను మొదటిరోజు చూసినప్పుడే నాకు బాగా నచ్చావు.. సరదాగా నిన్ను ఆట పట్టించినా, నువ్వంటే నాకెంతో అభిమానం ఏర్పడింది. కానీ, బదరీ నా అభిమానం, ఆత్మీయత నిన్నొక తమ్ముడిగా ప్రేమించడానికే తప్ప... ఇంకోలా చూడలేకపోయాను.”

భళ్ళున గ్లాస్ బద్దలైంది.

రోజూలా ఆఫీస్ లో అడుగుపెట్టగానే చిరునవ్వుతో ఎదురొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే బదరీ కనిపించలేదు. స్మరణకి చాలా వెలితిగా అనిపించింది. మనసు కష్టపెట్టుకున్నట్టున్నాడు. తన ప్రపోజల్ ఒప్పుకోకపోయినంత మాత్రాన ఇలా దూరం అయిపోవడమేనా! అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమ అనేది ఒక వరం. తరగని సంపద... అది అమ్మా, నాన్నల నుంచి పిల్లలలకి, పిల్లల నుంచి పేరెంట్స్ కి, వాళ్ళ నుంచి అన్నదమ్ములు, అక్కచెల్లిళ్ళకి వారసత్వంగా సంక్రమిస్తుంది.. ఎన్ని తరాలు గడిచినా తరగనిది ప్రేమ.. అలాంటి ప్రేమ బదరీకి తన మీద, తనకి ఇంకొకరిమీద జనించడంలో తప్పు లేకపోవచ్చు.. కానీ ప్రేమించిన వ్యక్తి తన స్వంతం అవాలని కోరుకోవడం, స్వంతం అయాక ఆ వ్యక్తి మీద అధికారం, హక్కులు కావాలని అనుకోడం ఇది ప్రేమా! వ్యామోహమా!

అతని ప్రేమను తను అంగీకరించలేదు కాబట్టి ఇంక మాట్లాడడా.. రేపు తనూ అంతేనా! తను అన్వేషిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా భార్య, ఇద్దరు పిల్లలతో కనిపిస్తే! స్మరణ ఒక్క క్షణం భయంతో వణికిపోయింది.. అవును కనిపిస్తే అనుకుంది.. ఏమో! ఏం జరుగుతుందో.. గుండె పగిలి చచ్చిపోతుందో,, జీవితం ఇంతే అని సమాధానపడుతుందో! భుజాలు ఎగరేసి బదరీ కాబిన్ వైపు నడిచింది. సీరియస్ గా పని చేసుకుంటున్నాడు.

“బదరీ!” పిలిచింది. కీ బోర్డు మీద కదులుతున్న వేళ్ళు ఆగిపోయాయి.. తలతిప్పి చూడలేదు.. స్మరణే అతనికి అభిముఖంగా వెళ్లి నవ్వుతూ “గుడ్ మార్నింగ్” అంది.

ఆమె వైపు చూడకుండా ముభావంగా “గుడ్ మార్నింగ్” అన్నాడు..

“ఏంటి అలకా!”

“ఎవరి మీద?”

“నా మీద”

“నీ మీద అలగడానికి నీకూ, నాకూ ఏంటి సంబంధం?”

“మనిషికీ, మనిషికీ మధ్య ఉన్న బంధం...

బదరీ మాట్లాడలేదు... స్మరణ సీరియస్ గా అంది.. “అబ్బ ఆ మొహం తీసేసి కాస్త నవ్వు మొహం పెట్టు బాబూ! చూడలేక చస్తున్నాను.. అయినా మన పరిచయం అయి ఎంతకాలం అయిందని గడ్డం పెంచేసి ప్రేమే నేరమౌనా అని పాడుకుంటూ తిరగడానికి... నవ్వు..”

“ఎలా నవ్వాలి మనసు మీద సుత్తితో కొట్టి నవ్వు అంటే నవ్వడానికి నేనేం రోబోనా! నాకసలు బతకాలని లేదు” కోపంగా అన్నాడు.

“ఒక్కసారి నీ మనసుని ప్రశ్నించు స్మరణ లేకపోతే నేను బతకలేనా అని.. ఏం చెబుతుందో వచ్చి చెప్పు నేను వెళ్తున్నా...”

స్మరణ వెళ్లి పోతోంటే జాలిగా అడిగాడు.. “నన్నిలా బాధ్యపెట్టడం న్యాయమా స్మరణా! నీకిది ధర్మంగా ఉందా!”

“అసలు లేదు..నువ్విలా బాధపడుతూ ఉంటే చూడాలని అసలు లేదు.. ఇవాళే కాదు ప్రతిరోజూ నువ్వు ఆనందంగా ఉండాలి.. నిన్ను అర్థం చేసుకుని, ప్రేమించి, అనురాగం పంచిచ్చే అమ్మాయి లభించాలి.. ఒక్కసారి నా వైపు సరిగా చూడు.. ఈ బాబ్డ్ హెయిర్, తలెగరేస్తూ తిరిగే పొగరుబోతుతనం, నా స్పీడు, నా ఆలోచనలు నీకు సూటబుల్ అనిపిస్తోందా?”

బదరీ ఆమె వైపు చూసాడు.. “అదంతా నాకు తెలియదు.. బట్ ఐ లవ్ యూ..””

“ఐ నో... నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని.. కానీ ఆ ప్రేమకి ఏం పేరు పెట్టాలో నీకు తెలియలేదు.. అందుకే నేరుగా ప్రేమా, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చావు. ఒకవేళ మీ పేరెంట్స్ కి నేను నచ్చలేదనుకో ఏం చేస్తావు ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుంటావా?”

ఆ ప్రశ్నకి బిక్క మొహం వేసుకుని చూసాడు.

“ఎదిరించలేవు.. నాకు తెలుసు నీది అలాంటి మనస్తత్వం కాదు.. అందుకే చెప్తున్నా.. నీ ప్రేమ ప్రవాహాన్ని పెళ్లి నుంచి కొంచెం పక్కకి మళ్ళించు. అప్పుడిలా గడ్డం పెంచేసుకుని ఉండక్కరలేదు.. అయినా నాకు తెలియక అడుగుతాను మీ మగాళ్ళు ప్రేమించిన అమ్మాయి కాదు అనగానే గడ్డం పెంచేసి, మందు కొడతారు.. మరి మేమేం చేయాలి..”

“నీకసలు మనసులేదు..” ఉడుక్కుంటూ అన్నాడు.

స్మరణ నవ్వి అంది “ఏం చేయను చెప్పు.. ఆ వెధవ మనసు నేను టెన్త్ కి రాగానే ఎవడో పట్టుకుపోయాడు.”

“అంటే!” అనుమానంగా చూసాడు.

“నా మనసు నా దగ్గర లేదు. ఒక వ్యక్తి దోచుకుపోయాడు. అప్పటి నుంచీ తిరిగి తెచ్చుకోవాలని ఎంతో ట్రై చేస్తున్నా ఊహు ఆ వెధవ దొరకడం లేదు.”

“అబ్బ సరిగా చెప్పు స్మరణా ఎవరికైనా మనసిచ్చావా”

“నిన్ననే చెప్పాలనుకున్నా.. నువ్వు వినకుండా కోపంగా వెళ్ళిపోయావు.. మనసు నేనివ్వలేదు... అతనే తీసుకున్నాడు..”

“అతనెక్కడుంటాడు? ఏం చేస్తున్నాడు? ఎలా ఉంటాడు?”

“నీ ప్రశ్నల్లో దేనికీ నా దగ్గర సమాధానం లేదు.”

“ఏమి తెలియకుండా ఎలా ప్రేమిస్తున్నావు కలలోనా”

ఒక్కసారి కళ్ళు మూసుకుని గుండె నిండా గాలి పీల్చుకుని వదుల్తూ అతని వైపు చూసి నవ్వి “కొంత కాలం స్నేహం చేసాను.. కలిసి చదువుకున్నాను.. కబుర్లు చెప్పుకున్నాను.. ప్రేమో, అభిమానమో తెలియని ఒక ఆకర్షణలో పడిపోయాను.. అలా పడిపోయిన నన్ను వదిలి అతను వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో నాకు తెలియదు..”

బదరీ మొహం చిట్లించాడు “నీ మాటలు వింటుంటే తెలుగు సినిమా చూస్తున్నట్టుంది..నీలాగే అర్థం లేకుండా ఉంది.”

గలగలా నవ్వింది “స్త్రీని ప్రేమించడం చాలా సులువు అర్థం చేసుకోడం చాలా కష్టం. సరేలే ఇదిగో నీ కోసం అరిశెలు తెచ్చాను... తిను.. సాయంత్రం నా ప్రేమ కథ చెబుతాను.. మరి నా ప్రేమికుడి కోసం నేను చేసే అన్వేషణలో సాయం చేస్తావా”

“ఎందుకు చేయాలి”

“నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి.”

“అసలు చేయను”

“చేస్తావు “

“నా గురించి నువ్వెలా ప్రామిస్ చేయగలవు!”

“నీ గురించి నీకన్నా నాకెక్కువ తెలుసు కనక..”

“మొండిదానివి నీతో వేగడం చాలా కష్టం..”

“కదా! ఒక్క రోజుకే అంత విసుగొస్తే జీవితాంతం నన్ను నువ్వేం భరిస్తావు.. నీ వల్ల కాదు.”

ఆమె అల్లరి మాటలకి అతని పెదాల మీదకి మెల్లగా పాకుతూ వచ్చింది చిరునవ్వు. మబ్బుల్ని తొలగించుకుంటూ ఆకాశంలో వెలిగిన నిండు చంద్రుడులా.

“నిన్ను అభినందించాలో, చిరాకు పడాలో అర్థం కావడం లేదు.. చిన్నపుడెప్పుడో కలిసిన వాడిని ఇంకా గుర్తుంచుకోడమే కాదు.. వాడిని ప్రేమించడం ఏంటి? మీనింగ్ లెస్”

“అది టీన్ ఏజ్ లవ్..”

“అయితే!”

“నువ్వు అబద్ధం చెప్పవు కదూ.. “

“చెప్పను...”

“డ్రింక్ చేయవు కదూ”

“అవును ఏం?”

“ఎందుకు చేయవు”

“మా అమ్మ చిన్నప్పటి నుంచి అవన్నీ తప్పు అని చెప్పింది... అదే నా మనసులో ఉండిపోయింది..”

“నీ చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు నీ బ్రెయిన్ లో ఇంకా అలా రిజిస్టర్ అయి ఉన్నాయి.. నువ్వు వాటిని ఇప్పుడు ఇగ్నోర్ చేయలేకపోతున్నావు.. కారణం అమ్మ మీద నీకున్న ప్రేమ, గౌరవం..అలాగే నా ప్రేమ కూడా .. టీన్ ఏజ్ లో నా మనసులో ప్రవేశించిన ఒక రూపం, వ్యక్తిత్వం అలా ఉండిపోయాయి. అయినా స్నేహం అనేది ఒప్పందం కాదు బదరీ! స్నేహం ముదిరితే ప్రేమ అవాలని రూలేం లేదు.. స్నేహం ఒక బంధం.. ప్రేమికులు విడిపోయే ఛాన్స్ ఉంది.. స్నేహితులు విడిపోయే ఛాన్స్ ఉండదు.. మనం మంచి స్నేహితులం సరేనా!” చేయి చాచింది..

కొన్ని క్షణాలు ఆమె మొహంలోకి తీక్షణంగా చూసి చిరునవ్వుతో చేయి కలిపాడు. “నీలాంటి స్నేహితురాలు లభించడం నా అదృష్టం స్మరణా! నీ ప్రేమ ఫలించాలని, మీ ఇద్దరూ త్వరలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

అతని స్వరంలో వినిపించిన నిజాయితీతో కూడిన ఆత్మీయతకి స్మరణ కళ్ళు చెమ్మగిల్లాయి.. ప్రేమించిన వాళ్ళని కన్విన్స్ చేయలేకపోవచ్చు.. కానీ, ప్రేమిస్తున్నాం అనుకునే వాళ్ళని కన్విన్సు చేయడం ఎంత సులభం! అనుకుంది.

ఆ సాయంత్రం స్టాంజాకి తీసుకుని వెళ్లి అతను వద్దు, వద్దు అంటున్నా వినకుండా డ్రెస్ కొనిచ్చింది. చెట్నీస్ లో ఇడ్లి తిని, కాఫీ తాగి స్నేహాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.

“సరేగానీ నువ్వు ఎక్కడ పుట్టావు?” అడిగింది స్మరణ.

“హైదరాబాద్ లో”

“ప్రకృతి అందాలు, ముఖ్యంగా గోదావరి జిల్లా అందాలు ఎప్పుడన్నా చూసావా..”

“లేదు ఏం? ఊటీ చూసాను.”

చుర, చురలాడుతూ చూసి “తమరు ఊటీ, కొడైకెనాల్, స్విట్జర్లాండ్..ఇవి తప్ప చూడరా..”

“అలా అని ఏం లేదు.. అటువైపు ఎప్పుడూ వెళ్ళలేదు.. బంధువులు కూడా ఎవరూ లేరు.. ఇంతకీ ఎందుకడుగుతున్నావు.”

స్మరణ అతని మొహంలోకి చూసింది.. అమాయకంగా, కోనసీమ కొబ్బరినీళ్ళంత స్వచ్చమైన మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది.. ఒక మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే కళ్ళల్లోకి సూటిగా చూస్తే చాలు.. ఆ కళ్ళే వ్యక్తం చేస్తాయి కోటిభావాలు... కొంతమంది ఎదుట మనిషి ఉంటే ఎటో చూస్తూ మాట్లాడతారు.. వాళ్ళకన్నా పెద్ద దొంగలు ఎవరూ ఉండరు. బదరీ ఆమె చూపులకి ఏ మాత్రం తొణక్కుండా ఆమె వైపే ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడు. ఆమె పెదవుల మీదకి చిరునవ్వు పాకివచ్చింది పిల్లతెమ్మేరలా. ఇంతకన్నా రిలయబల్ ఎవరుంటారు? బదరీని నిశ్చింతగా నమ్మచ్చు అనుకుంది.

“ఏంటి సస్పెన్స్” అడిగాడు అసహనంగా.

“నిన్నో చోటికి తీసుకువెళ్తాను వస్తావా మనకి నాలుగు రోజులు హాలిడేస్ వస్తున్నాయి వీకెండ్ తో కలిపి” అడిగింది.

“నువ్వు సహారా ఎడారికి రమ్మన్నా వస్తాను.. ఇంతకీ ఎక్కడికి?”

“ఒక అమాయకమైన ప్రేమ జనించిన పవిత్ర స్థలానికి..”

“దేవదాసు, పార్వతి పుట్టిన చోటా..”

“కాదు.. అంతకన్నా గొప్ప ప్రేమ ...వస్తావా! రావా..”

“‘చెప్పాగా ఎక్కడికైనా వస్తానని.. జీవితాంతం కాకున్నా కనీసం నాలుగురోజులు కలిసి ఉండచ్చుగా..”

“ఈ తెలుగు సినిమా డైలాగులు ఆపు.. గురువారం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కారులో వెళ్తున్నాము.. నీకు డ్రైవింగ్ వచ్చా..”

“పదహారేళ్ళ వయసులోనే నడిపా కారు..”

“గుడ్... నోట్లో బంగారు స్పూన్ పెట్టుకుని పుట్టినట్టున్నావు..లే ఇంక వెళదాము...” బ్యాగ్ తీసుకుని లేచింది. బదరీ కూడా లేచాడు.

ప్రేమ అంగీకరించాలా, తిరస్కరించాలా అనేది వ్యక్తిగతం. మెడ మీద కత్తి పెట్టి ప్రేమిస్తావా? చంపేయనా అని క్రూరంగా కళ్ళల్లోకి చూస్తూ బెదిరించడానికి చండశాసనం కాదు.. ఆ శాసనాన్ని ధిక్కరిస్తే యాసిడ్ సీసాతో, లేదా కత్తితో శిక్షించడం ఏ దేశంలో న్యాయం! కానీ ఇప్పుడు అదే చెలామణీ అవుతోంది.. స్మరణ తిరస్కరించినంత సున్నితంగా తిరస్కరిస్తే యాసిడ్ మరణాల్లాంటి అరాచకాలు ఆగుతాయా! బదరీలాంటి సంస్కారవంతులు కూడా ఉండాలిగా! బలవంతంగా ఒక గండం గడిచినందుకు బాబాకి కృతఙ్ఞతలు తెలియచేసుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది స్మరణ.

****సశేషం****

Posted in May 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!