Menu Close
ఈ జీవితం దేనికి ?
(కథానిక)
-- గౌరాబత్తిన జి.కుమార్ బాబు --

“నేను ఉద్యోగం మానేశాను నీలిమ” అని భార్యతో చెప్పాడు రాజశేఖర్. భర్త చెప్పిన మాట విని దిగాలు పడింది నీలిమ. ఇరవై ఏళ్ళుగా ఎదుగూబొదుగూ లేకుండా అనేక ఉద్యోగాలు చేస్తూ మానేస్తూ వచ్చాడు రాజశేఖర్. ప్రతిసారీ ఉద్యోగం మానేసిన తరువాతే భార్యకు చెప్పడం అతనికి అలవాటు.

సరిగ్గా నాలుగేళ్ళ క్రితం ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు రాజశేఖర్. అప్పటికి ఆరు నెలల నుండి తాను తీసుకునే జీతం కంటే ఎక్కువ పని చేస్తున్నాననే భావన మనసులో మొలకెత్తి నిత్యం అశాంతి కలుగజేస్తూ ఉంది. పనిభారం ఎక్కువైనప్పుడు యాజమాన్యాన్ని జీతం పెంచమని అడగొచ్చు, పదోన్నతినిచ్చి ఎవరైనా సహాయకుడిని ఇవ్వమని అడగొచ్చు. కానీ ప్రవృత్తిరిత్యా రాజశేఖర్ మనసు అటువైపుగా ఆలోచించదు. పరిస్థితుల పట్ల అలిగి, వాటి నుండి దూరంగా వెళ్లిపోవడమేగానీ, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునే పని చేయడం రాజశేఖర్ కు అలవాటులేదు.

ఒక రోజున ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం, వెనువెంటనే పేపర్ పెట్టేయడం చేసేశాడు. విషయం తెలిసిన వెంటనే వైస్ ఛైర్మన్ మాట్లాడుదామని రాజశేఖర్ ను పిలిపించాడు. వైస్ ఛైర్మన్ పిలవడంతో రాజశేఖర్ అహం సంతృప్తి చెందింది. తానాడిన నిష్టూరం గెలిచిందని రాజశేఖర్ గర్వపడ్డాడు.

భార్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో జరుగుబాటుకు లోటులేదు. దాంతో ఇటువంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు, అదీ హఠాత్తుగా. కానీ ఈ విషయాన్ని రాజశేఖర్ మనసు ఆమోదించదు పూర్తిగా. పరిస్థితుల మీదే తన కోపమంతా. అంతర్ముఖత్వం చెంది పరిస్థితులకు తానెంత కారణమో తెలుసుకునే ప్రయత్నం చేయడు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారాలనుకుంటాడే కానీ, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవాలనుకోడు.

అహం సంతృప్తి చెందడం వల్ల శరీర పరిభాషలో వచ్చిన మార్పుతో వైస్ ఛైర్మన్ క్యాబిన్ కి వెళ్ళాడు.

“ఏంటి శేఖర్ గారు రిజైన్ చేశారు” అని అడిగాడు వైస్ ఛైర్మన్.

“ఏం లేదు సార్, సిటీ నుండి ఇంత దూరం రావాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంట్లో కూడా కాస్త ఇబ్బందిగా ఉంది” అని బదులిచ్చాడు రాజశేఖర్.

“తొందరపడకండి మిమ్మల్ని అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ గా ప్రమోట్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ పేస్కేల్ లోకి వస్తారు” అని చెప్పాడు రాజశేఖర్.

ఏం చెప్పాలో అర్థం కాక సంశయాత్మకంగా నిలబడ్డాడు రాజశేఖర్. “ఆలోచించండి, మళ్ళీ కలుద్దాం” అని ముగించాడు వైస్ ఛైర్మన్.

రాజశేఖర్ మళ్ళీ వైస్ ఛైర్మన్ క్యాబిన్ కి వెళ్ళలేదు. తన రాజీనామా వెనక్కి తీసుకోలేదు. నోటీస్ పీరియడ్ పూర్తి కాగానే రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు.

***

మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు రాజశేఖర్. అప్పటికి కెరీర్ మొదలుపెట్టి ఇరవై ఏళ్ళయ్యింది. జీవితంలో ఏమీ సాధించలేదని మనసులో మథనం చెందుతున్నాడు. ”ఈ జీవితం వృధా అయినట్టేనా” - రాజశేఖర్ మనసును తొలుస్తున్న ప్రశ్నయిది. ప్రశ్న అయితే వేసుకున్నాడు గానీ సమాధానం ఎలా తెలుసుకోవాలో తెలియదు శేఖర్ కి. తన మానసిక సమస్యలకు బయట ప్రపంచంలో సమాధానాలు, పరిష్కారాలు వెతుక్కుంటాడు.

కెరీర్లో ఎదగలేదనే అసంతృప్తికి తోడు సోరియాసిస్, ఆర్థరైటిస్ అనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాజశేఖర్ ను మరింత కలవరపరిచేవి. అల్లోపతీ వైద్యంతో లాభం లేదని తనకు తానే నిర్ధారించుకుని నగరంలో పేరుమోసిన హోమియో వైద్యుడు రమణ దగ్గరకెళ్ళాడు. రమణ దగ్గరకు చాలా ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. దాంతో సగటున ఒక్కో రోగికి రమణ కేటాయించే సమయం తక్కువగా ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకుని రమణ దగ్గరకెళ్లిన రాజశేఖర్ కి రమణ ఎక్కువ సమయం కేటాయించక పోవడంతో చిరాకు కలిగింది.

“అదేంటి సార్, నా సమస్య ఏంటో కూలంకషంగా వినకుండా, చర్చించకుండా ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు” అని రమణను అడిగేశాడు శేఖర్.

శేఖర్ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన రమణ వెంటనే తేరుకుని “చూస్తున్నారు కదండీ బయట రోగుల సంఖ్య, ఇలా చేయకపోతే అందరికీ అటెండ్ కాలేను” అని చెప్పాడు. అయినా శేఖర్ సంతృప్తి చెందలేదు. వాదించాడు.

“మీకున్న సమస్య ఇదండీ. మీ కిష్టమైతే వైద్యం చేయించుకోండి. లేదంటే లేదు” అని చెప్పేశాడు రమణ. అసంతృప్తితోనే బయటకొచ్చేశాడు శేఖర్.

తన ఇంటి దగ్గరే ఉన్న మరో హోమియో వైద్యుడి వద్ద ట్రీట్మెంట్ తీసుకోసాగాడు.

***

రాజశేఖర్ కాస్ట్ అకౌంటెన్సీ చదివేటప్పటి మిత్రుడు నవీన్. అతను అదే నగరంలో ఓ కంపెనీకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ హెడ్ గా పని చేస్తున్నాడు. పాత స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ఓ ఉమ్మడి మిత్రుని ద్వారా మొబైల్ నెంబర్ తీసుకుని శేఖర్ కి ఫోన్ చేశాడు. ఆఫీసుకి వెళ్ళి నవీన్ ని కలిశాడు రాజశేఖర్. మాటల మధ్యలో నవీన్ తమ కంపెనీలో ఓ ఖాళీ ఉన్న విషయం తెలిపి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని అన్నాడు. అది తక్కువ జీతానికి కావడంతో రాజశేఖర్ ని ఆ పోస్టుకి అడగలేదు నవీన్. మరో ఆలోచన లేకుండా ఆ పోస్టుకి తాను వస్తానని చెప్పేశాడు శేఖర్. “మరి మేము ఇరవై వేలే జీతంగా ఇవ్వగలం” అని అన్నాడు నవీన్, “పర్లేదు నవీన్, నాకు పని నేర్చుకోవడం ముఖ్యం” అని నిబద్ధతను ప్రతిబంబించే స్వరంతో అన్నాడు శేఖర్. అలా అనటం, వెనువెంటనే ఉద్యోగంలో చేరటం జరిగిపోయాయి.

ఓ వారం రోజుల తరువాత శేఖర్ ని తన క్యాబిన్ కి రమ్మని పిలిచాడు నవీన్. ఆఫీసులో చేరిన దగ్గర నుండీ ప్రోటోకాల్ ని గౌరవిస్తూ నవీన్ ని సార్ అని పిలవసాగాడు శేఖర్. క్యాబిన్ కి వచ్చిన శేఖర్ తో – “శేఖర్, డైరెక్టర్ గారు నువ్వు సెమీ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి జీతం ఇరవై అయిదు వేలు ఇమ్మన్నారు” అని చెప్పాడు. రాజశేఖర్ వెనువెంటనే – “వద్దు సార్, నేను ఇరవై వేల జీతానికి ఒప్పుకుని ఈ ఉద్యోగంలో చేరాను, ఆ ప్రకారమే ఇవ్వండి” అని కచ్చితంగా చెప్పాడు. కాదయ్య, ఇది యాజమాన్య నిర్ణయమే అని చెప్పి జీతం పెంచే అవకాశం, అధికారం ఉన్నా, ఎందుకో మౌనంగా ఉండిపోయాడు నవీన్.

***

వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నప్పటికీ, శేఖర్ లో వివిధ సామాజిక సమస్యలపై స్పందించే ప్రవృత్తి ఉంది. కొన్ని అంశాలను దినపత్రికలో చూసి, వెంటనే ఏదో రకంగా స్పందించి తరువాత మర్చిపోవడం చేస్తుంటాడు. అది కృష్ణా పుష్కరాలు జరుగుతున్న సమయం. పుష్కర యాత్రికులకు సేవలందించడానికి రామకృష్ణ మఠం వారు కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు దినపత్రికలో వార్త చదివాడు శేఖర్. వెంటనే రామకృష్ణ మఠానికి ఫోన్ చేసి అధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాల్సిన మీరు, ఇలా మూఢ నమ్మకాలకు ప్రోత్సాహం అందించడం బాధాకరమని అన్నాడు. ”మేము యాత్రికుల సౌకర్యార్ధం మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం సార్, వాస్తవానికి పుష్కరాల పట్ల మాకు అంతా ఆసక్తి లేదని” మఠం వారు తెలిపారు. ఇలానే అప్పుడప్పుడూ ప్రజాసమస్యలపై ఆయా ప్రభుత్వ శాఖలకు ఉత్తరాలు రాసేవాడు.

శేఖర్ చూసే కంపెనీ కార్యకలాపాలు పెరగడంతో శేఖర్ పైన కిరణ్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ ని మేనేజర్ గా నియమించాడు నవీన్. కిరణ్ శేఖర్, నవీన్ ల కన్నాఓ పదిహేనేళ్ళు చిన్నవాడు. తొలుత పని విషయంలో కిరణ్ కి బాగా సహకరించిన శేఖర్ తరువాత తరువాత సహకరించడం తగ్గించాడు. చెప్పిన పని చేయడానికి నిరాకరిస్తూ – “మీరే చేసుకోండి సార్ ఈ పని” అని ఎదురు సూచనలివ్వడం మొదలుపెట్టాడు. కిరణ్ కి ఇలాంటప్పుడు శేఖర్ వ్యవహారశైలి అర్ధమయ్యేదికాదు, కోపమొచ్చేది, అయినా పైనున్న నవీన్ కి ఫిర్యాదు చేయక పోవడానికి కిరణ్ కారణాలు కిరణ్ కున్నాయి. శేఖరే ఒకసారి నవీన్ వద్దకు వెళ్లినప్పుడు – “సార్, ఇపుడు నేను ఆయన చెప్పిన పని కూడా చేయాలా?” అని అడిగాడు. “మేనేజర్ కి సహకరించకపోతే ఎలా శేఖర్” అని అడగవలసిన నవీన్ మిత్రుడి అహం అర్ధం చేసుకుని “నువ్వు అలాంటివి రానివ్వకు శేఖర్, ఇద్దరూ కలసి పని చక్కగా చేసుకుపోండి” అని చెప్పాడు.

***

శేఖర్ తన ఇంటి దగ్గరున్న హోమియో వైద్యుడి వద్ద రెండు నెలల పాటు వైద్యం చేయించుకున్నాడు. తరువాత ఎందుకో అతని విద్యార్హతల మీద అనుమానం వచ్చింది. వెంటనే ఆ వైద్యుడినే అడిగేశాడు. అతను చిరాకుపడ్డాడు. కోపోద్రిక్తుడయ్యాడు. “మీ దగ్గర వైద్యం చేయించుకుంటున్న నాకు మీ వృత్తి వివరాలు తెలుసుకునే హక్కు లేదంటారా” అని నిలదీశాడు శేఖర్. “చూడండి, నేను B.H.M.S కాదు, ఓ హోమియో వైద్యుడి వద్ద ముప్పై ఏళ్ళ పాటు పని చేశాను. ఆ అనుభవంతో సొంత ప్రాక్టీస్ పెట్టుకున్నాను. మీకు నా వైద్యం పట్ల నమ్మకం లేకపోతే, రావడం మానేయండి” అని బదులిచ్చాడు ఆ వైద్యుడు.

ఓ రోజున ఆఫీసులో ఉన్నప్పుడు కిరణ్ శేఖర్ తో – “ఆయుర్వేదం నాకు రెండు సమస్యలను తొలగించింది సార్. గ్యాస్ సమస్యతోనూ, చుండ్రు సమస్యతోనూ దాదాపు ఆరేళ్ళ నుండి బాధపడుతున్నాను. ఆయుర్వేదం మందులు వాడాక రెండూ తగ్గిపోయాయి” అని చెప్పాడు. “అలాగా సార్” అంటూ ఆ ఆయుర్వేదం వైద్యుడి చిరునామా తీసుకున్నాడు శేఖర్.

ఆయుర్వేదం వైద్యుడు శేఖర్ సమస్యలు విని, “మరేం పర్లేదండీ, తగ్గించవచ్చు” అని ధైర్యం చెప్పి రెండు రకాల మాత్రలు, ఓ తైలం, ఓ టానిక్ ఇచ్చాడు. మందులు వాడేటప్పుడు శేఖర్ టానిక్ ను మినహాయించాడు. అది రక్తాన్ని శుభ్రం చేసి, వంట్లోని వేడిని తగ్గించడం కోసం ఉద్దేశింపబడ్డది. అది వాడక పోవడం వల్ల శరీరమంతా పొక్కులు వచ్చేసి, ఉబ్బిపోయింది. దాంతో ఆఫీసుకు పది రోజుల పాటు దూరమయ్యాడు. తరువాత ఎటువంటి సమీక్షా చేసుకోకుండా ఆయుర్వేద వైద్యాన్ని దూరం పెట్టేశాడు.

***

రాజశేఖర్ ప్రతి రోజూ ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక చదివేవాడు. అందులో సుప్రీం కోర్ట్ జడ్జీలు గానీ, హై కోర్ట్ జడ్జీలు గానీ తిరుమల సందర్శిస్తే ప్రత్యేకంగా వార్త వేసేవారు. ఆ పద్ధతి ఎందుకో శేఖర్ కి నచ్చేది కాదు. ఓ రోజు ఆఫీసు లో ఉన్నప్పుడు ఆ పత్రిక ఆఫీసు కు ఫోన్ చేసి ఈ విషయమై వాదనకు దిగాడు. ప్రక్క సీట్లోనే ఉన్న కిరణ్ అది గమనించాడు. ఫోన్ కాల్ పూర్తయ్యాక – “ఏంటి సార్ విషయం. ఫోన్ లో ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు” అని అడిగాడు కిరణ్. విషయం చెప్పిన శేఖర్ తో – “పాపం వాళ్ళేదో వార్తేసుకుంటే దానికెందుకు సార్ గొడవపడడం” అన్నాడు కిరణ్. “ఏం లేదు సార్ రేపొద్దున మా పిల్లలు మనం తిరుపతి వెళ్లినప్పుడు పేపర్ లో వార్త రాదేంటి. బహుశా నాన్న చేసేది చిన్న ఉద్యోగమేమో అనుకుంటారని” అని బదులిచ్చాడు శేఖర్. అవాక్కవ్వడం కిరణ్ వంతయ్యింది.

క్రమంగా ఇలా అవాక్కవ్వడం కిరణ్ కి అలవాటయ్యింది. శేఖర్ కి సోరియాసిస్ ఉండటం మూలంగా తరచూ తలనిండా పొట్టు బాగా వచ్చేసేది. అలా వచ్చినప్పుడల్లా శేఖర్ విపరీతమైన ఆత్మనూన్యతకి లోనయ్యేవాడు. గోరు చుట్టు పై రోకలి పోటులా అలా పొట్టు తరచూ వస్తుండడం వల్ల వెంట్రుకులకు డై వేయడం కూడా కుదిరేది కాదు. దాంతో తల అంతా తెల్ల వెంట్రుకుల మాయమయిపోయింది. ఇందువల్ల ఆటోలోను, బస్సులోను శేఖర్ కి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవి. బాబాయ్ అంటూ ఆటోవాడు, ఆ పెద్దాయనకు కాస్త సీటీవ్వండి అంటూ బస్ కండక్టరు శేఖర్ నూన్యతా భావాన్ని మరింత పెంచే వారు. తలలో ఇలా పొట్టు ఎక్కువగా ఉన్నప్పుడు కిరణ్ కి కూడా విచిత్ర అనుభవాలు రుచి చూపేవాడు శేఖర్. కిరణ్ కి ఏవైనా ఆఫీసు పత్రాలు అందజేసినప్పుడు కిరణ్ పత్రాలు తీసుకున్న వెంటనే “ఎందుకు సార్ అలా విసురుగా తీసుకుంటారు. చినిగి పోతాయి సార్ ఆ పేపర్లు” అంటూ తనలోకి తాను ముడుచుకు పోయేవాడు. అలవాటైన కిరణ్ మౌనంగా ఉండేవాడు.

శేఖర్ అప్పుడప్పుడూ కిరణ్ తో తాను కెరీర్ లో ఎదగలేక పోయానని ఈ సరికి ఏ జనరల్ మేనేజరో అయ్యి వుంటే నా వయసుకి సరిగ్గా సరిపోయి ఉండేదని బాధపడేవాడు. “ఈ జీవితం వృధా అయినట్టే కదా సార్” అంటూ వాపోయేవాడు. నిండా నదిలో మునిగి ఉన్న వాడికంటే ఒడ్డున ఉన్న వాడికి పరిస్థితి సరిగా బోధపడుతుంది. ఆ సిద్ధాంతాన్ననుసరించి తనకు చేతనైన రీతిలో ఏదో  హితబోధ చేసి ధైర్యం చెప్పేవాడు కిరణ్. శేఖర్ ఇంకా కెరీర్ లో ఎంతవరకూ ఎదగవచ్చో, ఎలా ఎదగవచ్చో తెలియజెప్పేవాడు. ఆ సమయంలో శేఖర్లో విపరీతమైన అంకితభావం, పట్టుదల చూసేవాడు కిరణ్. “పాపం, వర్క్ నేర్పుదాం, ఆయనకు తెలియనవి, తనకు తెలిసినవి చెబుదాం” అని మనసులోఅనుకునేవాడు కిరణ్. కానీ అతి కొద్ది రోజుల్లోనే పట్టుదల, అంకితభావం శేఖర్లో మాయమయిపోయేవి. ఏదైనా కొత్త పని నేర్పుదామని, ఆ కొత్త పనిని శేఖర్ ని చేయమని పురమాయించేవాడు కిరణ్. అలాంటప్పుడు ఆ బాధ్యతను తీసుకొనడానికి ఆసక్తి చూపేవాడు కాదు శేఖర్. ఈ పని ఆయనది, ఆయన జీతం తీసుకుంటున్నాడు, నేనెందుకు చేయాలి ఈ పనిని అని ఆలోచించేవాడు. ఆలోచనకనుగుణంగా బాధ్యతను తీసుకునేవాడు కాదు. పై డెస్క్ వర్క్ ను గమనించడం గానీ, డెలిగేట్ చేసినప్పుడు బాధ్యతను తీసుకోవడం గానీ చేసేవాడు కాదు. కానీ వర్క్ నేర్చుకుని గొప్ప జీతం, ఉన్నత స్థానం పొందాలని కోరిక మాత్రం ఉన్నది శేఖర్ కి. అదే శేఖర్ ఆలోచనా సరళిలోని వైరుధ్యం. వైచిత్ర్యం. ఇలా వ్యవహరిస్తున్నప్పటికీ, అప్పుడప్పుడూ తాను కెరీర్ లో ఎదగలేకపోయానని, ఈ జీవితం దేనికని కిరణ్ తో చెప్పుకుని బాధపడడం మానేవాడు కాదు. శేఖర్ మాటలకు, చేతలకు ఉండేటి వ్యత్యాసం అర్ధం చేసుకున్న తర్వాత మౌనంగా తలాడించడం మొదలుపెట్టాడు కిరణ్.

***

శేఖర్ చూస్తున్న కంపెనీలో అదే గ్రూప్ కి చెందిన ఇంకో వ్యాపారాన్ని చేర్చారు. దాంతో ఆ వ్యాపారానికి సంబంధించిన ఉద్యోగులు నలుగురు వచ్చి చేరారు. కొన్ని నెలల తరువాత ఏదో పనికి సంబంధించిన విషయంపై శేఖర్ ని నవీన్ కోప్పడ్డాడు. నవీన్ మాటలు పూర్తయ్యిన వెంటనే ఒక నిమిషం సమయమడిగి, తాను ఉద్యోగం మానేయాలనుకుంటున్నానని చెప్పాడు శేఖర్. “అదేంటి శేఖర్, మళ్ళీ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటావు, ఇప్పటికే కెరీర్ లో ఎదగలేక పోయానని బాధపడుతూ ఉంటావు” అని అన్నాడు. కానీ శేఖర్ ముఖంలో కచ్చితత్వం కనబడడంతో ఆ విషయాన్ని అక్కడితో ముగించేశాడు. ‘ఈ మనిషేంటో’ అని అనుకున్నట్లుంది అతని మొహం లోని భావం. కిరణ్ కి శేఖర్ నిర్ణయం పట్ల ఎటువంటి ఆశ్చర్యం కలుగలేదు. అతనికి శేఖర్ నిర్ణయం వెనకున్న కారణం తెలుసు. అది అతని అహమే. అహానికి తగిలిన గాయం. గాయం చేసింది కిరణో, నవీనో కాదు. ట్రాన్సఫర్ ద్వారా వచ్చిన కంపెనీ బ్రాంచ్ అకౌంటెంట్. అతని జీతం శేఖర్ కన్నా తొమ్మిది వేలు అధికం. అదే శేఖర్ అహం దెబ్బతినడానికి కారణం. నవీన్ తన నిర్ణయం తెలియజేసిన మూడో రోజే రాజీనామా పత్రాలను సమర్పించాడు. అదే రోజు సాయింత్రం, ’నేను ఉద్యోగం మానేశాను నీలిమ’ అని భార్యకు కూడా తెలియపరిచాడు.

***

ఉద్యోగం మానేసిన దగ్గర నుండి ఖాళీ సమయం ఎక్కువయ్యింది, తన గమ్యమేమిటో తెలియని గందరగోళమూ ఎక్కువయ్యింది. ఈ మానసిక గందరగోళం నుండి తప్పించుకోడానికి గుళ్ళకు వెళ్ళడం మొదలు పెట్టాడు. ఒక రోజు గుళ్ళో శ్రీ రామ కృష్ణ సేవా సమితి వారు హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం అనే పుస్తకాన్ని ఉచితంగా పంచుతున్నారు. శేఖర్ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని అక్కడే కూర్చుని పుటలు తిరగేయడం మొదలు పెట్టాడు. అందులోని అనేక ప్రశ్నలు తనకే వేస్తున్నట్లు, తన వ్యక్తిత్వ దోషాలను ప్రశ్నిస్తున్నట్లు అనిపించాయి శేఖర్ కి. పుస్తకం మూసేసి ఆలోచనలో పడ్డాడు.ఈ సారి బాహ్య పరిస్తితుల గురించో, వ్యక్తి గురించో కాక తన గురించే తాను తాను ఆలోచించుకోసాగాడు.....

*** సమాప్తం ***

Posted in May 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!