Menu Close
విలువైనది
-- ఏ. అన్నపూర్ణ --

ఆఫీసు నుంచి వస్తూ ఒక పది స్వీట్ బాక్సులు తెచ్చాడు రాజీవ్.

వాటిని చూడగానే రేఖకి వొళ్ళు మండిపొయింది. కానీ రాగానే పోట్లాట పెట్టుకోవడం ఎందుకని....సౌమ్యంగా
''నేను చెబుదామనుకుని మరిచిపోయాను. రెండురోజుల్లో దీపావళి. పని మనిషికి, కారు డ్రైవరుకు ఇరుగుపొరుగు వారికి స్వీట్స్ పంచాలి. యు ఆర్ వెరీ స్మార్ట్.'' అంది రాజీవ్ తెచ్చిన బాక్సులు తీసి బీరువాలో దాచిపెడుతూ.

''ఎక్సూజ్ మి మిస్సెస్ రేఖా ఇవి పంచడానికి కాదు. మనకే.....'' అన్నాడు ఒక బాక్స్ ఓపెన్ చేసి....తింటూ.”

“టీ తాగుతారా...” అంది కిచెన్లోకి వెడుతూ.

''కొత్తగా అడుగుతావేమిటి/తీసుకురా” అన్నాడు సోఫాలో కూర్చుని.

''ఏమీలేదు. ఆఫీసులో తాగారు కదా అని.....” టీ చేసి తెచ్చి స్వీట్ బాక్స్ ని అక్కడ నుంచి తీయబోయింది.

''అలావుంచు. ....తర్వాత నేను తీస్తాను...” అని వారించాడు...రాజీవ్.

టీతో బాటు బాక్స్ పూర్తిగా ఖాళీ అయినది.

''అదికాదండీ మొన్న బ్లడ్ టెస్టులో కొలస్ట్రాల్ ఎక్కువగా వుంది....నువ్వు స్వీట్స్ పూర్తిగా మానుకోవాలి ...అని డాక్టరుగారు చెప్పేరు. గుర్తువుందా?”

''ఆ...డాక్టరు అలాగే అంటాడు. నాకు స్వీట్స్ అంటే ప్రాణం. ప్రతి దానికీ భయపడుతూ బతకాలంటే నాకు చిరాకు....” అన్నాడు రాజీవ్.

''మీరు జీవించేది మీ ఒక్కరి కోసమే కాదు. నాకోసం, పిల్లలకోసం కూడా ''

''అదంతా ట్రాష్. నేను నా కోసమే జీవిస్తాను. ఇంకొకరి కోసం ఆలోచించను'' నిర్లక్ష్యంగా అన్నాడు రాజీవ్.

రేఖ చేసేదిలేక నిస్సహాయంగా ఉండిపోయింది.

రాజీవ్ కి రెండుసార్లు ప్రాణం మీదకి వస్తే డాక్టర్ చాల జాగ్ర్తత్తగా ఉండాలి. ఫుడ్ హాబిడ్స్ మార్చుకోవాలి. ఇది మీ ఫ్యామిలీ అందరికి జెనిటిక్ ప్రాబ్లం అని అన్నాడు.

కానీ వింటేగా ......పార్టీలకు వెళ్లడం మానడు. డ్రింక్ చేయడం మానడు. ఏడ్చి గోల పెడితే ''రేఖా! నీకు పిల్లలకు లోటు రాదు. వాళ్లకి పెళ్లి చేసాం. మూడు విల్లాలు వున్నాయి. ఇంకా బ్యాంకులో నాలుగు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ నీ పేరున వున్నాయి....నువ్వు కూడా లైఫ్ ఎంజాయ్ చేయి. నన్నుమాత్రం కంట్రోల్ చేయాలని చూడకు.'' అంటూ పెద్ద లెక్చరిస్తాడు.

లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే తినడం తాగడమేనా? మోయలేనన్ని నగలు కొనుక్కోవడమా..నాలుగు బీరువాల నిండా చీరలు నింపడమా...కాదు కదా! భార్య భర్తలు కలిసి ప్రపంచం చూడాలి. ఇద్దరూ ఒక్కటిగా ఉండాలి. కలిసి పార్టీలను చేసుకోవాలి. అందులో ఆరోగ్యకరమైన ఆహారము ఉండాలి. ఇద్దరు ముచ్చటపడి పుట్టినరోజుకి, పెళ్లిరోజుకి గిఫ్ట్లు ఇచ్చుకోవాలి.

అంతేకాని ఎవరిదారిన వాళ్లు కొనుక్కోడంకాదు. కలిసి తిరగాలి. ఒకరికోసం ఒకరు అన్నట్టు ఉండాలి.

పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్ళు ఒకరు UK, ఒకరు కెనడాలో వున్నారు. ఒకే ఒక్కసారి వెళ్లి పట్టుమని నెల రోజులు వుండలేదు. కంపెనీ వర్క్, ఇన్కమ్, బిజినెస్ అంటూ లెక్కలు వేస్తాడు.

ఇక రేఖ ఒక నిర్ధారణకు వచ్చింది. ''జరిగేది జరగనీ'' అని.

రాజీవ్ తల్లి తండ్రులు టైము నుంచి ఫామిలీ డాక్టర్ మధుకర్. ఆయనకు అందరి స్వభావము తెలుసు. ఏమి చేయగలడు?

రేఖ వంటలో ఎలాంటి కొలస్ట్రాల్ లేకుండా జాగ్రత్త పడుతుంది. కానీ ఆమె ఒక్కటే తింటుంది.

''ఇలా చప్పిడిగా తినలేను....అంటూ హోటల్నుంచి నాన్ వెజ్ తెప్పించుకుంటాడు. ఇవన్నీ తెలిసిన డాక్టర్ .....ఒకసారి రాజీవ్ జీవిత కాలం అంచనా వేసి రేఖతో ముందుగానే చెప్పేసేడు. ఈ విషయం పిల్లలతో చెప్పింది రేఖ.

''మీ డాడీ గురించి మీకు తెలుసు. నా అదృష్టం బాగుంది. మీరు ఆయనను చూసి నన్ను అర్థం చేసుకున్నారు. నాకు నచ్చేలా పెరిగారు. నాకు విలువ ఇచ్చారు. మీ డాడ్ అంటే భయం... ఆయన అలవాట్లను చీదరించుకుని ఎన్నటికీ మేము దారి తప్పము....బాగా చదువుకుంటాం అన్నారు చదివి నేను గర్వపడేలా స్థిరపడ్డారు. మీ డాడీ పట్ల మీకు అవగాహన వుంది. మీ మీద ఆయనకు తండ్రిగా ప్రేమ వున్నా ఖరీదైన వస్తువులు కొని ఇవ్వడం వరకే. మీతో గడిపింది చాల తక్కువ.

ఎప్పుడూ నా గురించే మీరు బాధ పడేవారు. మీకు ఒక నిజం చెబుతున్న ఏదో ఒక రోజు ''డాడ్ లేరు'' అని కబురు వస్తుంది. సిద్ధంగా వుండండి ధైర్యంగా వుండండి. అప్పుడు నేనిలా చేయదల్చుకున్న.... నన్ను శాసించేవాడు మీ డాడీ ఒక్కరే. ఆయనే లేకపోతె...........మీకు చెప్పాల్సిన బాధ్యత వుంది. నన్ను నేను నిలువరించుకుంటాను. మీరుకూడా .... రియాలిటీ తెలుసుకోవాలి.''

''మామ్! అవును నీకు ఆ అధికారం వుంది. నీలాంటి ''మదర్ ''ఉండటం మా లక్. డాడ్ ప్రవర్తన మమ్ములను ''జాగ్రత్త'' అని హెచ్చరించింది. మాకు హార్ట్ ప్రాబ్లెమ్ జీన్స్ లోనే ఉంటుందని తెలిసి జాగ్రత్తలు పాటిస్తూ నువ్వు చెప్పినట్టే నడుచుకున్నాం. నువ్వు మా ఆరోగ్యం కోసం పడే తపన అర్థం చేసుకున్నాం. డాడీని మార్చడానికి నువ్వు నీ కెరియర్నే వదులుకున్నావు. ఇంటి దగ్గిరే వుండేదానివి. డాడీ మమ్ములను హాస్టల్కి పంపాలని నీతో వాదన వేసుకుంటే ఎదిరించి 'నా పిల్లలు నా దగ్గర విలువలతో పెరగాలని ''అనాధల్లా'' అమ్మ నాన్నలకు దూరంగా ఉండటం సహించనని 'మా పట్ల ఎంతగానో శ్రద్ధ తీసుకున్నావు. అదంతా మేము ఎన్నటికీ మరిచి పోము మామ్!

ఇప్పుడు మా వంతు బాధ్యతగా నిన్ను చూసుకుంటాం ....ఇక్కడ నీకు ఎన్నో అవకాశాలు వున్నాయి నచ్చిన ఫీల్డ్ ఎంచుకుని సంతోషంగా వుండు......ఎడ్యుకేషన్ బిజినెస్ ఏదైనా అంటూ ...ప్రోత్సహించారు. రాజీవ్ సరైన దారిలో పయనించివుంటే ఆతడు కూడా నూరేళ్లు జీవించి పిల్లల అభివృద్ధిని చూసి సంతోషించేవాడు. నాకు ఈ ఒంటరితనం ఉండేదికాదు.

భార్యలు సంపాదనే లక్ష్యంగా భర్తను ఒత్తిడి చేయడం కొందరిలో ఉండవచ్చు. కానీ సంపాదన కొంత పరిధిలో ఉంటే కుటుంబం అంతా పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారు. లేదంటే అర్ధాంతరంగా వదులుకుంటారు. పిల్లలు స్థిరపడేవరకు డబ్బు అవసరం. ఆ తరువాత భార్య భర్తల జీవనానికి ముందు చూపుతో సేవింగ్స్ ఉండాలి. వస్తోంది కదాని ఖర్చు చేస్తూ ఆడంబరాలకు పోకూడదు. విల్లాలు లగ్జూరీ లైఫ్....పిల్లలకు సోమరితనాన్ని పెంచుతాయి. మా డాడ్ ఏదికావాలన్న కొని ఇస్తాడు....అనేకంటే ''నేను నాకోసం కష్టపడాలి అని శ్రమించి సాధించు కోవడంలో ఆత్మ విశ్వాసం ఉండాలి.....అనుకున్నవారు ఒక లక్ష్యం ఏర్పర్చుకుంటారు. అందుకు మదర్ సప్పోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ ఇచ్చిన రేఖ పిల్లలను తీర్చిదిద్దింది.

అప్పటి సంఘటన గుర్తుకు వచ్చింది.

''రేఖా నేను ఒక ఆలోచన చేసాను. పిల్లలను హాస్టల్కి పంపి నువ్వు నా కంపెనీలో చేరు. నా పేమెంట్లో సగం వస్తుంది. వాళ్ళని హయ్యర్ స్టడీస్ కి అమెరికా పంపవచ్చు.'' అన్నాడు ఒకరోజు రాజీవ్.

రేఖా ఆమాటకి అదిరిపడింది. ఇప్పటికే రాజీవకి 12k వస్తుంది. నేను కూడా సంపాదించవలసిన అవసరం లేదు. ఖాళీగా ఉంటే పోనీ టైం పాసుకి చేయడం వేరు. పిల్లలను దూరంగా పంపి జాబ్ చేయాల్సిన అగత్యం మాత్రం లేదు. ఇప్పుడు టీనేజి పిల్లలను హాస్టల్లో పెడితే చదువుమాట దేవుడెరుగు. తల్లి తండ్రి పిల్లల మధ్య అనుబంధాలు చెడిపోతాయి. డబ్బును సంపాదించుకోవచ్చు ఎప్పుడైనా. పిల్లల ప్రేమను పోగొట్టుకుంటే మాత్రం తిరిగి సంపాదించుకోలేము. ఈ విషయం ఆమెకు తెలుసు.

''నేను ఒప్పుకోను''......స్పష్టంగా చెప్పింది రేఖ.

''ఇంజినీరింగ్ ఎంటెక్ ఎంబీఏ చేసి ఇంట్లో కూర్చుంటావా ...ఆ డిగ్రీలు వేస్టు చేస్తావా? మరెందుకు చదువుకున్నట్టు! హేళన చేసాడు రాజీవ్.

''ఆ చదువు కోసం పదేళ్లు మా అమ్మ నన్ను హాస్టల్లో పెట్టింది. ఇష్టం లేకపోయినా అమ్మ నోటికి జడిసి నాన్న అమ్మ మాటను పాటించారు. అలా నేను ఇద్దరి ప్రేమా కోల్పోయాను. ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. మీరు ఏమన్నా చెప్పండి వింటాను. ప్లీస్. పిల్లలను మాత్రం నాకు దూరం చేయకండి....అంది కన్నీటితో.

''అర్ధం లేని సెంటిమెంట్లతో వాళ్ళను పాడు చేస్తున్నావు.'' అని విసుక్కుంటే పిల్లలు కూడా ధైర్యంగా ''మేము వెళ్లం ఇక్కడే ఇంటిదగ్గిరే ఉంటాం'' అని చెప్పి రేఖను అతుక్కుపోయారు. ముగ్గురు ఏకం అయ్యేసరికి రాజీవ్ కోపం వచ్చినా ఊరుకున్నాడు. అలా వాళ్ళను కాపాడుతూ వచ్చింది. దాని ఫలితమే ఈవేళ వాళ్ళు ''అమ్మని'' దగ్గిరకు తెచ్చుకున్నారు. జీవితకాలం భద్రంగా చూసుకుంటారు.

అవును వాళ్లకు తెలుసు. డాడ్ మా మీద ప్రేమకంటే డబ్బుకే విలువ ఇచ్చేరు. అందుకే ఆయనకు ప్రేమ దక్కలేదు. అందరిని విడిచి వెళ్లిపోయారు. ఏదైనా సంపాదించ వచ్చేమో....విలువైన అమ్మ ప్రేమ ఎక్కడా దొరకదు. అది వాళ్ళు వదులుకోరు.

*** సమాప్తం ***

Posted in May 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!