Menu Close
Galpika-pagetitle

సూపర్ షార్ప్ -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

శర్మగారికి పిల్లలతో ఆడుకోవడం అంటే సరదా. అందుకే ఆదివారం ఆయన పిలవగానే మా చింటూని కూడా తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. పలకరింపులు, క్షేమసమాచారాల్తో కాసేపు సరదాగానే గడిచింది. తరవాత మొదలైంది అసలు కథ.

శర్మగారు మా చింటూని పంథొమ్మిది ఏళ్ళెంత అని అడిగాడు. వీడు ముందే ఆంగ్లమాధ్యముడు. ఆ విషయం ఆయనక్కూడా తెలియాలిగా? అందుకే "అంటే నైంటీన్ సెవెన్సా?" అని ఎదురడిగాడు.

నాకు సమాధానం తప్ప ఎదురు ప్రశ్నలు అవసరం లేదన్నట్టుగా వాడివైపే మౌనంగా చూస్తూండిపోయారు శర్మగారు. దాంతో చింటూగాడు మనసులోనే గుణించుకుని చెప్పాడు, "వన్ థర్టీ త్రీ"

వాడు సమాధానం చెప్పినా ఆయనేమాత్రం స్పందించకుండా భావరహితంగా చూస్తూనే ఉండిపోయారు. చింటుగాడంటే సామాన్యుడు కాదు కదా, ఆయన ఉద్దేశాన్ని చిటికెలో పట్టేశాడు. అందుకే "సారీ అంకుల్. మీరు తెలుగులో అడిగిన ప్రశ్నకి ఇంగ్లీషులో సమాధానం చెప్పడం పద్ధతి కాదు. పంథొమ్మిది ఏళ్ళు నూట ముప్ఫై మూడు. అయినా మీరేంటంకుల్, ఇంత మాడర్న్ గా ఉన్నా తెలుగే మాట్లాడతారు అమాయకంగా?" అన్నాడు. దెబ్బతో శర్మగారికి దిమ్మ తిరిగిపోయింది. చివరికి ఏం చెయ్యాలో తెలీక, తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు, "ఐతే తెలుగులో మాట్లాడ్డం అమాయకత్వం అన్నమాట" అంటూ నావైపు చూసి నిట్టూర్చారు.

ఎంతైనా మావాడి తెలివే తెలివి. ఎంతటి మేధావినైనా ఇట్టే బురిడీ కొట్టించేస్తాడు. ఈ శర్మగారు మాత్రం తక్కువ తిన్నారా ఏంటి? చచ్చినా ఓటమినొప్పుకోడు. అందుకే ఇంకో ప్రశ్నవేశాడు, "పంథొమ్మిదేళ్ళు నూట ముప్ఫై మూడని ఎలా చెప్పావు?"

"కాలిక్యులేట్ చేసి"

“ఏం గుర్తు లేదా?"

"అవన్నీ గుర్తు పెట్టుక్కూర్చుంటే మైండ్ లో స్పేసంతా వేస్టయిపోతుంది"

ఇది నేను రోజూ ఆఫీసులో శర్మగారికి చెప్పే డైలాగే. ఎదుటివాళ్ళు చెప్పిన పని నాకిష్టంలేకపోతే నేను అదే డైలాగు చెబుతానని శర్మగారిక్కూడా తెలుసు. అందుకే ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సుకతని నా కళ్ళల్లో చూపించాను.

"స్పేస్ వేస్టవడానికి మెదడేమీ మెమరీ కార్డు కాదు. గుర్తు పెట్టుకునే విద్య నేర్చుకోకపోతే మైండ్ కి ఎక్సర్ సైజుండదు. అందుకే ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు, రైమ్స్ అన్నీ నోటికి నేర్చుకొమ్మంటారు. కంఠోపాఠం చెయ్యడం వల్ల జ్ఞాపక శక్తి పెంపొందుతుంది. నాలాగా వయసైపోతున్నకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతూ వస్తుంది. అలాంటప్పుడు గుర్తున్నా లేకపోయినా లెక్కలు వేసుకోక తప్పదు కాబట్టీ గుర్తుండనివన్నీ ఏదో విధంగా కాలిక్యులేట్ చేసి పబ్బం గడుపుకుంటాం" అనేసరికి ఆయన మావాడికి ఏదో క్లాసు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కనిపెట్టేశాను.

మా చింటూగాడు, "ఐతే బైహార్ట్ చేసి చెప్పమంటారా? జస్ట్ టెన్ మినిట్స్" అంటూ నా దగ్గర సెల్ తీసుకుని అందులో పంథొమ్మిదో ఎక్కాన్ని వెతుక్కుని మౌన పఠనం ప్రారంభించాడు. ఈలోగా శర్మగారి భార్య కాఫీ పెట్టుకొచ్చింది. మేం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగడం పూర్తిచేసి కప్పులు అలా కింద పెట్టామో లేదో శర్మగారి ముందుకొచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు చింటూ.

"అప్పుడే వచ్చేసిందా? అందులోనూ పంథొమ్మిదో ఎక్కం?? అంటూ ఆశ్చర్యపోయారు శర్మగారు. వాడు వెంటనే గడగడా అప్పజెప్పేశాడు. దాంతో చింటూవైపు అనుమానంగా చూస్తూ అడిగారు శర్మగారు, "ఈ ఎక్కం నీకు ముందే వచ్చుకదూ?"

"లేదంకుల్ ఇప్పుడే నేర్చుకున్నాను"

శర్మగారు టైము చూసుకుంటూ అన్నారు, "నీకీ ఎక్కం బైహార్ట్ చేసి చెప్పడానికి ఎంతటైం పట్టిందో తెలుసా? జస్ట్ సెవెన్ మినిట్స్. ఇంత తక్కువ టైములో పంథొమ్మిదో ఎక్కం నోటికి నేర్చుకోవడం అంటే మాటలు కాదు. ఇప్పుడు నాకో డౌటు. నీ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడేళ్ళుగా స్కూలుకి వెళ్తున్నావు. ఈ ఏడేళ్ళ కాలంలో నీకు ఈ ఎక్కం నేర్చుకోవడానికి ఏడు నిమిషాల సమయం దొరకలేదా? ఈ ఏడేళ్ళుగానూ నిన్ను ఎవరూ ఎక్కం నేర్చుకోమని చెప్పలేదా? లెక్కల మేస్టారు ఎక్కాలు అప్పజెప్పమని అడక్కుండానూ ఉండడు. అప్పజెప్పకపోతే పనిష్మెంటివ్వకుండానూ ఉండడు. పనిష్మెంటిచ్చినా కూడా నువ్వు నేర్చుకోలేదంటే అందుకు కారణం ఏమిటి? నీకు మీ మేస్టార్లంటే గౌరవం లేదా?"

"మీరు నన్ను ఎక్కాలెందుకడిగారు? మీరేమైనా మా మ్యాథ్స్ టీచరా? కాదు. ఐనా కూడా నేను ఆన్సర్ చెప్పాను. మీమీద గౌరవంతో టేబుల్ బైహార్ట్ చేసి చెప్పాను. ఈ రోజు సండే. మా మ్యాథ్స్ టీచరైనాసరే హాలీడే కాబట్టీ మ్యాథ్స్ గురించి అడక్కూడదు. అడిగినా చెప్పకూడదు. హాలీడే రోజు నో వర్క్ నో స్టడీస్. ఆదివారం కూడా చెప్పేట్టయితే శలవివ్వడం ఎందుకు?" ఆయనెంత సీరియస్ గా అడిగారో వీడూ అంతే సీరియస్ గా చెప్పేసరికి శర్మగారి ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు.

అందుకే నన్ను పక్కకి తీసుకొచ్చి జాలిగా మొహం పెట్టి తన గోడు వెళ్ళబోసుకున్నారు, "మేస్టారూ, ఇది మీ డైలాగే. మీకు శని ఆదివారాలు శలవు. కానీ కంపెనీకి శలవు కాదు కదా, కాబట్టీ మీరు చేసిన పనిలో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చెయ్యగలిగింది మీ ఒక్కరే. కానీ మీరేమో స్విచ్చాఫ్ చేసుక్కూర్చుంటారు. దాంతో అందరూ నా మీద పడతారు. మీకే కాదు, నాకూ శలవే కదా?"

"చూడండ్సార్, శలవురోజంతా మా అబ్బాయితో ఎంజాయ్ చెయ్యడానికి నా పద్ధతి నేను కనుక్కున్నాను. మీ పద్ధతి మీరూ కనుక్కోండి. అంతేగానీ ఎదుటివాళ్ళని తప్పులు పట్టాలని చూడకండి. అది నెగెటివ్ థింకింగ్ కి దారి తీస్తుంది" అంటూ చెబుతూంటే ఆయన నవ్వాలో ఏడవాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు.

ఆనక తన ఓటమిని ఒప్పేసుకుంటూ, నాకు నచ్చజెబుతున్నట్లుగా "వాడికన్నీ మీ లక్షణాలే వస్తున్నాయి. అది వాడి భవిష్యత్తుకి మంచిది కాదు" అన్నారు.

"వాడెంత షార్పో మీరూ చూశారుగా? అయినా మీ పిచ్చిగానీ, కొబ్బరి చెట్టు మామిడి కాయలు కాస్తుందా?" అంటూ నేను వివరించి చెబుతుంటే ఆయన మారు మాట్లాడలేక మౌనం వహించారు.

పేరాశ ప్రియురాలు - తెనుగుసేత: డా.కోడూరు ప్రభాకరరెడ్డి - English Original: A Lickpenny Lover - O Henry

ఆ పెద్దబజారు దుకాణంలో పనిచేసే 300 మంది అమ్మాయిల్లో మ్యాసీ(Masie) ఒకటి. 18 ఏళ్ల వయసున్న ఆమె పురుషుల గ్లవ్స్ కౌంటర్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది. మ్యాసీ జుట్టు, శరీరం రాగి వర్ణంతో ఎంతో అందంగా ఉంటుంది.

ఒకరోజు ఇర్వింగ్ కార్టర్ (Irving Carter) అనే కవి, చిత్రకారుడు, కార్ల వ్యాపారి, ఆపైన కోటీశ్వరుడు ఆ దుకాణానికి వచ్చాడు. స్వతహాగా అతడా దుకాణానికి రాలేదు. అతని తల్లి కంచు విగ్రహాలను కొనటానికి కార్టర్ ను బలవంతాన బయలుదేరదీసింది. దుకాణంలో కార్టర్ పచార్లు చేస్తూ కొంచెం సమయం గడపటానికి గ్లవ్స్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు. నిజంగా అప్పుడతనికి గ్లవ్స్ అవసరముంది. ఎందుకంటే గ్లవ్స్ తెచ్చుకోవటం మర్చిపోయాడతడు. గ్లవ్స్ కౌంటర్ దగ్గర జరిగే సరస సల్లాపాల గురించి అతనికేమీ తెలియదు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లే సరికి అతనికే తెలియని మన్మథావస్థకు గురైనాడు. ఇద్దరు, ముగ్గురు అల్లరి చిల్లర యువకులు విచిత్ర వేషధారణతో కౌంటర్ పైన వాలిపోయి గ్లవ్స్ ను గెలుకుతూ ఉంటే  సేల్స్ గర్ల్స్ వగలు పోతుండటం చూశాడు కార్టర్. అతడు వెనక్కు వచ్చేసేవాడే! కానీ కౌంటర్ లో ఎదురుగా మ్యాసీ కనిపించి 'ఏం కావాలి?' అన్నట్లు అందంగా, హాయిగా కార్టర్ ను చూసింది. హుందాగా ఉన్న కార్టర్ ముఖంలో అప్పుడు రాగచ్చాయలు పొడసూపాయి. కానీ ఆ స్థితి బిడియం, సంకోచాల వల్ల వచ్చింది కాదు. వెకిలి చేష్టలు చేసే యువకుల వరుసలో తాను కూడా ఉన్నాడా అనే అనుమానం కలిగింది కార్టర్ కు. తాను కూడా కౌంటర్ పైకి వంగి సేల్స్ గర్ల్ అభిమానం సంపాదించాలని ప్రయత్నం చేశాడు. ఆ క్షణంలోనే మ్యాసీని తన సొంతం చేసుకోవాలనే కోరిక మనసులో బలంగా నాటుకుంది.

గ్లవ్స్ కొని వానిని ప్యాక్ చేశాక కొంతసేపు అక్కడే తచ్చాడుతూ మ్యాసీ గులాబీ బుగ్గల మీద గుంటలు పడటం గమనించాడు కార్టర్. గ్లవ్స్ కొనిన మిగతావాళ్ళు కూడ అలాగే అక్కడక్కడ తచ్చాడుతున్నారు. మ్యాసీ కౌంటర్ పై మోచేతిని ఆన్చి వంపులన్నీ కనబడేటట్లు వయ్యారంగా నిలబడి ఉంది. ఇటువంటి పరిస్థితిని కార్టర్ ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ అమ్మాయిని బైట తానెప్పుడూ కలుసుకోవటం కుదరదు. సేల్స్ గర్ల్స్ ప్రవర్తన ఎలా ఉంటుందో తాను వినిన, చదివిన వానినుండి గుర్తుకు తెచ్చుకున్నాడు కార్టర్. వాళ్ళు సాధారణ పరిచయాలను ఎప్పుడూ కోరరని ఊహించాడు. ఒక అందమైన కన్యకు తన కోర్కె తెలపాలనుకుంటేనే గుండె వేగంగా కొట్టుకోసాగింది అతనికి. కానీ తన భావావేశం కార్టర్ కు ధైర్యాన్నిచ్చింది. సాధారణ విషయాలపై స్నేహపూర్వక సంభాషణల అనంతరం కౌంటర్ పైనున్న ఆమె చేతిలో తన విజిటింగ్ కార్డు పెట్టాడు కార్టర్.
"మీరు నన్ను క్షమించాలి! నేను చొరవ తీసుకుంటున్నానని అనుకోవద్దు. మిమ్మల్ని మరోసారి కలుసుకొనే అవకాశం నాకు కలిగిస్తారని కోరుకుంటున్నాను. ఆ కార్డులో నా  పేరున్నది. మీ మీది గౌరవభావంతో అడుగుతున్నాను- నన్ను మీ స్నేహి...అదే...పరిచయస్థునిగా అంగీకరిస్తారని భావిస్తున్నాను" అన్నాడు కార్టర్.

"తప్పకుండా మీరు చెప్పేది నిజమే. సామాన్యంగా నేను కొత్త వ్యక్తులతో బయటికి వెళ్ళను. ఇది స్త్రీ ప్రవృత్తికి నప్పదు. సరే! మీరు నన్నెప్పుడు కలుసుకోవాలనుకుంటున్నారు?" ఏ సంకోచమూ లేకుండా చిరునవ్వు చిందిస్తూ అంది మ్యాసీ.

"ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా-మీ ఇంట్లో కలుసుకోవటానికి అనుమతిస్తే..." కార్టర్ ఉత్సాహంగా అడిగాడు.

మ్యాసీ గల గలా నవ్వుతూ "ఓ! వద్దు వద్దు. మేము అయిదు మందిమి మూడు గదుల ఇంట్లో ఉన్నాం. మా అమ్మ అందుకు ఒప్పుకోదు" అంది.

"అయితే మరెక్కడైనా - మీకు సౌకర్యంగా ఉండే చోట..." అన్నాడు కార్టర్.

"గురువారం రాత్రి అయితే నాకు అనువుగా ఉంటుంది. మీరు 8వ కాలనీ 48వ వీథికి 7.30కు రండి. ఆ వీథి మలుపులోనే నేనుండేది. తిరిగి నేను 11కు ఇంటికి వెళ్ళాలి. 11 తర్వాత అమ్మ నన్ను బైట తిరగనివ్వదు." అంది మ్యాసీ.

తమ సంకేత స్థలాన్ని, నిర్ణీత సమయాన్ని ఖాయపర్చుకొని కార్టర్ గబ గబా తల్లిని కలుసుకోవటానికి వెళ్ళాడు. చిన్న కళ్ళు, మొద్దు ముక్కు గల మరొక సేల్స్ గర్ల్ స్నేహాభావంతో క్రీగంట చూస్తూ మ్యాసీ దగ్గరికి వచ్చింది.

"ఆ ధనవంతునితో స్నేహం కుదిరిందా మ్యాసీ?" చనువుగా అడిగింది.

"మళ్లీ కలవటానికి అనుమతి అడిగాడు అతడు" అంటూ అతడిచ్చిన కార్డును బ్లౌజ్ పాకెట్ లో దాచుకుంది మ్యాసీ.

"కలుసుకోవటానికి అనుమతా?" వ్యంగ్యంగా అంటూ "వాల్డార్ఫ్(Waldorf)లో డిన్నర్ గురించి, ఆ తర్వాత తన కారులో సరదాగా తిరగటం గురించి ఏమైనా చెప్పాడా?" అడిగిందా సేల్స్ గర్ల్.

"ఓ...ఆ విషయాన్నొదిలేయ్! నువ్వు గోరంతలు కొండంతలు చేస్తావ్. అతడు వాల్డార్ఫ్ గురించేమీ చెప్పలేదు. కానీ అతని కార్డులో 5వ వీథి చిరునామా ఉంది. అతడు డిన్నర్ కు ఆర్డరిస్తే వెయిటర్ కు చిల్లి గవ్వ కూడా టిప్ ఇచ్చేలా లేడు" అంది మ్యాసీ నిరాసక్తంగా.

నిర్ "బంధం" -- గౌరీ కాసాల

"సరితా ఇవాళ రవికి మన ఏరియాలో డ్యూటీ పడిందిట. ముందు మన ఇంటికి వచ్చేసి మనందరికి ఒకసారి హాయ్ చెప్పి తర్వాత డ్యూటీ లోకి వెళ్తానన్నాడు... అన్నాడు సుధీర్ భార్యతో.

ఆ మాటలు వింటూనే ఎగిరి గంతేసింది సరిత. "రవి అంటే మీ కజిన్ కదూ డిఎస్ పి నో, ఎస్ పి నో కదా ! అతని ద్వారా పర్మిషన్ సంపాదించ కూడదూ.. కాస్త బండి మీద నాలుగు వీధులు తిరిగి ఊపిరిపీల్చుకు వద్దాం..." అంది సరదాగా.

"అబ్బా...బావుండదేమో సరితా. వాడు మామ్మ ని చూడటానికి వస్తున్నాడు. వాడి పని ఏమిటో.... వాడి పరిధి ఎంతవరకో ఏంటో మనకి తెలియదు గదా.." అన్నాడు సుధీర్ ఇబ్బందిగా..

"నాకు తెలుసు మీరిలా ఏదో సొడ్డు చెప్తారు. మీకేం చిన్నప్పటినుంచి మామ్మ కూచి గా పెరిగారు కదా... ఇంటి పట్టున ఉండటం మీకు సరదా నే..."

"అబ్బా వాడు వచ్చే ముందు మూడ్ ఆఫ్ చేయకు.. చాలా రోజులైంది వాణ్ని చూసి. వీలుంటే అడుగుతాలే" విసుగుని దాచుకుంటూ అన్నాడు సుధీర్..

అక్కడే కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న సుందరమ్మ గారు మనవరాలు తన గురించి అనేసరికి తలెత్తింది, "ఏమిటి అమ్మాయి ఏమంటున్నావు  నువ్వు... పాపం సీఎం నుంచి సినిమా యాక్టర్ ల వరకు అందరూ బయటకు వెళ్ళవద్దని... దండంపెట్టి పాటలు పాడీ బతిమలాడుకొంటున్నారు కదా!! అంత అవసరం ఏమి వచ్చింది నీకు. గట్టిగా అడిగింది మామ్మ గారు.

హు.. మీకేం తెలుసు మామ్మగారూ, మీరు ముసలివారు అయిపోయారు కాబట్టి వంటలూ, వత్తులు చేసుకుంటూ గడిపేస్తున్నారు... బొత్తిగా బయటికి వెళ్లకుండా నెల రోజులు బట్టి ఇంట్లో ఉండటం అంటే మా లాంటి వయసులో వున్నవారికి ఎంత కష్టమో మీకేం తెలుసు. ఈ "గృహనిర్బంధం" భరించలేక పోతున్నా... అంది కొంచెం విసురుగా ఇంకొంచెం నిరసనగా.

ఏమంటున్నావమ్మాయ్ ముసల్దాన్ని కాబట్టి ఇంటిపట్టునే ఉంటున్నానా! నేనూ పుట్టడమే ముసలిదానిగా పుట్ట లేదుగా... పదిహేనో ఏట కాపురానికి వచ్చేను. వీడి ముత్తాత గారికి అంటే మా మామ గారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. మీ ముత్తాత గారి రాజసం నీకేం తెలుసు... కూతుళ్లని ఉన్న ఊర్లో ఇవ్వడం వల్ల ఎప్పుడూ ఇక్కడే వుండే వారు. సూర్యోదయం కన్నా ముందే లేచి పిల్లలకి పాలు పెద్దలకి కాఫీలు చూసేసరికి టిఫిన్ టైమ్ అయ్యేది. టిఫిన్ అయ్యేసరికి మధ్యాహ్నం వంటకి ఉపక్రమించే వాళ్ళం. ఈ లోపలే పిల్లల్ని తయారుచేయడం ఆడపిల్లలకు అయితే జడలు...బొట్టు కాటుక దిద్దటం ఇవి అదనం.. పేరుకి నలుగురo కోడళ్ళయినా పనికి ఇద్దరమే ఉండేవాళ్ళం. మిగతా ఇద్దరిలో.. చూలింతో బాలింతో. ఇంకొకటో అయ్యేవారు. వాళ్ళకి పథ్యం వంట విడిగా....మధ్యాహ్నం మహా అయితే ఒక అరగంట సమయం చిక్కేది. మళ్లీ నిద్రపోతే గీరగా ఉంటుందని వంటింటి గుమ్మం మీద చీర కొంగు పరచుకొని పడుకునే వాళ్ళం. మళ్లీ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు వాళ్ళకి చిరుతిళ్ళు.. పెద్దవాళ్ళకి కాఫీలు రాత్రి వంట.... తెల్లవారుజామున వంటింట్లోకి అడుగు పెడితే రాత్రి పదింటికి బయట పడేవాళ్ళం. అంటే నీ వయసులో నా జీవితమంతా వంటింట్లోనే గడిచిపోయింది. అప్పటిదాకా కొంచెం ఆవేశంగా మాట్లాడిన మామ్మగారి గొంతు ఉన్నట్టుండి మార్దవమై పోయింది. "ఒక మాట చెప్పనా అమ్మాయ్ మేమెవ్వరం కూడా దాన్ని నిర్బంధం అనుకోలేదు. పెద్దలకి పిల్లలకి ఒకోసారి బాలింతలకు ఆలనా పాలనా చూడటంలోఎంతో ఆనందం పొందేవారం.

మీ తరం వచ్చేసరికి చిన్న చిన్న కుటుంబాలు ఒకరో ఇద్దరో పిల్లలు అందుకే బయట తిరగటాలూ... అంత పెద్ద కుటుంబంలో అలవాటుపడ్డ నేను ఇప్పుడు మీ దగ్గర ఒంటరిగా ఉండటం లేదూ ..పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించ గలిగిన వివేకం మానవులకి ఇచ్చాడు భగవంతుడు..కొంచం ఉపయోగించు.. పాత రోజులు తలచుకోవడంతో గొంతుగద్గదమైంది సుందరమ్మ గారికి.

"మామ్మా" పిలుస్తూ దగ్గరికి వెళ్ళబోయాడు సుధీర్.

ఎప్పుడొచ్చాడో ఏమో రవి సుధీర్ని చెయ్యిపట్టి ఆపి మామ్మ గారికి దగ్గరగా వెళ్లి క్లోజప్ తీసాడు..... మొబైల్ స్విచాఫ్..చేసి ఎక్సలెంట్.. ఎక్సలెంట్...అంటూ కాళ్ళకి దణ్ణం పెట్టి చెమర్చిన కళ్ళతో వెళ్ళిపోయాడు.

రంగు తరగని పుటలు -- డా. వాసిలి

కలలు జీవించడానికే! టీనేజీ సైకాలజీ

‘‘నమస్కారం అంకుల్.. నేను వకుళని’’

‘‘చెప్పమ్మా.. ఎలా ఉన్నావ్..?’’

‘‘బాగున్నాం అంకుల్.. వచ్చే శనివారం గృహప్రవేశం.. మీరు రావాలి’’ అంటూ ఆహ్వానం.

“ష్యూర్.. వస్తామమ్మా’’ అన్నాను.

మా అమ్మాయి ఉంటున్నది మిచిగన్ స్టేట్ కాపిటల్ లాన్సింగ్లో. వకుళ ఉండేది డెట్రాయిట్ దగ్గిరలోని ఫార్మింగ్టన్లో. అక్కడికి గంట ప్రయాణం. వకుళ ఉద్యోగం చేస్తున్నది లాన్సింగ్లో. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట వచ్చిపోవటానికే సరిపోతుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో పది గంటలన్నా పని చేయాల్సిందే! అంటే రోజులో పన్నెండు గంటలు వృత్తికే సరిపోతుంది. మిగతా పన్నెండు గంటలే పర్సనల్ లైఫ్. అందులో ఎంతకాదన్నా ఆరు గంటలు నిద్రకు. మిగిలింది ఆరు గంటలే జీవితం. మిగిలిన ఆరు గంటలలోను వండి వార్చటానికి ఓ రెండు గంటలు. డ్రెసెప్, రెడీ కావటం వగైరాలకు మరో గంట. ఇక మిగిలింది మూడు గంటలు. ఈ మూడు గంటలలోనే భర్త పనులు, పిల్లల పనులు ప్లస్ ఇంటి పనులు.. ఇన్ని పనుల మధ్య, ఇంత టైట్ షెడ్యూల్లో జీవితంలో ‘నేను’ మిగులుతుందా? అసలు- ‘జీవితమే నేను’ కావటానికి బదులు ‘జీవితంలో నేను ఎక్స్ట్రా’ అవుతోందా? అనిపిస్తుంటుంది.

****

దాదాపు మూడువేల చదరపు అడుగుల లివింగ్ స్పేస్... పేరుకే డూప్లెక్స్ కానీ బేస్మెంట్ కలుపుకుంటే ట్రిప్లెక్స్ అని చెప్పుకోవచ్చు. నాలుగు గదులు ప్లస్ కిచెన్ ప్లస్ కింద ఒక పెద్ద హాల్, పైన ఒక పెద్ద లివింగ్ హాల్. ఉండేది భార్యాభర్తలు ప్లస్ ముద్దుల కొడుకు. ఆర్కిటెక్చర్ అండ్ ఎలివేషన్ చాలా బాగుంది. చాలా కాస్ట్లీగా ఉంది.

‘‘ఎక్స్లెంట్ వకుళా! నీ టేస్ట్ నచ్చింది. నేను ఇప్పటిదాకా చూసిన వాటిల్లో నీదే బెస్ట్ హౌస్!’’ అన్నాను.

‘‘థాంక్స్ అంకుల్.. ఇది నా డ్రీమ్ హౌస్. నా పదహారేళ్ల ప్రాయంలో నేను కన్న కలను సాకారం చేసుకోవటానికే అమెరికా వచ్చాను. ఆ కల వాస్తవ రూపంలోకి రావటానికి పదహారేళ్ళు పట్టింది’’.

‘‘ఇంటి అప్పు తీర్చటానికి మరో పదహారేళ్లు పడ్తుంది’’ అన్నాను సరదాగా.

‘‘భయపడాల్సింది లేదు కానీ, కాస్త వర్రీగా అనిపిస్తున్న మాట మాత్రం నిజం. నా జీతం దాదాపుగా లోన్ తీర్చటానికి, ప్రాపర్టీ టాక్స్ పే చేయటానికి సరిపోతుంది’’ అంది వకుళ కాస్త దిగాలుగా. అయినా తీర్చగలనన్న ధైర్యమూ, ఏ పరిస్థితులనైనా ఫేస్ చేయగలనన్న ఆత్మ విశ్వాసమూ ఆమె మాటలలో ప్రతిధ్వనించింది.

‘‘అంటే నీ కల ఖరీదు- నీ ప్రొఫెషనల్ లైఫ్ అంత. రోజులో సగ భాగం అంత!’’ అన్నాను- నాదైన ధోరణిలో.

చురుక్కున చూసింది వకుళ. ‘వాట్ డు యు మీన్’ అన్నట్టున్నాయి ఆ చూపులు.

‘‘అంకుల్ మీ తరానికి నా ఈ ప్రయాణం, ఇంత ఖరీదైన ఇల్లు కట్టుకోవటం ఒక ఎక్స్ట్రా మైల్ అనిపించవచ్చు. నా మనస్తత్వానికి కలుపుకున్న ఈ మరో మైలు ప్రయాణమే లక్ష్యం. అప్పుడే గమ్యం చేరుకున్నట్లు. ఈ ఒక్క మైలే నాదైన మైలు కింద లెక్క’’.

‘‘దటీజ్ వకుళ... జీవితానికి ఎక్స్ట్రా మైలే మైల్స్టోన్ అవుతుంది కదా’’ అంటూ అభినందన పూర్వకంగా తననే చూస్తున్నాను. అయినా నాలో తిరుగాడుతున్న ఆలోచనలను పసిగట్టినట్లుగా-

‘‘నాకొక అన్నయ్య... నేను చదువుకుంటున్న రోజుల్లో ... ‘వై బాదర్!’ అనేవాడు నా సిన్సియారిటీని చూసి. నేను పట్టుదలగా చదువుతుంటే వాడు బలాదూర్గా తిరుగుతుండేవాడు. ‘ఇలాగైతే ఎలా బ్రదర్! గివ్ ఎ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్’ అనేదాన్ని. వాడికి నా మాటలు ఎఫెక్టివ్గా అనిపించేవికావు. నేను మాత్రం నా పట్టుదలను వదలలేదు. బిటెక్ పూర్తిచేశాను. ఇండియాలోనే కొంతకాలం ఉద్యోగం చేసి అమెరికా వచ్చాను. ఇప్పుడు మేం ముగ్గురం గ్రీన్కార్డు హోల్డర్స్. మరో ఏడాదిలో సిటిజన్ షిప్ వస్తుంది కూడా. కష్టపడ్డా, కష్టపడుతున్నా నా కలను సాకారం చేసుకోగలిగాను. పదహారేళ్లలో కట్టాల్సిన లోన్ ఏ ఏడేనిమిదిళ్లలో కట్టెయ్యగలనన్న నమ్మకముంది. ఫార్టీ ఇయర్స్ ఏజ్లో నేను ఫ్రీ అయిపోతాను’’.

‘‘అంటే రిటైర్ అవుతావా?’’ అన్నాను.

‘‘కాదంకుల్, రిలాక్స్డ్గా జీవించడం ప్రారంభిస్తాను... కలలను పెంచుకోవటం మానేస్తాను.. ఈ ఒక్క ఎక్స్ట్రా మైల్ దాటగలిగితే చాలు... నిశ్చింత. అయినా ఇక్కడ అంటుంటారు ‘గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్’ అని. మన భాషలో ‘డు యువర్ బెస్ట్’ అని. జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మరికొన్ని అడుగులు వేస్తూ కనిపిస్తున్న మైలురాయిని దాటగలనన్న కాన్ఫిడెన్స్ ఉంది’’.

భోజనాలు ముగించుకొని వచ్చేస్తుంటే- మాడమ్ చేతిలో వకుళ ఒక గిఫ్ట్ ప్యాక్ పెట్టింది.

‘‘ఇదేమిటమ్మా..! మమ్మల్ని గిఫ్ట్ తీసుకురావద్దని చెప్పి నువ్వు ఇలా గిఫ్ట్ ఇవ్వటం ఏంటి?’’ అన్నాను.

‘‘అంకుల్ మీరు రావటమే గిఫ్ట్. దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ ఆత్మవిశ్వాసం.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో జీవించేలా మమ్మల్ని ఆశీర్వదించండి.. మీ అందరికీ ఆత్మీయురాలిగా ఉండేటట్లు బ్లెస్ చేయండి చాలు’’ అంది వకుళ.. ఆమె కళ్ళలో తడి...

***

అసలు వకుళలా టీనేజ్లోనో, స్టూడెంట్గానో ఎంతమంది కలలను అర్థవంతమైన జీవితం వైపు మళ్లించగలుగుతున్నారు? కల అన్నదానికి అర్థం తెలుసా? అని. ‘బాయ్ మీట్ గర్ల్ కథలేనా- కల అంటే! భావి జీవితాన్ని కలలో చూసుకోలేమా? కలలోని జీవితాన్ని సాకారం చేసుకోలేమా?

జీవితమే ఒక అవార్డ్. దాన్ని మించిన అవార్డులు, రివార్డులు ఎక్కడినుండో పుట్టుకురావు. జీవితాన్ని ప్లాన్ చేసుకోగలిగితే, లైఫ్ ప్లానింగ్ సాధ్యమైతే, ఇతర అవార్డుల కోసం వెంటపడటం ఉండదు. ఇతర రివార్డులకు ప్రాకులాడటం జరగదు. నిజానికి వర్తమానమే ఒక అవార్డ్. భవిషత్తే ఒక రివార్డ్. కష్టపడాలంటే తగిన ఫలితం ఉంటుందో? లేదో? అని వెనకడుకు వేస్తుంటాం. అలా ఎంతో నష్టపోతుంటాం.

రెండు పక్కన రెండు చేరేవరకు విద్యార్థి జీవితమే. కాన్వకేషన్లోనో, గ్రాడ్ వాక్లోనో ఇచ్చే డిగ్రీలను అందుకుతీరవలసిందే. ఈ డిగ్రీలు ఉద్యోగం సంపాదించేందుకు పనికొచ్చే సర్టిఫికెట్లు అనుకుంటే ఎలా? విద్యార్థి జీవితంలో ప్రోది చేసుకున్న ఆత్మ విశ్వాస ప్రతీకలుగా వీటిని పరిగణించలేమా? భవిష్యత్తుకు వేసే నిచ్చెనకు భూమిక- విద్యార్థి జీవితం. పాదం నిచ్చెనపై చేర్చితే మొదటి మెట్టుపైనే ఒక కాలు ఉంటుంది. రెండో పాదం మరో మెట్టు దిశగా లేచి ఉంటుంది. అంటే ఇక అధిరోహణే. మెట్టునుండి మరో మెట్టును చేరుకోవటమే జీవితం. నిచ్చెన అంత ఎత్తులో పట్టు కోల్పోకుండా ఉండగా లేనిది- మనమూ అంత ఎత్తుకు చేరుకుని నిలదొక్కుకోలేమా? నిచ్చెనకున్న పట్టు మనకు లేదు అనుకుంటే ఎలా? మన పట్టుదలే మన ఆటిట్యూడ్. పాజిటివ్గా ఉన్నంత కాలం మనకు అన్నీ అవార్డులే, రివార్డులే.

టీనేజ్లోనే ఇల్లు కట్టుకోవాలన్నది కలగా బయటికొచ్చిన అంతరంగం. ఇంజనీరింగ్ చేస్తూ స్టూడెంట్ లైఫ్లోనే తన ఇంటిని మానసికంగా డిజైన్ చేసుకోగలిగింది వకుళ. తన ఇంటికి సంబంధించి పర్మినెంట్ స్ట్రక్చర్తో ప్రొఫెషనల్ లైఫ్ ప్రారంభించింది. తన కల ‘డే డ్రీమ్’ కాకూడదన్న పట్టుదలతో, ప్లానింగ్తో ఫ్యామిలీ లైఫ్లో చక్కటి హోమ్మేకర్ కాగలిగింది. కుటుంబ వాతావరణంలో తన డిజైన్కు రంగులను అద్దింది. సేవింగ్స్తో ఫౌండేషన్, రూఫ్లను పూర్తిచేసింది. క్రెడిట్తో గోడలను లేపి కలర్ఫుల్ హౌస్ను జీవితం ముందుకు తెచ్చుకుంది. తన చాయిస్తో, ఆటిట్యూడ్తో గృహప్రవేశం చేసింది. టీనేజ్లో కలలుకన్న ఇంటిలో, హోమ్మేకర్గా కట్టుకున్న ఇంటిలో వర్తమాన జీవితం ప్రారంభించింది. ఇక భవిష్య జీవితమంతా ఈ ఇంటనే. నా దృష్టిలో వకుళ చేసింది ఇంటిని కట్టుకోవటం, గృహప్రవేశం కాదు. కలను సాకారం చేసుకోవటం జీవితాన్ని పండించుకోవటం, భవిష్య జీవితాన్ని కళ్లముందు నిలుపుకోవటం.

ఇక జీవితం కల కాదు... జీవించటానికే!

వకుళ కట్టుకున్నది ఇల్లు మాత్రమే కాదు.. చేతికొచ్చిన డిగ్రీ.. చేస్తున్న ఉద్యోగం.. ముడిపడిన కుటుంబం- అన్నీ తనకు తానుగా కట్టుకున్నదే. టీనేజ్లో స్టూడెంట్గా కన్న కల... హోమ్ మేకర్గా సాకారం చేసుకున్న కల... లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని నిర్వచించుకోదగ్గ కల.

(Published in Andhra Bhoomi Telugu Daily in 28th March 2013 issue under my column Teenage Psychology)

Posted in May 2022, కథానికలు

1 Comment

  1. కరణం శ్రీపాద రావు నాచారం 9440419743

    మన దేశం గురించి,మన సంస్కృతి గురించి కూడా రాబోయే సంచికలో మా మంచి వకుళ ఆలోచిస్తుందని ఆశిస్తున్నా!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!