Menu Close
Page Title

దివిసీమలో ఒక కాళరాత్రి ప్రకృతి విలయతాండవం

నా అనుభవ సంగ్రహాలయంలో నుంచి తొంగిచూసిన కొన్ని ప్రగాఢ స్మృతులు, నాపై తీవ్ర ప్రభావాన్ని చూపిన ఉదంతాలలో ఒక్కటి ఇక్కడ పొందుపరచాలని, ఆనాటి చరిత్ర తెలియని ఈతరం వారికి తెలియజెప్పే ఉద్దేశ్యంతో వివరిస్తున్నాను.

అది 1977 వ సంవత్సరం నవంబరు మొదటి వారం. నేను 'ఆంధ్ర ప్రదేశ్ టెలీకమ్యూనికేషన్స్' లో యాంత్రిక వ్యవస్థాపన విభాగంలో సహాయ ఇంజనీర్ గా జేరి అప్పటికి కొద్దినెలలే అయింది. అప్పటికి ఇంకా కావలసినంత స్వయంచాలక అనుసంధాన శక్తిగల యంత్ర పరికరాలు తయారుచేసే సామర్ధ్యం దేశంలోనే కుంటుపడడం వల్ల, తయారయినవి అవసరమైన అన్నిచోట్లకి అందకపోవడం వల్ల ఇంకా నిజామాబాదు, కర్నూలు, ఏలూరు, తెనాలి, నెల్లూరు వంటి కొన్ని పెద్ద నగరాలు కూడా స్వయంచాలక దూరసంచార కేంద్రాలకు నోచుకోలేదు. మానవ సహాయంతోనే స్థానిక, దూర వినియోగదారుల ఫోన్లను అనుసంధానం చేసే వ్యవస్థలలో మానవ బలహీనతలు, యితర లోపాలవలన వినియోగదారులలో అసంతృప్తి పెరిగి చాడీలు సహజంగానే చాలా అధిక సంఖ్యలో ఉండి పాలనావ్యవస్థకి శిరోభారాన్ని కలిగించేవి. నేను నిజామాబాదులోని కొన్ని ఆ సంబంధిత సాంకేతిక సమస్యలని పరిష్కరించే ప్రయత్నంలో అక్కడ తలమునకలై యుండగా మా జనరల్ మేనేజర్ పిలిచి అనకాపల్లి లో శారదా నది పొంగి ఆ వరదనీటిలో స్వయంచాలక స్థావరం మునిగి స్థంభించిపోయినదని, వెంటనే అక్కడికి చేరుకొని సాధ్యమైనంత త్వరలో సమస్యని పరిష్కరించమని ఆజ్ఞాపించారు. అప్పటికే తూర్పు తీరాన్న విస్తరించి వున్న తుఫాను ప్రభావంవల్ల హైద్రాబాదు ఆకాశమంతా కూడా మేఘావృతమై భారీవర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అయినా రైళ్లు నడుస్తుండడంవల్ల దొరికిన బండి పట్టుకుని అనకాపల్లి చేరుకొని అక్కడి పరిస్థితి చూస్తే బేజారు వేసింది. అప్పటికే వరద నీరు తీసివేయడం వల్ల నీటి గుర్తులతో ‘స్విచ్ రూమ్’ అంతా ఐదడుగుల బురద నీటిలో మునిగి ఉన్న జాడలు చూపిస్తూ, మిగిలిపోయిన మట్టి మాత్రం అస్తవ్యస్తంగా పడి ఉంది. యంత్రాలన్నీ విద్యుత్ తో నడవడం వల్ల నీరు తగలగానే నిప్పురవ్వలు చెలరేగి పెద్ద నష్టం జరుగవచ్చుననే భయంతో సంరక్షణ సిబ్బంది విద్యుత్సరఫరా నిలిపేయడం జరిగింది. వినియోగదారులని యంత్రాలకి కలిపే కేబుల్ వ్యవస్థ ‘ఎక్స్చేంజి’ లోకి ప్రవేశించే 'మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రేమ్' చాలావరకు నీటిలో మునిగి కేబుల్ తీగలమధ్య విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించడానికి వాడే కాగితం తడిసి అన్నిటిలో విద్యుత్ మూకుమ్మడిగా ప్రవహించడానికి సిద్ధంగా వుంది. వాటన్నిటిని విడదీసి వేడిచేస్తూ పంఖాలతో తడిని ఆరబెట్టి, పరికరాలమధ్య ఇరుక్కొని ఉన్న మట్టిని, తడిని జాగ్రత్తగా తొలగించి ‘ఇన్సులేషన్’ విలువ పెంచుతూ తగిన పరిమితులు చేరగానే, క్షేమ స్థితికి చేరినదని ధృవపరచుకుని విద్యుత్ ని పంపడం జరిగింది. ఆఎక్స్చేంజి లో అన్ని భాగాలు ఒక్కొక్కటి పరీక్షిస్తూ సవ్యంగా పనిచేస్తున్నాయని స్థిరీకరించుకోవడానికి వారం రోజులు పైనే పట్టింది. అన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయని ధృవపరచుకొని తిరుగుప్రయాణం ప్రారంభించాను. వర్ష తీవ్రత కొంత తగ్గినా ఇంకా పడుతూనే ఉంది. నేను ప్రయాణిస్తున్న గోదావరి ఎక్సప్రెస్ విజయవాడ చేరింది, ఏదైనా తిందామని రైలు దిగబోతుంటే విజయవాడ డివిజనల్ ఇంజనీర్ శ్రీ బలరామన్ నా బోగి వెదుక్కుంటూ వచ్చి జనరల్ మేనేజర్ గారి మాటగా నన్ను అక్కడ దిగి, దివి సీమలో జరిగిన అనూహ్య విధ్వసం వార్తాపత్రికలద్వారా తెలిసిందని అక్కడికి వెళ్లి, చక్కబరచుటకు ఒక రూపకల్పన తయారుచేసి, కాల, వస్తు అంచనాలతో మాట్లాడమని తెలియజేసారు. ఆయన నన్ను విజయవాడ అతిధి గృహానికి చేర్చి మర్నాడు ఉదయం మచిలిపట్నం వెళ్ళడానికి బండి ఏర్పాటు చేశారు.

మరునాడు ఉదయాన్నే మచిలీపట్నం చేరి ఆ ప్రదేశానికి సంబంధించిన SDO శ్రీ అర్జా కృష్ణమూర్తి, (తీవ్ర అస్వస్థతో ఉండి కూడా సమావేశానికి వచ్చి నాకు వారి సిబ్బందిని పరిచయం చేసి అప్పగించి వెళ్లారు). అక్కడి జూనియర్ ఇంజనీర్స్ అందరిని సమావేశపరిచి కనుక్కోగా తెలిసినదేమిటంటే అక్కడి గ్రామాలలోని నిజ పరిస్థితి వాళ్లకు కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి, కమ్యూనికేషన్ తీగలు తెగిపోయాయి. వాళ్ళ సిబ్బందిలో ఎవ్వరితోను మాట్లాడడం సాధ్యపడలేదు. స్థలాకృతి చాలాభాగం నామరూపాలు లేకుండా పోయిందని తెలిసింది, 'హై టెన్షన్ ఎలక్ట్రిక్ టవర్స్' కుప్పకూలిపోయాయని చెప్పారు, తిరిగి విద్యుత్ సరఫరా చెయ్యడానికి రెండు మూడు నెలలు పైనే పట్టవచ్చు. వెళ్లగలిగేది బహుశా మోటారు సైకిల్ పై మాత్రమే కనుక పునరుద్ధరణకై పనిముట్లు, అవసరమైన పరికరాలు తీసుకెళ్లడం సాధ్యంకాదు. ఆ మధ్యాహ్నం ఒక 'రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్' బండి తీసుకు ఆ సంబంధిత జూనియర్ ఇంజనీర్ శ్రీ PLN రామ్ బండి ని తోలగా ప్రత్యక్ష్యంగా చూడాలని బయలుదేరాను. దారి అంతా చిన్నాభిన్నమై, మోటార్ సైకిల్ కూడా నడపవీలులేనంతగా నానిన నల్లరేగడి నేలపై టైర్లకు పట్టు దొరకక జారుతూ ముసురుతున్న చీకట్లలో అట్టే దూరం ప్రయాణం చేయలేకపోయాము. ఒక వైపు కురుస్తున్న వర్షం మరోవైపు అసలే మేఘావృతమైన చీకటిలో సూర్యస్తమానం సమీపించడంతో ఇక వెళ్లే ప్రయత్నం మానుకుని మరునాటికి వాయిదా వేసాను.

మరునాడు ఉదయాన్నే మళ్ళీ ఉత్సాహవంతుడైన JE రామ్ తో మోటార్ సైకిల్ పై బయలుదేరి మెల్లగా చల్లపల్లి మీదుగా అవనిగడ్డ చేరుకునే లోగా మేము చూసిన భయానక దృశ్యాలు చాలా విదారకంగా యుండి మా గుండెల్ని మంచు కొండలపైన మెల్లగా లాగుతున్నట్టనిపించింది. చెట్ల పైన కొమ్మల మధ్య ఇరుక్కున్నశవాల అవశేషాలు, మోకాటి పైగా ఉప్పెన నీటిలోను రోడ్డుకు రెండువైపులా ప్రక్కన పొలాలలో అడ్డదిడ్డంగా విసిరివేసినట్లు ఉన్న విగత మానవ, పక్షి, జంతు కళేబరాలు, హార్రర్ సినిమా లోని దృశ్యాలకంటే కూడా హీనంగా ఆ మబ్బులు కమ్మిన చీకట్లలో ఈదురుగాలుల మధ్య మెల్లగా చెట్లకొమ్మలలో కదులుతూ, నీటి అలలపై తేలుతున్న కళేబరాలు జరిగిన ప్రకృతి వికటాట్టహాసాన్ని ప్రాణికోటి నిస్సహాయ విషాద విలాపాలని తలపింప చేస్తూ మాకు దర్శనమిచ్చాయి. ప్రకృతి ఒక సమయంలో ఎంతో అందంగా ఆహ్లాదాన్ని మనోల్లాసాన్నికలిగిస్తూ, కళాకారులకి భావుకతని ప్రసాదించగలదో ఆ ప్రకృతేనా ఈ విలయతాండం చేసిందనిపించింది. సాయంకాలం హోటల్ కి చేరుకొని నా కర్తవ్యపాలనకై ఎన్నుకోవలసిన మార్గాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దివిసీమలో ఎక్కువ జనాభాగల వూరు చల్లపల్లి. అక్కడికే ముందు సందేశవ్యవస్థని స్థాపించడం అత్యవసర కర్తవ్యమని నిర్ణయించుకుని మరునాడు SDO ని ఆప్రాంతంలో ఆర్మీ వాళ్లతో మాట్లాడించమని కోరగా అయన అక్కడి ఒక మేజర్ తో మాట్లడించారు. మాకు అప్పటి పరిస్థితిలో అత్యవసరంగా వారివద్ద సామాన్యంగా ఉండే ఒక VHF (Very High Frequency)   వ్యవస్థ మచిలీపట్టణం లోని మా ఎక్స్చేంజి నుంచి చల్లపల్లి ఎక్స్చేంజి కి అమర్చి పెట్టమని కోరాను. పరిస్థితిని గ్రహించిన ఆయన వెంటనే ఒప్పుకుని రెండురోజులలో దానిని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈలోగా మేము స్తంభాలపై తీగలద్వారా అక్కడే ఉన్న రెండు 8 ఛానెల్స్ వ్యవస్థల్ని స్థాపించదలిచి స్తంభాల స్థాన నిర్ణయానికై పని ప్రారంభించమని రామ్ ని నిర్దేశించాను. ఈ లోగా మచిలీపట్టణం  SDO  స్టోర్ లో ఉన్న సామాను లో నాకు కావాల్సిన కొన్ని 'రిలే' లు తీగలు తీసుకుని నాపూర్వ అనుభవం ఉపయోగపడగా, ఒక 'ఛానెల్ ఇంటర్ఫేస్ సర్క్యూట్' ని రూపొందించి, అక్కడికక్కడే తయారుచేసి పనిచేస్తోందని నిర్ణయించుకుని చల్లపల్లిలో ఒక టెలిఫోన్ పరికరానికి అనుసంధించి సిద్ధంచేసాను. దివి సీమ మొత్తం విద్యుత్సరఫరా లేనందువల్ల మచిలీపట్నం నుంచి జనరేటర్లు అద్దెకు తీసుకుని మా పవర్ సిస్టం కి సంధించి  ఆర్మీ వాళ్ళు VHF ఛానెల్ సిద్ధంచేసిన వెంటనే నేను అప్పటికే సిద్ధంచేసి ఉంచిన channel Interface ready టెలిఫోన్ కి కూర్చి వాటిని  చల్లపల్లి లో అమర్చి, అదే ఛానెల్ మచిలీపట్నం లో ని కోయాక్సిల్ ద్వారా హైద్రాబాదులోని ముఖ్యమంత్రి కార్యాలయంలోని లోని కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి తుదివరకు పరీక్షించి పిదప మచిలీపట్టణం కలెక్టర్ గారి ని పిలిచి వారి సంక్షేమ అవసరాలకి వాడుకునేందుకు ఇచ్చాను..

ఆ 1977, నవంబర్ 19 కాళరాత్రి రాత్రి మూడు నాలుగు గంటల మధ్యన దివిసీమ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో మూడు నిమిషాలు పాటు 145  మైళ్ళ వేగం తో విజృభించిన తుఫాను గాలులు  కొంచం తగ్గి మళ్ళీ ఒక  నిమిషకాలం 125  మైళ్ళ వేగంతో 943 ఎం బార్ తక్కువ వాతావరణ పీడనాన్ని కలిగించి  (27.85 inHg) ఫలితంగా బంగాళాఖాతంలో నీటిని అతివేగంతో తోడి భూమిపైకి విసిరి 22  అడుగుల ఎత్తు సముద్రపునీటి అలలతో దివిసీమని ఉడ్చిపెట్టాయి. 20 అడుగుల పైగా ఎత్తుగలిగిన అలలతో ముంచివేసిన విషయం వాతావరణ శాఖచే నమోదు చేయబడింది. నిద్రలో ఉన్న జనం జంతు పక్షి గణాలు లేచి తప్పించుకునే వీలులేకుండా అంత ఉదృతంతో అణచిపెట్టి శాపంలా పరిణమించి అందరిని బలి తీసుకుంది. కొన్ని స్వతంత్ర గణాంకాల ప్రకారం పోయిన వారి సంఖ్య యాభైవేల పైమాటే కానీ ప్రభుత్వ లెక్కలలో మాత్రం 10 వేలుగా నమోదు చెయ్యబడింది.

Divi Seema
తుఫాను కదిలిన మార్గంలో పెరిగిన పీడన శక్తి

ఆ ‘సర్క్యూట్’ ని ఉపయోగించి కలెక్టర్ గారు అక్కడి సంక్షేమ ముఖ్య అవసరాలైన మందులు, పదివేల  పైగా శవాల తగులబెట్టేందుకు అవసరమైన కట్టెలు, ఇంధన సామగ్రి, మిగిలిన వారు జీవన యాత్ర సాగించేందుకు అవసరమైన ఆహార ఉత్పత్తులు మొదలైన ముఖ్య అవసరాల పట్టిక నివేదనకు ఉపయోగ పడిందని, ముఖ్య విషయాలు ముఖ్యమంత్రిగారికి , ఇతరమంత్రులకు సెక్రెటరీలకు చేర్చగలిగామని సంతృప్తిని వెలిబుచ్చారు. ఈ లోగా మోకాలు పైన నీళ్లలో గోతులు తవ్వి టెలిఫోన్ స్తంభాలు పాతడానికి సిద్ధం చెయ్యగా, RSS కార్యకర్తలు వాళ్ల సంక్షేమ ఉద్యమంలో భాగంగా (నిల్వ వున్న శవాలు కుళ్ళుతూ అంటురోగవ్యాప్తికి కారణం అవుతాయని) దరిదాపులలో చిందర వందరగా పడి ఉన్న శవాలని మా స్థంభాలకై తీసిపెట్టిన గోతులలో పూడ్చిపెట్టి కప్పివేస్తుండడంచూసి మా వాళ్ళు నిస్సహాయస్థితిలో నాకు తెలియజెయ్యగా నేను నా వ్యూహాన్ని మార్చాల్సివచ్చింది. ఒకసారి కొన్ని గోతులు పూడ్చివేసిన తరువాత మళ్ళీ ప్రక్కనే వేరే గొయ్యి తవ్వి పని కొనసాగించడానికి వీలవదు. స్థంభాలమధ్య దూరం మారినా, వాటి అమరిక తీరు మారినా, 'ట్రాన్స్ పొజిషన్' పధ్ధతి పనిచేయక ఒక ‘ఛానెల్’ నుంచి మరో’చానెల్’ లోనికి సంభాషణలు యాదృచ్చికంగా దొర్లి ఛానెల్ ప్రమాణం దెబ్బతిని 'ట్రంక్ కాల్స్' నాణ్యత దిగజారిపోతుంది. అందుకని మళ్ళీ  అమరికని మార్చి ఈ మాటు సుమారు ఒక కిలోమీటర్ వరకు గోతుల స్థానాన్ని గుర్తించుకుని స్తంభాలు సిద్ధంగా ఉంచుకుని ఇరవై సమూహాలు ఒకేసారి గొయ్యి తీసినవెంటనే స్తంభాలను పాతిపెట్టే ఏర్పాటు చేసి మొత్తానికి మచిలీపట్నం చల్లపల్లిల మధ్య రెండు ఎనిమిది 'ఛానెల్ సిస్టం' లు పనిచేసే ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ఈ లోగా మరొక అవాంతరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. గోతుల తవ్వే వాళ్ళ కాళ్ళు ఉప్పునీటిలో చాలాసేపు నానడం వల్ల, అవే నీళ్లలో కుళ్లుతున్న శవాలు కూడా ఉండడంవల్ల గజ్జి లాంటిది పట్టుకుని, అందరు “మాకు దయ్యాలు పట్టుకున్నాయి ‘బతికుంటే బలుసాకైనా తిని ఉండొచ్చు’ మేము ఇక్కడ పనిచెయ్యం మా ఊళ్లకు వెళ్లిపోతామని” (వారందరు ఆంధ్ర, ఒరిస్సాలలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవాళ్లే) పని మానేశారు. వాళ్ళకి దెయ్యాలు భూతాలు లేవు అవి మానవ కల్పితాలే అని సైన్స్ విశదపరిచి అందరికి ఆముదము సీసాలు, లైఫ్ బాయ్ సబ్బులు విరివిగా యిచ్చి నీళ్ళలోకి దిగే ముందు దిట్టముగా ఆముదం పాదాలనుండి పొట్టవరకు పులుముకుని పని ప్రారంభించి, పని పూర్తి అయిన పిమ్మట ఇచ్చిన లైఫ్ బాయ్ సబ్బులతో శుభ్రముగా కడుక్కుని స్నానం చేసిన తరువాత కానీ ఏదీ తినకూడదని గట్టి నియమము పెట్టి, ఆ పద్దతి సరిగ్గా అనుసరించకపోతే వాళ్ళ ప్రాణాలకే ముప్పు అని తెలియజెప్పి, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా నియంత్రించ గలిగాము. తిరిగి పని ప్రాంభించేసరికి రెండురోజులు వృధా అయింది.  ఈలోగా కలరావ్యాధి సోకిందని ఒక పుకారు లేవదీశారు. పని ప్రారభించకముందే దీనికి సంబంధించిన పనివాళ్లంతా మచిలీపట్టణం దగ్గర పొలాల్లో మేము వేయించిన గుడారాలలో ఉండే ఏర్పాటు చేసాము. దానిని ఎదుర్కోవడానికి వారందరిని తెల్ల వారకుండానే వంటచేసుకుని అక్కడే తిని మేము అందుబాటులో ఉంచిన బండ్లలో పని స్థావరానికి చేరుకొని అక్కడ ఏమి తినకుండా మంచినీళ్లు మాత్రమే తాగుతూ (అవి రోజుకి మూడు సార్లు మంచినీళ్ల ‘కాన్స్’ లో అందించే ఏర్పాటు చేసాం) వేరేదేది త్రాగకుండా నియంత్రించి, ప్రతిరోజూ ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నము 3 గంటలవరకు పనిచేసే వీలు కలిగించి వారిలోని అనుమానాల్ని, భయాలని క్రమంగా పారద్రోలి నమ్మకాన్ని పెంచి పనిచేయించాల్సి వచ్చింది. నేను వాళ్ళని సముదాయపరస్తూ పనులు చేయించగలనన్న నమ్మకం నిజంగా పని జరిగిన పిమ్మటగాని గాని నాకు కుదరలేదు. ఎందుకంటే అంతగా చదువుకోని వాళ్లు అక్కడి దుర్భర వాతావరణంలో క్రమశిక్షణ పాటించకపోతే అనూహ్య ప్రమాదాన్నే ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది.

ఈలోగా మా జనరల్ మేనేజర్ గారు పరిస్థితిని సమీక్షించడంకోసం అవసరమైన సహాయం అందించడం కోసం వచ్చారు. ఆయనకు నేను వేసుకున్న ‘ప్లాన్’ విశదీకరించగా దానికి అయన ఇదంతా పూర్తి అయ్యేసరికి కనీసము నాలుగు నెలలైనా పడుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మాకు అవసరమైన సామాన్లు, కేబుల్స్, పనిముట్లు, బండ్లు, మనుషుల వివరాలు కనుక్కుని వారంరోజుల్లో ఏర్పాటు చేయగలిగారు.

Divi Seemaరోజూ మధ్యాహ్నము మూడు గంటలదాకా పనిచేస్తున్నవాళ్ళ అవసరాలు చూసి, పిమ్మట నేను, నా సహాయ  ఇంజినీర్లు అంతవరకు జరిగిన పని సరిగ్గా ఉన్నదా లేక ఎక్కడైనా సరిదిద్దడము అవసరమా చూసుకుని ఆ భాగం ఎలక్ట్రికల్ గా బాగుందా అని సరిచూసుకుని మచిలీపట్నం వెళ్లి సమయానికి హోటల్స్ అన్ని మూసి ఉండి తిండి దొరికేదికాదు మాకు. మేము ప్రొద్దున తిన్న ఇడ్లీ తో ఆరోజుకి సరిపెట్టుకుని పడుకునే వాళ్ళం. మా 'టెస్టింగ్' పనిలోభాగంగా ఒకరోజు బాగా చీకటి పడిన తరువాత నేను మా సహాయ ఇంజినీరు లైన్లపై టెస్ట్  చేస్తున్న సమయంలో ఒక కుర్రాడు స్థంభంపైకి ఎక్కి పై తీగతో నా టెస్ట్ ఫోన్ కలిపి మాట్లాడిస్తున్నాడు. మా వాన్ డ్రైవర్ నాపై హెడ్ లైట్స్ వేసి ఉంచాడు. నేను అతనితో వాటిని ఆపేయమని, లైట్ లేకపోయినా నేను మాట్లాడగలనని, వాన్ బాటరీ ‘డిశ్చార్జ్’ అయిపోతే మా ప్రణాళిక దెబ్బతింటుందని చెప్పి నాపని లో నేను నిమగ్నుడైనాను. పని పూర్తిచేసుకుని అప్పటికింకా మా డ్రైవర్ లైట్స్ ఆర్పలేదని గుర్తించి చెప్పిన పని ఎందుకు చెయ్యలేదని నిలదీయగా అతడు "సార్, వెనక్కి తిరిగి చూడండి'" అనగానే తిరిగి చూస్తే వెనక ఒక పెద్ద నాగు పాము వెళ్లిపోతూ కనిపించింది. అది చాలాసేపు పడగవిప్పి నన్ను కాటువేయటానికి సిద్ధంగా ఉండడం చూసిన డ్రైవర్ తక్కిన వాళ్లు హెడ్ లైట్స్ ని దానిపై ఫోకస్ చేసి అది ఏమిచేస్తుందోనన్న భయంతో 'టెన్షన్' భరిస్తూ చూస్తూ ఉండిపోయారు. నాకు చెబితే దానికి నా 'రియాక్షన్' ఎట్లావుంటుందో, అది దానిని ఉసిగొల్పి కాటు వేసేటట్లు చేస్తుందన్న భయంతో  నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ విధంగా మా డ్రైవర్ నాగాయలంకలో ఆ నాగు పాము బారి నుండి నా ప్రాణాలు కాపాడాడు.

ఆవిధంగా మేము పనిచేసిన ఊళ్ళు చల్లపల్లి, మోపిదేవి, మాచవరం, అవనిగడ్డ, నాగాయలంక, తలగడ దీవి, కోడూరు, భావదేవరపల్లి, ఏటిమొగ, ఘంటసాల, శ్రీకాకుళం, మొవ్వ, కూచిపూడి, చినముత్తేవి, కాజా, ఆ చుట్టూపక్కల ప్రాంతాలు.

Divi Seemaఅప్పుడు నీరు తీసివేసిన తరువాత కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి. వందలకొద్దీ నాగుపాములు కలుగుల్లోంచి బయటికొచ్చి వీరవిహారం చేస్తూ దర్శనమిచ్చి ప్రజలని భయభ్రాంతులని చేశాయి. మాలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఒక్కొక్క వూరు టెస్ట్ చేసి విద్యుతసరఫరా క్రమీబద్ధం చేస్తున్న సమయంలో వారు చూసిన అద్భుతం- సముద్రతీరాన్నే ఉన్న హంసలదీవి లోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఎతైన గాలిగోపురం పైన అమర్చిన విద్యుద్దీపం పైనుంచి ఉప్పెన తరంగం వెళ్లినా కూడా చెక్కుచెదరకుండా ఉండి విద్యుత్ సరఫరా ప్రారంభించిన వెంటనే  దేదీప్యమానం గా వెలిగి అందరిని ఆశ్చర్యంలో ముంచివేసింది. గుడి లోని అన్ని దీపాలు అలాగే వెలిగాయట. మళ్ళీ ఆ వూరు మొత్తం ప్రతి ఇల్లు సరిచెయ్యాల్సి వచ్చింది. అదేవిధంగా భావదేవరపల్లి కూడా జరిగిందని చెప్పుకున్నారు. ఆ సమయంలో దివిసీమలో పదివేల పైన శవాలనైనా చూసివుంటాను. అవి కాకుండా ఆ లెక్కకి సరితూగే జంతు, పక్షి  కళేబరాలు కూడా చూసి 'జాతస్యమరణం ధృవం' అన్న శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతా వాక్యం మనస్సుని ఆవరించగా జన్మించిన జీవుల ఆకస్మిక ముగింపు యింత దారుణమా అనే భావం మనస్సు నావరించి విషాదాన్ని నింపింది.  అనుభవించిన సుఖ దుఃఖాలు వారి వారి స్మృతులలోను, సూక్ష్మ శరీరాలలోనే యిమిడిపొయి మరోజన్మని వెదుక్కుంటూ పయనాన్ని సాగించి ఉంటాయి. సాధారణంగా వివిధపక్షి గణాలతో ఎప్పుడు సందడి గా ఉండే ఆ ప్రాంతపు ఆకాశమంతా నీరవ నిస్తేజంగా వుండి బావురుమంటోంది. ఆ నిస్తేజ వాతావరణంలో ఒకేసారి దహన మవుతున్న అనేక శవాలు ఉత్పత్తి చేస్తున్న దుర్గంధం, కాలుతున్న జుట్టు వాసన, అక్కడ పని చేస్తున్న మమ్మల్ని మానసికంగా ఎంతగానో దిగజార్చింది. ఆ స్మృతి నా మనసుపొరలలో ఇరుక్కుని  ఇంటికిచేరినా విడవకుండా కొద్దినెలలు వెంటాడుతూనే వుంది. అదొక మరుపురాని విషాద గాథ. ఒక్కొక్క ఊరుని పర్యవేక్షిస్తూ ప్రతి ఫోన్ టెస్ట్ చేస్తూ, మొత్తం ఆ దివిసీమ లో మా  నిర్దేశిత కార్యక్రమం పూర్తి అయ్యేసరికి అక్కడే 45 రోజులు పట్టింది. మధ్యలో ఒకటి రెండు మార్లు మా కుటుంబముతో ఫోనులో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వీలైంది. ఆ పునరుద్ధరణ కార్యక్రమము జరిగే రోజుల్లో శ్రద్ధగా పనిచేసిన RSS వర్గాలు, రామకృష్ణ మిషన్,  మరికొన్ని సేవా సంఘాలు  'శవసేన'గా శవాలని భుజాలపై మోసుకుని ఖననం చేస్తూ, 'సఫాయి సేన'గా పరిసర్రాలని శుభ్రం చేస్తూ వివిధ అవతారాలు ధరించి  అమోఘ సేవ చేశారు. మేము అక్కడ పనిచేస్తున్న సమయంలో అనేకమంది సంఘసంస్కర్తలు, రాజకీయ వేత్తలు, నాయకులు మాకు ఎదురు పడ్డారు. వారిలో ముఖ్యులు ముఖ్యమంత్రి-వెంగళరావు, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, ఆటలబీహారీ వాజ్పాయ్, మదర్ థెరీసా, క్రీస్తు ప్రబోధకుడు బిల్లీ గ్రాహం, ఇందిరాగాంధీ, అనేక సినిమా ప్రముఖులు  మొదలైన ఎందరో చెయ్యగలిగిన సహాయం చేశారు.

Divi Seemaమేము దివి సీమ లో చేసిన విస్తరణనినంతా సరిచూసుకుని, పాత SDO గారి అకాల మరణానంతరం కొత్తగా జేరిన SDO గారికి అప్పగించి హైదరాబాద్ చేరడానికి డిసెంబర్ నెలాఖరు అయింది. మా GM మా ప్రయత్నాన్ని అభినందిస్తూ అమర్చిన సమావేశంలో ప్రశంసల తరువాత ప్రక్కన పొందుపరిచిన లేఖని అందించారు.

గతము లో  1864  ప్రాంతాలలో ఇంత తీవ్రతతో కాకపోయినా ఒక  పెను తుఫాన్ మచిలీపట్నం తీరం తాకినదట. అప్పడు పెద్ద కోటలా ఉండే మా మేనత్త గారి 'పంతులవారి మేడ' ఆప్రాంత జనాలకి ఆశ్రయమిచ్చిన దనే విషయం ఈ సందర్భంలో ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు.

-o0o-

Posted in May 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!