Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
రాణీ రుద్రమదేవి
Rani Rudramadevi

మదర్ థెరీసా, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, పల్నాటి నాగమ్మ, కవయిత్రి మొల్ల, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా యావత్ భారత చరిత్రలో తమకంటూ ఒక పుటను పదిలపరచుకొన్న, సాధ్వీమణులు ఎందఱో ఉన్నారు. వీరందరూ తమకు లభించిన ప్రాత్సాహంతో, తాము నమ్ముకున్న సిద్దాంతాల ద్వారా సామాజిక స్ఫూర్తిని కలిగించారు. తద్వారా దేశ అభ్యున్నతికి అవిరళ కృషి సల్పారు. వీరి చరిత్రను చదివిన తరువాతైనా, మహిళలను చిన్న చూపు చూసే వారికి కనువిప్పు కలిగితే అది ఎంతో సంతోషకరమైన విషయం.

అయితే, వీరందరి కన్నా చరిత్ర పుటలలో ముందుగా నిలిచి ఆడది అంటే అబల కాదు ఆదిపరాశక్తి అని అక్షరాల నిరూపించి వీరోచిత జీవన అభ్యున్నతితో తన రాజ్యం సస్యశ్యామలమై ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లే విధంగా ఎన్నో మంచి కార్యాలను చేపట్టి వారికి అండగా ఉంటూ చాలామందిలో ముఖ్యంగా మహిళలలో ధీరోదాత్త గుణాలను ద్విగుణీకృతము చేసిన కాకతీయ వంశాంకురం మరియు పట్టపురాణి ‘రాణీ రుద్రమదేవి’, ఈనాటి మన ఆదర్శమూర్తి, మహిళలందరికీ గొప్ప స్ఫూర్తి.

ప్రతి దేశ చరిత్ర చెబుతుంది ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలు. చరిత్ర నిలుస్తుంది ప్రత్యక్ష సాక్షిగా గతించిపోయిన ఎన్నో ఒడలు పులకరించే ఘట్టాలకు, నేడు కనిపించని ఎన్నో సుందర కళా దృశ్యాలకు మూగబోయిన ప్రతిమలా. కాకతీయ ప్రభువులు, తెలంగాణ గడ్డపై మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, తెలుగు ప్రాభవాన్ని, సంస్కృతినీ పరిరక్షించి చరిత్ర పుటలలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. వారు నిర్మించిన కట్టడాలు, ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఆనాడే కాదు ఈనాటికీ పటిష్టంగా ఉన్నాయి. ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల మంటపం, హనుమప్ప దేవాలయం ఇలా ఎన్నో చరిత్రకి తార్కాణాలు. కానీ, తరువాతి కాలంలో మహమ్మదీయుల దండయాత్రల్లో ఈ కట్టడాలు చాలా వరకు దెబ్బతిన్నాయి.

కాకతీయ చక్రవర్తులలో అత్యంత పేరుప్రతిష్టలు గడించి ప్రజల మనసులలో స్థిరమైన స్థానాన్ని పొందిన చక్రవర్తి గణపతిదేవుని కుమార్తె మన రుద్రమదేవి. తండ్రికి తగ్గ తనయగా ఎంతో ఆదర్శవంతమైన పాలనను అందించింది. రాణీ రుద్రమదేవి తను చక్రవర్తి కాకమునుపు, తండ్రిచాటు తనయగా ఉంటూ రాజ్య నిర్వహణలోని మెలుకువలన్నీ నేర్చుకుని క్రీ.శ. 1262 అధికారికంగా సామ్రాజ్య పట్టమహిషై, ఓరుగల్లును రాజధానిగా చేసుకొని 27 ఏళ్ల పాటు రుద్రమదేవి చక్రవర్తి పేరుతో సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించి, మహిళా పాటవాన్ని విశ్వవిఖ్యాతం చేసింది. సమర్ధవంతమైన సామాజిక కర్తవ్యానికి లింగబేధం లేదని 800 వందల సంవత్సరాల క్రితమే నిరూపించి, స్త్రీ సాధికారతను అమలుచేసిన మహిళా మూర్తి రుద్రమదేవి.

రాజ్యకాంక్ష, కుట్రలు, కుతంత్రాలు ఇవే సాధారణంగా మనకు చరిత్ర పుటలలో రాజుల గురించి తెలిసే విషయాలు. కానీ, వాటికి భిన్నంగా జనరంజక పాలన అందించిన మహారాజులు, మహారాణుల చరిత్రలు కూడా కాంతి పుంజాల వలే మనకు అక్కడక్కడ తారసపడుతుంటాయి. చరిత్రలో ఎంతో మంది రాజులు తమ పాలనలో ఎన్నో పధకాలను ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమమే ప్రధమ కర్తవ్యంగా భావించి ఆదర్శ పాలకులయ్యారు. అటువంటి వారి కోవలోకి చేరినదే మన రుద్రమదేవి. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను ఏకంచేసి, మహా సామ్రాజ్ఞి యై, సుభిక్ష పాలనను అందించిన కాకతీయ వంశ వీరనారీమణి, మహా సాధ్వి రాణీ రుద్రమదేవి.

రుద్రమదేవి పరిపాలనా సామర్ధ్యం, చాకచక్యం, సమయస్ఫూర్తి, తనని వెన్నంటే వుండి, తన కనుసన్నలలో మెలిగే అత్యంత నమ్మకస్తులైన సేనానులను సంపాదించిపెట్టింది. వారిలో ముఖ్యుడు గోన గన్నారెడ్డి. కనుకనే ఎన్ని కుతంత్రాలు, రాజకీయ అస్తిరతలు వచ్చినను, ధైర్యంగా ఎదుర్కొని, స్థిరమైన పాలనను అందించింది. రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొని, గెలిచి, మూడు కోట్ల బంగారు వరహాలను దేవగిరి యాదవ మహదేవుడు నుంచి పరిహారంగా గ్రహించింది. ఈ చిన్ని ఉదాహరణ చాలు ఆ మహారాణి శక్తి సామర్థ్యాలు ఏపాటివో చెప్పడానికి. ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమ పైకి దండెత్తి వచ్చిన మహదేవునిపై పది రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ అపరభద్రకాళిలా విజృంభించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మిగిలిన శత్రురాజులకు ఒక సంకేతంగా చూపించి తలెత్తకుండా చేసింది.

Orugalluకాకతీయ ప్రభువులు సహజంగానే కళా ప్రియులు. కనుకనే వారి ముఖ్యపట్టణమైన ఓరుగల్లు (నేటి వరంగల్లు) పూర్తిగా శిల్పకళా నిర్మితమై ఉండినది. ఓరుగల్లు కోట మొత్తం విస్తీర్ణం 32 చదరపు మైళ్ళు. పూర్తి పరిరక్షణతో నిర్మితమై, వాస్తు పరంగా కూడా ఎంతో ఖ్యాతి గడించింది.

రుద్రమదేవి కాలంలో వ్యవసాయం ముఖ్య జీవనోపాధి. అందుకే ఎన్నో చెరువులను, కుంటలను, కాలువలను నిర్మించి వర్షపునీరును వాడుకునే విధంగా నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. ఆమె సదా యుద్దాలతో సతమతమౌతున్ననూ ప్రజల బాగోగులను నిరంతరం గమనిస్తూ అన్ని సౌకర్యాలను పొందేటట్లుగా శ్రమించేది.

వాణిజ్యపరమైన ఉత్పత్తులను ప్రోత్సహించి, మోటుపల్లి, మచిలీపట్టణం వంటి రేవుపట్టణాల ద్వారా విదేశీ వర్తక వ్యాపారాలను కూడా నిర్వహించి  తద్వారా తన ప్రజలకు మెరుగైన జీవనప్రమాణాలను అందించింది. ఆమె పాలనలో దేశం సుభిక్షంగా ఉందని ఎంతోమంది విదేశీ యాత్రికలు తమ రచనలలో తెలిపారు.

ఎంత జాగ్రత్తలు రాజకీయ పరిపాలనా దక్షత ప్రదర్శించినప్పటికీ, శత్రువులు సదా అవకాశం కొరకు వేచివుంటారు అనేది వాస్తవం. ఎంత సమర్ధవంతంగా రాజ్యాన్ని విస్తరించి పాలించినను, రుద్రమదేవి, ఆమె తరువాత వచ్చిన ప్రతాపరుద్రుడు, ఉప్పెనలా ముంచుకొచ్చిన ముస్లిం దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు, సామంత రాజుల అవకాశవాదం ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.

1289లో త్రిపురాంతకం వద్ద అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి, తనతో పాటు వచ్చిన సేనాని మల్లికార్జునుడూ ఇద్దరూ మరణించారు. ఈ ఘటన జరిగిన తర్వాత 11వ రోజున మల్లికార్జునుడి కుమారుడు చెంచుబట్ల శాసనం వేయించాడు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో ఆ శాసనంలో స్పష్టంగా ఉంది.

13 వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగిన మందడం ప్రాంతంలో కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రయాణిస్తుంది. అందుకే ఈ ప్రాంతం అంతగా ప్రాచుర్యం పొంది నేటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఈ ప్రాంతంలోనే రూపుదిద్దుకుంటున్నది.

మహా ధైర్యశాలి, పరాక్రమ వంతురాలైన రుద్రమదేవి ధీరోదాత్త చరిత్రను ఒక చలన చిత్రం గా నిర్మించి మన చరిత్రను అందరికీ పంచిన దర్శకులు, నిర్మాతలకు ఇవే మా జోహార్లు.

Sources: Source 01, Source 02

Posted in May 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!