Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
భారతరత్న లతా మంగేష్కర్
Latha Mangeshkar Photo

వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తూ వనంలోని చెట్లన్నీ ప్రకాశవంతమైన పూతతో చిగురించడం మొదలుపెడతాయి. పుప్పొడి రేణువులు గాలిలో విహరిస్తూ ఉంటే కోకిలలు తమ కిలకిలరావాలతో తమ పారవశ్యాన్ని తెలుపుతాయి. అటువంటి ఆహ్లాదకర వాతావరణంలో, సమాజవనం లోని సగటు మనిషి ఆనందకర ఆలోచనలతో సరికొత్త ఆశలను సృష్టించుకొని మాటలకు వర్ణించలేని అనుభూతులకు లోనవడం జరుగుతుంది. అంతటి ఆరోగ్యకర అనుభూతులకు కారణమైన కోయిల మనిషి జన్మను దాల్చి తన  గానామృతంతో ఎల్లవేళలా మనకు ఆహ్లాదాన్ని అందిస్తే, అంతకుమించిన అదృష్టం మరోటి ఉండదు. అటువంటి అదృష్టాన్ని మన భారతీయులందరికీ అందించి తన సంగీత సాగరంలో అందరూ సేదతీరి మనోల్లాసాన్ని పొందేటట్లు చేసి, ఏడు దశాబ్దాలు తన గాత్రంతో అన్ని భారతీయ భాషల వారినీ అలరించి ముప్పై సంవత్సరాలలో ముప్పై వేల పైచిలుకు పాటలను ఆలపించి, గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించి, ఎందఱో వర్ధమాన గాయనీగాయకులకు స్ఫూర్తిగా నిలిచి, సమాజ శ్రేయస్సుకై తన వంతు కృషి సల్పిన ‘భారత రత్న’ పురస్కార గ్రహీత, నిగర్వి, ‘గాన కోకిల’, లతా మంగేష్కర్ నేటి మన ఆదర్శమూర్తి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ లో 1929, సెప్టెంబరు 28 వ తేదీన లత గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఒక కళాకారుడు. కానీ సంగీత జ్ఞాని. కనుకనే లతా మంగేష్కర్ తన ఐదవ ఏటనుండే సంగీతం మీద మక్కువ ఏర్పడింది. అది గమనించిన ఆమె తండ్రి దీనానాథ్ ఆమెకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. ఆవిధంగా ఆమె తండ్రి, గురువు అన్నీ అయిన దీనానాధ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ సంగీత సాధన చేస్తుండేది. నిబద్ధత తో సల్పిన సాధనాకృషి తో అత్యంత పిన్న వయస్సులోనే సంగీత రంగంలోకి వచ్చి పదమూడేళ్ళ ప్రాయంలోనే సినిమా పాటలు పాడే స్థాయికి చేరింది. లతా గారి గాత్రానికి ఒక ప్రత్యేకమైన శ్రావ్యత ఉంది. కనుకనే ఆమె పాటలను వినని భారతీయులు మనకు గోచరించరు. ఆమె పాటలను వింటున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. వివిధ భారతీయ భాషల చిత్రాలకు తన గాత్రాన్ని అందించిన ఏకైన గాయని లతా మంగేష్కర్ గారు.

సంకల్ప బలం ధృడంగా ఉండి, నిత్య జీవన కష్టాలకు వెరవక మనోబలం తో ధైర్యంగా ముందుగు సాగితే గెలుపు సిద్ధించి మనలను ఒక స్థాయిలో నిలుపుతుంది. దీనికి నిలువెత్తు సాక్షం మన లత గారి జీవితమే. తండ్రి సంరక్షణలో, శిక్షణలో చేసిన సంగీత సాధన అతి చిన్న వయసులోనే తనకంటూ ఒక గుర్తింపును తెచ్చి చాలా చిత్రాలకు నేపధ్య గాయనిగా చేసింది. దురదృష్టవశాత్తూ పదమూడేళ్ళకే తండ్రిని కోల్పోయిననూ వెరవక సినిమాలలో పాడుతూ కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ, కష్టకాలంలో తన కిష్టమైన సంగీతాన్నే నమ్ముకొని, అదే వృత్తిగా మలచుకొని అంచలంచలుగా ఎదిగి యావత్ భారతావని గర్వించే స్థాయిని చేరుకొన్న ఆ సంగీత విదుషీమణి ఎందరికో ఆదర్శమూర్తి.

మన తెలుగు చలన చిత్ర రంగానికి ఆమె 1955 నుండే పరిచయం. పాడినవి మూడు నాలుగు పాటలే అయినా అవి ఎప్పటికీ గుర్తుండిపోయే ఆణిముత్యాలు. ఆమె పాడిన వేలకొలది హిందీ పాటలలో అజరామరమైన వందలకొద్దీ మధుర గీతాలు మనందరికీ నేటికీ నిత్యనూతనమే.

దక్షిణ భారత సినీ ప్రపంచంలో దాదాపు నాలుగు శతాబ్దాలు ఏకచత్రాధిపత్యం తో అలుపెరుగక గీతాలను ఆలపించిన ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారిని మించి మరాఠి, హిందీ భాషలలో ఉత్తరభారతాన వెలుగొందిన ధ్రువతార మన లతా మంగేష్కర్ గారు. ఆమె గాత్రానికి ముగ్దులై ఎటువంటి పాటను ఆలపించిననూ శ్రోతలు మైమరిచిపోయేవారు.

గాయనిగా డెబ్బై ఏళ్లు సినీ రంగంలో తన ప్రస్థానాన్ని కొనసాగించిన లత గారికి లభించిన పురస్కారాలు, సన్మానాలు అనన్యము. అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు అయిన భారత రత్న, దాదా సాహెబ్ ఫాల్కే, గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇలా ఒకటేమిటి ఎన్నో పురస్కారాలు తనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేకాదు ఆమెకు ఎన్నో బిరుదులు కూడా లభించాయి. తన జీవిత కాలంలో ముప్పై ఆరు దేశ-విదేశీ భాషలలో ఎభైవేల పై చిలుకు పాటలు, గజల్స్, ప్రార్థనా గీతాలు, సంగీత కీర్తనలకు తన గాత్రాన్ని అందించిన ఆమె నిజంగా యావత్ భారతావనికి దొరికిన ఒక మంచి విలువకట్టలేని మంచి వజ్రము. ఆమె ప్రతిభకు మరో కలికితురాయి చట్ట సభలలో తనకు లభించిన సభ్యత్వం.

ఎంత ఎదిగినను ఒదిగి ఉండే మనస్తత్వం లత గారిది. ఆవిడ నిరాడంబరత, ఆవిడ వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంది. ఆమె, సగటు మానవ జీవితాన్ని ప్రతిబింబించే ఒక నిఘంటువు లాంటిది. సంగీతమే ప్రాణవాయువుగా జీవిస్తున్న ఎంతో మంది గాన ప్రియులకు ఆమె ఒక స్ఫూర్తి. తన తండ్రి పేరు మీద ఒక సంస్థను స్థాపించి సమాజ సేవను ఎంతో గోప్యంగా నిర్వహిస్తున్న ఆ మహా సాధ్వి గత నెల అంటే ఫిబ్రవరి 6. 2022 న ఈ భువిలో తన ప్రస్థానాన్ని ముగించి మరో లోకంలో తన బాధ్యతను నిర్వర్తించేందుకు మనలను వీడి వెళ్ళిపోయారు. కానీ వేలకొలది అత్యంత మధురమైన పాటలను మనకు అందించిన ఆమె తన గాత్రంతో సదా మనలను పలకరిస్తూనే ఉంటుంది.

Posted in March 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!