Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి --

పదహారో శతాబ్దంలో శ్రీ కృష్ణరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరిగా చెప్పబడిన కవుల్లో థూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది ఈ నెల పద్యం. శ్రీకాళహస్తి అంటే వెంఠనే స్ఫురించేది – శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు) అనే మూగజీవులు. భగవంతుడనేవాడున్నాడు, ఆయనకి సేవలు చేయాలి అని తెలియడానికి మానవజన్మ ఒక్కటే కాదు ఏ జన్మ అయినా చాలు కానీ ఆ జ్ఞానం రావడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ జ్ఞానం రావడానికి ఎన్ని జన్మలు పడుతుందో అనేది ఎవరికీ తెలియని చిదంబర రహస్యం.

మ. పరిశీలించితి మంత్ర తంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
     గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిని శంక వో
     దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మించి సు
     స్థిర విజ్ఞానము త్రోవ చెప్ప గదవే శ్రీ కాళహస్తీశ్వరా       (శ్రీ కాళహస్తీశ్వర శతకము 77)

ఈ పద్యంలో థూర్జటి అంటున్నాడు చూడండి- మంత్ర తంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగాల రహస్యాలన్నీ తెలుసున్నవాళ్ళు చెప్పగా విన్నాను. వేద శాస్త్రాలన్నీ వల్లించాను (వక్కాణించితి). ఇంత విచారించినా (అరయన్) శంకలు తీరలేదు (శంక వోదు) – భగవంతుడి గురించి, విజ్ఞానం అంటే ఏమిటో అనేదాని గురించీను. ఇంత చేసినా గుమ్మడికాయలో ఆవగింజంత కూడా శంక తీరలేదు. అందువల్ల ఇప్పుడేం చేయాలి? నాకు నమ్మకం బాగా కుదిరేలాగ (నమ్మించి), సుస్థిరమైన విజ్ఞానం అంటే ఏమిటో దయచేయవయ్యా శ్రీకాళహస్తీశ్వరా అని మొరపెట్టుకుంటున్నాడు. గుమ్మడికాయలో ఆవగింజ అనేదో చమత్కారం ఎందుకంటే, ఆ రెండింటినీ పోల్చి చూస్తే ఏం తేలుతుంది? చదివినది గుమ్మడికాయంత, కానీ అసలు సిసలు విజ్ఞానం అనేదేమిటి అనే శంక ఇంత చదివినా అంతే పరిమాణంలో ఉంది. అసలు భగవంతుడున్నాడా, ఉంటే ఎలా, ఎక్కడ ఉన్నాడనే పెద్ద సందేహం లో ఆవగింజంత కూడా ఏమీ తెలియలేదు. ఎందుకు తెలియలేదని ప్రశ్నించుకుంటే మనకి తేలేదేమిటి? దీనికో చిన్న కథ చెప్పుకుందాం.

శ్రీకృష్ణలీలాతరంగిణి రాసిన నారాయణ తీర్థ యతీంద్రులు రోజూ రాత్రి మంచం మీద పడుకున్నపుడు ఆ లీలా తరంగిణి పాడుకుంటూంటే అదే గదిలో నేలమీద శిష్యుడు పడుకుని ఆయనపాటలు వింటూ ఆయనకేసి చూస్తూ ఉండేవాడుట. ఓ రోజు పొద్దున్నే అడిగాట్ట శిష్యుడు, “గురువుగారూ, రాత్రి పాటపాడుకునేటపుడు మీ బొజ్జ మీద కృష్ణుడు నాట్యం చేస్తాడు కదా, పధ్నాలుగు లోకాలూ తానే అయిన కృష్ణుడు అలా మీ బొజ్జ మీద ఉంటే మీకు నెప్పి పెట్టదా?” అని. దానికి ఆయన ఆశ్చర్యపోయి అడిగారుట, “అదేమిటి నాకు కృష్ణుడు కనపడలేదే, నా బొజ్జ మీద నాట్యం చేయడం ఏమిటి?” కాసేపు దీని గురించి మాట్లాడుకున్నాక గురువుగారు శిష్యుడికి చెప్పారు మర్నాడు కూడా కృష్ణుడు శిష్యుడికి కనిపిస్తే వాళ్ళిద్దరికీ మోక్షం రావాలంటే ఇంకా ఎన్ని జన్మలెత్తాలి అనేది అడగమని. శిష్యుడి సందేహం విన్నాక కృష్ణుడు చెప్పాట్ట – “శిష్యుడివైనా నువ్వు నన్ను చూసావు కనక నీకు ఇదే ఆఖరి జన్మ. అయితే మీ గురువుగారు ఇంకో జన్మ ఎత్తాలి,” అని.

భగవదనుగ్రహం ఎవరికి ఎప్పుడు ఎక్కడ కలుగుతుందనేది భగవంతుడికి తప్ప మరొకరికి తెలియదు. అయితే ఇంత కష్టపడడం దేనికయ్యా, ఎప్పుడో ఒకప్పుడు అదే వస్తుంది కదా అంటే, మనం ఏ పనీ చేయకుండా కాళ్ళు చాపుకుని కూర్చుంటే, భగవంతుడు మనకి అరటిపండు పట్టుకొచ్చి వలిచి నోట్లో పెట్టడు తినడానికి. కర్మణ్యే వ్యాథికారస్తే అన్నట్టూ మన ప్రయత్నం మనం చేయాలి. దీనిగురించే థూర్జటి చెప్తున్నాడు, ఇన్నేళ్ళు, ఇంత చదువుకున్నాను. ఇంతకు ముందు భగవంతుడు ఉన్నాడనీ, మేము చూసామనీ చూసిన వాళ్ళు చెప్పగా విన్నాను. అయితే నాకు కనపడడేం? దానిక్కారణం ఏమిటంటే, అనుగ్రహం ఆ భగవంతుడి దగ్గిరనుంచి రావాలి. అందువల్ల శివా ఇంత చేసాను, ఇప్పుడు నువ్వు తప్ప నాకు దిక్కులేదు. నన్ను కరుణించవల్సింది నువ్వే అంటున్నాడు కవి.

ఇక్కడ కవి రాసినది గమనిస్తే మనకి తెలిసేదేమిటంటే, భగవద్గీతలో చెప్పినట్టు జ్ఞానం వేరు, అది వచ్చాక పూర్తిగా భగవంతుణ్ణి ముఖాముఖీ చూసి సంపాదించిన విజ్ఞానం – అనేది వేరు. శ్రీరామకృష్ణులు అనడం ప్రకారం యోగమార్గంలో ముందుకెళ్ళేవారికి మూలాథారం దాటి ఒక్కో చక్రం దాటుతుంటే, ఒక స్థాయి దాటాక భగవంతుడి గురించి తప్ప మరే విషయమూ వినడానికి ఇష్టపడరుట సాథన చేసేవారు. అక్కడనుంచి పైకి ప్రయాణించి ఒక్కో మెట్టూ ఎక్కడానికి భగవదనుగ్రం తప్పనిసరి. అది ఈ జన్మలో రాకపోతే మరి చేసిన సాథన అంతా గంగలో పోయినట్టేనా అంటే? కాదు, “శుచీనాం శ్రీమతాంగేహే, యోగభ్రష్టోభి జాయతే” అన్నట్టూ సాథకుడు మరో మంచి, ధనవంతుల కుటుంబంలో పుట్టి సాథన క్రితం జన్మలో ఎక్కడ వదిలేసాడో అక్కడనుంచి మళ్ళీ మొదలుపెడతాడు. మానవ జన్మ, ఆయుర్దాయం పరిమితమైనవి కాబట్టి భగవదనుగ్రం రావడానికి అనేకానేక జన్మలు పట్టవచ్చు. అందుకే సాథన అలా విడవకుండా చేస్తూనే ఉండాలి.

శ్రీకాళహస్తీశ్వర శతకంలో థూర్జటి మరోచోట (13) అంటాడు, సాలె పురుగు ఏ వేదం పఠించింది? పాము ఏయే శాస్త్రాలు చదివింది? ఏనుగు ఏవిద్య అభ్యాసం చేసింది? తిన్నడు ఏ మంత్రం ఉపాసన చేసాడు? నీ సేవ ఒకటే కదా వాళ్లకి మోక్షం ఇచ్చింది? అంటే, మనస్సనేది భగవంతుడి మీద ఉండడం ఒకటే కావాల్సింది. చివరిగా శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిన కవి పేరు థూర్జటి. ఆ పేరుకి అర్థం ఏమిటి? థూళిసరితమైన జటలు కలవాడు – ఇంకెవరు శ్రీకాళహస్తీశ్వరుడైన ఆ శివుడే.

****సశేషం****

Posted in March 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!