Menu Close
SirikonaKavithalu_pagetitle

తేడా! -- రాయదుర్గం విజయలక్ష్మి

అలసిపోయాననుకోదు, విశ్రాంతిని కోరదు
నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది,
రేయింబవళ్లుగా, త్రికాలాలుగా,
ఆరు ఋతువులుగా.....
మళ్ళీ, మళ్ళీ అదే భ్రమణవేగంతో,
సమస్త జీవరాశులను సమంగా చూస్తూ
కాలాన్ని వెలిగిస్తూనేఉంటుంది,
నిరంతర ప్రవాహశీల ప్రకృతి!

భూమిని పెళ్లగించుకొని  మొలకెత్తే విత్తనం
పువ్వై, కాయై. ఫలమై….
మళ్ళీ మొలకెత్తడానికి త్వరపడుతుంది
ఎండిన నీటి చెలమైనా
నాలుగు చినుకులు రాలగానే
పరుగు పందేనికి సిద్ధపడుతుంటుంది.

సుఖ దుఃఖాల ద్వంద్వాన్ని మోసే మనిషి మాత్రమే
అలసిపోయానంటాడు, విశ్రాంతి కావాలంటాడు
మనిషి కూడా ప్రకృతిలో భాగమే కదా!
మరెందుకీ ద్వంద్వాల బరువుల అలుపు?

నేనూ, నాదీ పర్వతాల మోత మనిషిది!
అంతా మనదేనని అల్లుకుపోయే మనసు ప్రకృతిది!!
స్వార్థంతో తనను తాను
కుదించుకొంటున్నాడు మనిషి!
ప్రతి కృతిలో, ఆకృతిలో తన్నుతాను
విస్తరించుకొంటోంది  ప్రకృతి!!

చిన్నీలు -- లలితా భాస్కర దేవ్

అతి మంచితనం
ఎందుకు పనికొస్తోందీ?
చేతకానివాని గా
ముద్ర వేయించు కోవడానికా!

ఒకప్పుడు .....
దూరదర్శన్ చూడాలంటే
రోజులో  కొంత సేపే.....

నేడో.....
ఎన్నో ఛానల్స్
సర్వం దర్శనమేగా!

ఎండలు అధికం ఎండాకాలం లో
వానాకాలం  వానలు అల్పం
చలి కాలమోఎప్పుడో చిన్నబోయింది
ఇప్పుడేమో  *కరోనా* కాలమాయే!

అప్పుడప్పుడు  వచ్చే
కొత్త వైరస్లు మంచివే నేమో?
పారద్రోలిన పాత పద్దతులు
...పాటించటానికీ

పక్షుల పై మమకారం పెంచుకొంటే
అవిఎగిరినప్పుడల్లా
క్షోభిస్తుంది హృదయం
ఎగరడం దాని నైజం ఆనుకోదు ఆక్షణం

మాటలే కదా మనసును దోచేవి
మాటలే కదా మనసును పొడి చేవి
మాటకు మాట ఎప్పుడూ   భేటీనేగా
మాటల మర్మ మెంతో తెలుసుకొనగ..

మౌనమే ..వ్యాఖ్యానమనిరి
మౌన మించుక చాలు
అంతర్ ముఖము చేయగా
మౌన మేరీతి వర్ణించెద
మనసు మూగబోయిన క్షణము

కాలమెంత గడసరిదో
కనులు మూసినా
కనులు తెరిచినా
కానరాక కరిగిపోయేనే

కవ్వ మెంతైనా ధదిని చిలుకు
నవనీతమొచ్చు వరకు
మనసు నెంతైనా మధించు
మాయతొలుగు వరకు

నీ గురించి ఆలోచించే
తీరిక లేదు నా గురించి
తెలుసుకు నే ఓపికాలేదు
ఇక మనం కలిసేదెన్నడూ?

చిరు ఆశ -- లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

ఎందరో హితులు
సన్నిహితులు ప్రక్కనే వున్నా
ఈ పిచ్చి మనసు నీకోసం
పరుగులు తీస్తోంది
మధురమైన అనుభూతినేదో
తట్టి లేపితే అది నీ ఆకృతి
దాలుస్తుంది ,,
గుండె వేగం  కొలవబోతే
నీ నామం జపిస్తుంది
నీ మనోరమ్యత నాకు మనోహరంగా కనిపిస్తుంది
ఒకటేమిటి చెప్పాలంటే దీనికి చివరేముంది ?
మృత్యు దేవత సైతం నా ప్రాణాల కోసం
నీ దగ్గరికే వస్తుంది ,,,,,,,,,,
అపరిచిత భాషలో నిన్ను ప్రశ్నిస్తున్న పర దేశిని నేను
పారేసుకున్న నా మంచు హృదయాన్ని
సందె వెలుగులో నాట్యం చేస్తున్న సెలయేళ్ళను
నాకందిస్తావనుకుంటున్న ఆశా జీవిని
ఈ శీతల గాలిలో
తడబడుతున్న స్వరాలతో
నీకోసమే నా ఈ గీతం
నాకు తెలుసు
నీవు వసంత తీరాలకు చేరుస్తావని
యుగాలు ఉదయిస్తున్నా
యుగాలు అంతమవుతున్నా
మన స్నేహం ఇలాగే వెలుగొందుతుంటుందని...

తరతరాలుగా ... -- స్వాతీ శ్రీపాద

ఎప్పుడు ఈ జాతి ఎక్కడ ఎలా వెలుగు చూసిందో
ఎవరికి తెలుసు?
పాదముద్రలు చెరిగి నాగరికత దారిపరచుకున్నాక
ఈ దారి ఒదిగిన మట్టి ముద్దకైనా తెలుసా?
వేల వేల తరతరాల చరిత్రకు అంకురార్పణ
అక్కడే మొదలైందని?

ఎక్కడో నీటి ధారలుగా పుట్టి
మరెక్కడో పారి పారి
ఇంకెక్కడో సువిశాలమై
సారవంతమైన మాగాణుల మడులు కట్టి
ఏమూలనో అంతర్వేదిలా మారిపోయే నది చిరునామా
ఏదని చెబుతాం?

పెదవి విప్పి సాక్షం చెప్పేందుకు
భూస్థాపితమైన ఆనవాళ్ళకు నాలుకలు లేవు
నీదీ నాదంటూ వాదులాడుకునే అహంకారాలకు
తాతముత్తాతల జాడలే తెలియవు
నోరులేక కళ్ళప్పగించి చూస్తున్న అంతర్యామికి
ఋజువులు చూపే సత్తా లేదు.

సరిహద్దులులేని అడవులకు తెలియదు
దాని ఒడిలో తరాలు గడిపే మృగాలూ
రెక్కలు విప్పి విశ్వదర్శనం చేసి వచ్చే పక్షులూ
మనుషులైతే ఈ సరికి
అణువణువునూ ఆక్రమించుకునే వారని
ఎక్కడికక్కడ గిరిగీసి విడదీసే వారని

అయినా ఎన్నితరాల  తరువాతో
ఒక నిశ్శబ్దం నిర్వచిస్తుంది
గాలిపై లేఖలూ నీటిపై పాటలూ
కలల మధ్య క్రౌర్యాలూ
ఉక్కు స్వరమై శాసిస్తుంది.
ఋతువులు వస్తూ పోతూనే ఉంటాయి
హక్కులూ అధికారాల మాదిరే నని.

ఎక్కడ ....? -- విష్ణు వర్ధన్ రాజు

ఎక్కడ ఈ మంత్ర ...తంత్ర వైద్యులు ...
కొత్త దేవుళ్ళు ...నయా అవతారాలు ..

దవాఖానా ల చుట్టూ ..జోరీగల్లా ముసురుతూ
రోగుల చుట్టూ ...కంచెలు వేస్తూ ...

రోగాల ... రోగం కుదిరిస్తామని
జబ్బుల...తాట వొలుస్తామని ..

మంత్రాలతో ... మాయ చేస్తామని ...
మాయ మాటలతో ...
మాయ మూటలతో ...
మాయ కూటములతో ...
మాయ కూడికలతో ...

ఊదు పోగలతో ...
నెమలీక కట్టలతో ..

యాగాలతో ...గాయాలతో ...
పూజలతో ...పునస్కారాలతో ..

చస్తున్న వాడిని మరింత చంపుతూ ...
చావే ... దశగుణంభవేత్ అని శరణు కోరేవిధంగా ...పురికొల్పే ...
మృత్యు మార్గదర్శకులు " ఎక్కడ " ???

మూగ వాడికి మాట
గుడ్డివాడికి చూపు ...
కుంటివాడికి నడక ...
చచ్చిన వాడికి బ్రతుకు...అంటూ ....

క్షణాల్లో ... అంతా ... హాంఫట్ తో ... ఖతం అని నమ్మబలికే ....
నయా దైవ దూతలెక్కడ ????

బలహీనుల ...బలహీనతలపై
అమానుష ...సవారి చేస్తూ ...
కడుహీనంగా ... కాల్చుకు తినే
"క్షుద్ర వైద్యులెక్కడ" ????

మతాల ముసుగున ....
మతలబుల మాటున ...
కనికరంలేకుండా ...
"మరోనా" అంటూ
"కరోనా"లను ...వెదజల్లే ...
కారుణ్య మూర్తులెక్కడ ??

మానవాళి ...
మృత్యుశయ్యపై ...మూలుగుతుంటే ....
కొత్తదేవుళ్లమని ...
రోత రోగాలను పాతరేస్తామని ..
ఊదరగొట్టే ...ఉత్తదేవుళ్ళెక్కడ ???

ఎక్కడ ...
ఎక్కడ ....
ఎక్కడ ....

కంటికి కనబడని ...
చూఫుకు అందని ...
ఆ నయా వైద్యులెక్కడ ...???

Posted in March 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!