Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

హేమంతం వెళ్తూ, వెళ్తూ శిశిరానికి చేయి ఊపింది. శిశిరం రాలుస్తున్న ఆకులను చూస్తూ కొత్త చివుళ్ళు వేయడానికి చెట్లు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. రాలిపడుతున్న ఆకులు పాడుతున్న తీయని పాటకి పరవశిస్తున్న ప్రకృతి ఆనంద తాండవం చేస్తున్నట్టు గాలులు అలలు, అలలుగా వీస్తున్నాయి. ఎక్కడి నుంచో ఉండుండీ కూస్తోంది కోయిల. ఆంజనేయులు తన గదిలో పడుకుని రాజశేఖర చరిత్ర చదువుకుంటూ, మధ్య, మధ్య గది కిటికీ లోనుంచి పెరట్లోకి తొంగి చూస్తున్నాడు మాలతి కనిపిస్తుందేమో అన్నట్టు. వెంకన్నగారు, కాంతమ్మ గారు వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రెండు రోజులుగా వెంకన్న గారు పొలం వెళ్ళడం లేదు.. మాలతికి ఆ రెండు రోజులు చదువు చెప్పలేకపోయాడు ఆంజనేయులు.. చదువు నెపంతో సాగే చిరు సరసాలు కూడా లేకపోవడంతో అతని మనసు చదువుతున్న పుస్తకం మీద కన్నా, మాలతి మీదే కేంద్రీకృతం అయింది.

అకస్మాత్తుగా కెవ్వుమన్న కేక వినిపించి, పుస్తకం వదిలేసి ఒక్క గెంతులో పెరట్లోకి వచ్చాడు ఆంజనేయులు.. మాలతి నూతి చప్టా దగ్గర పడి ఉంది. గబుక్కున ఆమె దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుని లేపాడు. మోచేయి గట్టుకు గీక్కుపోయి రక్తం వస్తోంది. ఆంజనేయులు చనువుగా ఆ చేయి పట్టుకుని సిమెంట్ తొట్టిలో నీళ్ళతో గాయం మీద నీళ్ళు పోస్తున్నాడు.. ఆ కేకకి ఏమయిందో అని కొంచెం మెల్లగా నడుస్తూ వచ్చిన వెంకన్న గారు ఆ దృశ్యం చూసి స్థాణువయాడు.

వెంకన్న గారి మనసు, మనసులో లేదు.. తను చూసిన దృశ్యం మనోఫలకం నుంచి చెదిరిపోడం లేదు.. అది యాద్రుచ్చికమా! లేక వాళ్ళ మధ్య ఏదన్నా జరుగుతోందా! జరిగే అవకాశం చాలా ఉంది.. వాళ్ళిద్దరూ వయసులో ఉన్న వాళ్ళు, ఆడ, మగా..ఇంతకన్నా ఏం కావాలి జరగడానికి.. తప్పు తనది.. వయసొచ్చిన ఆడపిల్లని వయసొచ్చిన కుర్రాడు ఉన్న ఇంట్లో స్వేచ్చగా వదిలేయడం పెద్ద తప్పు.. ఒక్కసారన్నా వాళ్ళ గురించి ఆలోచించకపోవడం రెండో తప్పు.. ఈ తప్పు ఇలా కొనసాగితే జరిగే ప్రమాదం వాళ్ళ జీవితాలనే కాదు, మొత్తం కుటుంబాన్నే చిందర, వందర చేస్తుంది. ఆ ఆలోచన రాగానే వణికిపోయాడు.

పడుకున్న భార్య దగ్గరగా వెళ్లి నెమ్మదిగా పిలిచాడు “కాంతం”

కాంతమ్మ కళ్ళు తెరిచింది ..” ఏంటండి అలా ఉన్నారేంటి” అడిగింది పాలిపోయిన మొహంతో ఉన్న భర్తను చూస్తూ.

“నీ ఆరోగ్యం ఎలా ఉంది?“ ఆయనకీ తను చాలా అసందర్భమైన ప్రశ్న వేసినట్టు అర్థం అవుతున్నా తన మనసులో చెలరేగుతున్న భావావేశాన్ని అణచుకోడానికి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు అడిగాడు. ఆవిడ లేచి కూర్చుంది.. ఏమైంది ఈయనకి? పెళ్లి అయి కాపురానికి వచ్చిన ఈ ముప్ఫై ఏళ్లలో ఏనాడూ ఇంత వేదన ఆయన మొహంలో చూడలేదు.. తనే ఎన్నో సార్లు మనకింక పిల్లలు పుట్టరా! నేను గొడ్రాలిగా బతకాల్సిందేనా అని ఆయన హృదయం మీద వాలిపోయి ఏడ్చేది.. తన ఏడుపు భరించలేకే తమ్ముడిని బతిమాలి ఆంజనేయ ప్రసాద్ ని పెంచుకోడానికి తీసుకున్నాడు. ఆచారాలను అనుసరించి దత్తత తీసుకోకపోయినా ఆంజనేయుడికి ఏ విషయంలోనూ లోటు చేయలేదు.

తన పక్కనే కూర్చున్న ఆయన చేయి అందుకుని మార్దవంగా అడిగింది... ఎందుకలా ఉన్నారు? ఏం జరిగింది? ఆరోగ్యం బాగుందా!”

ఆయన ఆవిడ మొహంలోకి చూసి సన్నగా నిట్టూర్చి అన్నాడు.. ఇవాళ చూడకూడని దృశ్యం ఒకటి చూసాను కాంతం...నా మనసు మనసులో లేదు..”

“చూడకూడని దృశ్యమా! ఏంటది?” నివ్వెరపోతూ అడిగింది.

రెండు గంటల క్రితం తను చూసిన దృశ్యం గురించి చెప్పాడు... “

ఆవిడ నోట మాటరాని దానిలా చేష్టలుడిగి చూసింది.. ఇది సామాన్యమైన విషయం కాదు కాంతం చూసీ చూడనట్టు వదిలేయడానికి. వాడు సిగరెట్ కాల్చాడనుకో చూడనట్టు నటించి వాడి పక్కనుంచి వచ్చేస్తే నా గౌరవం నేను నిలబెట్టుకున్నట్టూ ఉంటుంది.. అయ్యో పెదనాన్న చూసాడేమో తప్పు చేసాను.. అనే పశ్ఛాత్తాపం వాడిలో కలిగేది.. కానీ ఇది చూసీ చూడనట్టు వదిలేస్తే మన పరువు, మా తమ్ముడి పరువు మంట కలిసిపోవడం కాదు.. వాడి జీవితం నాశనం అవుతుంది.. ఆ పిల్ల జీవితం మనం నాశనం చేసిన పాపం మనల్ని చుట్టుకుంటుంది. చేయి పట్టుకుని అంత దగ్గరగా తీసుకునేంత చనువు వాళ్ళ మధ్య ఎప్పుడు ఏర్పడిందో, ఎలా ఏర్పడిందో నాకు అర్థం కావడం లేదు.. వాడిని చదువు మానిపించి అర్ధాంతరంగా ఇప్పుడు తమ్ముడు దగ్గరకు పంపలేను కూడా...”

ఆయన మాటల్లో వినిపిస్తున్న బాధ, నిస్సహాయత ఆవిడ గుండెల్ని రంపంతో కొస్తున్నట్టు అనిపించింది. పరువు ... కులం, అంతస్తు ఏమి ఆలోచించకుండా ఆంజనేయులు ఇంత పని చేసాడా. ఇది క్షమించరాని నేరం... ఉపేక్షించడం ఎంతమాత్రం తగదు.. కొంచెం కఠినంగా అంది...” నాకు ఎవరి సేవలు అవసరం లేదు.. దాన్ని తక్షణం  తీసుకువెళ్ళమని వాళ్ళ నాన్నకు కబురు చేయండి..”

ఆయన తలాడించాడు.. “అవును అదే సరైన నిర్ణయం... ఇప్పుడే కబురు చేస్తాను” అంటూ గబుక్కున లేచాడు. ఆయన వెళ్ళిన వైపు చూస్తూ “నా భర్తని ఇంత మనోవ్యధకు గురిచేస్తాడు అనుకుంటే వీడిని రానిచ్చేదాన్నా.. నా భర్తకు కష్టం కలిగించేది ఏది అయినా నాకు అవసరం లేదు” అనుకుంది ఆవిడ.

నిజమే! ఏ స్త్రీ మాత్రం తన భర్త ఆనందాన్ని హరించే విషయాన్ని భరిస్తుంది..

ఆంజనేయులు ఊహించని సంఘటన... మరునాడు అతను నిద్రలేచేసరికి నూతి దగ్గర గాజుల శబ్దం లేదు.. ఇంట్లో ఎక్కడా మువ్వల శబ్దం అసలే లేదు.. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటావిడ వంట గదిలో ఉంది.. ఉప్మా చేస్తున్న వాసన ... సన్నగా వెంకన్నగారు చదువుతున్న రుద్రం మాత్రం వినిపిస్తోంది. ఆంజనేయులు గబుక్కుని లేచి గదిలోనుంచి బయటకు వచ్చాడు.. వసారా దాటి పెరటి వైపు నడిచాడు. ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు.. మాలతి ఏది? అప్రయత్నంగా పెదాల మీద కదిలాయి ఆ అక్షరాలూ.. వింటున్న చెక్క తలుపు, మందార మొక్కలు మాకు తెలియదు అన్నట్టు తలూపాయి. ఎవరిని అడగాలో అర్థం కాలేదు. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి వంటగదిలోకి తొంగి చూసాడు.. కూరలు తరుగుతూ మాలతి కనిపిస్తోందేమో అని.. ఏం బాబూ కాఫీ ఇవ్వమంటారా అడిగింది వంటావిడ..

“అవునండి...” అన్నాడు. ఇప్పుడే ఇస్తాను అందావిడ.

అతనికి అయోమయంగా, అస్తవ్యస్తంగా ఉంది మనసంతా.. మాలతి ఏది? ఎవరిని అడగాలి.. ఎక్కడికి వెళ్ళింది.. అన్యమనస్కంగానే అన్ని పనులు కానిచ్చి, పుస్తకాలు తీసుకుని కాలేజ్ కి బయలుదేరాడు. అతని వాలకం, హడావుడి క్రీగంట గమనిస్తూనే ఉంది కాంతమ్మ.

వీడికి వయసు వచ్చింది.. ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అనుకుంది. వయసొచ్చిన యువకుడు, వరదొచ్చిన నది ఒకటే... ఆనకట్ట వేయకపోతే పరవళ్ళు తొక్కి, మహాప్రవాహమై సర్వనాశనం తధ్యం అనుకుంది.

ఆంజనేయులు కాలేజ్ కి వెళ్ళలేదు.. అతని మనసంతా మాలతి నిండిపోయి ఉంది.. ఆమె ఇంట్లో లేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్లి ఉండాలి.. ఇంకా ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ ఇల్లు ఆంజనేయులుకి తెలుసు.. అతని కాళ్ళు అప్రయత్నంగానే మాలతి  ఉండే గూడెం వైపు నడిచాయి. అప్పుడప్పుడూ దూరం నుంచి చూసిన ఆ గూడెం లో మొదటిసారిగా అడుగుపెట్టాడు. అన్ని తాటాకు గుడిసెలు... పక్క, పక్కన దగ్గర, దగ్గరగా పది గుడిసెలున్నాయి.. ఆడవాళ్ళు చాలా మంది గుడిసె ముందు కూర్చుని లేసులు అల్లుతున్నారు. పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు. గుడిసెల లోపల నుంచి సన్నని కట్టెల పొయ్యి మీద నుంచి పొగ వస్తోంది.. ఏదో వంటకం వాసన.. ఆ వాతావరణం చూడగానే అక్కడ నివసిస్తున్నవారి జీవన శైలి, వారి ఆర్ధిక, సామాజిక స్థాయి అర్థం అవుతుంది. అతను అప్రతిభుడై చూసాడు. మాలతి ఉండేది ఇక్కడా! కళ్ళు తిరిగినట్టు అయింది. మాలతి ఈ గుడిసెలో ఉంటుంది అన్న నగ్నసత్యం జీర్ణం చేసుకోలేకపోతున్నాడు.. ఏ గంధర్వ కన్యో శాపవశాత్తూ భూమ్మీద మాలతిగా పుట్టి ఇంత పేదరికం అనుభవిస్తున్నట్టుంది అనిపించింది.

అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ “ఎవరేటి బాబుగారూ... ఎవరు కావాలేటి “ అడిగిందో స్త్రీ..

మా... మాలతి “ అన్నాడు..

మాల్తి కోసవచ్చారా... అయ్యో పెద్దయ్య గారు పంపారేటండి.. తవరు రాడం ఎంటండి.. కబురుచేత్తే మేవే వద్దుంగా అంటూ గట్టిగా మాల్తీ అని పిలిచింది. మాలతి పక్కన ఉన్న గుడిసెలో నుంచి పరిగెత్తుకుని వచ్చి అక్కడ ఆంజనేయులుని చూసి స్థాణువు లా నిలబడిపోయింది..

పెద్దయ్యగారు అంపారే ఈ బాబుగారిని నీకోసం .... ఎల్లు” అంది ఆ స్త్రీ మాలతితో.

“రండి బాబుగారూ అంటూ మాలతి ముందుకు నడిచింది. ఆంజనేయులు మాలతిని అనుసరిస్తూ అలా చెప్పా చేయకుండా వచ్చావేంటి మాలతీ! నన్ను మీ ఇంటికి పిలిపించుకుంటావా.. అన్నాడు కొంచెం కోపంగా..

“మన్నించండి బాబుగారూ.. అయ్యగారు నేను పొద్దున్నే నిద్రలేవగానే బట్టలు సర్దుకో మీ ఇంటి దగ్గర దింపేత్తా అన్నారు.. వోచ్చేసాను. అయినా తవరు ఇల్లా మా గుడిసేకి రావడం మంచిది కాదు బాబుగారూ.. మా అయ్యకి అనుమానం వచ్చిందంటే నా బతుకు చాకిరేవే..” అంది.

తలవంచుకుని ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న ఆంజనేయులు ఆమె పాదాలకి చెప్పులు లేకపోవడం గమనించాడు.. “జోల్లెసుకోలేదే” అన్నాడు.. కిసుక్కున నవ్వింది.. అలవాటు లేదండి అంది..

నీకు నేను కొనిస్తాను అన్నాడు..

ఎందుకు? మీరెందుకు కొంటారు.. విస్మయంగా చూసింది.

ఏం ఎందుకు కొనకూడదు.. నువ్వలా జోళ్ళు లేకుండా నడిస్తుంటే నాకు నచ్చదు.. అందుకే కొనిస్తాను..

ఇద్దరూ పెద్ద, పెద్ద చెట్ల కింద నుంచి నడుస్తున్నారు.. రాలుతున్న ఆకులు ఆమె ఆశల్లా అనిపిస్తుంటే అదోరకంగా నవ్వుతూ అంది “నాకు మనువు చేత్తున్నారండి”

“ఏంటి? అర్థం కానట్టు మళ్ళీ అడిగాడు..

మా మేనమావ కొడుకుతో మనువండి..”

“కుదరదు... చేసుకోనని చెప్పు... “

“చేసుకోను అంటే మెడలొంచి తాళి కట్టిత్తారండి ... బాబుగారూ! ఇక నేను మీ ఇంటికి రాలేనండి ... పెద్దమ్మగారికి బాగైపోయింది... ఇంక అక్కర్లేదు అని చెప్పారండి అయ్యగారు.. బాబుగారూ! ఇంక తవరిని చూడలేనండి..”

ఆమె కళ్ళల్లో చిప్పిల్లిన నీళ్ళు ముత్యాల్లా చెక్కిళ్ళ మీదకు జారాయి.. ఆ మాటల్లో వినిపించిన వేదన, దుఖం ఆయన హృదయాన్ని సూటిగా తాకాయి.

“ఎందుకు చూడలేవు.. నేనే మీ ఇంటికి వస్తూ ఉంటా.. మనం కలుసుకోడానికి గోదారి గట్టుంది.. కోవెల ఉంది.. తప్పకుండా కలుసుకుందాం.. నువ్వు పెళ్లి చేసుకోకు... నేను నిన్ను పెళ్లి చేసుకుంటా..” ఆవేశంగా గబా, గబా అనేశాడు.

ఎక్కడెక్కడినుంచో, రకరకాల పూలు గాల్లో తేలుతూ వచ్చి తన మీద వర్షంలా కురుస్తున్నట్టు అనిపించింది మాలతికి..

“నేను కాలేజ్ నుంచి వచ్చే సమయానికి నువ్వు గోదారి గట్టుకు వచ్చేయ్ ... అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు... మన పాఠాలు చెప్పుకోవచ్చు.. సరేనా...

మాలతి కళ్ళల్లో మెరుపులు.. నిజంగానా... మీరు నన్ను పెళ్ళాడతారా !

తప్పకుండా.. నా చదువు పూర్తీ అయి ఉద్యోగం రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటా.. మనల్ని ఎవరూ విడదీయలేరు మాలతీ.... నిన్ను నేను ప్రేమిస్తున్నాను.. నువ్వు నాక్కావాలి మాలతీ! గబుక్కున ఆగిపోయి ఆమె చేయి పట్టుకున్నాడు. ఓ పెద్ద అల ఉవ్వెత్తున లేచి తనని నిలువెల్లా తడిమినట్టు అయింది ఆమెకి..

బాబుగారూ! కంపిస్తున్న పెదాలతో పిలిచింది..

మాలతీ! తమకంగా అంటూ దగ్గరగా తీసుకోబోయాడు..

ఎండుటాకులు గలగల్లాడాయి.. ఎవరో వస్తున్నారు.. గబుక్కున దూరం జరిగింది మాలతి.

స్వేచ్చకి ఆనకట్ట వేస్తె ఆ ఆనకట్టని తెంచుకుని ప్రవహిస్తుంది... కొమ్మల్లో బంధిస్తే కొమ్మలని విరిచేసి ఎగిరిపోతుంది.. ప్రేమికులని నియంత్రించే శక్తి ఏ ఆచారానికి లేదు, సంప్రదాయానికి లేదు.. ప్రేమికులు ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకోవాలని అనుకుంటే ప్రకృతే దారులు తెరిచి స్వాగతం పలుకుతుంది.. లేకుంటే ఈ ప్రపంచంలో ప్రేమకథలన్నీ మొగ్గగానే వాడిపోయేవి.. ఆ కథలు పుష్పించి ఫలించినా, విడిపోయి ఎడబాసినా,  ఏకాంతంగా కలుసుకుని ఆశలు, కోరికలు, ఊహలు కలబోసుకునే అవకాశం కలగాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. వెంకన్న గారు ఏది ఆశించి ఆ అమ్మాయిని వెనక్కి పంపించేసారో ఆ ఆశయం నెరవేరలేదు.. వాళ్ళ ఆశలు మాత్రం గోదావరి గట్టు మీద రెక్కలు విప్పుకున్నాయి.

ప్రతిరోజూ ఆంజనేయులు కాలేజ్ నుంచి గోదారి గట్టుకు రావడం, అప్పటికే అక్కడ ఏ చేట్టుచాటునో కూర్చుని మాలతి ఎదురుచూడడం నిత్యకృత్యమైంది. తనని చూడగానే పరవళ్ళు తొక్కే ఉత్సాహంతో పరుగున వచ్చిన మాలతిని దగ్గరగా తీసుకోడానికి అతనికి ఏది ప్రతిబంధకం కాలేదు.

ఆరోజు వలంధర రేవు దగ్గర కూర్చున్నారు. దూరంగా శివాలయం గోపురం కనిపిస్తోంది. సూర్యుడు వాళ్లకి చాటు ప్రసాదించడానికి నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టాడు.. చీకటి క్రమంగా వ్యాపించడం మొదలుపెట్టింది. రెండు నావలు ఆవలి తీరం నుంచి ఇవతలి తీరానికి అలసిన సరంగుల్లా మెల్లగా వస్తున్నాయి. నిండుగా ప్రవహిస్తున్న గోదారి మీద ముదురు నారింజ రంగు నీడలు పడి వింత అందాన్నిఅద్దుతున్నాయి. క్రమశిక్షణతో నిలబడి కవాతు చేస్తున్నట్టున్నాయి ఒడ్డున ఉన్న కొబ్బరిచెట్లు.. ఆమె చేయి పట్టుకుని నడుస్తూ ఖాళీగా ఉన్న పడవ ఎక్కించాడు.

“నాకు భయంగా ఉంది బాబుగారూ!” అంది వణుకుతున్న స్వరంతో.

“ఎందుకు భయం నేనున్నాగా..” ఆమె భుజాల మీద చేయి వేసి దగ్గరగా హత్తుకున్నాడు.

“నిజంగా తవరు నన్ను పెళ్లాడతారా!”

“అనుమానం ఎందుకు? నా చదువు అయిపోగానే తప్పకుండా పెళ్లి చేసుకుంటా..”

“నాకు మీరంటే చాలా ఇష్టం బాబుగారూ.. దీన్ని ప్రేమంటారేమో నాకు తెలియదు.. మేము మీలాగా పెద్దింటాల్లం కాము... చదుకున్న వాళ్ళం కూడా కాదు.. అయినా ఏదో ఆశ ఉంది బాబుగారూ నేను పెద్దమ్మ గారిలాగా పట్టు చీరలు, నగలు పెట్టుకుని మీ పక్కన కూర్చుంటానా! అమ్మగారిలా దొరసానమ్మను అయితానా!”

“తప్పకుండా.. మహరాణిలా ఉంటావు సరేనా...” మరి కొంచెం దగ్గరగా తీసుకున్నాడు. “బెస్తవాళ్ళు ఎవరన్నా చూస్తారేమో బాబుగారూ..” గువ్వపిట్టలో ఒదిగిపోతూ గొణిగింది.

సూర్యుడు పూర్తిగా అస్తమించాడు.. చీకట్లో దూరంగా ఇద్దరు కుర్రాళ్ళు గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. బెస్తవాళ్ళు అవతలి గట్టు నుంచి వచ్చేసి, పట్టుకొచ్చిన చేపల్ని బుట్టలో వేసుకుంటున్నారు. చేపల వాసన కూడా వాళ్లకి మధురమైన పరిమళంలా ఉంది.. బహుశా దాన్నే ప్రేమపరిమళం అంటారేమో! ప్రేమికులకు ఆలాంటి అందమైన సాయంత్రం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఏకాంతం లభించినప్పుడు వాళ్ళ ప్రేమ తప్ప భౌతికి ప్రపంచం స్పృహ ఉంటుందా! ఇప్పుడు వాళ్ళు కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోవడంలేదు. రాబోయే విరహం గురించి ఆలోచిస్తూ, అలాంటి విరహ బాధ కలక్కుండా ఏం చేయాలా అని వారి, వారి స్థాయికి తగిన ప్రణాళికలు రచించుకుంటూ, భవిష్యత్తుని ఊహించుకుంటూ, ఆ ఊహల్లో కనిపిస్తున్న తారల పల్లకీలో తారామండలానికి చేరుకోడానికి తహతహలాడుతున్నారు.

చల్లగాలి, అతని కౌగిలి, ఆ వెచ్చదనం మాలతికి కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తోంది..ఈ ఆజానుబాహుడు, విద్యాధికుడు, గొప్ప కుటుంబీకుడు అయిన కుర్రాడు తన భర్త అని తలచుకుంటే గర్వంతో గుండె పొంగిపోతోంది.. కానీ ఆ స్వర్గ ద్వారాల దగ్గర ఎవరో నిలబడి తనని నిర్దయగా వెనక్కి తోస్తున్నట్టు అనిపించి, గబుక్కున అతని భుజం మీద తలవాల్చి వెక్కి, వెక్కి ఏడవసాగింది.

“ఎందుకేడుస్తున్నావు?” అడిగాడు ఆమె చుబుకం ఎత్తి నుదుట చుంబిస్తూ..

“నాకు, నాకు భయంగా ఉంది” అంది.

“ఎందుకు భయం... నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా నా మాట నమ్ము” అన్నాడు.

“మిమ్మల్ని నమ్మకపోతే నన్ను నేనే నమ్ముకోలేను బాబుగారూ” అంది తమకంగా.

ఆంజనేయులు ఆమెని మరింత గట్టిగా గుండెలకు హత్తుకుని ఆమె కళ్ళు, చెంపలు, పెదాలు ముద్దుపెట్టుకున్నాడు. ఎన్నిసార్లు ఎంత దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నా కలగని మైకం ఇవాళ వాళ్ళని నిలువెల్లా ముంచెత్తింది. విశాలంగా పరచుకున్న గోదారి, పైన నిర్మలంగా ఉన్న ఆకాశం తప్ప మరో ఉనికిని వాళ్ళు గుర్తించే స్థితి దాటిపోయారు. పరిసరాలన్నీ ప్రేమ సంగీతం ఆలపిస్తున్నట్టు... ఆ గానానికి ప్రణయ నృత్యం చేస్తున్నట్టు వాళ్ళ కదలికలు ఆ చీకట్లో...

ఎక్కడి నుంచో గట్టిగా మాల్తీ .... మాల్తీ అని వినిపించడంతో ఒక్కసారిగా స్పృహ వచ్చినట్టు ఆమె తుళ్ళిపడింది.. వణికిపోతూ అంది “మా అయ్యా..”

అతనికి కూడా భయం వేసింది. “ఎక్కడ” అడిగాడు..

“చీకటడిందికదా... నా కోసం ఎతుక్కుంటూ వస్తున్నాడు.. నేనేల్లిపోతాను..” గబుక్కున లేచింది.

“ఉండు నేను తోడొస్తాను” ఆమె చేయి పట్టుకుని ఆపుతూ అన్నాడు.

“ఒద్దొద్దు... అయ్యా చూసాడంటే చంపేస్తాడు... మీరు రావద్దు.. రేపు మళ్ళి వస్తాను..” బతిమాలుతూ అంది.

“సరే.. రేపు కూడా తప్పకుండా వస్తావుగా ...” అడిగాడు.

“రాకుండా ఉండగలనా... ఇప్పుడు ఎల్లిపోతాను.. అయ్యా వచ్చేస్తున్నాడు..” అంటూ అతని చేయి విడిపించుకుని పరుగు తీసింది. ఆంజనేయులు చీకట్లో ఆమెనలా చూస్తూ శిలలా నిలబడిపోయాడు.

ఆ తరవాత ఇంటి దగ్గర ఏం జరిగింది అని ఆమెని అడగలేదు ఆంజనేయులు.. అలాగని ఆమె ప్రతిరోజూ గోదారి గట్టుకు రావడమూ మానలేదు. వాళ్ళ ప్రేమ పరిధులు దాటుతోంది. రోజు, రోజుకీ వాళ్ళ మధ్య మోహావేశం ఎక్కువ అవుతోంది. వాళ్ళు పొందుతున్న ఆనందం కన్నా మించినది మరేదీ లేదని గట్టిగా అనిపిస్తోంది ఇద్దరికీ కూడా. ప్రతిరోజూ నన్ను పెళ్ళాడుతారు కదూ అని ఆమె అడగడం మాత్రం మరచిపోదు. అలా అడిగినప్పుడల్లా ఆమె చేతిలో చేయేసి, పెదాల మీద ముద్దు పెట్టుకుని ప్రమాణం చేయడం కూడా క్రమం తప్పకుండా జరుగుతోంది.

ఈ లోగా పరీక్షలు దగ్గరకొచ్చాయి.. ఆంజనేయులు ఈ మధ్య రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని కాంతమ్మ గ్రహించింది. భర్తకి చెప్పింది.

ఆరోజు గుమ్మంలోకి వచ్చిన ఆంజనేయులు వసారాలో పడక కుర్చీలో పడుకున్న వెంకన్న గారిని చూసి బెదిరిపోయాడు.. అతన్ని చూడగానే ఆయన గంభీరంగా అన్నాడు.. “ఏంటి ఈ మధ్య రోజూ ఆలస్యంగా వస్తున్నావు... పరీక్షలు వస్తున్నాయి గుర్తుందా? మీ నాన్న నా మీద నమ్మకంతో ఇక్కడ ఉంచాడు. పి యు సి గట్టేక్కిస్తే నీ మాటా దక్కుతుంది.. నా పరువూ దక్కుతుంది.. అస్తమానం స్నేహితులతో తిరిగితే ఏమి దక్కదు” అన్నాడు.

“లే ... లేదు పెదనాన్నా! స్నేహితులతో కలిసి చదువుకుంటున్నాను..”. అన్నాడు గొంతు తడారిపోతుంటే..

ఆయన తల పంకించాడు. ఆంజనేయులు లోపలికి వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

మరునాడు మాలతిని కలిసినప్పుడు చెప్పాడు “నా పరీక్షలైందాకా కలవద్దు మనం... ఆఖరి పరీక్ష రాసాక కలుద్దాం.. అప్పుడు ఎంచక్కా సఖినేటి పల్లి వెళ్లి సరదాగా తిరిగి వద్దాం పడవలో” అన్నాడు.

మాలతి కళ్ళు సంతోషంతో మిల,మిల లాడాయి.. “మీ పరీక్షలేప్పుడు అవుతాయి” అడిగింది.

“నెల పడుతుంది” అన్నాడు.

“అమ్మో అన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలను బాబుగారూ” అంది. ఆ కళ్ళల్లో కనిపించిన బాధ చూసి గుండె మెలితిప్పినట్టు అయింది అతనికి. పరీక్షలు గంగలో కలవనీ ఈమెని వదిలి బతికే బతుకెందుకు అనిపించింది. వెంటనే తండ్రి పులిలా కళ్ళ ముందు మెదిలాడు. తనని తాను  సంబాళించుకుంటూ అన్నాడు.. “నేను పరీక్షలు పాసైపోయి పెద్ద ఉద్యోగం చేస్తే మనం పెళ్లి చేసుకోవచ్చు.. అప్పుడు నువ్వు పట్టుచీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని అచ్చు పెద్దమ్మలాగా”

అతని మాటలు పూర్తీ కాకుండానే ఆమెని నిలువెల్లా సిగ్గు ఆక్రమించింది. చెక్కిళ్ళలో నుంచి కెంపులు రాలాయి.. కళ్ళల్లోంచి వజ్రాలు కురిశాయి.. మనసంతా పచ్చలహారం పరచుకుంది...వెన్నెలతో మొహం కడిగి  నక్షత్రాలతో అలంకరించినట్టు ఉన్న ఆమె మొహం రెండు చేతుల్లో పట్టుకుని ముద్దులతో ముంచెత్తాడు.

కాలం చక, చకా పరుగులు తీసింది..పరీక్షలు అయిపోయాయి.. మాలతిని తాత్కాలికంగా దూరం పెట్టి మనసు చదువు మీద కేంద్రీకృతం చేసాడు. ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వచ్చేసరికి అతను ఊహించని సన్నివేశం.

వంటావిడ వంటగది వసారాలో పీట మీద తలపెట్టుకుని చెంగు పరచుకుని పడుకుని ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆంజనేయులుకి ఏమి అర్థం కాలేదు.. వెంకన్న గారు ఎక్కడికో వెళ్లినట్టున్నారు. అన్ని గదులు చూసుకుంటూ పెద్దమ్మా! అని పిలుస్తూ లోపలికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి స్తంభించి పోయాడు. కాంతమ్మ పడుకుని ఉంది. మాలతి ఆవిడ కాళ్ళకి కొబ్బరి నూనె మర్దనా చేస్తోంది.

అడుగుల శబ్దానికి ఆవిడ కళ్ళు తెరిచి ఆంజనేయుల్ని చూసి గద్దింపుగా అంది “నీకిక్కడ ఏం పనిరా... వెళ్ళు నీ గదిలోకి..”

ఆవిడలా గద్దించగానే బిత్తరపోయాడు.. మాలతి తల పూర్తిగా వంచేసుకుని అప్రయతంగానే వేగంగా మర్దనా చేయసాగింది. అలా చేయడంలో ఆ క్షణంలో కలిగిన ఉద్వేగం కనిపిస్తోంది.

అతనికి అవమానంగా అనిపించింది. గిరుక్కున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

****సశేషం****

Posted in March 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!