Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

మూలఘటిక కేతన – విజ్ఞానేశ్వరీయం

కేతన అచ్చతెనుగును అంటే “తల, నెల, వేసవి, గుడి, మడి” – అంటూ ఒక కంద పద్యంలో వివరించాడు. ఇవాళ మనం అచ్చ తెనుగు అనుకొనే ‘వలరాజు’ ‘అలరుపిండు’ మొ|| నవి కేతన దేశ్యాలన్నాడు.(23,24,25 పద్యాలు). 24, 25 పద్యాలలోని దేశీ తెలుగు పదాలను ఆరుద్ర ఒక పట్టికగా ఇచ్చారు. దీనిని గూర్చి మరికొంత వివరించారు. ఆంధ్ర భాషా భూషణం లో 190 పద్యాలున్నాయి. అనేక ముఖ్య విషయాలను వివరించే ఈ గ్రంథం తర్వాత వారికి మార్గదర్శకమయింది. ఈ కావ్య ప్రశస్తిని గూర్చి చెప్తూ ఆరుద్ర “ఆంధ్ర భాషా భూషణం నుండి చిన్నయసూరి కోకొల్లలుగా సూత్రాల సులువులు, ఉదాహరణలు వ్రాసుకొన్నాడు. అయితే ఆంధ్ర భాషా భూషణాన్నే లక్ష్యంగా తీసుకొని కొన్ని సూత్రాలు చెప్పవచ్చును. కాని సూరి గారు చెప్పలేదు” అని “లక్షణములు నిలిపెడిచో ...” అనే పద్యాన్ని తెల్పి ఇది బాల వ్యాకరణంలో లేదు అని అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 385).

“కేతన వ్యాకరణమున గొన్ని లోపములున్ననూ మరియొక గ్రంథ సాహయ్యము లేకుండా దనకు దానుగా ద్రోవ చేసుకొని కావించిన యరణ్య ప్రయాణము వలె భాషా స్వభావమును గుర్తించుచూ మహాకవి ప్రయోగములను బరిశీలించుచూ గావించిన వ్యాకరణ గ్రంథం గొప్ప ప్రయత్నమని యభినందించక తప్పదు అని అమరేశం వారు అన్నది సత్యం” ఆని ఆరుద్ర దీనికి ముగింపు పలికారు. (స.ఆం.సా. పేజీ 386).

విజ్ఞానేశ్వరము:

ఇది ధర్మశాస్త్ర గ్రంథము. యాజ్ఞవల్క్య మహర్షి మూడు కాండలతో రచించిన గ్రంథం, యాజ్ఞవల్క్య స్మృతి. దీనికి విజ్ఞానేశ్వరుడు ‘మితాక్షరి’ అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. దానిని మూలఘటిక కేతన –

మును సకలశాస్త్ర ధర్మము
విని విజ్ఞానేశ్వరుడు వివిధ ప్రౌఢిన్
జనులకు దెలిపిన దానిం
దెనుగున జెప్పెద సమస్త దేశీయులకున్

అని చెప్పి విజ్ఞానేశ్వరీయం అనే పేరున (1-5) తెలుగులోకి అనువదించాడు. అనువాదమైనా ఇది జాతీయాలతో, కేతనకు సమకాలీనమైన విషయాలతో స్వతంత్ర కావ్యంలా విలసిల్లుచున్నది.

ఈ ధర్మశాస్త్రంలో మూడు కాండలున్నాయి.

  1. ఆచారకాండ ఇందులో 143 పద్యాలున్నాయి.
  2. ప్రాయశ్చిత్తకాండ ఇందులో 140 పద్యాలున్నాయి.
  3. వ్యవహారకాండ ఇందులో 152 పద్యాలున్నాయి.

ఆచారకాండ లో వర్ణాశ్రమ ధర్మాలు వివరింపబడ్డాయి. ప్రాయశ్చిత్తకాండ లో నేరసహితమైన విషయాలు, శిక్షలు మొదలైనవి. వీటిని ఆరుద్ర క్రిమినల్ లా అని అన్నారు. అలాగే వ్యవహారమంటే సివిల్ లా అన్నారు. కేతన వ్యవహారం అనే మాటకు చక్కని నిర్వచనం చెప్పాడు.

విచ్చలవిడి బలవంతుం
డచ్చుగ గారించుటయును నబలుడు చాలన్
నొచ్చి మహీపతి సభకున్
వచ్చి యెఱిగింప నదియె వ్యవహారమగున్ (3-8) (స.ఆం.సా. పేజీ 387).

ఆనాటి ఆచార వ్యవహారాలూ ఇందులో చక్కగా వివరింపబడ్డాయి. పశువులు ఇతరుల చేలలో వరి మేసినప్పుడు వానిని బందెల దొడ్డిలో కట్టేసేవారు. అపుడు ఆ ఆసామి వెళ్లి డబ్బు చెల్లించి పశువును విడిపించుకొనేవారు. ఈ విషయం “ఎనుముకు బందె పాతిక..” అనే పద్యం తెలుపుతున్నది.

నేరాలు చేసిన వానికి శిక్షలు – “చంపిన దానిని సరిగా – జంపులు తగు విప్రుడైన...కుక్కచ్చు వ్రాసి దండింపదగున్” మొహంమీద (నేరస్థుని) కుక్కచ్చు వెయ్యడం ఒక గొప్ప దండన. గాడిదమీద ఊరేగించడం ఇలాంటివి తెల్పబడ్డాయి. క్రిమినల్ లా నే కాదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా ప్రాయశ్చిత్త కాండలో ఉంది. హంతకుని ఎలా పరిశోధించి పట్టుకొవాలో ఇందులో వివరింపబడింది.

సాక్ష్యాలు రెండు రకాలు – 1. దైవం 2. మానుషం. పరీక్షలు అయిదు రకాలు – 1. బ్రాహ్మణులకు తులా పరీక్ష, 2. క్షత్రియులకు అగ్ని పరీక్ష, 3. కోమట్లకు జల పరీక్ష, 4. శూద్రులకు విష పరీక్ష మరియు 5. అన్ని వర్గాల వారికి కోశ పరీక్ష.

విజ్ఞానేశ్వరీయం లో కేతన తన కాలం నాటి సంగతులను స్మృతి కర్తల అభిమతానికి విరుద్ధం కాకుండా చెప్పాడని, దేశ కాలాచారాలను పాటించాడని అన్న ఆరుద్ర – “ఇటువంటి ధర్మ శాస్త్రంలో కవిత్వం ఏమీ ఉండదు కాని సాంఘీక చరిత్రకు అవసరమైన ముడిసరుకు చాలా ఉంది. కావ్యమైనా, మహా కావ్యమైనా ఎరుకను సమగ్రం చేయడం ముఖ్యం. తెలుగులో తొలి కథాకావ్యాన్ని వ్రాయడమే గాక మొట్టమొదటి వ్యాకరణ గ్రంథాన్ని ధర్మశాస్త్రాన్ని విరచించిన కేతన ధన్యుడు.” అంటూ ఆరుద్ర కేతనను ప్రస్తుతించాడు. (స.ఆం.సా. పేజీ 391).

కమలనాభామాత్యుడు

తిక్కన తాతగారు కవి అయినట్లే శ్రీనాథుని తాతగారు కూడా కవీశ్వరుడే. అతడే కమలనాభామాత్యుడు. శ్రీనాథుడు తన తాతగారిని గూర్చి కాశీఖండంలో ఇలా నుతించాడు.

“మత్పితామహు గవి పితామహుని దలతు
గలిత కావ్య కళా లాభు గమల నాభు... “(కాశీఖండం, పీఠిక-20)

కనకక్ష్మాధర ధీరు వారధీతటీ కాల్పట్టణాధీశ్వరున్.....వినమత్కాకతి సార్వభౌమ గవితా విద్యాధరుల గొల్తుమా, మా యనుగుందాత బ్రదాత శ్రీ కమలనాభామాత్య చూడామణిన్!”   (భీమేశ్వర పురాణం, ఆవ-1-10).

దీనిని బట్టి శ్రీనాథుని తాత కాకతీయ సార్వభౌముని చేత మన్ననల నందినట్లు కరపట్టణానికి అధిపతి అయినట్లు తెలుస్తున్నది. కమలనాభుడు ‘పద్మ పురాణం’ వ్రాసినట్లు శ్రీనాథుడు చెప్పాడు. కాని అది అలభ్యం. అందుకే ఆరుద్ర ఇలా అన్నారు. “ఏమైతేనేం ఇప్పటికి తిక్కన గారి తాత శ్రీనాథుని పితామహుడు ఒకే బోటులో పయనిస్తున్నారు.”

మంచెన

“బాల రసాల పుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళల కిచ్చి యప్పడుపు గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనివాడు గౌ
ద్దాకులైన నేమి నిజధార సుతోదర పోషనార్థమై!” (1-13)
(స.ఆం.సా. పేజీ 394).

ఈ పద్యం బమ్మెర పోతరాజు రచించినట్లు తెలుగుదేశంలో బహుళ ప్రచారంలో ఉంది. కాని పోతనకు ముందు సుమారు 152 సంవత్సరాల క్రితం వాయబడిన ‘కేయూర బాహు చరిత్ర’ అనే గ్రంథం లోనిదీపద్యం. ఈ గ్రంథం రచించినది మంచెన. కేయూర బాహు చరిత్ర నండూరి గుండయ మంత్రికి అంకితం ఇవ్వబడింది.

మంచెన తన కావ్యంలో కృతిపతిని గూర్చి వివరంగా తెలిపాడు. తనను గూర్చి మాత్రం “విద్వజ్ఞినమాన్యుడు’ ‘ఉభయకావ్య సరణిజ్ఞుడు’ అని మాత్రం వ్రాసుకొన్నాడు. గుండన మంత్రికి మంచెన ఇష్టసఖుడు.

గుండన మంత్రి తాత కేతన. ఇతడు వెలనాటి చోళులలో చివరివాడైన పృధ్వీశ్వరుని వద్ద క్రీ.శ. 1183-1206 ప్రాంతంలో మంత్రిగా ఉండేవాడు. గొప్ప మంత్రి. గుండన మంత్రి వైభవంగా జీవించాడని మంచెన వ్రాసిన “మంటికడవ నులక మంచంబు...” అనే పద్యం తెలుపుతున్నది. గుండన మంత్రి మంచెనను పిలిపించి తనకు ఒక కృతిని రచించి అంకితమివ్వమనగా పైన పోతన గారి పద్యమని మనం చెప్పుకొన్న “బాల రసాల పుష్ప..” అనే పద్యం రచించి, కవులు తమ రచనలను కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించకూడదు గాని మంచి వారికి అంకితమివ్వవచ్చు అని వివరించి తన రచనకు ఉపక్రమించాడు మంచెన.

ఏ కృతి వ్రాయాలో కృతిపతి యైన గుండయే నిర్ణయించాడు. “స్థాయి, రసము శృంగారము...గేయూర బాహు చరితము, సేయుము నీవాంధ్ర భాష శిల్పము మెరయన్” మంచెన వ్రాసిన రెండవ పద్యం నుండే  శిల్పం మెరవడం ప్రారంభమయిందని చెప్తూ ఆరుద్ర “కరిముఖ డశ్వినుల్... అనే పద్యాన్ని తెల్పి అందులోని శిల్ప చాతుర్యాన్ని, గణిత వైభవాన్ని ఇలా వివరించాడు.

“ఈ పద్యంలో చక్కని శిల్పముంది. కరిముఖుడు, ఏకదంతుడు అశ్వినులు ఇద్దరు. వేదాలు మూడు. బ్రహ్మ తలలు నాలుగు. శివుని వదనాలు ఐదు. అతని కుమారుని ముఖాలు ఆరు....ఇలా ఈ పద్యంలో దశావతారాలు, అనంతమైన తారకలు తన కృతిపతిని కాపాడుతుండాలని చెప్పాడు” అని తెల్పారు ఆరుద్ర. గుండన మంత్రి గణిత శిఖర రత్నం. అందుకే అంకెలతో పద్యం రచించి చక్కని శిల్పాన్ని ప్రదర్శించాడు. అని ఆరుద్ర విశదీకరించారు. (స.ఆం.సా. పేజీ 396).

కేయూర బాహు చరిత్రకు ఆధారం- సంస్కృతంలో రాజశేఖర కవి వ్రాసిన ‘విద్ధసాల భంజిక’. కేయూర బాహుడు అనే రాజు కథ ఇది. ఇది సంస్కృతంలో దృశ్య కావ్యం. దానిని కొంచెం మార్చి మధ్య మధ్య పిట్ట కథలు, నీతి కథలు, కథకు సంబంధం లేకపోయినా చొప్పించడం జరిగింది. రాజులను వ్యామోహాల నుండి కాపాడటం మంత్రుల కర్తవ్యం. కేయూర బాహుడు భార్యా వ్యామోహంతో కొట్టుకుపోతున్న సమయంలో అతని మంత్రి భాగరాయణుడు చిన్న నాటకం ఆడి పొరుగున ఉన్న ఒక కన్యతో (రాణికి అనుమానం రాకుండా) రాజుతో వివాహం జరిపించడం. ఆ కన్య నిజంలో మగవాడి రూపంలో ఉన్న యువతి కావడం – చివరకు ఆ యువతికి కేయూర బాహుని ద్వారా మగసంతానం గలగడంతో -కథ సుఖాంతమౌతుంది.

కేయూర బాహు చరిత్ర గ్రంథం లోని వివిధ అంశాలను గూర్చి ఆరుద్ర చర్చించారు. ఇందులో 787 గద్య పద్యాలున్నాయి. ఏయే ఆశ్వాసాలలో ఏ పిట్టకథలున్నాయో ఆరుద్ర వివరించాడు. జాతీయాలు, సామెతలతో మనస్సుకు ఆనందం కల్గిస్తున్న ‘కేయూర బాహు చరిత్ర’ నిజంగా బాల రసాల పుష్ప పల్లవ కోమలమేనని ఆరుద్ర మాట. (స.ఆం.సా. పేజీ 404).

**** సశేషం ****

Posted in March 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!