Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

కాకతీయ యుగం

ఎలాంటి నీళ్ళతో స్నానం చేయాలి. భోజన తాంబూలాదులు ఎలా స్వీకరించాలి? నీటిని ఎప్పుడు ఎన్ని త్రాగాలి మొదలైన నిత్యకృత్యాలు ఎలా నిర్వహించాలో ఈ గ్రంథం వివరిస్తుంది.

చారుచర్య అనే ఈ గ్రంథానికి వేటూరి ప్రభాకర శాస్త్రి పీఠిక వ్రాయగా ముక్త్యాల సంస్థానాధీశ్వరులు ప్రచురించారు. వావిళ్ళ వారు కూడా ప్రచురించారు.

భోజుడే కాక క్షేమేంద్రుడు కూడా సంస్కృతంలో “చారుచర్య” అనే గ్రంధాన్ని రచించాడు. దీనికి హిందీలో శ్రీ దేవదత్త శాస్త్రి గారు వ్యాఖ్యానం రచిస్తే, పి.వి.రమణారెడ్డి గారు తెలుగు వచనంలో దాన్ని వివరిస్తూ...”శ్రీ క్షేమేంద్రకృతా చారుచార్యా సమాప్తం!”అనడం వల్ల భోజుని చారుచార్యకు, దీనికి సంబంధం లేదని తెలుస్తున్నట్లు ఆరుద్ర తెల్పారు.

చివరగా ఆరుద్ర మాటలు-

“నీతి భూషణం వ్రాసిన ఆంధ్రభోజుడు భోజుని చారుచర్యను తెనిగించిన ఈ అప్పన మంత్రి ఒక్కటేనని నేను భావిస్తున్నాను” అని ఇద్దరు భిన్నవ్యక్తులయినా యితడు కాకతీయ యుగంలోని వ్యక్తే అన్నారు ఆరుద్ర.

(1) శివదేవయ్య

కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గణపతి దేవ చక్రవర్తి వద్ద, రుద్రమదేవి వద్ద, ప్రతాపరుద్రుని వద్ద మూడు తరాల వారికి మంత్రిగా ఉండి వారి మన్ననలు పొందిన మహామంత్రి, గొప్ప వ్యక్తి శివదేవయ్య. శివదేవయ్యను చూచిన తిక్కన గారు సాక్షాత్తు అతనిని ఈశ్వరుడని ప్రస్తుతించారు. ఈ సంగతి సోమరాజీయంలో ఉంది (స.ఆం.సా. పుట 359).

ఇతనిని గూర్చి మహిమాన్వితునిగా కొన్ని కథలున్నాయి. ప్రతాపరుద్రుని భార్య శివదేవయ్య విగ్రహానికి నిత్యం పూజ చేసేదట. దీనిని గూర్చిన కథ ప్రతాపరుద్ర చరిత్రలో ఉన్నది (స.ఆం.సా. పుట 359). ఈ మహామంత్రి కవిత్వం కూడా చెప్పేవాడని అనంతపురం కవుల గ్రంథాల వల్ల తెలుస్తున్నది. ఇతను ఏ గ్రంథాలు వ్రాశాడో తెలియదు. ఆరుద్ర, రామకృష్ణ కవి మొదలైన వారి అభిప్రాయాలను తెల్పి కొంత చర్చించారు.

శివదేవయ్య ‘శివదేవధీమజీ’ అనే మకుటంతో ఒక శతకాన్ని రచించినట్లు మానవల్లి రామకృష్ణ కవి గారి మాట. ఈ శివదేవయ్య కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని గురువైన విశ్వేశ్వర దేశికులై ఉంటారని చిలుకూరి వీరభద్రరావు గారి అభిప్రాయం. ఇద్దరూ భిన్నవ్యక్తులని చాగంటి శేషయ్య మొదలైన వారి భావన. “సంస్కృతాంధ్ర కవితావళి కెల్ల పితామహుడని పేరుపొందిన శివదేవయ్య ఇతర కృతులు దొరికితేనే గాని అంతపెద్ద బిరుదు అతనికి ఎలా వచ్చిందో మనం తెలుసుకోలేము. ఆ కృతులు బయటపడనంత వరకు అతడు ఒక నీతిశాస్త్ర రచయితగానూ, శతకకర్త గానూ మాత్రమే నిలుస్తాడు.” అని ముగించారు ఆరుద్ర.

(2) మూలఘటిక కేతన

కాకతీయ గణపతి చక్రవర్తి కాలంలో వేంగి దేశంలో వెంటిరాల అనే అగ్రహారం ఉండేది. దీనిని బహుశా వెర్రిరాల అని కూడా పిలిచేవారు. ఈ అగ్రహారానికి మూల ఘటిక వారు అధికారులుగా ఉండేవారు. మూలఘటిక వారు వెలనాటి రాజుల ఆస్థానంలో ఉండేవారు. తీరాంధ్రలలో చాళుక్యుల తరువాత వెలనాటి చోళులే వైభవంగా రాజ్యమేలారు. వీరి రాజధాని నేటి గుంటూరు జిల్లాలోని చందవోలు.

వెలనాటి చోళులలో ఆఖరివాడని చెప్పదగ్గ పృధ్వీశ్వరుణ్ణి నెల్లూరి తెలుగు చోళ రాజైన తిక్కరాజు (మనుమసిద్ధి తండ్రి) క్రీ.శ. 1206 లో నిర్జించడం తో వెలనాటి చోళుల ప్రాభవం తగ్గిపోయింది. క్రీ.శ. 1218 నుండి కాకతీయ గణపతి దేవుని శాసనాలు వెలనాడులో కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి పండితులు కాకతీయుల, నెల్లూరు చోళుల రాజ్యాలవైపు రావడం జరిగి ఉంటుంది. మూలఘటిక కేతన బావమరిది బండారు కేతన చాలా సుప్రసిద్ధుడు. వెలనాటి చోళుల దండనాధుడు;మంత్రి. ఆంధ్రదేశంలో ముప్పయి ఇద్దరు మంత్రులను కీర్తించే ఓక సీసమాలిక వుంది. అందులో బండారు కేతన పేరు ఉంది. ఈ బండారు కేతన ఏదైనా రాజకీయ కార్యం కొరకు మూలఘటిక కేతనను నెల్లూరికి పంపి ఉండవచ్చు. ఆ విధంగా కేతన నెల్లూరుకు చేరడం వల్ల ఒక గొప్ప కార్యం జరిగిందని చెప్పవచ్చు. కేతనను గూర్చిన వివరాలు ఆరుద్ర పై విధంగా వివరించారు.

ఈ విధంగా నెల్లూరు చేరిన కేతన తిక్కన గారిని కలుసుకోవడం జరిగింది. అప్పటికే సంస్కృత రచనలు చేసిన కేతన ‘అభినవదండి’ అనే బిరుదు పొందాడు. కేతనను చూచినా తిక్కనకు అంతని కృతికి భర్త కావాలన్న కోర్కె జనించి కేతనను పిలిపించి సకల మర్యాదలు చేసి “కేతనా నీవు సంస్కృతావ్యనేక భాషా కావ్య రచనా విశారదుడవన్న సంగతి జగత్ప్రసిద్ధం. కాబట్టి ఒక కావ్యం రచించి నన్ను కృతిపతిని చెయ్యాలి” అని సగౌరవంగా ప్రార్థించారు. కేతన సంతోషించి దండి సంస్కృతంలో, గద్యంలో చెప్పిన ‘దశకుమార చరిత్ర’ను తెలుగులో గద్యపద్యాలున్న కావ్యంగా చెప్పి దానిని తిక్కనకు సమర్పించాడు. కేతన తెలుగులో రచించిన ఈ కావ్యం తెలుగులో తొలి కథాకావ్యంగా గుర్తింపు పొందింది.

దండి సంస్కృతంలో పదిమంది వీరకుమారుల సాహసగాధలను లోకోత్తరంగా, మనోహరమైన వర్ణనాదులతో రచించాడని చెప్పి ఆరుద్ర ఆ కథలను, పాత్రలను పరిచయం చేశారు. సోమదత్తుడు, పుష్పోద్భవుడు, రాజవాహనుడు మొ|| వారు ఈ దశకుమారులు.

కేతన మూలంలో ఏయే మార్పులు, చేర్పులు చేశారో శిష్టా రామకృష్ణ శాస్త్రి గారు పరిశీలించారని, కేతన గొప్ప కవికాడు మరియు రసపోషణ సరిగాలేదని తీర్పు చెప్పారు. (స.ఆం.సా. పుట 372).

కేతన తన కవిత్వానికి తిక్కన ఆనందించాడని, బ్రహ్మదేవుడైనా కవిత్వం చెప్పి తిక్కన గారిని మెప్పించలేడంటూ ఒక పద్యంలో చెప్పాడు.

“కవిత జెప్పి ఉభయకవిమిత్రు మెప్పింప
నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ
బరగ దశకుమార చరితంబు జెప్పిన
ప్రోడ నన్ను వేరె పొగడనేల!”

అయితే ‘తిక్కన గారు కృతిని పుచ్చుకొన్నందుకు మొహమాటానికి మెచ్చుకొన్నదే ...’ అని శిష్టా వారి మాట.

ఒకరకంగా నన్నయాదుల ప్రతిభ కేతనలో లేకపోవచ్చు. కాని అతడు తెలుగులో మొట్టమొదటి కథాకావ్యాన్ని-దశకుమార చరిత్రను వ్రాశాడు. అలాగే తెలుగులో తొలి వ్యాకరణ గ్రంధం ‘ఆంధ్ర భాషా భూషణం’ రచించాడు. అదే విధంగా, యాజ్ఞవల్క్య మహర్షి సంస్కృత భాషలో మూడు కాండాలుగా ఒక ధర్మ శాస్త్ర గ్రంథం రచించాడు. దానికి విజ్ఞానేశ్వరుడు ‘మితాక్షరి’ అనే పేరుతో ఒక వ్యాఖ్యానం రచించాడు. దానిని మూలఘటిక కేతన ‘విజ్ఞానేశ్వరీయం’ అనే పేరున తెలుగులోకి అనువదించాడు. ఇది తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం.

ఈ విధంగా తెలుగులో తొలి కథాకావ్యాన్ని, మొట్టమొదటి వ్యాకరణ గ్రంథాన్ని, తొలి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనువాద రూపమైనప్పటికీ ఒక గొప్ప గుర్తింపుగా రచించిన కేతన ధన్యుడు. వ్యాకరణ గ్రంథం కేతన సొంతమే.

ఆరుద్ర దశకుమార చరిత్రను గూర్చి, అందులోని కథను గూర్చి స.ఆం.సా. పుట 367 వ పేజీ నుండి 380 పేజీ వరకు చర్చించారు. తేటతెనుగు మాటలు వాడడంలో కేతన తనకు తానె సాటి అని, జనులిచ్చిన ‘అనుభవదండి’ అనే బిరుదు కేతనకు ఎంతో ఇష్టమని అందుకే తన రచనలలో ఎక్కువగా వాడుకొన్నాడని, కేతన తన కథాకావ్యంలో కొన్ని కొత్త పద్దతులు ప్రవేశపెట్టాడని ఆరుద్ర వివరించారు. అష్టాదశ వర్ణనలలో పుత్రోదయం ఒకటి. అయితే కేతన కావ్యం ప్రారంభించక ముందే తిక్కనను ఆయన తల్లి గర్భంలో ఉన్న విషయాన్ని వర్ణిస్తూ “గర్భిత నవ సుధాకరపయోనిధి మాడ్కి...” . అనే పద్యం కేతన వ్రాశాడు. దీనిని గూర్చి “కృతిపతి అవడానికి ముందే ఇటువంటి గర్భ వైభవాన్ని మరేకవీ వర్ణించి ఉండడు. కేతన మొదలుపెట్టిన గర్భధారణ వర్ణన తరువాత కవులు ఎందఱో అనుసరించారు.” అని ఆరుద్ర వివరించారు. (స.ఆం.సా. పుట 376).

ఆంధ్ర భాషా భూషణం:

“ఇది తెలుగు భాషలో తెలుగు భాషకు చెప్పిన మొట్టమొదటి వ్యాకరణం” ఆరుద్ర.

కేతన చెప్పిన ఒక సుదీర్ఘ ఉపోద్ఘాతం ఆరుద్ర ప్రస్తావించారు. దాని సారాంశం:

అది పూర్వకవులు చేతకాక కాదు. నన్ను ధన్యుణ్ణి చేయడం కోసం నాకు వదిలివేశారు. భాషావేదులు నేను చెప్పిన లక్షణం విని...నేను ఆంధ్ర భాషా భూషణం అనే శబ్ద శాస్త్రాన్ని రచిస్తాను...అంటూ సాగిన ఈ ఉపోద్ఘాతం లో, ఎక్కడా నన్నయ సంస్కృత భాషలో ఒక వ్యాకరణం వ్రాసినట్లు పేర్కొనలేదు. ఈ ఉపోద్ఘాతము వాళ్ళ తెలుగులోగాని, సంస్కృతం లో గానీ తెలుగు భాషకు వ్యాకరణ గ్రంథం లేదని తెలుస్తున్నది.

తెలుగు భాష అయిదు రకాలని కేతన తెల్పాడు. అవి, తత్సమం, తత్భవం, అచ్చతెనుగు, దేశ్యం మరియు గ్రామ్యం.

**** సశేషం ****

Posted in February 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!