Menu Close
Page Title

శ్రీమద్రామాయణం లో వాల్మీకి చెక్కిన అపురూప శిల్పం – హనుమంతుడు

Hanuman-Statue-Kanchikacharlaప్రపంచ చరిత్రలోనే అత్యంత పురాతనమైన ఇతిహాసం వాల్మీకి మహర్షి వ్రాసిన శ్రీ మద్రామాయణము. ఐదువందల సర్గలలో, ఏడు కాండలలో, ఇరవై నాలుగువేల శ్లోకాలలో, ఎక్కువ భాగం అనుష్టుప్ ఛందస్సులో లిఖించబడినదీ అసమాన 'ఆది కావ్యం’. రామాయణము లోని ఏడు )బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర( కాండలలో, హనుమంతుని ప్రస్తావన, ఔన్నత్యము వాల్మీకిచే ప్రస్ఫుటించబడింది కిష్కింధ కాండ నుండి ఉత్తర కాండల వరకు మాత్రమే. చూచుటకు అతడొక వానరుడే గాని అతడొక అసమాన ధీశాలి, బలవంతుడు, శౌర్యవంతుడు, విశేష ప్రజ్ఞాశాలి, వాక్పటుత్వం కలిగి తన సామర్ధ్యం తనకే తెలియని ధీరోదాత్తుడు. హనుమంతుడు బలానికి, వీరోచిత చొరవకు, ధృఢ శ్రేష్ఠతకు, అసమాన్య భక్తికి ప్రతీకగా నిలుస్తాడు. రామ నామ జపము రాముని కంటే గొప్పదని నిరూపించాడు.

శ్రీ రాముని అవతార సాఫల్యానికి రావణ సంహారం పరాకాష్ట ఐతే, దానికి ప్రస్ఫుటంగా కనబడని కారణం హనుమంతుని అసమాన భక్తి యుక్తులు, సాహస శక్తి, సహాయానికై చొరవ. హనుమత్సహాయము లేనిదే సీతాన్వేషణ దుస్సాధమయ్యేదేమో! రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్ ధాటి వల్ల తీవ్రంగా గాయపడిన కుడిభుజమైన లక్ష్మణుణ్ణి బ్రతికించుకోలేక పోయేవాడేమో! లక్ష్మణ సహాయం లేకుండా రామ రావణ యుద్ధం మరింత క్లిష్టతర మయ్యేదేమో. రాముని విజయ యాత్ర ముగియకపోతే సున్నిత మనస్కురాలైన జానకి ప్రాణాలు నిలుపుకోవడం అసంభవమయ్యేదేమో. రాముని అరణ్యవాస దీక్ష పరిసమాప్తి అయి అయోధ్యకు వచ్చి రాజ్య భారం చేపట్టకపోతే భరతుని ప్రాణాలు నిలిచేనా? రావణుని దురాగతాలు మరింత పెరిగి దేవమానవుల జీవనం మరీ దుస్సహంగా మారేదేమో! అయినా ఎక్కడా తన గొప్పతనాన్ని గాని తన ఆవశ్యకత గాని ప్రకటించుకున్న దాఖలాలు లేవు.

సామాన్యంగా ఎవరైనా అలౌకిక భయాన్ని ఎదుర్కోవలసి వస్తే మనస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చే శక్తిగా ఆంజనేయదండకం పఠించడం చూస్తుంటాము. ఆనమ్మకాన్ని ధృవీకరిస్తూ -

‘భూత పిశాచ నికర నహి ఆవై
మహావీర జబ నామ సునావై’-

'నీపేరు వింటే చాలు భూత పిశాచాలు దరిదాపులకి రావు' అంటాడు పరమ భక్తుడు తులసీదాసు.

Anjanaadriదశరధుని పుత్ర కామేష్టి అయిన పిమ్మట పాయసం రూపంలో వున్న యాగఫలాన్ని తన భార్యలకు పంచుతుండగా గాలికి ఎగురుతున్నమెతుకుని ఒక పక్షి తీసుకునివెళుతూ కిష్కింధలోని అంజనాద్రిపై అంజనాదేవి రుద్రుని పూజించి తీసుకుంటున్న ప్రసాదంలో పడవేసినదట. ఆవింధంగా అతడు రుద్రాంశతో వాయునందనుడిగా, కేసరి పుత్రునిగా పేరు గడించాడు. చిన్నప్పుడు అల్లరిగా తిరుగుతూ సూర్యుణ్ణి పండనుకొని పట్టుకోబోతే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు మూతి వొంకర పోయినదట. అతడి అల్లరి తో వేగి విసిగిపోయిన ఋషులు "నీకు నీ బలాన్నీ, శక్తుల్ని మరొకరు గుర్తుచేసే వరకు వాటి ఉనికినే మర్చిపోతావు" అని శపించారట. ఆసంగతి తెలిసిన జాంబవంతుడు సముద్రతీరాన్న సీతాన్వేషణకై కోతి మూకలో ఎవరు సముద్రము పై ఎగిరి లంకకు చేరుకోగలరని ప్రశ్న ఎదురైనప్పుడు అంతవరకూ వానర సైన్యములో సామాన్య వానరునిగా తిరుగుతూన్న హనుమంతుని పిలిచి హనుమంతుని శక్తి సామర్ధ్యాలు గుర్తుచేసి శాప విముక్తుడిని చేసి ఆ రామ కార్యానికి పురిగొల్పుతాడు. అసమాన శక్తి సామర్ధ్యాల ప్రదర్శనకు మార్గ దర్శకమయ్యాయి. కిష్కింధలో ఋష్యశృంగ పర్వతం వద్ద తనని అయోధ్య రాకుమారులకి పరిచయం చేసుకుంటూ హనుమంతుని పరిచయ వాక్యాలు (రంగనాథ రామాయణంలో వివరించిన హనుమంతుని సంభాషణ ప్రక్క పటం లో చూడవచ్చు) విన్న ఆకొద్ది మాటలతోనే శ్రీ రాముడంతటి వాడిని ఆకట్టుకున్న ఉదాత్త పండితుడు, జ్ఞాని. రాముడు హనుమంతుని మెచ్చుకుంటూ వాల్మీకి మాటల్లో లక్ష్మణునితో ఈవిధంగా అంటాడు..

అవిస్తరమసందిగ్ధం అవిలంబిత మద్రుతం|
ఉరఃస్తం కంఠగమ్ వాక్యం వర్తతే మధ్యమే స్వరే||

Hanuman-Conversation‘అతడి మాటలు వాచాలమైనవి అస్పష్టమైనవి కాక, వాటి ఉచ్చారణ మరీ వేగంగా గాని మరీ నెమ్మదిగాగాని కాక అవి అతడి హృదయంలోనుంచి మృదువుగా గొంతు బయటకు శబ్దపుష్టి గలిగి మంద్ర స్వరంతో వెలువడ్డాయి, చూడు, లక్ష్మణా!’

సంస్కారక్రమసంపన్నాం అద్రుతామవిలంబితాం|
ఉచ్చారయతి కల్యాణీమ్ వాచం హృదయహారిణీమ్||

అతడి ఉచ్చారణ సంస్కారవంతుడైన భాషితునివలె అద్భుతంగా సరైన రీతిలో వినువారి హృదయాలను దోచుకునే విధంగా ఉన్నది, సుమా!

అనయా చిత్రయా వాచా త్రిస్థానవ్యజ్ఞనస్థయా|
కాస్యనారాధ్యతే చిత్తం ఉద్యతా సేర రేరపి ||

‘కత్తి తీసిన బద్ధ శత్రువైనా బుద్ధిజనితమై హృదయార్భావమై కంఠోద్భాసితమైన అతడి పలుకులు విన్న పిమ్మట అనుకూలంగా స్పందించక ఎలా ఉండగలరు?’

ఏవం విధో యస్య దూతో న భవేత్పార్థివస్య తు
సిధ్యన్తి హి కథం తస్య కార్యాణాం గతయోఽనఘ||

‘ఎన్నడైనా యిటువంటి దూత ఉండగా ఆ రాజు దౌత్యం కృతకృర్త్యం కాకపోవునా’ -అంటాడు రాముడు హనుమంతుని మాట తీరుని మెచ్చుకుంటూ.

సీతాన్వేషణలో సముద్రాన్ని లంఘిస్తూ నడుమ అడ్డుపడ్డ సురస అను నాగ జనని నోరు తెరిచి మ్రింగడానికి సిద్ధమైనప్పుడు తన రూపాన్ని విపరీతంగా పెంచి, దానికి దీటుగా సురస నోటిని పెంచినప్పుడు, క్షణంలో అతి సూక్ష్మరూపం ధరించి ఆమె నోట్లో ప్రవేశించి ఆమె గుర్తించి నోరు మూసేలోగా బయటికి వచ్చేసి, తన తెలివితేటలతో ఆమె మెప్పుని పొంది 'నొప్పింపక తానొవ్వక' రామకార్య సిద్ధికై తన ఉద్యమం కొనసాగించాడు.

హనుమంతుడు లంకను చేరి, జానకిని జూసి, కుమ్మరి మొల్ల పద్యంలో -

‘కం. అంగన బొడగన నీ వియ
    మ్మంగను గడు జాలువాడ నంచును నాచే
    నుంగర మంపెను శ్రీ రఘు
    పుంగవు డిదె కొమ్మటంచు భూమిజ కిచ్చెన్.’

దానిని చూచి రాముని ఉంగళీకముగా గుర్తించి, దుఃఖితురాలైన జానకిని గాంచి లంకలో రావణణుని వద్ద బందీగా దీనావస్థలో ఉన్న వున్న సీతని హనుమంతుడు తన భుజాలమీద ఉంచుకుని తాను ఎలావచ్చాడో రాముని వద్దకు అల్లాగే సముద్రం పైన తీసుకువెళతానని సీతతో ఉత్సాహంపెంచి ధైర్యం చెప్పబోయినప్పుడు-

హనుమందూరమధ్వానమ్ కథం మాం వోఢుమిచ్ఛసి|
తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప ||

'అది నీ మర్కట బుద్ధిని చూపించడమే అవుతుంది గాని, ఓ హనుమాన్, వానర యూధ ముఖ్యుడా, అంతదూరం నన్నెట్లా తీసుకెళ్లగలవు?' అని ఆమె సందేహాన్ని వెలిబుచ్చుతే హనుమంతు చెట్టుపైనుండి దిగి వచ్చి తన నిజ శరీరాన్ని

హరిః పర్వత సంకాశః తామ్ర వక్త్రో మహాబలః|
వజ్రదంష్ట్ర నఖో భీమో వైదేహీ మిదమబ్రవీత్ ||

పర్వతాకారుడు, మహాబలుడు, ఎర్రని రాగి వంటి ముఖము గలవాడు వజ్ర సమాన దంతములు, నఖములు గలవాడు నిప్పు కణికె వలె మెరుస్తున్నవాడు గా చూపించాడు.

హనుమాన్ విరాట్రూప దర్శనాన్ని తులసీదాస్ హనుమాన్ చాలీసా లో ఈ విధంగా వర్ణిస్తాడు..

సూక్ష్మరూప ధరి            భీమరూప ధరి
సియహిమ్ దిఖావా |     అసుర సంహారే|
వికటరూపధరి              రామచంద్రకే
లంక జరావా||              కాజ్ సంవారే||

వాల్మీకి శ్లోకాలలో

సపర్వత వనోద్దేశామ్ సాట్ట ప్రాకార తోరణామ్|
లంకామిమాం సనాథం వా నయితుం శక్తి రస్తి మే||

'నాకున్న శక్తితో లంక నంతా- పర్వతాలు, వనాలు, ప్రాకారాలతో ఆ దేశపు రాజుతో సహా- తీసుకెళ్లగలను.' అన్నప్పుడు, సీత బదులు గా "సముద్రంపై, భూమిపై ఆకాశ మార్గాన్న వెళుతూ రావణ సైన్యం కల్పించే వివిధ విపత్కర పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుంది, కదా? ఆ సమయాన్న నన్ను కాపాడే ప్రయత్నంలో నిన్ను నువ్వు కాపాడుకుంటూ రాక్షస శత్రువులని గెలిచి నన్ను రాముని వద్దకు చేర్చడం సాధ్యమేనా? పైగా, రావణుడు నన్ను వంచించి తీసుకువచ్చాడు దానికి శిక్షగా రాముడు రావణుణ్ణి ఓడించి తగిన విధంగా శిక్షించి తీసుకుని వెళ్లడమే న్యాయం" అంటుంది, జానకి. హనుమంతునికి దానిని అంగీకరించ తప్పలేదు.

Ashoka-Vatika-Srilankaసీత ముందు చిన్ని రూపంలో అమాయకత్వం చూపి తరువాత భీకరరూపం దాల్చి లంకని కాల్చి రావణ సేనకు గుణ పాఠాన్ని అందించాడు.

ఆంజనేయుడు 'అష్టసిద్ధి నవనిధికేదాత' అని తులసీదాసుచే కీర్తింపబడ్డాడు. అష్టసిద్ధి ( అనగా అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇసిత్వా, వశిష్ట్వా) ప్రదాత అని, నవనిధి (పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్ఛప, ముకుంద, కుండా, నిల, ఖర్వ) దాత అని కొనియాడ బడ్డాడు.

ఆలయాల్లో హనుమంతుని ప్రతిమలు సింధూరవర్ణాన్ని కలిగి ఉంటాయి. దానికి కారణం ఈ విధంగా చెబుతారు. ఒకసారి సీత పాపిడిలో సింధూరం చూసి అది ఏమని అడుగగా సీత అది రాముని పై గల ప్రేమకు చిహ్నమని, అది రాముని ఆయుష్షు పెంచుతుందని చెప్పిందట. శరీరమంతా సింధూరము పులుముకుని  హనుమంతుడు రామునిపై గల తన అపార భక్తిని ప్రదర్శించాడట. దానిని గమనించిన రాముడు సింధూరం రంగులో ఉన్న హనుమంతుని ప్రార్ధిస్తే పూజించినవారి వ్యక్తిగత కష్టాలు తగ్గుముఖం పడతాయని దీవించాడనేది ప్రచారంలో ఉన్న ఒక కథనం. పూజల అనంతరం భక్తులకి తమలపాకులో కొంచం సింధూరం విగ్రహంనుంచి తీసి ప్రసాదంగా యిస్తారు పూజారులు.

ఒకరోజు సీత శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అందరికి బహుమతులిస్తూ హనుమంతునికి ఒక ముత్యాలహారం ఇచ్చినదట. దానిని తీసుకుని ఆంజనేయుడు ఒక్కొక్క ముత్యాన్ని కొరికి చూడ నారంభించాడట. అది చూసి సీత దేవి ఆగ్రహంతో అదేమి పని అని అడగగా సమాధానంగా వాటిలో రాముడు కనబడులేదేమిటని చూస్తున్నానన్నాడట. దానిని చూసి రాముడు ఆప్యాయంగా 'చిరంజీవ' అని ఆశీర్వదించాడట.

Panchamukha-Hanumanమహిరావణుడు రామలక్ష్మణులను భీకర యుద్ధసమయంలో పాతాళ లోకంలో దాచినప్పుడు హనుమ అక్కడ మహిరావణుడు వెలిగించి ఐదు దీపాలను ఒకేసారి ఆర్పవలసి వచ్చినప్పుడు పంచముఖాలతో ఊపిరిబిగపట్టి వాటిని ఆర్పివేసి వారిరువురికి విముక్తిని కలిగించి యుద్ధములో పాల్గొనగలిగేట్లు చేసాడు. హనుమాన్ ఒక్కడే శని ప్రభావానికి అతీతుడని వినికిడి. రావణునినుండి విముక్తుడైన శని హనుమంతుని పట్ల కృతజ్ఞతతో మారుతిని పూజించేవారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేసాడట.

రెండుమార్లు అమెరికా కి ప్రెసిడెంటు గా ఎన్నుకోబడ్డ 'బరాక్ ఒబామా' మొదటిసారి ఎన్నికలముందు, అతని శ్రేయోభిలాషులు పూజించిన హనుమద్ ముద్రిక బహుమతి గా ఇస్తే దాన్ని ధరిస్తూ విజయపరంపరలో సాగిపోయాడట. అది ఆయనే స్వయంగా చెప్పిన విషయం.

శ్రీ రామ సంకీర్తన ఎక్కడ వినబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుని సమక్ష నిదర్శనం కనబడుతుందని సామాన్య జన వాక్కు.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్|
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిమ్ నమత రాక్షసాంతకమ్||

-o0o-

Posted in February 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!