Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

ఆంజనేయ ప్రసాద్ తండ్రి సుబ్బయ్య.. రాజమండ్రిలో అప్పట్లో సివిల్ లాయర్ గా మంచి పేరుండేది. ఆయనకీ నలుగురు మగపిల్లలు.. పెద్దవాడు వెంకటరమణ, రెండోవాడు శివనారాయణ, మూడోవాడు అచ్యుత నారాయణ .. ఆంజనేయప్రసాద్.. సుబ్బయ్యగారి అన్నగారు వెంకయ్య గారికి సంతానం లేకపోడంతో ఆంజనేయ ప్రసాద్ కి పన్నెండేళ్ళ వయసులో పెంపకానికి తీసుకున్నాడు వెంకయ్య. ఆయనకీ నరసాపురంలో పెద్ద డాబా ఇల్లు, అరవై ఎకరాల మాగాణీ ఉండేది.

పెదనాన్నగారి దగ్గరే చదువుకుంటూ ఎసేస్సేల్సీ అవగానే యర్రమిల్లి నారాయణ మూర్తి కాలేజిలో పి.యు.సిలో చేరాడు ఆంజనేయప్రసాద్. కాలేజికి కొంచెం దూరంలో విశాలమైన డాబా ఇల్లు వెంకయ్య గారిది. పెద్ద, పెద్ద గదులు వరసగా రైలు పెట్టేల్లా.. ఆ తరవాత పెద్ద నడవా.., ఎడంగా ఉండే వంటగది, ఈశాన్యంలో నుయ్యి.. విశాలమైన పెరడు.. ఆ పెరట్లో అనేక రకాల చెట్లు, మొక్కలు ఎలా పడితే అలా పెరిగి పచ్చగా ఉండేది. ఆయన భార్య కాంతమ్మ.. ఆవిడది మహాకాయం.. ఆ కారణంగా నిత్యం అనారోగ్యంతో మంచం లోంచి కదలలేని స్థితి వచ్చింది. ఆవిడని  చూసుకోడానికి తన కూతురు పదహారేళ్ళ మాలతిని సాయంగా పంపించేవాడు పాలేరు సీతయ్య. నిజానికి ఆడపిల్లని ఒకళ్ళ ఇంట్లో పనికి పంపించడం అలవాటు లేని కుటుంబం పాలేరు సీతయ్యది. అయినా వెంకన్న గారన్నా, ఆయన భార్య కాంతమ్మ గారన్నా అంతులేని భయభక్తులున్నవాళ్ళు అవడంతో ఆవిడ అనారోగ్యం చూసి ఆ ఇంట్లో పరిస్థితి చూసి మాలతిని పంపిస్తుండేవాడు. ఉదయం పొలానికి వెళ్లేముందు దింపి, సాయంత్రం పొలం నుంచి వస్తూ తీసుకుని వెళ్ళేవాడు.

ఆ నూతిలో నుంచి రోజూ ఉదయం చేదతో నీళ్ళు తోడి, సిమెంటు తొట్టిలు నింపుతూ ఉండే మాలతి చేతి గాజుల సున్నితమైన ధ్వనులు...పెరట్లోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి వసారాలోకి లేడిపిల్లలా చెంగున గెంతే ఆమె మృదుమధుర పదధ్వనులు, అప్పుడప్పుడూ అమ్మగారూ! అయ్యగారూ! అంటూ పిలుస్తూ ఆ కబురు, ఈ కబురు చెప్పే ఆ స్వరం...  ఫిడేలు తీగెను ఓ సారి సున్నితంగా లాగి వదిలేస్తే వచ్చే సున్నితమైన ధ్వనిలాంటి ఉండేది.

చామనచాయ కన్నా కొంచెం రంగు తక్కువగా ఉన్నా నొక్కు, నొక్కుల వత్తు జుట్టు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. విశాలమైన కాటుక కళ్ళతో, ముద్ద బంతికి పరువం వచ్చినట్టు ఉండేది. పూల, పూల పరికిణీ, దానిమీద ఓణీ నడుం చుట్టూ దోపి పెద్దమ్మకి సేవలు చేస్తుంటే ఆంజనేయులు అలా దొంగచాటుగా చూస్తూ ఉండిపోయేవాడు. నూతి చప్టా మీద బట్టలుతుకుతుంటే తన గది కిటికీ లో నుంచి చూస్తూ ఉండడం సరదాగా, ఆనందంగా ఉండేది. పెద్దమ్మ గారికి పళ్ళు తోమించడం దగ్గర్నించీ ఆవిడ భోంచేసాక ఎంగిలి కంచం తీయడం, ఆవిడ మూతి, మొహం కడిగి ఆవిడ పడుకోగానే దుప్పటి కప్పి, పెరట్లోకి వెళ్లి శుభ్రం చేయడం, మొక్కలకు పురుగు వస్తే కొమ్మలు విరిచేయడం, నీళ్ళు పెట్టడం, బియ్యం, పప్పులు బాగుచేయడం సమస్తం పనీ చేసేది. వంటావిడ శాంతమ్మ బ్రాహ్మలావిడ. బాల వితంతువు.. అవసరం అయితే ఆవిడకి కూరగాయలు తరిగి ఇవ్వడం కూడా మాలతి పనే. ఏ పని చెప్పినా చిరునవ్వు మొహంతో హుషారుగా చేసేది. పద్దెనిమిదేళ్ళ ఆంజనేయ ప్రసాద్ మనసు అనుకోకుండానే ఆమె వైపు ఆకర్షింప బడసాగింది. వయసు, ప్రకృతి, మనసు మూడు కలిస్తే మనిషితో ఆడుకోకుండా ఉండవు. ఆంజనేయ ప్రసాద్ విషయంలో అదే జరిగింది.

అవి ధనుర్మాసం ప్రారంభమైన రోజులు, చలి ఎముకలు కోరికేస్తోంది. సాయంత్రం నాలుగైంది.. అప్పుడే కాలేజీ నుంచి వచ్చి చలిగా ఉండడంతో తన గదిలోకి వెళ్ళ బోతున్న ఆంజనేయ ప్రసాద్ అడుగు గది బయటే ఆగిపోయింది. ఇది నా గదేనా విస్తుబోయి చూసాడు. పరిశుభ్రంగా కడిగి, ముగ్గులేసి ఉంది. తలుపు ఓరగా వేసి, కుంపట్లో వెలుగుతున్న నిప్పులమీద సాంబ్రాణి చల్లుతోంది మాలతి కొద్దిగా ఒంగి. జడ బరువుగా ముందుకు పడుతోంటే కుడిచేయి మునివేళ్ళతో సాంబ్రాణి వేస్తున్న ఆమె ఆ పొగకి ఎడమ చేయి అరచేయి బోర్లించి కళ్ళకి అడ్డం పెట్టుకుంది. సరిగ్గా అప్పుడే అటూ, ఇటూ కదులుతున్న జడ చివరలు కుంపట్లో పడబోతుంటే ఒక్క గెంతులో వెళ్లి ఆమె జడ పట్టుకుని లాగి వెనక్కి జరిపాడు. ఆ విసురుకి అతని గుండెల దగ్గరగా వచ్చిన మాలతి అప్పటికే పొగతో ఎర్రబడిన కళ్ళెత్తి నిశ్చేష్టురాలై చూసింది. అతని గుండెలకి బాగా దగ్గరగా ఆమె, అతని కుడిచేతి గుప్పిట్లో ఆమె జడ. ఏం జరిగిందో అర్ధం కాలేదు ఆయనకి. కుంపట్లో నిప్పులాగే కణ, కణమని మండుతున్న యవ్వనం, చూపుల్లోంచి దూసుకొస్తున్న నిప్పురవ్వలు.. ఆ క్షణం ఏం చేయాలో తెలియని అమాయకపు వయసు, కొన్ని క్షణాలు అలాగే ఒకరినొకరు చూసుకున్నారు. అంతే జడ లాక్కుని రివ్వున పరిగెత్తుకుంటూ పెరట్లోకి పారిపోయింది మాలతి.

ఆయనకీ కూడా ఆ తరవాత ఏం చేయాలో తోచలేదు.. కానీ మరికొంతసేపు ఆమె స్పర్శ అలా ఉండిపోతే బాగుండు అనిపించింది. ఆమెనలా చూస్తూ ఉండిపోతే కాలం పాదరసంలా జారదూ అనుకున్నాడు. తీయని ఊహలతో మంచం మీద చేష్టలుడిగి కూర్చుండిపోయాడు. గదిలో సాంబ్రాణి పరిమళాలు, ఎదలో ప్రేమ పరిమళాలు గుప్పుమన్నాయి. దాదాపు గంట తరవాత కుంపట్లో నిప్పు చల్లారిపోయింది కానీ ఆయన గుండెల్లో రాజుకున్న నిప్పు మాత్రం కణ, కణమని మండుతూనే ఉండగా తలుపులు మళ్ళీ కొంచెం తెరుచుకోడం ఓ ఆకారం వచ్చి మెల్లగా కుంపటి తీసుకుని వెళ్లిపోవడం మాత్రం గమనించాడు.

వాళ్ళిద్దరి మధ్యా ఆకర్షణ, అనురాగం మొదలవడానికి అట్టే సమయం పట్టలేదు.. ఇంట్లో ఉన్నంతసేపూ ఆమె కోసం అతని కళ్ళు అన్వేషణ ప్రారంభించాయి. ఆమె స్వరం కోసం అతని చెవులు తహ,తహలాడేవి. ఇంతకు ముందు అతను లేనప్పుడు అతని గది శుభ్రం చేసే మాలతి ఇప్పుడు కేవలం అతన్ని ఒక్కసారి చూడడం కోసం అతను ఉన్న సమయంలోనే వస్తోంది. కానీ ముంచెత్తే సిగ్గుతో తల వంచుకుని గబా, గబా తుడిచి పరిగెత్తి పోతుంది.

ఎదురైన ప్రతిసారీ చూపులు కలుసుకుని అనేకం మాట్లాడుకునేవాళ్ళు కళ్ళతో. కుశలం అడగడం దగ్గర నుంచీ మొదలై ప్రేమ సందేశాలు పంపుకోడం దాకా వందల, వేల భావాలను ఆ కళ్ళు వ్యక్తం చేయసాగాయి. అతనికి ఏదో మాట్లాడాలని, ఏం మాట్లాడాలో తెలియని స్థితి.. ఆమెకి ఏదో అడగాలని, ఏమడగాలో తెలియని స్థితి. అమ్మగారికి తగ్గిపోయి త్వరగా స్వస్థత చేకూరితే ఇంక తను ఈ ఇంటికి రానవసరం లేదు అనుకునే మాలతి ఇప్పుడు ఆ ఇంటినుంచి ఎట్టి పరిస్థితిలోను వెళ్ళడానికి సిద్ధంగా లేదు.

సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయాయి. కాంతమ్మ గారు మాలతికి కొత్త పరికిణీ, ఓణీ కొన్నది. ఎరుపు రంగు ఆరణి పట్టు పరికిణీ, తెల్ల జార్జేట్ ఓణీ, తెల్ల జాకెట్టు వేసుకుని తలలో చామంతులు పెట్టుకుని, రెండు చేతులకీ ఎర్రటి మట్టి గాజులు వేసుకుని గల,గల్లాడుతూ ఇంట్లో మాలతి అటూ, ఇటూ తిరుగుతుంటే సంక్రాంతి లక్ష్మికి రూపం వస్తే ఇలా ఉంటుందేమో అనిపించసాగింది ఆంజనేయప్రసాద్కి. వంటావిడ సుబ్బమ్మ గారు నువ్వుండలు, చక్కిలాలు, అరిశెలు చేసింది. మాలతి సేవల వల్లనో, దీక్షితులుగారి ఆయుర్వేదం మందుల ప్రభావమో కాంతమ్మ ఇప్పుడు కొంచెం తేరుకుని మంచం మీద లేచి కూర్చుని పనులు పురమాయించడం, కబుర్లు చెప్పడం చేస్తోంది. పట్టుచీర కట్టుకుని, ఒంటినిండా నగలు పెట్టుకుని ఆవిడ అలా కూర్చుని ఉండడం చూసిన వెంకన్న గారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కొత్త లాల్చి, పైజమా వేసుకుని పెద్దమ్మ కాళ్ళకి దణ్ణం పెడుతున్న ఆంజనేయులుతో అంది ఆవిడ.. “నాకు తెలీకడుగుతాను.. పండగ కదా మీ అమ్మా, నాన్న పిల్లలని తీసుకుని ఇక్కడికి రావచ్చు కదరా! పెద్దాళ్ళం మేమున్న ధ్యాసే లేదు మీ నాన్నకి” అంది.

“ఏమో పెద్దమ్మా... నాన్నకి కేసులుంటాయి కదా! అందుకే రాలేదేమో” అన్నాడు ఏం చెప్పాలో తెలియని ఆంజనేయులు.

“ఆ’ ... కేసులూ సింగినాదం .. వెధవ కేసులు ఏం ఉంటాయి! వాడి పొలం వీడు లాక్కున్నాడు.. వీడి పొలం వాడు లాక్కున్నాడు, వీడి అన్నగారు వాడ్ని మోసం చేసాడు... తమ్ముడిని అక్క మోసం చేసింది ఇవేగా ఇంకేం ఉంటాయి.. అస్తమానం ఊళ్ళో వాళ్ళ గొడవలు తీర్చేవాడికి తన కుటుంబంలో ఎలాంటి అభిప్రాయ బేదాలు లేకుండా అనుబంధాలు నిలుపుకోవాలని తెలియదూ! “

ఆంజనేయులు బిక్కమొహం వేసుకుని పెదనాన్న వైపు చూసాడు. వెంకన్న కి భార్య హటాత్తుగా తమ్ముడి మీద దాడి ఎందుకు చేస్తోందో అర్థం కాలేదు.. “ మనం పిలవలేదు కదే “ అన్నాడు.

“పిలవాలా! అన్నగారింటికి రమ్మని బొట్టెట్టి పిలవాలా! ఇంకా నయం.. మేళం తీసుకెళ్ళి తోడ్కొని రావద్దూ!  సరేలెండి.. అయితే వచ్చే శివరాత్రికి కుటుంబం మొత్తం రమ్మని కబురు చేయండి దొరగారికి. అంతర్వేది తీర్థం కూడా చూడచ్చు అని చెప్పండి .” అందావిడ సగం నిష్టూరంగా, సగం కోపంగా.

“అలాగేలేవే.. పిలిపిస్తాను” అన్నాడు ఆయన.

ఆ భార్యాభర్తలు అనుకున్నట్టే శివరాత్రికి సుబ్బయ్య గారు భార్యా, పిల్లలతో వచ్చాడు. వస్తూనే కొడుకుని పిలిచి “ఏరా ఎలా చదువుతున్నావు కాలేజీకి సవ్యంగా వెళ్తున్నావా.. కుర్రాళ్ళతో కలిసి గోదారి ఒడ్డుకి షికారు వెళ్తున్నావా” అని గట్టిగా అడిగాడు.

“బానే చదువుతున్నాను నాన్నా” భయం, భయంగా అన్నాడు ఆంజనేయులు.

“వాడు బుద్ధిమంతుడురా వాడి గురించి మనకి బెంగే అక్కర్లేదు” అన్నాడు వెంకయ్య.

సుబ్బయ్య గారి భార్య పద్మావతి వంట పెత్తనం చేతికి తీసుకుంది. ఆవిడ చేతివంట అద్భుతంగా ఉంటుంది. అందుకే కాంతమ్మ పెద్దగా అభ్యంతరపెట్టలేదు. తనకి అన్ని పనుల్లో చురుకుగా సాయం చేస్తున్న మాలతిని చూసి పద్మావతి ముచ్చటపడింది. “మన ఇంట్లో ఆడపిల్లలు లేరు.. ఎంచక్కా ఇలాంటి ముచ్చటైన ఆడపిల్ల ఒకటి ఇంట్లో లక్ష్మి దేవిలా తిరుగుతుంటే ఇల్లు కళ, కళ్ళాడి పోతుంది” అంది కాంతమ్మతో.

“నీ కొడుకులకి పెళ్ళిళ్ళు అయితే కోడళ్ళు వస్తారు.. నాకా అదృష్టం ఉందా.. ఆంజనేయులు ఉద్యోగం అంటూ ఏ పట్నమో వెళ్ళాడంటే మళ్ళీ నా దగ్గరకు వస్తాడూ.. అక్కడే పట్నం పిల్లను పెళ్లి చేసుకుని స్థిరపడతాడు.. అప్పుడు వాడికి ఈ పెద్దమ్మ, పెదనాన్న గుర్తుంటారా!” స్వరంలో బాధ సుడులు తిరిగింది.

కాంతమ్మ మాటలకి మజ్జిగ చిలుకుతున్న మాలతి చేతిలో కవ్వం వణికి, కుండ చుట్టుపక్కల మజ్జిగ చుక్కలు చింది పడ్డాయి.

“అలా జరగదు అక్కయ్యా... వాడు నీ దగ్గరే ఉంటాడు.. వాడి భార్య నీకు సేవలు చేసుకుంటుంది.. నా మాట నమ్ము” అంది పద్మావతి.

శివరాత్రి నాడు అందరూ కలిసి అంతర్వేది తీర్ధం కి బయలుదేరారు. వెంకన్న గారి అంబాసిడర్ కారులో తోడికోడలు, మాలతి చెరో వైపు పట్టుకుని సాయం చేస్తుండగా పసిపిల్లలా తప్పటడుగులు వేస్తూ కాంతమ్మ చాలా కాలం తరవాత కారు దగ్గరకు నడిచి వచ్చి కారులో కూర్చుంది. ఆ ఊళ్ళో కారున్న వాళ్ళల్లో వెంకయ్యది  మూడో స్థానం .. తోడికోడళ్ళు, అన్నదమ్ములు కారులో వెళ్ళగా పిల్లలు ముగ్గురు, నడక మొదలు పెడితో వాళ్ళ వెనకాల బిడియంగా మాలతి నడిచింది.

అన్ని రకాల వ్యాపారస్తులతో తీర్థానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా క్రిక్కిరిసి ఉండడంతో పద్మావతి, కాంతమ్మ లక్ష్మి నరసింహ స్వామీని దర్శించుకుని దేవాలయం లో కూర్చున్నారు. వాళ్ళ దగ్గరే వినయంగా నిలబడిన మాలతిని చూస్తూ “వెళ్ళవే తీర్థం చూడు ఇక్కడ నిలబడ్డావేం“ అంటూ ఆంజనేయులుని పిలిచి “దీన్ని కూడా మీతో తీసుకుని వెళ్ళండిరా.. ఇంద నీకేం కావాలో కొనుక్కో” అంటూ కొంగుముడి విప్పి మాలతి చేతిలో చిల్లర డబ్బులు పెట్టింది అంది పద్మావతి.

మాలతి మనసు తుళ్ళిపడింది. ఆంజనేయులు హృదయం ఎగిరెగిరి పడింది.. ఇద్దరికళ్ళు కలుసుకున్నాయి. పక్క, పక్కనే నడుస్తూ, మధ్య, మధ్య జనం అడ్డువస్తుంటే ఒకరికొకరు మరింత దగ్గరవుతూ, ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ వెళ్ళిన ఇద్దరికి ఏం మాట్లాడుకోవాలో తెలియక మౌనంగా హృదయాలతో సంభాషిస్తూ తీర్థంలో కలిసిపోయారు.

పద్మావతి ఇచ్చిన డబ్బులతో మాలతి రిబ్బన్లు, గాజులు కొనుక్కుంది. ఆంజనేయులుతో కలిసి అలా నడుస్తుంటే మాలతికి గర్వంగా అనిపించింది. పెద్ద కులంవాడు, చదువుకున్నవాడు, ఆమె దృష్టిలో అందమైన వాడు అయిన ఆంజనేయులు పక్కన నడుస్తుంటే తనకేదో ఒక కొత్త పదవి లభించినట్టు ఆమె పులకించిపోయింది. ఈ బాబుగారు నా వారైతే అనే ఓ తీయని ఊహ వద్దన్నా ఆమె మనసులోకి చొచ్చుకు రావడంతో తుపానుగాలికి చిగురాకులా వణికిపోయింది. ఆ ప్రకంపనకి తోడు ఆ రద్దీలో ఒకరినొకరు తోసుకుంటూ వచ్చి ఆమెని గుద్దుకోడంతో ఆ ఊపుకి గబుక్కున ఆంజనేయులు మీద వాలింది.. ఎడం చేత్తో ఆమెని పట్టుకుని ఏవైంది అనడిగాడు. సిగ్గుతో కుంచించుకు పోతూ “తోసారండి” అంది తన తప్పు లేదన్న విషయం అతనికి తెలియచేసే ప్రయత్నం చేస్తూ.

మరింత జాగ్రత్తగా ఆమెని చూసుకుంటూ తిరిగాడు. అక్కడినుంచి ఇద్దరి మధ్యా మరింత చనువు ఏర్పడింది. ఎదురుపడినప్పుడల్లా ఇద్దరి మధ్యా కబుర్లు మొదలయాయి. అతను కూడా పెద్ద మాటకారి కాకపోవడంతో ఆ కబుర్లలో పెద్దగా సరసాలు, సరాగాలు లేకుండా చాలా మాములుగా “భోంచేసారా అని ఆమె అడిగితే, నువ్వు తిన్నావా అని ఆయన, పగలంతా పెద్దమ్మ నిద్రపోతుంటే ఏం చేస్తుంటావు లాంటి మాటలతో గడిచేది. ఇంకా కొన్ని రోజులు అయాక మరిన్ని వివరాలు సేకరించడంలో కొంచెం చనువు తీసుకున్నాడు.

“నువ్వు బడికెందుకు వెళ్ళవు? అసలు ఎంతవరకు చదువుకున్నావు?” అని అడిగాడో రోజు.

“నేనా? బడికెల్లనిత్తారెంటండి మా ఇంట్లో.. మూడో తరగతి సదువు అయిపోగానే మానేసానండి.. అ,ఆలు, ఎక్కాలు వచ్చును కానీ, మర్చిపోయనండి..” అని సమాధానం ఇచ్చింది. ఆమె మాటల్లోని యాస గమనించిన ఆంజనేయులుకి నవ్వొచ్చింది.. దానితో పాటు కొంత సానుభూతి కూడా కలిగింది. తనతో పాటు చదువుకుంటున్న ఎందఱో అమ్మాయిలూ గుర్తొచ్చారు.

“నేను చదవడం రాయడం నేర్పించనా!” అడిగాడు.

“నాకిప్పుడు చదువోత్తాదేన్టండి” అంది కళ్ళు పెద్దవి చేసి అపనమ్మకంగా.

“ఎందుకు రాదు? వస్తుంది.. చాలా మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. నీకు కందుకూరి వీరేశలింగం గారు తెలుసా!”

“ఆయనేవరండి.. నాకేం తెలియదండి..”

“ఆయన ఆంధ్రదేశానికి దేవుడిలాంటి వాడు.. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆయన నిజంగానే దేవుడు.”

గబ, గబా చెంపలు వాయించుకుంది.

అది చూసి నవ్వుతూ అన్నాడు. “ఆడపిల్లల కోసం రాజమండ్రిలో స్కూలు పెట్టారు.. అంతే కాదు ఆడపిల్లలకి చిన్నప్పుడే పెళ్లి చేయడానికి వీల్లేదని పెద్ద ఉద్యమాలు చేసాడు. మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకుని బాగా బతకాలని చెప్పారు. అంచేత నీకు నేను చదువు చెప్తాను. కనీసం నీ పేరు నీకు రాసుకోడం అయినా రావాలిగా” అన్నాడు.

మాలతికి అతనలా చెబుతుంటే కమ్మటి పాట వింటున్నట్టు అనిపించింది. చదువుకోడం సంగతెలా ఉన్నా ఆ వంకతో అతనికి కొంచెం దగ్గరగా ఉండచ్చు అన్న ఆశతో తలూపింది.

మర్నాడు మూడు గంటలు కొడుతుండగా ఆంజనేయులు కాలేజ్ నుంచి వచ్చే సమయానికి పెరట్లో బాదం చెట్టు కింద శుభ్రం చేసి, చాప పరిచి ఉంచింది. ఆంజనేయులు వస్తూ, వస్తూ పలకా, బలపం పట్టుకొచ్చాడు. దేవతలు, గంధర్వులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో వాళ్ళిద్దరూ పక్క,పక్క కూర్చుని విద్యాభ్యాసం మొదలుపెట్టారు.

ఆమెకి అక్షరాలు వచ్చు కాబట్టి చిన్న, చిన్న వాక్యాలతో ప్రారంభించాడు. ఎక్కాలు వచ్చు కాబట్టి కూడికలు, తీసివేతలతో గణితం ప్రారంభించాడు. ఇవి రెండూ ఆమెకి అర్థం అవుతున్నాయి అనే నమ్మకం ఏర్పడ్డాక నెమ్మదిగా ఎ, బి సి డి లు చెప్పచ్చు అనుకున్నాడు. నిజానికి ఆంజనేయులుకి ఆమెని విద్యావంతురాలిని చేయాలన్న అభిలాషకన్నా ఆమె భాషలోని యాస పోగొట్టి నాగరికురాలిని చేయాలన్న సంకల్పం ఎక్కువగా ఉంది. “అమ్మగారూ.. తవరికి ఎన్నీల్లెట్టమంటారా” అనే వాక్యం సరిచేసి, “అమ్మగారూ స్నానానికి వేడినీళ్ళు పెట్టమంటారా” అని అడిగేలా చేయడానికి రెండు రోజులు పట్టింది. అప్పటికి అతని భాషలో కూడా యాస బాగానే ఉండేది.. కానీ తన క్లాస్మేట్ రామచంద్రమూర్తి ద్వారా తన భాషను సంస్కరించుకున్నాడు.

మాలతి చదువు విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె భాషలో, నడవడికలో కూడా మార్పొచ్చింది. నవ్వులో, చూపుల్లో నాజూకుతనం, సొగసు.. చిగురిస్తున్న తొలి ప్రేమ పూవులు సన్నగా పరిమళాలు విరజిమ్మసాగాయి. నిజానికి అది ప్రేమా, ఆకర్షణా, అనురాగమా ఆమెకి తెలియదు.. ఆమెకి కావాల్సింది అతని సమక్షం.. అతని మాటలు పరవశంతో వినడం, అతని ఊపిరి వెచ్చగా మెడకి తగులుతుంటే ఆ బాదం చెట్టు కింద ఆమె గుండెల్లో ప్రేమకీ, ఆకర్షణకీ, వాంఛకీ అతీతమైన ఒక భావానికి అంకురార్పణ జరిగింది. బాబుగారు చాలా మంచివారు అనుకుంటూ ఉండేది. అంతకు మించి ఏమనుకోవాలో కూడా ఆమెకి తెలియదు.

కానీ ఆంజనేయులు కి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది తనకి ఆమె పట్ల ప్రేమ, ఆకర్షణ తో పాటు ఇంకేదో గాఢమైన భావన కలుగుతోంది అని. అయితే, దాని పర్యవసానం ఏమవుతుందో అనే విషయం అతను అప్పుడు ఆలోచించలేదు.

ఒకరోజు....

****సశేషం****

Posted in February 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!