Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
మర్మదేశం (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

పిల్లలెక్కిన ఫ్లయింగ్ సాసర్ హిమాలయ పర్వతాల మీదుగా ప్రయాణం సాగిస్తోంది.

"అదే ఎవరెస్టు శిఖరం" చెప్పాడు క్రేన్. పిల్లలలో ఎటువంటి చలనము లేదు.

"8850 మీటర్ల పొడవున్న ఈ మౌంట్ ఎవరెస్ట్ ను ప్రయత్నం లేకుండానే మీరు ఎక్కేసారు చూడండి" నవ్వుతూ అన్నాడు డింగు.

"ప్లీజ్ అంకుల్ మాకైతే మూడ్ లేదు. శర్వాణి వచ్చే వరకు మాకు దిగులుగానే ఉంటుంది." అన్నాడు చరణ్.

"అరే .... మేథా అంకుల్ మాటిచ్చారుగా ...'శార్వాణిని తీసుకుని వస్తానని.' దిగులు పడకండి. అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏ కష్టం తెలియని ప్లేస్ కి తీసుకు వెళుతున్నాము తెలుసా! అక్కడ ఉంటే మీకు ఏ దిగులు ఉండదు. నిజం చెప్పాలంటే అసలు ఆ ప్లేస్ కి మీరు రాలేరు. మీరే కాదు ఎవరు రాలేని ప్లేస్" ఊరిస్తూ చెప్పాడు డింగూ.

"మేము ఎక్కడికి రాము. శార్వాణి వచ్చాక ఇంటికి వెళ్లి పోతాము." అన్నాడు కౌశిక్.

"శార్వాణిని వెతికి తీసుకు వచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడ ఉంచుతాము. ఇదే సేఫ్ ప్లేస్‌. శార్వాణి వచ్చాక మీరందరూ వెళిపోదురుగాని" అన్నాడు క్రేన్.

"ఇదే కైలాస శిఖరం. శివపార్వతులు కొలువై ఉన్న ప్రదేశం. దీని ఎత్తు 6638 మీటర్లే అయినా ఈ నాటి వరకూ ఎవరూ దీన్ని అధిరోహించ లేదు." అన్నాడు మేథా.

"శివుడు ఉన్నాడు అని చెప్పారు కదా! దానిమీద కాళ్ళు ఎందుకు పెడతారు?" అన్నాడు దినేష్.

"అదేం కారణం కాదులే. మరి శేషాచలం కొండలమీద వెంకటేశ్వర స్వామి ఉంటే కాలినడకన, బస్సులలో వెళ్ళి చూడటం లేదా? వేరే కారణాలు లేవో వుండి ఉంటాయి." అన్నాడు చరణ్.

"అవును అది నాలుగు మత విశ్వాసాలకు సంబంధించిన పుణ్యక్షేత్రం. ఎవరైనా దానిని ఎక్కడానికి ప్రయత్నిస్తే పన్నెండు గంటల వ్యవధిలోనే రెండు సంవత్సరాలలో పెరిగే గోళ్ళు జుట్టు పెరిగిపోతాయి. వృద్ధుల లక్షణాలు వచ్చేస్తాయి. ఎక్కిన వాళ్ళు అదృశ్యం అయిపోతారు. ఈ మధ్య కైలాస పర్వతం పరిశోధనకు వెళ్లిన హెలికాప్టర్లు కూడా మాయమై పోయాయి. చైనా ప్రభుత్వం ముందు ఎక్కడానికి అనుమతి ఇచ్చినా మత విశ్వాసాలను దెబ్బతీసే ఈ పని చేయకూడదు అని అంతర్జాతీయ ప్రెషర్ ఎక్కువవడంతో చైనా ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అందుకే ఆ పర్వతం ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఉండదు.” చెప్పాడు క్రేన్.

పిల్లల్లో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగింది. “అంకుల్ మాకు మరిన్ని వివరాలు తెలియజేయవా?” అంటూ అడిగాడు కౌశిక్.

"టిబెట్ పశ్చిమ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో ఉంది ఈ కైలాస పర్వతం. జైనులు దీనిని అష్ట పాద పర్వతమని పిలుస్తారు. బౌద్ధులు టిఫే అని ఆకాశ దేవత సిపేమెన్ నివాస ప్రాంతమని అంటారు. విశ్వోద్భవ కేంద్రం ఇది. ఒక వైపు సింహం అమ్మవారి ప్రతీకగా, రెండో వైపు గుర్రం హైగ్రీవ స్వరూపంగా, మూడో వైపు ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా, నాలుగవ వైపు నెమలి కుమారస్వామి ప్రతీకగా నాలుగు రూపాలతో విరాజిల్లుతూ ఉంటుంది. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అవి నాలుగు రంగులను వెదజల్లుతూ ఉంటాయి. స్పటికం, బంగారం, రూబీ, నీలం. ఇవి ఒక్కో సమయంలో ఒక్కో రంగులో కనిపిస్తూ ఉంటాయి. కైలాస పర్వతం సముద్రమట్టానికి 6714 మీటర్ల ఎత్తులో ఉంది. నాలుగు జీవనదుల పుట్టినిల్లు ఇది. బ్రహ్మపుత్ర, సింధూ, సట్లెజ్, కర్ణాలి (గంగా) ఇవి కిందకి ప్రవహించి గంగానదిలో కలుస్తూ ఉంటాయి.” అంటూ చెప్పాడు డింగూ.

"అంకుల్ అటు చూడండి ఓంకారం ఆకారంలో ఉంది ఆ పర్వతం. భలే ఉంది." అంటూ చెప్పాడు దినేష్.

"అదే ఓంకార పర్వతం అంటారు." అన్నాడు డింగూ.

"వావ్...! ఆ సరస్సులో .... హంసలు ఎంత బాగున్నాయో... తళతళ మెరిసే నీటితో అవి పోటీ పడుతున్నాయి." ఆశ్చర్యంగా చూపిస్తూ అన్నాడు చరణ్.

"దానినే మానస సరోవరం అంటారు. బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిన మంచి నీటి సరస్సు. దేవతలు రోజు వచ్చి రాత్రిళ్ళు ఇందులో స్నానం చేస్తారని ప్రతీతి. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు కైలాస పర్వతం నుంచి ఒక జ్యోతి సరోవరంలో కొచ్చి అదృశ్యమైపోతుంది. పరమశివుడు అందులో స్నానం చేస్తాడు అని చెబుతారు. 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి అని అంటారు. అమ్మవారి కుడి అరచేయి ఇందులో పడిందని స్థలపురాణం. ఈ మానససరోవరానికి ఉత్తరాన కైలాస పర్వతం ఉంది. పశ్చిమాన కనిపిస్తోంది చూశారా ..... దానినే రాక్షసతాల్ అంటారు.

ఇది ఉప్పునీటి సరస్సు. ఈ రెండు సరస్సులు మంచి, చెడులకు ప్రతీకలు. గంగాఛానల్ ద్వారా రక్షాస్థల్ కు అనుసంధానం అయింది ఈ మానససరోవరం. ఈ రెంటినీ పలుచని పొర విడదీస్తుంది. నేను అనే అహం ఉప్పు నీరు అయితే ....... ఆ సన్నని పొరను దాటుకుని మనిషి పరమాత్మ తత్వం తెలుసుకుని ఎప్పుడు బయట పడతాడో అప్పుడు అతని మనస్సు మానససరోవరంలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇలా పింగళ నాడుల మధ్య దాగి ఉన్న ఆ బ్రహ్మనాడిని నిద్ర లేపుతాడు సహస్రారాన్ని చేరుకుంటాడు. సుషుమ్న నాడి తెరుచుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడికి ప్రవేశించ గలరు. అవన్నీ మీకు చెప్పినా అర్థం కాదు కానీ ......మీ పూర్వ జన్మ సుకృతం వల్ల నా సహకారంతో విశ్వకర్మచే నిర్మించబడిన ఈ రహస్య ప్రదేశానికి చేరుకోగలుగుతారు. చర్మ చక్షువులకు కనిపించని ప్రదేశం మహా జ్ఞానులకు, యోగులకు, తపో సంపన్నులకు మాత్రమే కనబడుతుంది. దీనినే పాశ్చాత్యులు ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్, ది పర్మిటన్ ల్యాండ్ అని అంటారు. చర్మ చక్షువులకు కనిపించకుండా మాయ పొర కప్పేసి ఉంటుంది. అక్కడికే ఇప్పుడు మిమ్మల్ని తీసుకు వెళ్తున్నాము."

"మళ్లీ మాకు అక్కడేమన్నా ప్రమాదాలు జరుగుతాయా?" భయంగా అడిగాడు దినేష్.

"దేవతలు తిరుగాడే భూమిలో ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ముందు నీలో ఉన్న అనుమానాలు భయాలు పక్కన పడేసేయి." అన్నాడు క్రేన్.

"అయ్యో ఇప్పటిదాకా చూసిన ఆ సుందర ప్రదేశాలు ఏమయ్యాయి? ఇదేదో ఎడారిలా ఉందే!" అన్నాడు కౌశిక్.

"దీనినే గోబీ ఎడారి అంటారు." అన్నాడు డింగూ.

"అదేదో దివ్య లోకం చూపిస్తామన్నారు .....!?! తీసుకొచ్చి ఈ ఎడారిలో పడేస్తున్నారే!" అన్నాడు కౌశిక్.

తొందర పడతావు ఎందుకు? ముందుముందు అద్భుతమైన లోకం మీకు చూపిస్తుంటే" అన్నాడు డింగూ.

**********

ఆ డ్రాగన్ అగ్నిగోళాల లాంటి కళ్ళతో తీక్షీణంగా చూసింది శర్వాణి వైపు. శార్వాణి శరీరాన్ని అంటిపెట్టుకున్న కట్లు తెగిపడ్డాయి.

"నీకు ఆకలిగా ఉంది కదా! ఇవిగో ఈ గుడ్లు తిను". అంటూ కొన్ని గుడ్లను శార్వాణి కి అందించింది.

"ఊహూ నేను తినను. నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు?

"నోరు మూసుకుని పెట్టింది తిను." గట్టిగా హూంకరించిందా రెప్టోయిడ్.

"నేను తినను. నన్ను మా వాళ్ళ దగ్గరికి పంపించేయి." ఏడుస్తూ చెప్పింది శార్వాణి.

"తినకపోతే పో ... నాకు ఏమన్న నష్టమా? నీకు మంచి చేద్దామని అనుకున్న నీ కర్మ." అంది ఆ డ్రాగన్.

"ఇదామంచి? మంచి చేసే వాళ్ళు ఇలా చేస్తారా? తన శరీరం మీద ఉన్న గాట్లని చూపిస్తూ అడిగింది శార్వాణి.

"అది వేరే విషయం. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు వింటే నేను నిన్ను మహరాణిని చేస్తా." అంది ఆ డ్రాగన్.

"అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇలా ఎత్తుకు వచ్చావు?" ధైర్యాన్ని కూడగట్టుకుని నిలదీసింది శార్వాణి.

***సశేషం***

Posted in February 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!