Menu Close
పునాది రాళ్ళు
-- ఆచార్య లక్ష్మి అయ్యర్ యన్ --

“ఏం నీలం! ఏ లోకంలో వున్నావ్?” డోర్ తీసుకొని నవ్వుతూ లోపలికి వచ్చింది శాలిని. తనను చూసి బజర్ నొక్కి లోపలికి వచ్చిన ప్యూను తో “దో చాయ్” అని చెప్తూ రావే లోపలికి అంది ప్రేమతో. నీలం కుమావత్, ఐ.ఏ.ఎస్. బోర్డ్ ను తాకుతూ ...ఏంటి కలెక్టరమ్మగారు పరధ్యానంగా వున్నారు?....అడిగింది శాలిని. “మరేం లేదు, సుధీర్ నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడే” చెప్పింది గాబరాగా నీలం. “ఇందులో తప్పేముంది అమ్మడూ! మనముండేది ముంబైలో. ఓ అందమైన కుర్రాడు ఓ అందమైన కుర్రదానితో చెప్పేవేగా? అంది కన్ను గీటుతూ ....అదీగాక తను మన కొలీగ్. కలసి ట్రైనింగ్ చేశాం. ఒకే రాంక్, మంచి ఆరడుగల అందగాడు, మంచి మనసున్న వాడు వెంటనే ఒప్పేసుకో ....” అంది శాలిని.

“అన్నీ తెలిసినదానివి నీవే ఇలా అంటే?” అమాయకంగా అడిగింది నీలం. “అదేం, కష్టాలన్నీ నీకేనా, అందరికీ  వున్నాయి. కష్టకాలం వచ్చినపుడు అనుభవించావ్, ఇప్పుడు సుఖం రాబోతుంది సంతోషించు.” ప్యూన్ రావడంతో మాట ఆగింది.

“సరే నే వెళ్తా! మంచి వార్త చెప్పు రేపు, బై” అంటూ సెలవు తీసుకుంది శాలిని. సాయంత్రం ఐదున్నర గంటలకల్లా డ్రైవర్ ను పిలిచి తొందరగా తన బంగళా కు వచ్చింది నీలం. వెళ్లి స్నానం చేసి ఫ్రెష్ అయి దీపం వెలిగించి పాలు కాచి టీ కప్పులతో సహా తల్లి రూంలోకి వెళ్ళింది. చదువుతున్న రామచరిత్ మానస్ ను ఆపి ప్రేమతో కూతుర్ని చూస్తుండిపోయింది అరవై ఐదేళ్ళ తల్లి. తల్లికి పాదాభివందనం (చరణ్ స్పర్శ్) చేసి టీ ఇచ్చి అప్పుడే లోపలికి వస్తున్న పనిపిల్లతో రాత్రి డిన్నర్ కు ఏం వండాలో చెప్పి గార్డెన్ లోని సోఫాపై కూర్చుని కళ్ళు మూసుకుంది నీలం. అర్ధ గంట తర్వాత పోర్టికో లైట్ వేసి కూతురి దగ్గర వచ్చి కూర్చుంది నీలం అమ్మ పూనం కుమావత్. “అమ్మా! సుధీర్ శర్మ నన్ను పెళ్లి చేసుకుంటాడట, ఈ రోజు వచ్చి చెప్పి వెళ్ళాడు. ఆలోచించి మెల్లగా నీ నిర్ణయం చెప్పు అని మరీ చెప్పి వెళ్ళాడు” అంది నీలం అమ్మను చూస్తూ. ఆమె కళ్ళలో ఓ మెరుపు. “ఒక్కగానొక్క కొడుకు. మంచి చదువుకున్న, డబ్బున్న కుటుంబం. అన్నింటికన్నా మంచి గుణవంతుడు. చెడ్డ అలవాట్లేమి లేని వాడు. మంచి వ్యక్తి.

“ఆ బాలాజీ, తిరుపతి వెంకటేశ్వరుడే నీకు దారి చూపుతున్నాడు. వెంటనే ఒప్పేసుకో ఏమీ ఆలోచించకు తల్లీ” అంది దేవుడికి దండం పెట్టుకుంటూ మార్వాడిలో ఓ భజన గూడ పాడింది. పదేళ్ళు హైదరాబాద్లో వుంటున్నపుడు బిర్లా మందిర్, తిరుపతి గుడిని దర్శనం చేసుకొని ఆ ప్రభావంతో హింది వాళ్ళ బాలాజీ ని (రాజస్థాన్లో హనుమంతుణ్ణీ బాలాజీ అంటారు) వేంకటేశ్వరుని బాలాజీ గా మార్చి వేసింది ఆమె భక్త హృదయం.

“ఇంకా ఎన్నేళ్ళని పాత విషయాలను తలచుకుంటావ్! మంచిరోజులు వస్తున్నాయిరా నీకు..” అంటూ నుదిటిమీద ముద్దు పెట్టింది తల్లి పూనం కుమావత్ .

xxxxxxxxxxxx         xxxxxxxxxxxx

రాత్రి పదిన్నర వరకు ఫైళ్లని చూసి బాల్కనీ లోకి నడిచింది కలెక్టర్ నీలం. ఆమె స్మృతులు మెల్లగా గతంవైపు పరుగిడసాగాయి .

“..........................................................................మేరా కిశోర్, తేరి గుడియా నీలం కేలియే హి హై (నా కిశోర్ నీ కూతురు నీలం కోసమే!) నా కొడుకుతో నీ గుడియాకు లగ్గం పెట్టించు....ముహూర్తం గూడ చూసేశాను..” అంటూ లోపలికి వచ్చాడు పడాసోలి గ్రామపు సర్పంచ్ నిర్మల్ కుమావత్ ....కిళ్ళి నములుతూ. ఐదేళ్ళ పాప నీలం అప్పుడే పలకలో వర్ణమాలను దిద్దడం ఆరంబిస్తున్నది.

“ఓసారి నా బీవీని అడిగి చెప్తాను” అన్నాడు సునీల్ కుమావత్, నీలం నాన్న. “ఏందీ అడిగేది? ఎల్లుండి పదివేలు సదింపు సదివించి ఈ పెళ్లి చేసేందుకు మన సమాజం వాళ్ళతో  మంత్రిజీనే స్వయంగా వత్తుంటేను!” అదేదో ఘన కార్యం చేస్తున్నట్లు చెప్పాడు సర్పంచ్.

పడాసోలి గ్రామంలో పొలాలు దున్ని గోధుమ, ఆవాలు పండించే సునీల్ కుమావత్ కు నియమాలు గానీ చట్టాలు గానీ తెలియవు. పెద్ద ఉమ్మడి కుటుంబం ఐదుగురు కొడుకులు, నలుగురు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు. అతని కుటుంబమే ఓ చిన్న సైజు గ్రామంలా వుంటుంది. రాజస్థాన్ లోని చాలా గ్రామాల పరిస్థితి దాదాపు ఇదే. ఇప్పటివరకు కరెంటులేని గ్రామాలు కూడా ఇక్కడ చాలా వున్నాయి. అఫిం, ఓపిఎం (గంజాయి మొక్కలు) బాడమీర్ లో పండించబడడం వల్ల ఇక్కడి గ్రామ మహిళలు చాలా మంది చుట్టలు , బీడీ లు కాలుస్తారు. చలికాలం అందరూ కూర్చొని దారూ (సారాయి) కూడా తాగుతారు. చదువు సందె లేని గ్రామాలు కోకొల్లలు. అమాయక మనస్తత్వం గల ప్రజానీకాన్ని దోచుకుంటున్న భూస్వామిక, రాజనీతి జాతి వ్యవస్థలు. సునీల్ కుమావత్ ఇంట్లో చదువుకున్న వాడని చెప్పాలంటే ఏడవ తరగతి ఫెయిల్ అయిన అతని తమ్ముడు మనోజ్ మాత్రమే. ఆ రోజు రాత్రి నీలం తల్లి పూనం వేడి వేడి పరాఠాలు వడ్డిస్తూ అంది “కాస్త ఆలోచించండి, జమానా బదల్ గయా (కాలం మారింది). ఇప్పుడు బెటీలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంట. మనోజ్ చెప్పాడు. ఇప్పుడే కదా దానికి ఐదేళ్ళు నిండాయి, పైగా బాల్య వివాహం కానూని జురం (చట్టరీత్యా నేరం) కూడా అంట. దాన్ని బాగా చదివించి డాక్టరో, టీచరో చేద్దాం..” అంది నిద్రపోతున్న కూతుర్ని ప్రేమగా చూస్తూ. కానీ ఆమె మాటలను వినేవాళ్ళెవరు? ఐదు రోజుల్లో పెళ్ళనే పేరుతో తతంగమంతా పూర్తయింది. ఓ పదేళ్ళ బాబును ఓ ఐదేళ్ళ పాప కిచ్చి పెళ్లి చేసి విందులు ఆరగించే పిచ్చి  వింత జనం. సయాని అయ్యాక తీసుకెళతాం అంటూ రస్మ్ పూర్తి అయింది అంటూ పాపను విడిచి వెళ్లిపోయారు. పెళ్ళైన తరువాత అమ్మాయి పుట్టింట్లో వుంటుంది ఇష్టమైతే చదివిస్తారు. పెళ్లైన 5 రోజుల తరువాత విడిగా పెరిగి పెద్దై విడాకులకై తిరిగే యువతరాన్ని కూడా చూడవచ్చు ..ఇప్పుడూ బాల్య వివాహ వ్యవస్థ జోరుగా సాగుతూనే వుంది. రోజులు గడవసాగాయి. నీలం గ్రామంలో ఐదవ తరగతి వరకే స్కూల్ ఉండడంతో చదువు ఆపేద్దామని అనుకున్నారు ఆ ఇంటి పెద్దలు. వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని, చీవాట్లు తిని దెబ్బలు తిని ఆఖర్న ఎవరికీ తెలియకుండా కూతుర్ని మనోజ్ ద్వారా తన తమ్ముడి దూరపు బంధువులు ఉంటున్న హైదరాబాద్ కు పంపించేసింది తల్లి  పూనం.

ఇంటర్, డిగ్రీ, పి.జి. చేసి ఐఏఎస్ పాస్ అయి పోస్టింగ్ తీసుకొని ముంబై వచ్చింది నీలం. ఈ లోపల నీలం తండ్రి పోవడం, నీలంను పెళ్లి చేసుకున్న ఆ చిన్న కుర్రాడు కిశోర్ 15 ఏళ్లలో ఆక్సిడెంట్ లో పోవడం అన్నీ జరిగినా తన పల్లె వైపు తిరిగి చూడని నీలం తన బాబాయి సహాయంతో తల్లిని మాత్రం ముంబై పిలుచుకు రమ్మని వత్తిడి చేసి తన దగ్గరకు పిలిపించుకుంది. కాలేజిలో పరిచయమైన శాలిని, సుధీర్ కు కొలీగ్ గా వుండడం అందరూ కలసి ట్రైనింగ్ చేయడం వాటంతట అవే జరిగి పోయాయి.

“ఖానా తైయార్ హై దీదీ (భోజనం రెడిగా వుంది అక్కా..!)” అన్న పనమ్మాయి పిలుపుతో ఈ లోకానికి వచ్చింది. “దామ్మా! భోంచేద్దాం”...అన్న తల్లి భుజంపై చేయి వేసి లోపలికి నడిచింది నీలం.

మరుసటి రోజు సుధీర్ వాళ్ళ ఇంటి లాన్లో ........”ఏం నీలం, కాయా పండా?” అని తాపీగా అడిగాడు సుధీర్. “సుధీర్! మీ అమ్మా నాన్నలకు అన్నీ విషయాలు తెలియాలి, దాపరికాలు వద్దు. నీవో తెలుగు బ్రాహ్మణుల కుటుంబానికి చెందిన వాడివి. నేనో బాల్య వివాహానికి బలైన పేద రాజస్తాన్ కుమావత్ అమ్మాయిని. నీ చదువంతా సిటీలో దర్జాగా ...సాగింది. నీవు పక్కా సౌత్, విజయవాడ, నేనో పక్కా నార్త్, కుమ్మరి కుటుంబానికి చెందిన దాన్ని. నీకు నాకు పొత్తు కుదురుతుందా యని ఆలోచిస్తున్నాను ....” అంది నీలం. “వెరీ సింపుల్! ఎవరికీ ఏమి చెప్పకుండా పెళ్లి చేసుకుందాం. తర్వాత తెలిస్తే కొంపలంటుకోవులే....!” అన్నాడు నవ్వుతూ. “నో, జీవితపు పునాది రాళ్ళే అబద్దాలతో ఆరంభమవుతే, ఆ జీవితం సాఫీగా సాగదు. నీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు అన్న భేద భావం నీకూ, నాకూ ఎన్నటికి వుండగూడదు. అన్నీ విషయాలు అందరికి తెలియాలి ...” అంది జీరబోయిన గొంతుతో నీలం.

“బడవా! నాకేమీ తెలియదనుకొన్నావా? నా కంతా శాలిని ఎప్పుడో చెప్పేసిందిలే. నాకే అబద్దం చెప్పి నాటకాలాడుతావా? నాటకాల రాయుడా.....” అంటూ సుధీర్ చెవి నులిమింది అక్కడకు ముందే వచ్చిన వాళ్ళమ్మ సుధ చిరుకోపంతో.

”ఆంటీ!” అంటూ ఆమె పాదాన్ని నమస్కరింప వంగింది నీలం. ఆమెను లేపి అక్కున చేర్చుకుని “నాకు బహూ (కోడలు)అయినా బేటీ(కూతురు) అయినా నువ్వే. అవునూ, తెలుగులో గొబ్బెమ్మ పాటలు కూడా చక్కగా గ్రామీణ శైలిలో పాడుతావంట గదా! ఓ గొబ్బెమ్మ పాట పాడు అంది. అందుకు నీలం అలాగే అంటూ రెండు చేతులతో తప్పట్లు కొడుతూ

ఓ ఓ ..వీరుడు వీరుడు వీర భద్రుడు
నల్లంచి కొండ మీద నాగలయ్య పుట్ట
నాగలయ్య పుట్ట మీద వడ్లార బోసా
వడ్లలకు నీడొచ్చే ఓ చందమామా.....అంటూ పాడుతుండగా “..ఆహా,రాజస్తాన్ అమ్మాయి తెలుగు జానపద గీతం .....” అంటూ చప్పట్లు కొడుతూ వచ్చింది శాలిని. సుధ నీలం భుజంపై చేయి వేసి పదమ్మా! నేనూ, నా భర్తా, నీవు, నా కొడుకూ, మీ అమ్మ అందరం ఈ రోజునుండి ఒకే కుటుంబం. పద మీ ఇంటికి వెళ్లి సంబంధం ఖాయం చేద్దాం” అని అంటే, “నేను మీ మధ్యలో లేనన్న మాట....?” అంటూ కోపంతో బుంగ మూతి పెట్టి  అడుగుతున్నశాలినిని చూసి అందరూ హాయిగా నవ్వేశారు.

**సమాప్తం**

Posted in February 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!