Menu Close
అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

ముల్లుని ముల్లుతోనే ...

రోజురోజుకు పెరుగుతున్న గిరాకీని తట్టుకోడానికి, అయ్యరు హోటల్లో విస్తారణ జరిగింది. మరో పాతిక మందికి, జాగా ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరిగింది. ఉన్న T.V. కి జోడుగా మరో T.V. చేరింది. ప్రస్తుతం, హోటల్ బిజీ బిజీగా ఉంది. క్రిందటి రాత్రి ఆంజనేయాలయంలో హరిదాసు వేసిన జోకులను నెమరు వేసుకొంటున్నారు, కొందరు గ్రాహకులు. తన ప్రత్యేక ఆసనంలో ఆసీనులయి ఉన్న శాస్త్రిగారు, సీతాకల్యాణాన్ని ఆసక్తికరంగా వినిపించిన హరిదాసును ప్రశంసిస్తున్నారు. ఆ సమయంలో, జోగారావు ప్లీడరు గారు, తన పదేళ్ల మనవడితో, హోటల్ లో అడుగుపెట్టేరు. శాస్త్రిగారికి, ఓ నమస్కార బాణం పడేసి, ఆయన దగ్గరలో జాగాచూసుకొని, రెండు ప్లేట్లు ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చేరు. అది వినగానే,

“తాతా, నాకు ఇడ్లీ ఒద్దు.” అని గొణిగేడు, ముద్దుల మనవడు.

“మరేమిటి కావాలిరా.” ప్లీడరుగారి ప్రశ్న.

“మసాలా దోస.” చిరునవ్వుతో విన్నవించేడు మనవడు.

“ఒక ఇడ్లీ కేన్సిల్ చేసి, మసాలా దోస తీసుకురా, బాబు.” అని సెర్వరుకు సవరణ తెలియజేసేరు తాత.

ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ కోసం ఎదురు చూస్తున్న జోగారావుగారితో శాస్త్రిగారు తన మొర ఇలా వినిపించుకొన్నారు.

“అయ్యా, వకీలు గారూ, మన హైస్కూలులో, సుమారు నాలుగు నెలలు దాటింది శర్మగారు బదిలీ మీద వెళ్లిపోయిన తరువాత పెద్ద క్లాసులకు లెఖ్ఖలు టీచరు ఇప్పటి వరకూ ఎవరూ రాలేదు. మా మనవడు రోజూ గోల. పెద్ద పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, లెఖ్ఖల టీచరు ఎవరూ లేరని. పోనీ, నేను చెబుదామా అంటే ఏదో, ఒకటో ఎక్కం అంటే చెప్పగలను గాని, ఏవో జీబ్రా లెఖ్ఖలట, అంతంత పెద్ద లెఖ్ఖలు నాకేమిటి తెలుస్తాయండి.”

“శాస్త్రిగారూ, ప్రోబ్లెం సాల్వ్ అయింది. వారం రోజుల్లో కొత్తాయన జాయినవుతారండి.” వకీలుగారి హామీ.

“క్రిందటి నెలా అలానే అనుకొన్నాం గదండి. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారని. తీరా కొసకి, ఆయన ఎం.ఎల్.ఏ. గారిని ఆశ్రయించి తల్లిగారి ఆరోగ్యం బాగులేదన్న సాకుతో విశాఖపట్నానికి బదిలీ మార్పించుకొన్నారు.” నిస్పృహతో శాస్త్రిగారి సందేహం.

“ఈ కేసు అలాంటిది కాదు. రెండు రోజుల కిందట మా బావ మరది ఫోన్ చేసి చెప్పేడు. వాళ్ళ ఊరి స్కూలులో పనిచేస్తుండే లెఖ్ఖలు టీచరు, లక్ష్మణస్వామి గారికి మన ఊరికి బదిలీ అయిందిట. మా బావమరిదికి ఆయన బాగా తెలుసట. వచ్చే ఆదివారమే, ఆయన వస్తున్నారట. ఆయనకు మంచి లోకేలిటీలో నాలుగు గదుల ఇల్లొకటి చూడమని మా బావమరిది చెప్పేడు.” నొక్కి చెప్పేరు వకీలుగారు.

“చల్లటి కబురు చెప్పేరు వకీలు గారూ. ఎంతమందేమిటి ఆయన కుటుంబం.”

“నలుగురు. ఆయన, ఆయన భార్య. ఇద్దరు పిల్లలు. ఒక మగ. ఒక ఆడ. ఇద్దరూ అమెరికాలో చదువుకొంటున్నారు.”

“అంటే, ఇక్కడకు వచ్చే వారు ఆ దంపతులిద్దరే అన్న మాట. నాలుగు గదుల ఇల్లు ఏం చేసుకొంటారండీ వాళ్ళు.”

“లెఖ్ఖల మేష్టరు గదండీ. వద్దన్నా ట్యూషన్లు వస్తాయి. పిల్లలిని కూర్చోబెట్టడానికి ఆ మాత్రం జాగా ఉండాలి.”

“ఆయన నివాసం కుదిరిందా.”

“నిన్ననే కుదిరింది. పెద్దీశ్వరాలయం వెనక, నందుల వారి వీధిలో సంతోష్ రెడ్డిగారి ఇల్లు.”

“అది ఖాళీ అయిందా... క్రిందటి ఆదివారం రెడ్డిగారు బజారులో కనబడి, మొర పెట్టుకొన్నారు. ఎవరో ఉత్తరాది వాడు అద్దెకున్నాడట. ఎనిమిది నెలలుగా అద్దె ఇవ్వడం లేదట. ఈ మధ్య ఖాళీ చెయ్యమని గట్టిగా చెబితే, అయిదువేల రూపాయిలు సమర్పించుకొంటే మరో ఇంటికి ఎడ్వాన్సు ఇచ్చి అందులోకి మారుతాను అన్నాడట. ఇదివరకు ఉన్న ఇంటికి కూడా ఏడాది అద్దె బకాయి పెట్టి ఆ ఇంటాయన దగ్గర ఆరు వేలు తీసుకొని అది రెడ్డిగారికి ఎడ్వాంసుగా ఇచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసేడుట. పాపం రెడ్డిగారికి ఆ విషయం మొన్నటి దాక తెలీదట. వకీలు గారూ, ఏమిటండి ఈ దౌర్జన్యం.”

“రెడ్డిగారు, వాడి పాచిక పారనివ్వలేదు శాస్త్రిగారూ. కుమ్మరి వీధి జగ్గు గాడి చేతిలో ఐదువందలు పెట్టి కథ నడిపించేరు. జగ్గు గాడి సంగతి మీకు తెలుసుగా. తిన్నగా వాడి వంటింట్లోకి వెళ్లి నాలుగు వంట సామాన్లు వీధిలోకి విసిరీసేడట. వాడేదో వాళ్ళ భాషలో ‘హంయి, హుంయి.’ అన్నాడట. వీడికి తెలిసిన రెండు హిందీ ముక్కలు, ‘జాన్తా నై, జాన్తా నై,’ అని అరిచి వాడి కాలరు పట్టుకొని కత్తి చూపించేడట. దెబ్బకి ఎనిమిది నెలల అద్దె సమర్పించుకొని సాయంత్రానికి ఇల్లు ఖాళీ చేసేడట.”

ముల్లుని ముల్లుతోనే తియ్యాలంటారు.” శాస్త్రిగారు సమర్థిస్తూ అన్నారు.

ఆదివారం సాయంత్రం సతీసమేతంగా, కొత్త లెఖ్ఖల మేష్టరు లక్ష్మణస్వామి, ఆ ఊరిలో అడుగు పెట్టేరు. రెడ్డిగారింట్లో నివాసానికి ఆయనకు అది మొదటి రోజు.

పాడిగేదెలు, ముసలి కుక్క, మేకపిల్ల, కావేవీ కథకనర్హం.

ఉదయం ఏడు గంటల ప్రాంతం. ఇన్సూరెన్స్ ఏజెంట్ కూర్మారావు, రిటైరుడు చిన్న లెఖ్ఖల మేష్టరు నారాయణరావు, మార్నింగ్ వాక్ నుండి వస్తూ, అయ్యరు హోటల్ లోనికి వెళ్ళేరు. ఇడ్లీ, సాంబారు ఆరగిస్తున్నారు. అంతలో విశ్రాంత తెలుగు పండిట్ రామ్మూర్తి పంతులుగారు వచ్చేరు. కూతురి అత్తవారి తరఫున విచ్చేసిన అతిథులకొరకు ఆరు మసాలా దోసలు పార్సిల్ చెయ్యమని ఆర్డర్ ఇచ్చేరు. వాటి రాకకై ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో, ఇడ్లీలకు సాంబారు స్నానం చేయిస్తున్న చిన్నలెఖ్ఖల మేష్టరు నారాయణరావును ఉద్దేశించి, “మేస్టారూ, మన చింతపండు వ్యాపారి అప్పలస్వామి గేదెలు దొరికాయా.” అని ఆరా తీసేరు.

“అదేమిటి, నాకు తెలీదే. ఆయన గేదెలు పోయేయేమిటి.” అని స్పందించడంలో, మేష్టారు తింటున్న వేడి ఇడ్లీ ముక్క నోటిలోనుండి ప్లేటులోకి జారిపోయింది.

“అయ్యో, అడక్కండి. క్రిందటి వారం, వాళ్ళ పనివాడికి ఇల్లు అప్పచెప్పి సకుటంబంగా తిరపతి వెళ్లేడట అప్పలస్వామి. వెళ్లే ముందు తనకున్న రెండు గేదెలు, ఒక కుక్క, వాటిని జాగ్రత్తగా చూడమని మరీ మరీ చెప్పేడట. రాత్రి పైన పడుకొంటే, దోమలు, ఉక్కపోత అని గేదెలకు దగ్గరగా కుక్కను కట్టి ఆ పనివాడు ఇంట్లో పంఖా వేసుకొని సుఖంగా సోఫాలో పరున్నాడట. తెల్లవారి గేదెలకు కుడితి పెడదామని పనివాడు వెళితే గేదెలే కాక, కుక్క కూడా కనిపించలేదట. రాత్రి ఆ మూడింటిని ఎవరో దొంగిలించుకు పోయేరట.” వివరంగా చెప్పేరు నారాయణరావు మాస్టారు.

“అదేమిటండి, గేదెల్ని దొంగిలించుకు పోయేరంటే అర్థముంది గాని, ఆ కుక్క, దొంగలతో ఎలా వెళిపోయిందండి.” చిన్న లెఖ్ఖల మాస్టారి పెద్ద సందేహం.

“అది ముసలి కుక్కట. ఇప్పటికి నాలుగయిదు సార్లు దొంగలతో వెళ్లిపోయిందట.”

ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో, ఆగయా, ఆగయా, అప్పలస్వామీ ఆగయా.

“రా, రా, అప్పలస్వామి. నూరేళ్లు ఆయుష్షు. నీ గురించే మాట్లాడుకొంటున్నాం.” రామ్మూర్తి పంతులు గారు స్వాగతం పలుకుతూ, “నీ గేదెలు దొరికాయా.” అని వాకబు చేసేరు.

“నిన్నటి దినం చింతలపాడు సంతలో అమ్మకానికుంటే సివిల్ నాయుడుగారు సూసినారండి. ఆయన గడసిన నెలే, మా పసూల్సాల పక్కా సేయింసినారండి. అప్పుడాయనకి, మా పసూలు బాగా ఎరికఅయ్యేయండి. మా కుక్కా ఆరికి ఎరికేనండి. ఆట్ని సూడగానే, నాకు ఫోను కొట్టినారండి. నా గేదెలు, ఆటి మయాన్నే మా కుక్క తొంగుందని సెప్పినారండి. ఏంటనే కుమ్మరీదికెల్లి జగ్గుగాణ్ణి తోలుకొని, సంతకెళ్ళినానండి.” అని, అప్పలస్వామి ఇంకా ఏదో చెప్పబోతూంటే.

రవ్వ దోస లాగిస్తూ, ఈ కథ వింటున్న దర్జీ కొండలరావు, “అప్పలసామీ, పోలీసోళ్ళకి కంప్లెన్ట్ ఇయ్యలేదా. ఆల్లయితే, ఆ దొంగ నాయేలల్ని బొక్కలో ఎట్టి, సితాక బాదిందురు.” అని సలహా ఇచ్చేడు.

“మన పోలీసోళ్ళ సంగతి నీకు తెల్దా. నా పాడి పసుల్ని ఆల్ల టాణాలో కట్టేసి, ఈ పసూలు నీయే యని రుజూ ఒట్టుకురా అని నన్ను తోలేసి, నాను రుజూ ఒట్టుకెళ్ళేసరికి ఒట్టిపోయిన రెండు ముసలి గేదెలు ఇయి నీయే యని నాకు అంట కట్టేత్తారు. అందుకే జగ్గుగాడుకాడకెల్లి, ఆడితో సంతకెల్లినాను.” అని పోలీసు వాళ్ళ పై, తన తిరుగులేని అభిప్రాయం వెలిబుచ్చుతూ.

“ఆ కాడ సూత్తుమా, నా గేదెలు, కుక్కని, ఏరికో, బేరానికి ఎడుతుండేవారండి, ఇద్దరు దొంగ సచ్చినోళ్ళు. జగ్గుగాడు ఒక్కుమ్మడి ఎల్లి, ఒక సచ్చినోడి కాలరొట్టుకొని, “ఓడ్రా నువ్వు, నా ఇలాకాలోకొచ్చి ఈటిని దొంగిలించేవు.” అని ఆడిమీదికి ఉరిమినాడండి. ఆ రెండో నా తొత్తుకొడుకు, జగ్గుగాడ్ని ఒట్టుకొని, “నువ్వు మా ఇలాకాలోది మోటర్ బైకు ఒట్టుకు పోనేదా.” అని అడిగినాడండి. జగ్గుగాడు మొదటోడి కాలరోగ్గీసి రెండో ఆడి కాలరొట్టుకొని, “ఓరి ఎర్రినాయేలా, నీకు తెల్దా, ఠానాలేయీ, యా..రి, ఇలాకాలోకి రావు. నేనేటి దొంగిలింసి నానా, పబ్లిగ్గ, పోలీసోళ్ళు సూస్తుంటే ఒట్టుకుపోనాను. ఆ ఉమాపతి డాట్టరు గాడి మొండి బకాయోటి ఓ లచ్చ ఒసూలు సేసినాను. ఆడు దానికి నాకు ఐదేలు ఇయ్యాల. రెన్నెలయింది. ఆ మాట ఇనుకోడు. నా కాడ కొస్సిన పోలీసోళ్ళకి సెప్పినాను. ఈ బైకు నా కాడే ఉంటది. ఆడితో, నా పైసలిచ్చి ఆడి బైకుని ఒట్టుకుపొమ్మని సెప్పండన్నాను. అట్టాగే అని ఆళ్లు పోనారు.” అది ఇని ఆ మొదటోడు, జగ్గుగాడి నొట్టుకొని, “నీ కథాపు, ఇటు ఇను, ఈటిని మేము దొంగనాడనేదు, ఆ దిక్కు సూడు, ఆ సింత సెట్టుకాడ మేకపిల్లనొట్టుకొని కూకున్నారే, ఆళ్ళు, ఈటిని అమ్మితే, పది పైసలు వాటా ఇత్తామన్నారు. మాకు మరేటి తెల్దు” అని సెప్పేసి ఆళ్ళిద్దరు పోనారండి. జగ్గుగాడు, సింతసెట్టు కాడున్న ఆళ్ల దిక్కు, పరూగున ఎల్లడం సూసి, ఆ దొంగానాయాలలు, మేకపిల్ల నొగ్గీసి, పారిపోనారండి. జగ్గుగాడు మేక పిల్లని ఒట్టుకోచ్చేసేడు. జగ్గుగాడి సేతిలో మేకపిల్లని సూసి, ఓ ముసలమ్మ, - ఈ మేకపిల్ల నాది. మీ కాడకెట్టా ఒచ్చినాది. అని అడిగినాదండి. జగ్గుగాడు కదంతా సెప్పి, ఆ మేకపిల్లని ఆ యమ్మకి ఇచ్చేసినాడండి. ఆ తరాత మా పసుల్ని, కుక్కని తోలుకొని ఇంటికి పోనామ్. జగ్గుగాడికి ఓ రెండొందలు సేతిలో ఎట్టేను.” వివరంగా, జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పేడు.

ఇంతలో అప్పలస్వామికి దుకాణం నుండి ఫోనొచ్చింది. ఏదో పెద్ద బేరం వచ్చింది, తొందరగా రమ్మనమని. అప్పలస్వామి దుకాణానికి దారి తీసేడు.

(సశేషం)

Posted in February 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!