Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 113 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-113

వీక్షణం-113వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం ఆసక్తిదాయకంగా జనవరి 9, 2022 న జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ప్రముఖ కథారచయిత్రి, రేగడివిత్తులు నవలా రచయిత్రి డా.చంద్రలత కథ "బొట్టెట్టి" కథాపఠనం జరిగింది.

ఈ కథ ‘’బొట్టెట్టి’’ అని అదే పేరు గల కథా సంపుటి లోనిది. ఈ కథ గురించి అనురాధ నాదెళ్ల గారు ఇటీవల రాసిన సమీక్షలో-

"ఆడపిల్లకు పుట్టింటి మీద ఉండే మమకారం ప్రతి ఆడపిల్లకూ అనుభవమే. దానికి కారణం ఆ ఇంటినుంచి ఏవో సంపదలు పొందాలన్న ఆశ కాదు. చిన్ననాట ఆ ఇంట ఆడిన ఆటలు, పొందిన ప్రేమ జీవితాంతం తనను వెన్నంటి ఉండే ఆత్మీయ, మమకారాలు, చిరునవ్వుతో జీవితాన్ని ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్నిస్తాయి. పుట్టింటి నుండి పిలుపు అంటే అది బొట్టెట్టి పిలవనక్కరలేదు. మాట మాత్రం చాలదా? ఇదే ప్రశ్న అడుగుతుంది కథలో రమణి తన భర్తని. సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా పడుతూ లేస్తూ పుట్టింట జరిగే అనేక వేడుకలకి నిరంతరంగా ప్రయాణాలు చేసి చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని కూడా వెళ్లేందుకు సిద్ధపడుతూనే ఉంటుంది.

పుట్టింటి నుంచి ఆస్తులు తెచ్చుకోవాలన్న ఆశతో వెళ్తోందంటూ చుట్టుపక్కలవాళ్లు హేళన చేస్తున్నారంటూ అత్తగారు, ఆడపడుచు విసుక్కున్నా పట్టించుకోదు. పిల్లలతో చేసే ప్రయాణాలు, ఆనక ఒంటిగానూ అన్ని దశల్లోనూ రకరకాల అసౌకర్యాలను భరిస్తూనే ఉంటుంది రమణి. భర్త విమర్శిస్తే అయినవాళ్లు మన అవసరాలకి, మన ఇంట్లో అక్కరలకీ రావద్దామరి? అని అడుగుతుంది. ఆమె అన్నట్టుగానే భర్త పోయినప్పుడు పుట్టింటివారొచ్చి అవసరమైన కార్యక్రమాలన్నీ జరిపిస్తారు.

ఆనక పుట్టింట్లో జరిగిన శుభకార్యాలకు అలవాటుగా వెళ్ళినా ఆమెను అశుభమంటూ దూరం పెడతారు. అన్నీ భరిస్తూనే ఉంటుంది. తన పిల్లల పెళ్లిళ్లకి ఇరుగుపొరుగులే అన్నీ అయి ఆదుకుంటారు. ఆరోగ్యం పోగొట్టుకుని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల మధ్య వైద్యం చేయించుకుంటుంది. అప్పుడూ వెళ్తుంది పుట్టింటికి.

స్నేహితురాలు సుధ సహించలేక ‘’నీరాక పట్ల గౌరవం, నీ పట్ల సానుభూతి లేని చోటుకి అనారోగ్యంతో ఎందుకా ప్రయాణాలు?’’ అని గట్టిగా అడిగినప్పుడు, ‘’అవునులే. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాలే’’ అని చెబుతూనే రమణి తన బ్యాగ్ లోంచి నెయ్యి గుబాళింపుతో ఉన్న చలిమిడిని తీసి స్నేహితురాలికి పెడుతుంది. ఆపైన కొబ్బరిపుల్లకి గుచ్చిన బొగడపూలను చూపిస్తూ ‘’బొగడచెట్టు నాన్న నాటిందే’’ అని చెప్పి మురిసిపోతుంది. పుట్టింటి పెరట్లోంచి తెచ్చిన ముద్దబంతులు, కారబ్బంతులు బ్యాగ్ లోంచి తీస్తుంది. ఏటి ఒడ్డున ఏరుకొచ్చిన మెరిసేరాళ్లను కూడా చూపిస్తుంది. ఇంకా, పెళ్ళినాడు నాన్న అమ్మకి బహూకరించిన శరత్ నవల అమ్మ పదేపదే చదవగా పసుపు రంగులోకి మారిందంటూ తీసుకొచ్చి చూపిస్తుంది. నాయనమ్మ పుట్టింటి నుంచి తెచ్చి నాటిన రాతి ఉసిరి చెట్టు కాయలూ తెస్తుంది.

‘’అమ్మమ్మ వడికిన రాట్నం ఈసారి వెళ్లినప్పుడు అడిగి తెస్తాలే.’’ అని చెబుతుంది. స్నేహితురాలికి నోట మాటరాదు. ‘’పుట్టింటి నుంచి చీరెసారెలేం తెచ్చుకున్నావ్?’’ అని విసుగుతో అడగాలనుకున్న ఆమె గొంతు మూగబోతుంది.

అన్నన్ని మాటలు పడుతూ, అన్నన్ని వ్యయప్రయాసలకి ఓరుస్తూ పుట్టింటికెళ్తోందని అందరూ వింతపడినా ఆమె పసిమనసు పొందుతున్న అపరిమిత ఆనందం ఎవరికి అర్థం అవుతుంది? పుట్టింటి ఆలోచనతోనే, ఆ ఇంటి చెట్టూ, పుట్టాతోనే ఆత్మీయతనల్లుకున్న రమణి ముఖంలో వెలిగే ఆ సంతోషం ఎవరికి అవగాహనకొస్తుంది?! అనే అందమైన కథ." అంటారు.

ఈ కథలో రచయిత్రి వైధవ్యం పేరిట స్త్రీలని ఏ విధంగా చిన్నచూపు చూస్తారో చెప్తూ "మేనకోడలి పెళ్ళిలో, ఎంతగా ఒక పక్కగా వొదిగికూర్చున్నా, అపశకునంలా పెళ్ళికూతురికి ఎదురొచ్చావని, చేయిపట్టి మరీ పక్కకు లాగిపడేసారు ఆ పెళ్లికూతురి అమ్మమ్మగారు. కానుకలు తీసుకొంటారు. రమణి చేత్తో కాదు. చిట్టోబుజ్జో ఇవ్వాలిట. అదట ఇదట. ఎవరి నమ్మకాలు వారివి. ఒక పక్క మౌనంగా కూర్చుంటే సరిపోతుందనుకొంటే, పెళ్ళిపనుల్లో సాయం చేయలేదని నిందలు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది. ’కాలం ముందుకు వెళుతుందా వెనక్కా’ అని. ఏది ఏమైనా, ఈ కొత్తహోదాని శిలువలామోస్తూ" అని అంటారు.

ఆ తరవాత జరిగిన కథా చర్చలో ఇలా స్త్రీలు వైధవ్యాన్ని శిలువలా మొయ్యాల్సిన బాధాకర సంఘటనల గురించి, ఇటువంటి మూఢత్వాల గురించి, స్త్రీలు ప్రతిఘటించాల్సిన అవసరం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన, వైవిధ్యమైన దేశంలో ఉంటూ కూడా ఇంకా ఇంటిపేర్లు, గోత్రాలు అడిగిమరీ అవమానిస్తున్న సంస్కృతిని గురించి కొందరు ఆవేదన వ్యక్తం చేసారు.

అలాగే చంద్రలతగారు రాసిన 'రేగడివిత్తులు' నవల గురించి, గ్రీన్ రివల్యూషన్ వంటి అంశాల మీద ఆసక్తిదాయకమైన చర్చ జరిగింది.

కథా చర్చా కార్యక్రమంలో శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి భవాని, శ్రీ సి.బి.రావు, శ్రీమతి రమణ, శ్రీ రాజశేఖరం, డా||కె.గీత, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ ప్రసాదరావు గోగినేని మొ.న వారు పాల్గొన్నారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో  డా||కె.గీత "పండగంటే" కవితని, శ్రీ శ్రీధర్ రెడ్డి "స్వస్థత" అనే కవితని, శ్రీ దాలిరాజు వైశ్యరాజు పేరడీ కవితని వినిపించారు. శ్రీమతి భవాని "కవితా కదలిరా" అంటూ రాగయుక్తంగా ఆలపించారు. శ్రీమతి గునుపూడి అపర్ణ గారు "పాహి పాహి లక్ష్మి" కీర్తనని, దేవులపల్లి అనువాదం చేసిన తిరుప్పావై గీతాన్ని డా||కె.గీత అతి శ్రావ్యంగా పాడి వినిపించారు.

స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది. వీక్షణం-113 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో చూడవచ్చు.

Posted in February 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!