Menu Close
SirikonaKavithalu_pagetitle

నా అక్షరం -- గంగిశెట్టి ల.నా.

తరులారా! మీలాగే ఆమెకూ తరాలను చూసిన అనుభవముంది
తరులారా! మీలాగే ఆమెకూ
అన్నీ దాచుకొనే అంతరంగముంది
మీలాగే అన్నిటినీ కాచుకొనే నిబ్బరముంది
నేల క్షారాలను పీల్చి మధురంగా పుష్పించే గుణమూ ఉంది
పరిమళాన్ని పదుగురికీ పంచే ప్రేమ నిండిన మనస్సూ ఉంది
మీలా ఋతువు మారిందని ఆకుల్ని రాల్చుకోదు
వెచ్చటి జ్ఞాపకాలుగా లోలోనే దాచుకొంటుంది
వాటినే తన బలంగా మార్చుకొంటుంది
శిశిరహేమంతాలందుకే ఆమెను వేధించవు
నిశ్శబ్దంగా ఆమె ఒడిలో  ఒదిగిపోతాయి

ఆమెవ్వరు? నా అక్షరం!
కనులు మూసుకొంటే నాదం,
తెరిస్తే దృశ్యకావ్యం!!

భాష...కవిత్వం -- కైలాస్ నాథ్

ఏ భాష అయినా
తొలిసారిగా
శబ్ధరూపంలో
తన్ను తాను ఆవిష్కరించుకుంటుంది..

అది హ్రస్వమైనా
దీర్ఘమైనా
లోని అనుభూతిని
శబ్ద పల్లకీ మీద మోసుకొస్తుంది

నరాల కొమ్మల్ని
చీల్చుకు వచ్చే మాట
పద్యమా? గద్యమా?
అంతరంగ మథనంలో
జ్వలించిన అగ్నికిరణం...

కవిత్వం
పదం నుంచీ పద్యమించిందా
పద్యం నుంచీ  గద్య మించిందా
కాదు ప్రశ్న
వో గుండె లోతుల అనుభూతుల్ని
మరో గుండెకు అందించగలిగిందా లేదా అన్నది ..

మనిషి జీవితంలోని
మజిలీల్లాగే
కవిత్వం కుడా మజిలీ ల్లో
సాగుతూంటుంది
చైతన్య మే ఊపిరి గా ...

ఇరవై ఒకటవ శతాబ్దంలో
తెలుగు గుండె
నాటి నన్నయ్య ను
నిన్నటి శ్రీ శ్రీ  ని
కలుపుకొనే ముందుకెళుతుంది
ఏ వాదం నిలుస్తుందన్నది
కాలానికి సంబందించినది కాని
కవిత్వాన్ని ఆస్వాదించే గుండెకు కాదు ..

పునరపి జనకుడు -- పి.లక్ష్మణ్ రావ్

నాన్నను తలచుకున్నప్పుడల్లా
బతుకు బండిని లాగుతున్న
శ్రామికుడే గుర్తొస్తాడు
స్వేదంతో సేద్యం చేసిన
కర్షకుడే గుర్తొస్తాడు
కల్లోల సంసార నావను
అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చుతున్న
నావికుడే గుర్తొస్తాడు!

నాన్న జ్ఞాపకమొచ్చినప్పుడల్లా
కన్నీటి అగ్నిగుండంలో
దగ్ధమౌతున్న కష్టాల కొలిమి
కనబడుతుంది
దుఃఖపు సుడిగుండాల్లో
గిరగిరా తిరుగుతున్న
నష్టాల రాపిడి కనబడుతుంది!

చిరిగిన వస్త్రాలపై అతుకులు కుట్టినప్పుడు
దర్జీకివ్వడానికి
చిల్లుల జేబులో చిల్లర వెతికేవారు
అరిగిన చెప్పులు మార్చడానికి
ఆరుమాసాలు పైసా పైసా
కూడబెట్టేవారు!

ఆవేదనల ఊపిరిని
ఎదలో అదిమిపెట్టి
కష్టాల నిట్టూర్పుల్ని
మౌనంగానే విడిచేవారు
కన్నీటిని రెప్పల మాటున దాచిపెట్టి
పెదవులపై చిరునవ్వులు పూయించేవారు!

ఇప్పుడు నేను నడి వయసు నాన్ననై
అప్పుల సంసారాన్ని ఈదుతుంటే
బతుకుబండిని లాగిన
నాన్న కస్టాలు అనుభవంలోకి వస్తున్నాయి
దుఃఖపు సుడిగుండాల్లో
గిరగిరా తిరుగుతున్న
నష్టాల రాపిడి అనుభవమౌతుంది
ఇప్పుడు నేను కూడా నాన్నలాగే
ఆవేదనల  ఊపిరిని ఎదలో అదిమిపట్టి
కష్టాల నిట్టూర్పుల్ని
మౌనంగానే విడుస్తున్నాను!

నేను అమ్మతనాన్ని-50 -- విశ్వర్షి వాసిలి

•1•
నేను
అమ్మను
అమ్మ అమ్మను
అయినా, కాను అమ్మమ్మను
అవునవును, కుటుంబాన అమ్మమ్మను
వసుధైక కుటుంబాన అమ్మల అమ్మను.

నేను
అమృతాన్ని
అమ్మతనాన్ని
అమ్మతన అమృతభాండాన్ని
విశ్వామృత నిస్వార్థపంపకాన్ని
ఇహ పర ఆనందతాండవాన్ని.
••2••
నేను
అమ్మను
అద్వితీయాన్ని
అయినా, కాను అడుగుల సవ్వడిని
అవునవును, అందరి సవ్వడుల నిశ్శబ్దాన్ని
సడిచేయని భావోద్వేగ జోడు అందెల రవళిని.

నేను
అస్తిత్వాన్ని
పారాడే అంతస్తత్వాన్ని
అనంత పోరాట పటిమని
పేగుబంధ అంతర్గత తత్వాన్ని
ఆది అంత రహిత అనంతత్వాన్ని.
•••3•••
నేను
అమ్మను
గర్భానుబంధాన్ని
నాభీ స్వరానికి అందని భావోద్వేగాన్ని
నాడీ కేంద్రానికి చేరని ప్రేమోదంతాన్ని
ప్రపంచ భాషలకు దక్కని జీవరహస్యాన్ని.

నేను
రక్షాకవచాన్ని
అమ్మతన జీవనస్రవంతిని
ముద్దిడిన కొండంత అండను
ప్రవాహ సదృశ పులకింతను
భాషకు పరిమితంకాని తాదాత్మ్యాన్ని.
••••4••••
నేను
అమ్మను
ఆడపడుచును
సృష్టిక్రమ మాతృగర్భను
తరతరాల పుట్టింటి మాతృకను
ఏడుతరాల మెట్టినింటి నవగర్భను
భవిష్యత్తర అందాన్ని ఆనందాన్ని అస్తిత్వాన్ని.

నేను
అమ్మ ఒడిని
తొలి విజయక్షేత్రాన్ని
అక్షరాభ్యాస పాఠశాలని
జీవనక్షాత్ర కళాశాలని
జీవరహస్య విశ్వవిద్యాలయాన్ని.
•••••5•••••
నేను
అమ్మను
సౌభాగ్య సీమను
సౌశీల్య సంపదను
కనిన కరుణిమను
కనరాని వేదనను.

నేను
కన్నతల్లిని
కుటుంబ వ్యవస్థన సాలీడుని
అల్లుకుపోతున్న విశ్వవలయాన్ని
రాణీవాస బహుముఖీన ప్రజ్ఞను
ఏకతారాగంలా అనిపించే ఐక్యతారాగాన్ని.
••••••6••••••
నేను
అమ్మను
సహస్రదళను
కౌటుంబిక వనమాలిని
అన్ని జాతుల అమ్మతనాన్ని
రంగు రుచి వాసనల సంగమాన్ని.

నేను
పురిటిబాధను
షిఫ్ట్ లకు అందని వర్కోహాలిక్ ని
ఇన్స్ట్రుమెంట్స్ లేని కాల్ సెంటర్ ని
బాధకు రియాక్ట్ కాగల రిసీవర్ ని
గడియపడని తలుపుని అమ్మ తలపుని.
•••••••7•••••••
నేను
అమ్మను
సమతూకం లేనిదాన్ని
కనలేని విజ్ఞాన సర్వస్వాన్ని
అయినా, కడదాకా కేరాఫ్ అడ్రస్ ని
రిటైర్మెంట్ లేని ఫుల్ టైమ్ రెస్పాన్సిబిలిటీని.

నేను
ఆత్మగీతను
మృతతత్వం దరిచేరని అమృతత్వాన్ని
సంస్కృతీ సంప్రదాయాల ప్రజ్ఞాపాటవాన్ని
నిఘంటువుల కెక్కని సంపూర్ణార్థాన్ని
నీకోసం నాగీతను దాటినదాన్ని.

శ్రీ రాముడు -- నాగరాజు రవీందర్

‘రామ రామ’ యనుచు వ్రాయగా వ్రాయగా
రహిని దాల్చు నొక్క ‘రామకోటి’
‘రామ రామ’ యనుచు రసనపై వల్లింప
చెలగు రాము డెపుడు చిత్తమందె

మాట దప్పడు రాముడు, మచ్చరించి
పదర డెవరిని, ప్రేమతోఁ బల్కరించు,
వ్యర్థముగ వాదులాడడు పరుల తోడ
నాదరించును గురువుల ననవరతము

రాముడు సంగరభీముడు
రాముడు కోదండరాము డరిభంజనుడున్
రాముడు ధర్మస్వరూపుడు
రాముని పాలన ప్రజలను రంజిలజేయున్

Posted in February 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!