Menu Close
Mutthevi Ravindranath Photo
'మనుస్మృతి'
ముత్తేవి రవీంద్రనాథ్
మూడవ అధ్యాయము (ఓ)

ఇక కర్త శ్రాద్ధ కర్మ ముగిశాక భోక్తలకు వీడ్కోలు పలికి, వారితో కొంతదూరం వారి వెనకనే నడిచి, వేరే ఆలోచనలు లేకుండా పరిశుద్ధమైన మనస్సుతో మౌనంగా దక్షిణ దిక్కు వైపు చూస్తూ తన పితృదేవతలను వారి ఆశీస్సులు కోరుతూ ప్రార్థిస్తాడు.

అష్టదిక్పాలకులలో ఒకడైన యముడు దక్షిణ దిక్కుకి అధిపతి. అతడే పితృలోక పాలకుడు. ఆ కారణంగా మనకు దక్షిణ దిశగా పితృలోకం ఉంటుందని మన ప్రాచీనుల విశ్వాసం. పితృదేవతలంతా దక్షిణ దిశగా ఉంటారనే విశ్వాసంతోనే దక్షిణానికి తిరిగి పితరులకు పిండ ప్రదానం చేయడం, దక్షిణానికి తిరిగి వారిని ప్రార్థించడం ఆనవాయితీ. అపరము అంటే వెనుక అనే అర్థంతో పాటు పశ్చిమ దిశ, దక్షిణ దిశ అనే అర్థాలూ స్థిరపడ్డాయి. తూర్పుకి తిరిగి నిల్చున్న వ్యక్తికి అపరదిశ పశ్చిమం. ఉత్తరానికి తిరిగి నిల్చున్న వ్యక్తికి అపరదిశ దక్షిణం. పితృలోకం దిశగా (దక్షిణదిశగా) తిరిగి చేసే శ్రాద్ధ కర్మను అందుకే అపరకర్మ అంటారు. పైపెచ్చు శ్రాద్ధ కర్మ అపరాహ్ణంలో (సూర్యుడు పడమటికి వాలిన తరువాత) చేస్తేనే శ్రేష్ఠం.  అపర అంటే పశ్చిమ దిశ అనే అర్థంలోనే భారతదేశపు పశ్చిమ దిశగా చిట్టచివరగా ఉన్న పశ్చిమ రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను ‘అపరాంతము’ అంటారు.

మనం గతంలో చెప్పుకున్నట్లే స్వర్గ నరకాలనేవి ప్రపంచంలోని పలు ప్రాంతాల ప్రజలు వారి పరిమిత భౌగోళిక పరిజ్ఞానం మేరకు ఏర్పరచుకున్న విశ్వాసాలు మాత్రమే. వాటికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. పాశ్చాత్యుల ప్లూటో ( Pluto) లాగే మన యముడు కూడా నరకలోకాధిపతి అనీ, సప్త అధోలోకాలలోని అట్టడుగు లోకమైన నరకలోకమే యముడి కార్యస్థానమనీ కొందరు నమ్ముతుంటే, మరికొందరు పితృలోకం లేక యమలోకం మనకు దక్షిణ దిశగా ఉందని నమ్ముతారు.

“మా కులంలో దాతలైన పురుషులు అభివృద్ధి చెందాలి. వేదాలు అధ్యయనం చేయడం, వాటి అర్థాలు గ్రహించడం, యాగములు చేయడం మా కులంలో దినదినాభివృద్ధి పొందాలి. మా కులంలో పుత్రులు, పౌత్రులు (మనుమలు) ఇబ్బడి ముబ్బడిగా పెరగాలి. మాకు వేదార్థాలు తెలుసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఎప్పటికీ అలాగే ఉండాలి. మాకు విస్తారంగా దానం చేసేందుకు తరగని ధనసంపదలు కలగాలి” - ఇవీ కర్త తన పితరులకు చేసే ప్రార్థనలు.

మనం గతంలో అనుకున్నట్లే వైదిక సమాజం పురుషాధిక్య సమాజం. పురుషులు, స్త్రీలు అందరూ తమకు పురుష సంతానమే కలగాలని కోరుకునేవారు. స్త్రీలు కూడా తమకు వీరమాతగా, వీరపత్నిగా లభించేదే నిజమైన గౌరవమని భావించేవారు. అందుకే సంతానార్ధులందరూ మగ పిల్లవాడు పుట్టాలని పుత్రకామేష్టి, పుం సవనము వంటివి చేసేవారు. తమకు అమ్మాయిలు పుట్టాలని ఎవరూ కోరుకునేవారు కారు. వ్యవసాయం, రక్షణ అవసరాల రీత్యా మాత్రమే కాక పితృదేవతలకు అంత్యేష్టి, అపరకర్మలు కూడా పురుషులే నిర్వహించాలి కనుక ప్రతి కుటుంబంలో పురుషుల అవసరం మెండు. అందుకే ఇక్కడ కర్త తమ కులంలో పుత్రులు, పౌత్రులు మాత్రమే కలగాలని కోరుకోవడం. (అస్మత్కులే దాతారః పురుషా వర్ధంతాం. పుత్రపౌత్రాదికం చ వర్ధతాం - కుల్లూకభట్టు వివరణ).

మనుస్మృతి రచనాకాలానికి  వేదాలు అధ్యయనం చేయడం, అర్థాలు తెలుసుకోవడం మీద ఇంకా ఆసక్తి ఉండేది. వేదార్థాలు తెలుసుకోవడంలో తమకున్న శ్రద్ధ ఎప్పటికీ అలాగే నిలిచి ఉండాలని శ్రాద్ధకర్మలలో నాటి కర్తలు కోరుకోవడం విశేషం. అయితే అనంతరకాలంలో శతాబ్దాల తరబడి అర్థ విచారణతో నిమిత్తం లేకుండా భారతీయుల ప్రాయికమైన విజ్ఞానమైనట్టి వేదాలను భట్టీయం వేయడం (Learning by Rote ) అనే పోకడ  ప్రబలింది. పాశ్చాత్య ప్రపంచంలోనూ ఇదే తరహా ధోరణి Scholasticism పేరిట క్రీ.శ. 10 - 15 శతాబ్దాల నడుమ ప్రబలంగా ఉండేది. ఆలోచనకు, జిజ్ఞాసకూ సమాధికట్టిన ఈ ధోరణి ఎన్నెన్నో అంధ విశ్వాసాలు ఏర్పడడానికి దారితీసింది.

ఇక ఆ తరువాత ఆ పిండములలోనూ, భోక్తలైన బ్రాహ్మణులలోనూ ఆవాహనచేసిన పితరులను విసర్జనముచేసి, ఆ పిండాలను గోవుకు గానీ, బ్రాహ్మణునికి గానీ సమర్పించాలి. వాటిని అగ్నిలోనూ లేక నీటిలోనూ కూడా వేయవచ్చు. కొందరు వాటిని కాకులకూ వేస్తారు.

ధర్మార్థకామములలో జీవితాంతం భర్త వెంటే నడుస్తూ, పాతివ్రత్యంతో ఆయనకే శుశ్రూషలు చేయగోరెడి సజాతికి చెందిన ధర్మపత్ని, శ్రాద్ధ క్రియలలో ఆసక్తి కలిగిన పుత్రులు తనకు కలగాలని కోరుకున్నట్లయితే ఆ పిండములలో మధ్యలోనిదైన పితామహ పిండాన్ని తినాలి. అలా తినడం వలన ఆమెకు దీర్ఘాయుష్మంతుడు, బలవంతుడు, బుద్ధిశాలి, సంతతి గలవాడు, ధర్మతత్పరుడు అయిన కుమారుడు జన్మిస్తాడట. ఇలా శ్రాద్ధ కర్మలలో చేసే పిండ ప్రదానం భోక్తలద్వారా పితృదేవతలకు చేరుతుందనీ, వారు సంతృప్తి చెంది కర్త లేక వారి కుటుంబీకుల ఈప్సితాలు నెరవేరజేస్తారనీ నమ్మడం కూడా కేవలం సనాతనుల విశ్వాసమే తప్ప అది శాస్త్రీయంగా రుజువుపరచ గలిగేది కాదు.

ఆ తరువాత కర్త చేతులు కడుక్కుని, ఆచమనం చేసి, ముందుగా తన జ్ఞాతులకందరికీ, ఆ తరువాత మిగిలిన బంధువులందరికీ సగౌరవంగా భోజనం పెట్టించాలి.

తిలైర్వ్రీహియవైర్మాషై  రద్భిర్మూలఫలేన వా |
దత్తేన మాసం తృప్యంతి విధివత్పితరో నృణామ్ || ( 3- 267)

ఈ శ్లోకానికి కుల్లూకభట్టు ఇచ్చిన వ్యాఖ్యానం-

‘తిలధాన్యయవమాషజలమూలఫలానామ్ - అన్యతమేన యథాశాస్త్రం శ్రద్ధయా దత్తేన మనుష్యాణాం మాసం పితరస్తృప్యంతి’. వాయుపురాణ వచనం ప్రకారం మాషా అంటే కృష్ణ మాషా (కారు మినుములు) అని గ్రహించాలని కుల్లూకుడు పేర్కొన్నాడు.

తిలలు (నువ్వులు),  వ్రీహి (ధాన్యము), యవలు (బార్లీ- Hordeum vulgare అనే శాస్త్రీయ నామం కలిగిన ఒక తృణ ధాన్యం), మాషా (కృష్ణ మాషా - కారు మినుములు), నీళ్లు, దుంపలు, పండ్లు వీటిని పితృదేవతల ప్రీతికోసం శాస్త్రప్రకారం బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ దాతల పితృదేవతలు ఒక మాసం పాటు తృప్తిపొందుతారు.

ఈ క్రింద తెలిపిన పలు రకాల మాంసాలను కర్తలు భోక్తలకు వండి పెడితే ఎలాంటి ఫలం లభిస్తుందో తెలుపుతున్నాడు మనువు. శ్రాద్ధ భోజనంలో భోక్తలకు ఆమిషమును వండి వడ్డించడమే ఆ అన్నదానంలో భాగంగా జరిగే మాంసదానం.

గృహస్థు తన పితృదేవతలు రెండు నెలలు తృప్తిగా ఉండడంకోసం ఒక బ్రాహ్మణుడికి మత్స్యమాంసాన్ని దానం చేయాలి. జింక మాంసం దానంచేస్తే పితరులు మూడునెలలు తృప్తిగా ఉంటారు. ఔరభ్రము (గొర్రె మాంసము) దానం చేస్తే నాలుగునెలలు, ద్విజులు తినే పక్షి మాంసం దానం చేస్తే ఐదునెలలు పితృదేవతలు తృప్తిగా ఉంటారు.

ఈ శ్లోకానికి చేసిన వ్యాఖ్యానంలో కుల్లూకభట్టు ‘ద్విజాతి భక్ష్య పక్షిమాంసేన’ (ద్విజులు భక్షించదగిన పక్షిమాంసం) అంటూ పేర్కొన్న కారణంగా కొన్నిరకాల పక్షిమాంసం తినడం ఆ కాలంనాటికే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు నిషిద్ధమని గ్రహించాలి.

ఛాగము (మేక) యొక్క మాంసం దానం చేస్తే ఆరుమాసాలు, పృషత్తు (మచ్చల దుప్పి) మాంసం దానం చేస్తే ఏడు నెలలపాటు పితృదేవతలు తృప్తిగా ఉంటారు. ఏణము (పెద్ద కన్నులు కలిగిన నల్ల ఇర్రి) యొక్క మాంసం దానమిస్తే ఎనిమిది నెలలు, రురువు అనే నల్ల చారల దుప్పి మాంసం దానమిస్తే తొమ్మిది నెలలపాటు పితృదేవతలు తృప్తిగా ఉంటారు.

దశమాసాంస్తు తృప్యంతి వరాహ మహిషామిషైః |
శశకూర్మయోస్తు  మాంసేన మాసానేకాదశైవ తు || ( 3- 270 )

వరాహము (అరణ్య సూకరము - అడవి పంది), మహిషము (దున్న) వీటి ఆమిషమును (మాంసమును) శ్రాద్ధ కర్మలో భోక్తగా వ్యవహరించిన ద్విజునికి పెడితే  దాత పితరులు పదినెలలు తృప్తిగా ఉంటారు. శశము (కుందేలు) మరియు కూర్మము (తాబేలు) మాంసము పెడితే వారు ఏకాదశ (పదకొండు) మాసములు తృప్తిగా ఉంటారు.

ఆవు పాలు, ఆ పాలతో చేసిన పాయసము (గవ్యేన పయసా, పాయసేన చ) దానమిస్తే పన్నెండు నెలలు, వార్ద్రీణము అనే తెల్లటి ముసలి మేక మాంసమును దానమిస్తే పన్నెండేళ్ళు పితరులు తృప్తిగా ఉంటారు.

వార్ద్రీణము అనేది ఇంద్రియములు క్షీణించిన ఒక తెల్లని ముసలి మేక అనీ, అది నదులలో నీరు త్రాగేటప్పుడు నోటితోపాటు రెండు చెవులతోనూ నీరు తాగుతుందనీ, అది యజ్ఞాలలో బలి ఇచ్చేందుకు శ్రేష్ఠమైనదని ప్రాచీనుల విశ్వాసం.

కాలశాకము అనే శాకము, ముళ్ళతో ఉండే మహాశల్కము అనే చేప, ఖడ్గలోహ ఆమిషము (ఖడ్గ మృగం యొక్క మాంసం), తేనె, మునులు తీసుకునే సకల ఆహారాలు (మున్యన్నాని సర్వశః) వీటితో శ్రాద్ధ కర్మ చేస్తే పితరులు అంతులేనంత కాలం తృప్తిగా ఉంటారు.

మూడవ అధ్యాయంలోని 267  నుంచి 272 వరకు గల శ్లోకాలలో తమ పితృదేవతల తృప్తికోసం శ్రాద్ధాన్నములో బ్రాహ్మణ భోక్తలకోసం తయారుచేసే ఆహారంలో గానీ, శ్రాద్ధ కర్మల అనంతరం వారికి ఇచ్చే దానంలో కానీ ఉండవలసిన పలు రకాల జంతువుల, పక్షుల మాంసాల పేర్లను మనువు ప్రస్తావించాడు. మనుస్మృతి రచనాకాలం నాటికి హింసకు వ్యతిరేకంగా బౌద్ధ, జైన ధర్మాలు చేపట్టిన ఉద్యమం ప్రభావంగా యజ్ఞాలలో పశువధ తగ్గుముఖం పట్టినా, నాటి బ్రాహ్మణులతో సహా సమాజంలో ఎవరికీ మాంస భోజనం నిషిద్ధంకాదని మాత్రం గ్రహించగలం. తమ గతకాలపు మాంస భక్షణానికి ఇంకా మిగిలివున్న ఒక చిన్నెలాగా శ్రౌత యజ్ఞాలు నిర్వహించే వైదిక బ్రాహ్మణులు నేటికీ వపాహోమం సందర్భంగా వధించిన బలి పశువు శరీరాన్నుంచి ‘వప’ అనే శరీరభాగాన్ని కొద్దిగా తీసుకుని తింటారు. సారస్వత బ్రాహ్మణులు, ఒడిసా, బెంగాల్ లలోని దాదాపు అందరు బ్రాహ్మణులు నేటికీ చేపలు తింటారు. వారిలో మాంస భక్షణం చేసేవారూ పలువురున్నారు. తొలినుంచీ జైనులు పూర్తి శాకాహార నియమం పాటించారు. అయితే 82 సంవత్సరాలు జీవించిన గౌతమ బుద్ధుడు చివరివరకు మాంసాహారే. ఆయన వ్యవసాయానికి ప్రమాదకరంగా మారిన యజ్ఞపశువుల బలిని వ్యతిరేకించాడేగానీ మాంసం తినవద్దని తన అనుచరులకు ఎప్పుడూ చెప్పలేదు. ఆహారంకోసం చేసే పరిమితమైన హింస ప్రకృతిలో ఒక తప్పనిసరి అంశమనీ, అవసరానికి మించి మాత్రం హింస చేయరాదనీ బుద్ధుడి సందేశం. బౌద్ధం క్షీణదశకు చేరుకున్నాక ఆది శంకరాచార్య బోధనల  ప్రభావం కారణంగా బుద్ధుడు విష్ణువు దశావతారాలలో ఒకనిగా స్వీకరించబడ్డాడు. హైందవ మతంలోని బ్రాహ్మణులలోని అధిక శాతం శాకాహారులుగా మారారు. మహాత్మా గాంధీ పేర్కొన్నట్లు హైందవ మతం బౌద్ధాన్ని మింగేసినా గెలించింది బుద్ధుని అహింసా సిద్ధాంతమే. అలా బౌద్ధం భారతదేశాన్నుంచి నిష్క్రమించడంలో ప్రధానపాత్ర పోషించినవి రెండు అంశాలు. ఒకటి - బుద్ధుడిని హైందవ మతం విష్ణువుయొక్క అవతారమూర్తిగా స్వీకరించడం, రెండు - హిందువులలో పలువురు- ముఖ్యంగా బ్రాహ్మణులలోని అధిక సంఖ్యాకులు - శాకాహార నియమాన్ని స్వీకరించడం. అలా ఒకప్పుడు కుందేలు, తాబేలు మాంసాలతో పాటు అడవిపంది, ఖడ్గమృగము, మహిషము (దున్న) వంటి జంతువులన్నిటి మాంసములను తిన్న బ్రాహ్మణులలోని అధికసంఖ్యాకులు తాము పొందిన నూతన సంస్కారం కారణంగా తదాదిగా శుద్ధ శాకాహారులుగా మారడం భారతదేశపు వైచిత్రి!!

***సశేషం***

Posted in February 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!