Menu Close
చివరకు మిగిలింది....
-- ఏ.అన్నపూర్ణ --

''అమెరికా అక్క వస్తూంది ....అనగానే సంతోషంతో మురిసిపోయింది రేఖ.

అబ్బో అక్క రూప వూరికి మావూరు చాలా దూరం. ఐనా ఇద్దరికి చనువు ఎక్కువ. అలాని స్వంత అక్కేమీ కాదు. దూరపు బంధుత్వం. రూపకి స్వంత చెల్లి వున్నప్పటికీ రేఖ అంటే ఇష్టంగా ఉండేది.

రూపకి పెళ్లి అయిన సంవత్సరం కూడా అవకుండా బావ గారికి అమెరికాలో వున్నా ఫ్రెండ్ వలన ఉద్యోగం వచ్చి వాళ్ళు వెళ్లి పోయారు.

అప్పుడు అందరికీ ''మా అక్క అమెరికా వెళ్ళింది మా బంధువుల్లో అమెరికా వెళ్లిన మొదటి మనిషి మా అక్కే.....అంటూ గొప్పగా అందరికీ చెప్పేది రేఖ.

తర్వాత రేఖ పెళ్ళికి అమెరికానుంచి వచ్చిన రూపను చూసి ఎంత సంతోషపడిందో... భర్తకి పరిచయం చేస్తే ఓ మహారాణీలా గౌరవంగా చూసాడు.

అప్పటినుంచి రూపక్క రెండేళ్లకోసారి ఇండియా రావడం, రేఖను తీసుకుని బంధువులు అందరినీ చూడటానికి వెళ్లడం.....ఆమె వున్న మూడునెలలు ఎంతో సరదాగా గడపటం జరిగేది. రూప అమెరికా నుంచి చీరలు ఏవో బహుమతులు తెచ్చేది ....

అప్పట్లో అమెరికా వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. ఇన్ని ఫ్లయిట్ సదుపాయాలు లేవు. ఉద్యోగ సదుపాయాలు, చదువుకోడానికి వీసాలు సులువుగా వచ్చేవికావు. చాలా కొద్దిమంది వెళ్లగలిగేవారు.

రేఖ కొడుకులు ఉన్నత విద్యకోసం అమెరికా వెడితే కూతురికి అక్కడి పెళ్లి సంబంధం కుదిరింది.

అమెరికా వీసాల కోటా పెరిగింది. భారతీయ కంపెనీలు కొన్ని అమెరికాలో స్థాపిస్తే ఇండియాలో అమెరికా కంపెనీలు వెలిశాయి. సాఫ్ట్వేర్ కంపెనీల జోరు పెరిగింది. బ్యాంకులు చదువుకొనే విద్యార్థులకు ''స్టడీ లోన్స్'' ఇవ్వడం వలన అందరికి విదేశాలకువెళ్ళే అవకాశాలు పెరిగాయి.

పీజీలు చేసినవాళ్లు లాయర్లు, ఎంబీయేలు, సిఏలు, డాక్టర్లు తప్పితే ఇంజినీరింగ్ చదివి 'ఎలాగో ఆలాగ ' విదేశాలకు వెళ్లాలని కలలు కనే వారి సంఖ్యా పెరిగింది.

ఆలా వచ్చిన అవకాశంతో రేఖ కొడుకులు, పెళ్లి చేసుకుని భర్తతో కూతురూ ఒకప్పుడు అందనంత దూరంలోవున్న అమెరికా సునాయాసంగా వెళ్లిపోయారు. ఈ కబురు తెలిసిన రూప ఎందుకో రేఖతో మాటలు తగ్గించింది. ఇండియా వచ్చినా కబురు లేదు.

''అదేమిటి....అంత చనువుగా స్నేహంగా వుండే రూపక్క ఎందుకిలా మారిందా అని రేఖ బాధపడింది. నా అవసరం లేదేమో...అనుకుంది. అవసరానికేనా బంధుత్వం స్నేహం..అని వేదన కలిగింది. బంధువుల ఇంట్లో పెళ్ళికి వెడితే అక్కడ కనిపిస్తే ...బాగున్నావా అక్క ...ఎప్పుడువచ్చావు? అని పలకరించింది.

''ఆ బాగానే వున్నాను....అని ముభావంగా వుండిపోయింది. రేఖకి అర్థం అయినది. మాట్లాడం ఇష్టం లేదని. రూప చెల్లి దీప మాత్రం ఆప్యాయంగా పలకరించి అక్కడ ఉన్నంతసేపు అంటిపెట్టుకుని తిరిగింది.

''ఏమిటో రూపక్క బాగా మారిపొయింది. వయసు పెరిగితే నలుగురూ కావాలనుకుంటారు. కానీ అక్క దూరం పెడుతోంది. నాతో ఎప్పుడు ప్రేమగా లేదు....స్వంత చెల్లిమీదనే అయిష్టత...ఎందుకో తెలియదు...నాకు ఫ్యాషన్గా ఉండటం తెలియదు అనేది...”అంటూ చెప్పింది.

దీపకి తెలుసు. రూపకి రేఖకీ అంతకు ముందు మధ్య వుండే అనుబంధం.

''నిజమే నేను ఏమైనా తప్పు చేసివుంటే మందలించే చనువు ఆక్కకివుంది. మరెందుకు దూరం అయినదో కారణం చెబితే బాగుండును. ఇలా మాటాడటం మానుకోవాలా...పోనీలే ...” అంది రేఖ.

''మనం పనికిరాలేదు ...చూడు విశాలతో ఎంత బాగా మాటాడుతోందో ...కొత్తగా దానితో అవసరం ఉందికాబోలు.'' అంది దీప.

విశాల కూడా బంధువే. రేఖ దీపల కంటే రెండేళ్లు చిన్న. భర్త చనిపోతే ఆ వుద్యోగం ఇచ్చారు. స్వేచ్ఛగా ఉంటుంది. ఏపని చేయాలన్న చొరవగా దూసుకునిపోతుంది. పుట్టింది అమ్మాయిగా కానీ అన్నీ అబ్బాయి లక్షణాలే! మాట తీరు పొగరు అంతా. ఒకప్పుడు రూపకి విశాలతీరు నచ్చేదికాదు.

'అమ్మాయిలు అబ్బాయిల్లా ఉంటే నాకు నచ్చదు' అనేది. అలాంటిది ఇప్పుడు బాగా ఇష్టపడుతోంది.

''రూపక్క స్వార్థపరురాలు. ఎవరు ఉపయోగ పడతారో వాళ్లతో స్నేహం చేస్తుంది....నాకు తెలుసు. చిన్నప్పుడే నేనంటే ద్వేషం. ముద్దుగా చూసింది లేదు. తాను వాడేసిన డ్రెస్సులు వస్తువులు నాకు ఇచ్చేది. నాన్న కొత్తవి కొనలేరని సర్దుకుపోయాను. దానికి చదువు రాలేదు. చచ్చి చెడి టెన్త్ చదివింది. త్వరగా పెళ్లి చేసేసారు. బావగారు మంచివాడు. అదృష్టం బాగుంది అమెరికా వెళ్లి బాగా సంపాదించారు.

అక్కకళ్ళు నెత్తికి వచ్చాయి. నీకోసంగతి రహస్యం చెబుతున్న అక్కకి పిల్లలు కలగరని ఆమెలో లోపం ఉందని అమెరికాలో డాక్టరు చెబితే ...అప్పుడు నా అవసరం వచ్చింది. నన్ను మా ఆయనను బతిమాలి ఏడ్చి నా కూతుర్ని పెంపకానికి తీసుకుంది. మూడునెలల పాపని. ఈ విషయం ఎవరికీ చెప్పద్దు.నాకు అవమానం అని మాట తీసుకుంది. ఆఖరికి పాపకి కూడా తెలియకూడదు. పొరబాటునికూడా నువ్వు దానితో 'నాకూతురువి' అని చెప్పవద్దు ...అంది.

మా ఆయన ఆఫీసులో డబ్బు పోయినది. ఎవరో కాజేసి అమాయకుడైన నా భర్తమీద పెట్టారు. మాకు ఆధారాలు లేవు కేసు పెట్టినా మేము ఓడిపోతే కోటి రూపాయలు కట్టాల్సి వచ్చింది. తప్పని స్థితిలో ఆడబ్బు అక్కని అడిగాము.ఇచ్చింది...కానీ బదులుగా నా కవలల్లో పెద్ద పాపని ఇవ్వమని కండిషన్స్ పెట్టింది. ఒప్పుకున్నాం. నా భర్త కేన్సర్తో చనిపోయారు. చిన్న పాపకి ఎప్పుడూ అనారోగ్యమే. చిన్న వుద్యోగం చేసుకుంటూ పాపని చూసుకుంటున్న ....పెద్ద దానిపేరు సునీత. ''నీతా'' అని మార్చింది....ఇప్పుడు సునీత ఆరోగ్యం బాగుంది. చదువొచ్చింది. మంచి జాబ్ చేస్తోంది. నాకు బెంగ తీరింది..” అంటూ దీప చెప్పినప్పుడు రేఖ నిర్ఘాంతపోయింది...రూప బుద్ధి తెలిసి.

సానుభూతిగా దీపని దగ్గిరకి తీసుకుని ఓదార్చింది. నీకు ఏమికావాలన్న నేనువున్న అంటూ ధైర్యం చెప్పింది.

''ఇంతకూ విశాలతో ఎందుకు క్లోజ్ గా ఉందంటే నీతాకి ఇప్పుడు ఇండియా అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తుందిట.

అతను బుద్ధిమంతుడు సాంప్రదాయక కుటుంబం వాడు కావాలిట. చెడు అలవాట్లు లేనివాడు బాగా చదువుకున్నవాడు కావాలిట. విశాల 'నేను చూస్తాను నాదీ బాధ్యత' అందట. అదీ సంగతి....”

''అమ్మాయిని తీసుకు వచ్చిందా ఇప్పుడు? అదే నీతాని.

''తెచ్చింది. కానీ ఇక్కడకు రానీయలేదు. విశాల ఇంట్లో దాచిపెట్టింది.''

''అలా చెప్పిన మాట వినే పిల్లలు ఇప్పుడువున్నరా? అందులో అమెరికాలో పెరిగినవాళ్లు.''

''అమ్మో వినకపోతే ఉరివేసుకుని ఛస్తానంటూ బావగారికి కూతురికి నరకం చూపిస్తుంది. వాళ్ళు భయంతో వింటారు.''

''సరేలే ...మనం ఏమిచేయగలం ..మరి నేను ఒకగంటలో వెళ్ళిపోతాను. మళ్ళీ కలుద్దాం....అని చెప్పింది రేఖ.

''మంచిది. నాకు చాల సంతోషంగా వుంది నిన్ను చూసినందుకు. ఫోన్ చేసుకుందాం...మీ పిల్లలు కూడా అమెరికాలోనే వున్నారు. వెళ్ళావా? అడిగింది దీప.

''వెళ్ళాము నాలుగుసార్లు. మీరు వచ్చేయండి ఇక్కడికి. నాన్నగారు రిటైర్ ఆయ్యారుకదా ...అంటున్నారు.

వచ్చే ఏడు వెడతామేమో ...అంది రేఖ. ఆరోజే ఇంటికి వచ్చేసింది పెళ్ళి నుంచి.

వారం రోజులకే దీప ఫోను చేసి చెప్పింది. ''రూపక్క కూతురికి పెళ్లి కుదిరింది. విశాల కుదిర్చిందిట. అబ్బాయి ఫోటో ఇదిగో అంటూ ఫోటో వెడ్డింగ్ కార్డు స్కాన్ చేసి పంపింది.

''మంచిది. వెళ్లి వచ్చాక విశేషాలు ఏమిటో చెప్పు...అంది రేఖ.

మరో రెండు వారాలు తరువాత పెళ్లి హడావుడి అయ్యాక తీరిక చూసుకుని పెళ్లి ఫోటోలు వీడియో అన్ని పంపుతూ లెటర్ కూడా రాసింది.

''అబ్బాయిపేరు మార్కండేయుడు. చదువు కెమిస్ట్రీ పి.హెచ్.డి. అయితే చేసాడు కానీ వొట్టి పల్లెటూరు మేళం. మరీ బక్కగా గెడ కర్రలా వున్నాడు జబ్బు చేసిన మనిషిలా. నీతాకి ఎలా నచ్చాడో మరి! అక్క కోరుకున్నట్టే సాంప్రదాయ కుటుంబమే కానీ వొట్టి చాదస్తం మనుషులు. చూసావుగా వీడియో ....బలవంతాన బెదిరించి ఒప్పించి ఉంటుంది. దానికి అలవాటేగా. బావగారు నిస్సహాయుడు.

నీకు అర్థం అయ్యే ఉంటుంది. అబ్బాయికి కాస్త అవకరం కూడా వుంది. పెళ్లి పీటలమీద గొంతుకూర్చున్నాడు. కాలునొప్పి అంటూ పదిసార్లు లేచాడు. చివరికి కుర్చీ వేశారు కూర్చోమని. నన్ను మా చెల్లి అని వాళ్ళకి పరిచయమే చేయలేదు. పరాయి మనిషిలా దూరంగా కూర్చున్నాను. అవడం నీతా నా కూతురేగా.... ఇంత అవమానిస్తుందని అనుకోలేదు. అన్నిటికి విశాలనే పిలిచేది. నేను భర్త లేనిదాన్నని చులకన చేసింది. అసలు నా చిన్న కూతురు పునీత రాలేదు.నన్నుకూడా పెళ్ళికి వెళ్ళద్దు అంది. నేనే పిచ్చిదానిలా వెళ్ళాను మమకారం చంపుకోలేక......అంతా కలిసి అమెరికా వెళ్లారు...అంటూ బాధపడుతూ రాసింది.

''బాధపడకు. రూప సంగతి తెలిసిందే కదూ. పునీతకి కూడా పెళ్లి చేసేయి. అదేమన్నా ఫ్రెండు లవ్వు అంటోందా?”

''సరేలే మాలాటి పేదవాళ్ళకి ప్రేమలు బాయి ఫ్రెండులు వుండరు. మనిషిని కంటే కూడా వచ్చే బెనిఫిట్స్ చూసే రోజులు. చూస్తున్నాను. నీకూ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు” అంది దీప.

దీప మంచితనం వలన పునీత నెమ్మది చూసి పునీత పనిచేసే కంపెనీ మేనేజర్ గారి అబ్బాయికి వాళ్ళే ఏరికోరి వచ్చి అడిగేరుట. రూప ఎలాగూ రాదు...కనుక చెప్పలేదుట. దీప ఫోను చేసి రేఖని తప్పకుండ పెళ్ళికి రమ్మంది. రేఖ, భర్త వెళ్ళినప్పుడు ఎంతో సంతోషపడింది.

రేఖ భర్తతో కలిసి అమెరికా వెళ్ళారు. అక్కడ అదే స్టేట్లో దగ్గిరే రూప ఉంటుంది. ఒక రోజు రూపని ఫోనులో పలకరించి చెప్పింది....మేము కూడా పిల్లలదగ్గిరకి వచ్చేసాము...అంటూ.

బాగానే మాటాడింది.....కానీ ఆ తర్వాత ఎన్ని సార్లు ఫోను చేసిన లిఫ్ట్ చేసేదికాదు. మళ్ళీ మామూలే బహుశా కొత్త నంబరు కనుక మొదటిసారి తెలియక లిఫ్ట్ చేసి మాటాడి ఉంటుంది. ఇక తెలిసాక ఊరుకుంది.

పెద్దవాళ్ళం అయిన తరువాత బంధువులు, కావలసినవాళ్లు అంటూ సంతోషాలు పంచుకుంటాం తప్పితే ఎవరి సంపాదనా ఎవరికీ అవసరం లేదు. ''అవసరానికి మాటాడుతున్నారు'' అని లేనివి ఊహించుకుంటారు కొందరు. అలా ఎందుకు ప్రవర్తిస్తారో కానీ ....

దీపతో రక్త సంబంధమే అయినా వదులుకుంది రూప. పైగా బిడ్డను పెంపుకిచ్చి ఉపకారమే చేసింది. అయినా అభద్రతా భావం. రేఖను స్నేహితురాలిగా ఆత్మీయత చూపి తరువాత తప్పించుకుంది. అదీ అవసరానికి వాడుకుంది..తర్వాత విశాలతో ....కూతురి పెళ్లి అవసరం...తీర్చుకుంది. ఇక చేయాల్సింది ఏమీ లేదు కనుక ఇక ఇండియా వచ్చే అవకాశం అవసరం లేదు కనుకా దూరంగా ఉండిపోవాలనుకుంది. ఏమిటో కొందరు...నాకు నేనే ....ఇంకెవ్వరూ అవసరంలేదు అనుకుంటూ జీవిస్తారు.

కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా గడవవు. సంతోషాలు బాధలు కన్నీళ్లు విషాదాలు సహజం. అవి పంచుకోడానికి నా వాళ్ళు అనే విధంగా మన మనసును అర్థం చేసుకునేవారు అంటూ ఉండాలి. ఆ లోటు తీరదు. అని మర్చిపోతారు. అలాంటివారికి మిగిలేది ఏమిటి? శూన్యం. చీకటి. వేయి దీపాలు వెలిగించినా.... మనసులో ఆవరించిన చీకటిని శూన్యాన్ని తొలగించడం మనసుకు మనసుకు మాత్రమే సాధ్యం.

**సమాప్తం**

Posted in February 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!