Menu Close
గొప్పామె, ఉరఫ్ గొప్పాయన భార్య
-- వి.బి.సౌమ్య --

“టొరొంటో క్రికెట్, స్కేటింగ్ అండ్ కర్లింగ్ క్లబ్” - ఊబర్ లో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కగా కనబడ్డది. పేరేంటో వింతగా ఉందనుకుంటూ ఉండగా డ్రైవర్ అడిగాడు - "మీది ఇండియానా?" అని. అవునన్నాను.

"మాది పాకిస్తాన్".

"ఆహా"

"మీరు క్రికెట్ ఫాలో అవుతారా?"

"చిన్నప్పుడు అయ్యేదాన్ని. ఇపుడు అవడం లేదు"

"సహారా కప్ చూశారా?"

"అప్పుడు బాగా చిన్నదాన్ని కానీ గుర్తు ఉంది."

"అది జరిగింది ఇక్కడే"

"ఓహ్, అవునా. ఈ గ్రౌండు లోనా?"

"అవును."

"వావ్. మనం వెళ్ళి చూడొచ్చా? ఫోటోలు దిగొచ్చా?"

"నేను కూడా ఇలాగే ఉబలాట పడ్డాను, సగటు ఉపఖండపు క్రికెట్ అభిమాని లాగా. కానీ అదొక ప్రాసెస్. ఊరికే ఎవరం పడితే వాళ్ళం, ఎలా పడితే అలా పోలేము. మెంబర్లు మనల్ని తీసుకెళ్ళాలి. ఏదో డ్రస్ కోడ్ ఉంది. ఇదంతా విన్నాక మళ్ళీ ఇటు రాలేదు" - నిట్టూర్చాడు అతను.

“ఓ అవునా...” అని ఊరుకున్నాను కానీ ఆశ్చర్యంగా అనిపించింది.

ఇంతలో నేను దిగాల్సిన వీథిలోకి కారు మలుపు తిరిగింది. “ఈ వీథిలో పాత ఇళ్ళు చాలా ఉన్నాయి. మొన్న ఒక ఇంటి గురించి మొన్నామధ్య పేపర్లో వచ్చింది. 1940లలో ఇక్కడ మూడు నాలుగు వేలకే మంచి ఇండిపెండెంట్ హౌజెస్ కొనగలిగే వాళ్ళు అంట. ఆరోజుల్లోనే ఆ ఇల్లు పదిహేనువేలకి కొన్నారంట. అది అప్పటికే పాత ఇల్లు. ఇపుడు వందేళ్ల పైచిలుకు వయసంట. ఇప్పుడు ఎందుకో దాన్ని డిమాలిష్ చేసి ఇంకేదో కడుతున్నారంట” డ్రైవర్ ఏదో చెప్పుకుపోతూ ఉన్నట్లుండి ఆగిపోయాడు. “ఏమైంది?” అని అడిగేసరికి  - “మీ అడ్రస్ వచ్చేసింది.” అని నవ్వేసాడు. నేను దిగగానే "హేవ్ ఎ గుడ్ డే" అంటూ కారు తిప్పుకుని వెళ్ళిపోయాడు.

**** **** ****

నా స్నేహితురాలు లియోనా నన్ను వాళ్ళ అమ్మమ్మగారింటికి రమ్మని పిలిచింది. మేమిద్దరం అట్టావా లో కలిసి చదువుకున్నాము. చదువు తరువాత తను ఉద్యోగానికి మాంట్రియాల్ వెళ్ళిపోయింది. నేను ఇటు టొరోంటోలో పడ్డాను. వాళ్ళు ఇక్కడి వాళ్ళే. బంధువర్గం సమస్తం ఈ టొరొంటో చుట్టుపక్కల ఊళ్ళలోనే ఉన్నారు. మొన్నొక రోజు “నేను మా అమ్మమ్మ వాళ్ళింటికొచ్చాను. వీళ్ళింట్లో నీకు ఒకటి చూపించాలి. వచ్చి తీరాలి నువ్వు” అని మెసేజి పెట్టింది. ఇట్లా స్నేహితుల అమ్మమ్మలు, తాతలూ, ఏ అత్తో, పెదనాన్నో...ఇలా రకరకాల బంధువుల ఇళ్ళకి ఇండియాలో చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను కానీ, కెనడాలో ఇలాంటి అనుభవాలు లేవు. అందువల్ల అదేమిటో అన్న కుతూహలం కొంతా, ఎప్పుడూ ఇలా పాతకాలం తెల్లవాళ్ళ ఇళ్లు చూడలేదు అన్న కూతూహలం కొంతా కలిసి - ఇలా బయలుదేరాను నేను. ఇల్లు బయట నుంచి చూడ్డానికి పాతదిలా ఉంది. ఆ డ్రైవర్ చెప్పిన లాంటిదే అనుకుంటాను. లియోనా కి ఫోన్ చేస్తే బయటకొచ్చి లోపలికి తీసుకెళ్లింది.

లోపలంతా పాత ఇంగ్లీషు సినిమాల్లో ఇళ్లలా ఉంది! చెప్పులూ, కోటూ అవీ తీసి ఇంట్లోకి అడుగుపెట్టగానే పెద్ద హాలు. గోడల మీద అలంకరణలు, గదిలోని ఫర్నిచర్ అన్నీ ఏ యాభై ఏళ్ళవో ఉండి ఉంటాయి అనిపించాయి. షోకేసులు, వాటి మీద డిజైనులు చూస్తూ లియోనా ని అడిగాను - "మీ ఇల్లు గొప్పగా ఉంది. పాత సినిమాల్లోని ఇళ్ళలా ఉంది. ఇంతకూ అసలెందుకు పిలిచావు?" అని. లియోనా "చెప్తా..చెప్తా.." అంటూ ఓ పక్కగా ఉన్న పుస్తకాల గదికి తీసుకెళ్ళింది. ఇంత పాతిల్లు కనుక ఏవైనా అరుదైన పుస్తకాలున్నాయి కాబోలు, నాకు ఇలాంటివి ఆసక్తని పిలిచిందేమో? అనుకుంటూ నేనూ అటు వెళ్ళా. గది అనడం కంటే అదే ఓ గ్రంథాలయంలా ఉంది. "సరే, బాగుంది. ఇందుకేనా నన్ను పిలిచావు?" తల తిప్పి అనబోతూ ఆ వైపు ఉన్న పెద్ద పెయింటింగ్ ని చూసి నోరెళ్ళబెట్టాను.

ఎదురుగ్గా ఉన్నది నా దృష్టిలో ప్రపంచ గమనాన్ని మార్చేసిన తత్వవేత్త ఉవె డింకెల్ యవ్వనం నాటి చిత్రం. అడవిలాంటి దట్టమైన చింపిరి జుట్టు, బవిరి గడ్డం -రెంటి మధ్య నుండీ నన్నే తీక్షణంగా చూస్తున్నట్లు ఉంది ఆ చిత్రం. పక్కనే ఓ అందమైన యువతి. బహుశా ఆయన భార్యేమో అనుకున్నాను.

"అక్కడ గాజు పెట్టెలో కనిపిస్తున్న కాగితాలు ఆయన స్వదస్తూరీతో రాసినవే. దాదాపు వందేళ్ళ వయసు వాటికిప్పుడు. అవి చూపించడానికే పిలిచాను నిన్ను. నీకు ఆయనంటే ఉన్న పిచ్చి తెలుసు కదా" అంటూ నవ్వింది లియోనా.

"వావ్... మీకెలా దొరికాయి అవి?"

"మా అమ్మమ్మ ఎవరనుకున్నావు? ఆయన కూతురు. ఆ ఫొటోలో ఉన్నది అమ్మమ్మ వాళ్ళ అమ్మే."

"వాట్? ఆయనకి పిల్లలున్నారా? నువ్వు ఆయన మునిమనవరాలివా?" ఈసారి ఇంతకుముందు కంటే ఉలికిపాటు నాకు. ఎంత గొప్పవాళ్ళకైనా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అన్నది నా బోటి వీరాభిమానులు కూడా ఒక్కోసారి రచనల ప్రభావంలో పడి తేలిగ్గా విస్మరిస్తారు అనుకుంటాను.

"ఇంతకాలం నేను ఆయన మునిమనవరాలిని అన్న విషయం నీకు చెప్పలేదు అంటావేమో అనుకున్నాను" అని నిరాశపడింది లియోనా.

"అది కూడా ఉంది" కోపంగా అన్నాను నేను.

"అది కాదు లే - నాకు ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే తెలుసు. కనుక నాకంత ఆరాధనాభావం లేదు. పైగా ఆ రచనలన్నీ నాకర్థం కావు - చదవనని నీకు తెలుసు కదా. అందుకని ఆయన మా ముత్తాత అన్న విషయం ఎవరి ముందూ ఎత్తను" కొంచెం సిగ్గుపడుతూ అన్నది లియోనా.

"మరిప్పుండెందుకు పిలిచావ్ నన్ను?"

"ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గురించి నాకు ఇన్నాళ్ళూ తెలియదు. మా అమ్మమ్మ చేత ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నంలో పాత సామాన్ల గదిని చక్కబెడుతూ ఉండగా ఇవి కనబడ్డాయి. నువ్వు ఆయన రచనలని ఎంత భక్తిభావం తో చదువుతావో, ఎంత ఆవేశపడతావో నాకు తెలుసు కనుక నిన్ను రమ్మని పిలిచాను." అంటూ వివరణ ఇచ్చింది లియోనా.

నేనేదో తిరిగోమాట అనబోతూండగా నెమ్మదిగా నడుస్తూ.ఒక పెద్దావిడ వచ్చింది ఆ గదిలోకి.. "మా అమ్మమ్మ" లియోనా పరిచయం చేసింది. నేను ఆమెకి నమస్కరించి, అది మా సంప్రదాయమని చెప్పి, పరిచయం చేసుకున్నాక ఇంకేం మాట్లాడాలో తోచక "మీ నాన్న గారికి నేను వీరాభిమానిని" అన్నాను.

"ఆయన రచనలకా?" అన్నదావిడ సరిచేస్తూ.

ఇది ఊహించనిదే అయినా తమాయించుకుని "అవునండీ, రచనలకే. నాకు వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఇవ్వాళే మొదటిసారి వింటున్నాను."

"అవును. ఆయన వ్యక్తిగత జీవితం ప్రస్తావన అంతగా కనబడదు. వికీపీడియా పేజిల్లో సైతం చాలా తక్కువ సమాచారం ఉంటుంది. నాకు తెలుసు." లియోనా మా సంభాషణలో కలిసింది.

"ఇద్దరూ జంటగా భలే ఉన్నారు ఫొటోలో" అన్నాను.

"అది వాళ్ళు జన్మభూమి జర్మనీ వదిలేసి వెళ్ళిపోతున్నపుడు భవిష్యత్తు మీద ఆశతో తీసుకున్న ఫొటో. ఆ పోవడం.... జీవితంలో మళ్ళీ తిరిగి అటు పోలేదు. మేము ఇప్పుడు ఇక్కడ తేలాము" - అమ్మమ్మగారు నిట్టూర్చారు.

నాకంతా ఆశ్చర్యంగా ఉంది. ఆయన జర్మను భాషలో అంతంత రాయడం ఏమిటి? అదంతా నేను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ చదివి ఆ రచనలని ఆరాధించడం ఏమిటి? వాళ్ళంతా ఎప్పుడో ఈ రచనలు చేసే ముందే ఆ దేశం వదిలి పోయి, చివరికి ఆ వారసులతో ఇక్కడ కెనడాలో నాకు స్నేహం కలవడం ఏమిటి? అని నా ఆలోచనల్లో ఉండగా, లియోనా పక్కన నిలబడి ఓ పోటు పొడిచింది. ఏమిటన్నట్లు చూస్తే, అమ్మమ్మ వైపుకి చూడమని సైగ చేసింది. ఆవిడ ఉవె, అతని భార్య ఉన్న ఆ చిత్రాన్ని తడుముతూ కళ్ళు తుడుచుకోడం చూశాము ఇద్దరం. లియోనా ఆమెని కుర్చీ దగ్గర కూర్చోబెట్టింది. ఆమె కళ్ళు తుడుచుకుని, గతాన్ని తల్చుకోవడం మొదలుపెట్టింది.

****** **** ****

"మా ముట్టీ జేన్ చాలా అందగత్తె. అసలైతే వాళ్ళది జమీందారీ కుటుంబం. సంపద, సౌకర్యాల మధ్యనే పెరిగింది మా ముట్టీ. ఎంతో అందగత్తె అనీ, చాలా తెలివైనదనీ పేరుండేది. మేము పుట్టాక కూడా అందం, తెలివీ తరగలేదు కానీ, నాకు తెలిసి, ఫేటర్చెన్ తో ప్రేమా, పెళ్ళీ తరువాత ముట్టీదంతా కటిక పేదరికమే." అంటూ ఆగారు.

"అదేమి? ఎందుకలా?" ఆశ్చర్యంతో అడిగాను.

"ఆయన జీవితంలో ఏ దశలోనూ పట్టుమని ఆర్నెల్లైనా తిన్నగా ఉద్యోగం చెయ్యలేదు. అలాగని ఆకాలంలో ఆమె వెళ్ళి ఉద్యోగం చేసి సంసారాన్ని పోషించే పరిస్థితి లేదు. తమతమ పుట్టిళ్ళ నుంచి ఏదైనా వస్తే దేశోద్ధారణకే మొదట ఖర్చు పెట్టేవారు. తరువాతే కుటుంబం." - లియోనా తేల్చేసింది.

"ఏంటీ? ఆయన ఉద్యోగాలే చేయలేదా?" ఇదొక పెద్ద షాక్ నాకు. మరి ఏం చేసేవాళ్ళు బ్రతుకుతెరువుకి?

"తాను రాస్తున్న, రాయబోతున్న గ్రంథాలన్నీ విపరీతంగా అమ్ముడుపోయి తమ ఆర్థికావసరాలు జీవితాంతం తీరుస్తాయని ఆయన నమ్మాడు. నా మొగుడు అపర మేధావి, ఈయన రాయాలే కానీ పబ్లిషర్లంతా అడ్వాన్సులతో క్యూ కడతారని ఆమె నమ్మింది." అమ్మమ్మగారు అన్నారు.

"అవును. ఆయన గొప్ప మేధావీ, రచయితే కదా. ఇపుడు ఆయన పోయి కూడా అరవై డెబ్భై ఏళ్ళ పైమాటే కదా. అయినా ఇంకా అమ్ముడుపోతూనే ఉన్నాయి కదా" అన్నాన్నేను అమాయకంగా.

"అదే మరి. ఆయన బతికుండగా వాటినెవరూ పట్టించుకోలేదు. ఆయన పోయాకే ఈ పేరంతా. బతికున్నపుడు దుర్భర దారిద్య్రమే. ప్రపంచానికి ఆర్థికశాస్త్రాన్ని బోధించిన వ్యక్తికి తన ఇంటి ఆర్థికవ్యవస్థ ని చక్కబెట్టుకోడం చేతకాలేదు." లియోనా అన్నది.

"అవునా... ప్చ్" అని నిట్టూర్చాను.

"ప్చ్ కాదు. అసలు వాళ్ళ జీవితం కథలు వింటే కడుపు తరుక్కుపోతుంది మనకి" అంటూ లియోనా ఏదో చెప్పబోతూ ఉండగా ..

"అవన్నీ ఎందుకే ఆ పిల్లకి?" అంటూ అమ్మమ్మ గారు అడ్డుపడబోయారు.

"నువ్వూరుకో అమ్మమ్మా. ఎవరో ఒకరికి తెలియొద్దా? మనం మనం అనుకుంటే సరిపోతుందా? ప్రపంచానికి తెలియొద్దా?" లియోనా తిరిగి అడ్డుపడి చెప్పనారంభించింది.

"సరే, నేను వెళ్ళీ కాస్త జ్యూస్ ఏదన్నా తాగి వస్తాను" అంటూ ఈ కథంతా వినడం ఇష్టం లేనట్లు పక్కకెళ్ళిపోయింది లియోనా వాళ్ళ అమ్మమ్మ.

(సశేషం)

Posted in February 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!