Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

కాకతీయ యుగం - తిక్కన సోమయాజి

భారత రామాయణాలు రచించిన తిక్కన వంశం- రాజకీయ చరిత్ర

తిక్కన గారి వంశ వృక్షాన్ని, మూల ఘటిక కేతన తన దశకుమార చరిత్రలో ఇచ్చిన వివరాలను అనుసరించి ఆరుద్ర చిత్రించారు. దీనిని గూర్చి చెప్తూ “తిక్కన గారి వంశం ఏడు పురుషాంతరాలు వారి కాలంలోనే వర్ణితమైంది” అని తిక్కన వంశ వృక్షం వేశారు ఆరుద్ర.

తిక్కన గారి వంశ మూల పురుషుడు మాచెన. తిక్కన గారి పూర్వీకులు వెలనాడు లో ఉండే గుంటూరు. తిక్కన తన తాత గారిని గూర్చి “సార కవితాభిరాము గుంటూరి విభుని మంత్రి భాస్కరుని మత్పితామహుని తలచి” అని, అలాగే తిక్కన తన తండ్రిని గూర్చి “మజ్జనకుండు కేతన మల్లన సిద్ధనామాత్యవరుల కూరిమి తమ్ముడు గుంటూరి విభుడు కొమ్మన దండనాధుండు” అని తెల్పాడు. (భారవం, విరాట – 1-10). దీనివల్ల తిక్కన తాత, తండ్రులు గుంటూరు వారని తెలుస్తున్నది. అయితే తిక్కన గారు, ఆయన పెత్తండ్రులు, వారి బిడ్డలు మాత్రం నెల్లూరి చోళుల వద్ద వివిధ ఉద్యోగ కర్తవ్యాలను ఎట్లా పొందారు? అన్నది ప్రశ్న. దీనికి ఆరుద్ర ఇలా స్పందించారు.

‘క్రీ.శ.1186 ప్రాంతాలకు ముందు చందవోలు, గుంటూరు ప్రాంతాలను వెలనాటి చోళులు వైభవోపేతంగా పాలించేవారు. నెల్లూరును పాలించే చోళ తిక్కరాజు చిన్నప్పుడే వెలనాటి రాజైన పృధ్వీశ్వరుణ్ణి చంపి ఆ తలతో బంతాట ఆడాడట.’ అని తెల్పి ‘ఆ రాజు మరణానంతరం (క్రీ.శ.1206 లో చనిపోయి ఉండవచ్చు) గుంటూరికి విభుడుగా ఉన్న కొట్టరువు భాస్కరుడు చోళ తిక్కరాజును ఆశ్రయించి ఉండవచ్చు.’ అని తిక్కన వంశీయులను గూర్చి తెల్పారు.

ఈ విధంగా తిక్కన వంశీయులు గుంటూరు నుండి వచ్చి నెల్లూరు చోళుల రాజ్యంలో స్థిరపడిన విధానానికి కారణాలను వివరించి, ‘కవి సార్వభౌముడైన తిక్కరాజు, సారకవితాభిరాముడైన మంత్రి భాస్కరుని చేరదీసి ఆశ్రయమివ్వడంలో వింతలేదు’ అని ఆరుద్ర వివరణ ఇచ్చారు. ఇది సమంజసంగానే ఉంది.

భాస్కర మంత్రి కి గల నలుగురు కొడుకులలో చివరి వారు కొమ్మన. ఇతని కుమారుడే మన తిక్కన గారు. తిక్కనకు పెదనాన్న సిద్ధన మంత్రి. ఇతడు ప్రసిద్ధుడు. సిద్ధన మంత్రి చోడ తిక్కరాజుకు ఆప్తుడైన మంత్రి. ఇతని కుమారుడే యుద్ధంలో వీరమరణం పొందిన ఖడ్గతిక్కన. సిద్ధనకు గల ఏడుగురు కుమారులలో నలుగురు నెల్లూరు చోళుల కొలువులో ఉన్నవారే. సిద్ధన మంత్రి ఆరవకొడుకు క్రీ.శ. 1215 లో జరిగిన దండయాత్రను అరికట్టడంలో ప్రముఖ పాత్ర వహించాడు.

తిక్కన కుటుంబీకులంతా ఈ విధంగా చోళుల వద్ద పెద్ద పదవులలో ఉండడం వలన తిక్కన చిన్ననాడే నెల్లూరు చేరి, రాజైన మనుమసిద్ధి తో చిన్న నాటి నుండే కలిసి మెలిసి ఉండడం వల్ల మనుమసిద్ధి తిక్కన గారిని మామా అని పిలిచేవారు.

రాజకీయ చరిత్ర

మొదటి తిక్కరాజు నెల్లూరు రాజ్యాన్ని సుదీర్ఘ కాలం పాలించాడు. మొదటి తిక్కరాజు కుమారుని పేరు మనుమసిద్ధి. మొదటి తిక్కరాజు అల్లుడి పేరు కూడా తిక్కరాజు. ఈ తిక్కరాజు చేసిన దానధర్మాలను గూర్చిన శాసనాలు కనపడుతున్నాయి (1244-46 మధ్యకాలంలో). అల్లుడు తిక్కరాజు యొక్క తమ్ముడు విజయాదిత్యుడు. అప్పటి పరిస్థితులను గూర్చి ఆరుద్ర అభిప్రాయం;

“మొదటి తిక్కరాజు అస్వస్థుడైనప్పుడు అతని కుమారుడైన మనుమసిద్ధిని ప్రక్కకునెట్టి అల్లుడు తిక్కరాజు తాను రాజై ఉంటాడు. మనుమసిద్ధి అడవుల పాలయ్యాడు. అట్టి పరిస్థితులలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు మనుమసిద్ధికి, తిక్కన గారి రాయబార ఫలితంగా తిరిగి రాజ్యాన్ని ప్రాప్తింపజేశాడు. కానే సర్వప్ప రచించిన సిద్దేశ్వర చరిత్ర లో ఆ నాటి రాజకీయ పరిస్థితులను, ‘తిక్కన బౌద్ధ, జైనులను గణపతిదేవుని సభలో ఓడించి వారి 36 వసతులన్నీ కూలద్రోయించి, జైనులందరినీ నరికించి....సోమయాజుల వారు సురుచిరోద్ధండ భీమ పరాక్రమ బిరుదులతో ఒప్పారినారట.’ అని వ్రాసివున్నది”

ఈ గ్రంథంలో వ్రాసిన అనేక విషయాలను ఆరుద్ర గారు వివరించారు. అంతేగాక గణపతి చక్రవర్తి దక్షిణదేశ దండయాత్రను గూర్చి తెల్పే ఒక శాసనం గూర్చి కూడా ఆరుద్ర గారు చెప్పడం జరిగింది. (స.ఆం.సా. పుట 336)

నిర్వచనోత్తర రామాయణ, దశకుమార చరిత్రలో గల వర్ణనలను బట్టి మనుమసిద్ధి కాలంలోనే తిక్కన తన రెండు కావ్యాలను వ్రాసినట్టు తెలుస్తున్నది.

క్రీ.శ.1253 తర్వాత నిర్వచనోత్తర రామాయణం పూర్తిచేసి యజ్ఞం చేసి సోమయాజి అయ్యాడు తిక్కన. భారత రచనా కాలానికి ‘బుధారాధనా విధేయ తిక్కన నామధేయ ప్రగీతం’ బని చెప్పుకొన్నాడు.

తిక్కన కవితకు చివరి మెట్టు ఆనందం అని చెప్తూ ‘భారతంలో ప్రతి పర్వాంతంలో ఆనందం ముద్ర ఉంటుంది. హరిహరనాధుణ్ణి ఆనందరూపునిగా వారు ఊహించారు’ అని చెప్పి ఆరుద్ర పాఠకుల సౌకర్యార్థం సుదీర్ఘ సమాసాల నుండి ఆనంద ముద్రను వేరు చేసి ఒక పట్టికగా ఇచ్చారు. తిక్కన రచనలో ఈ ఆనంద ముద్రను మొదట గుర్తించిన వారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు! అని ఆరుద్ర మాట. (స.ఆం.సా. 347).

మడికి సింగన-అప్పన మంత్రి-శివదేవయ్య 

“భారతంలో గ్రంథాదిని కృతి కర్త భావానంద భరితాంతఃకరణుడు. గ్రంథాంతంలో కృతి పాటి సంభ్రుతానంద భావుడు. ఏ ఆశయానికైతే మనం మన జీవితాన్ని అంకితం చేశామో ఆ ఆశయం యొక్క ఆనందమే మన ఆనందం.” అన్న ఆరుద్ర మాటలు అందరికీ ఆనందదాయకమైనవి.

మడికి సింగన  

“నీతి శాస్త్రాలు, ధర్మ శాస్త్రాలు ఎక్కువగా కాకతీయ యుగంలోనే రచించడం ప్రారంభించినట్లు కనబడుతున్నది. క్రీ.శ. 1347 లో ఉన్న అయ్యలమంత్రి కుమారుడు కనుక ఈ సంవత్సరానికి ఒక తరం అర్వాచీనుడవుతాడని సుప్రసిద్ధ చరిత్ర కారులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు కాలనిర్ణయం చేశారు.” ఇవి ఆరుద్ర మాటలు. (స.ఆం.సా.351).

మడికి సింగన రచించింది ‘సకల నీతి సమ్మతము’. సింగన ‘నీతి భూషణం అనే గ్రంథంలోని పద్యాలు’ అని పేర్కొని 25 పద్యాలను తన సకలనీతి సమ్మతంలో వివిధ శీర్షికల క్రింద ఉదాహరించాడు.  (స.ఆం.సా.349).

ఆరుద్ర ‘సకల నీతి సమ్మతం నుండి సేకరించిన నీతి భూషణం’ అని కొన్ని పద్యాలను గూర్చి చర్చించారు.

“జనులది అల్పగ్రంథం బనవలదు దీన దోచు నన్నియు...’ అంటూ చిన్నదైనా ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయన్నాడు సింగన.

కవియొక్క విలువను గూర్చి చెబుతూ “ఆ కులవృత్తి..అన్న పద్యంలో వాల్మీకి రామాయణం రాయకుండా ఉంటే రాముడు రావణుని చంపినది అబద్ధమే అవుతుంది.

"కృతి లేని నరేశ్వరుని వర్తనంబు రత్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరు వెత్తినన్” అని కవుల యొక్క ప్రాముఖ్యత అవసరం సమాజంలో ఎంతో ఉన్నదని ఈ కవి నొక్కి చెప్పాడు.

అలాగే “సరసకవిత రుచి యెరుగని పురుషుల పశువులని నిక్కముగ నెరుగుదు...” అని మంచి కవిత్వమును ఆనందించలేని వారిని గూర్చి చెప్తూ “చందురు జూచి మోదమున సాగరముబ్బిన నూతులుబ్బునే” అని చక్కని ఉదాహరణతో తెల్పాడు.

‘ఆజ్ఞా పాలనము’, ‘ప్రజా పాలనము’, ‘రాజనీతి’, ‘సేవకనీతి’, ‘దండయాత్ర’, ‘ప్రయాణ వ్యసన పరీక్ష’ మొ|| శీర్షికలతో ఆయా విషయాలను గూర్చి మడికి సింగన సేకరించిన పద్యాలను ఆరుద్ర పాఠకులకు రుచి చూపించారు.

చివరగా ఆరుద్ర “ఇది అల్ప గ్రంథం అనవద్దు. దీనిలోనే ఎన్నో కనపడతాయి. ఎన్నింటినో చూపించే కిటికీ చిన్నదే కదా! అని కవి ఈ గ్రంథం మొదటే అన్నాడు. ఇప్పుడు దొరికిన పద్యాలు కూడా తక్కువని అనుకోనక్కర లేదు. ఇతని కవిత్వ శక్తిని ఈ గవాక్ష రంధ్రం సమగ్రంగా చూపెడుతుంది. నీటి భూషణం లోని ప్రతి పద్యం అక్షరాలా భూషణం.” అని సెలవిచ్చారు.

అప్పన మంత్రి

ఆంధ్రభోజుడు అనే కవిని గూర్చి ఇంతకు పూర్వం చర్చించడం జరిగింది. దీనిని గూర్చి ఆరుద్ర “ప్రతి పద్యం ఒక భూషణంలా రచించిన ఆంధ్రభోజుడెవరా అన్న ప్రశ్న అంతకుముందు మనకు కల్గింది. అది బిరుదే గాని తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదని చెప్పకనే చెబుతున్నది. ఆంధ్రభోజుడు బహుశా అప్పన మంత్రి అవుతాడా అనే సందేహం కలుగుతున్నది. ఎందుకంటే యితడు ‘చారుచర్య’ అనే చిన్న గ్రంధం వ్రాశాడు.” అని చెప్తూ చారుచర్య లోని ఒక పద్యాన్ని ఉటంకించాడు. అందులో “...దొల్లియా-భోజుని చేత చెప్పబడింపొల్పగు నీ కృతినూత్న సత్కళా భోజుడు మంత్రి యప్పన ప్రబుద్ధుడు జేసె దెనుంగు బాసన్” అని ఉన్నందువల్లా, యితడు తన పేరుకు ముందు వాడిన విశేషణం గమనించదగి ఉన్నదని చెప్పి “దీనిని బట్టి అతనికి (అప్పన మంత్రికి) ఆంధ్రభోజుడనే బిరుదు వచ్చిందా?” అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. చారుచర్య, నీతి భూషణం రెంటిని పోల్చి శిల్పం ఒకటిగానే ఉన్నది అన్నారు ఆరుద్ర.

అప్పనమంత్రి కాలం మడికి సింగనకు పూర్వమేనని, ఎందుకంటే సకలనీతి సమ్మతంలో ‘చారుచర్య’ నుండి కూడా ఒక పద్యం మడికి సింగన ఉదహరించాడు. అది 258వ పద్యం. అప్పనమంత్రి తండ్రి గోవిందాచార్యుడు. తల్లి నాగమాంబ. తన తల్లిని గూర్చి అప్పనమంత్రి ‘కులద్వయ శిరోభూషణ ధర్మ చరిత’ అని ప్రస్తుతించాడు. ఇతడు ఉభయభాషా కవిత్వమాన వైదగ్ధ్యుడు. ఇతను శృంగార పురుషుడు. ‘నారీజన పంచబాణ నాగమయప్పా’ అని తనను తాను సంబోధించుకొన్నాడు. చారుచర్య చిన్న గ్రంథం 76 పద్యాలు మాత్రమే.

 

**** సశేషం ****

Posted in January 2022, సమీక్షలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!