Menu Close
Lalitha-Sahasranamam-PR page title

ప్రథమ అధ్యాయం

(అమ్మవారి స్థూలరూప వర్ణన) శ్లోకాలు: 01-21, సహస్రనామాలు: 01-54

031. ఓం కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయై నమః

బంగారంతో తయారు చేయబడిన కంకణం భుజకీర్తులచే శోభిల్లు మాతకు వందనాలు.


032. ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః

రత్నఖచితమైన కంఠాభరణాన్నీ, సువర్ణమయ చింతాకాన్నీ -- ముత్యాలహారాలనూ ధరించిన తల్లికి వందనాలు.


033. ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తన్యై నమః

అమూల్యమైన తన స్తనద్వయంచే కామేశ్వరుని ప్రేమరూపమైన రతనాలనుకొన్న తల్లికి వందనాలు. అంటే కామేశ్వరునియందు శ్రీలలితాదేవి గాఢమైన ప్రేమ కలిగియున్నదని భావము.


034. ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయాయై నమః

నాభిదేశంనుండి ప్రభవించిన నూగారు రూపమైన లోతుకు స్తనద్వయ రూపమైన రెండు ఫలాలుకల శ్రీదేవికి వందనాలు.


035. ఓం లక్ష్య రోమ లతాధారతా సమున్నేయమధ్యమాయై నమః

శ్రీ లలితయొక్క ఊర్ధ్వభాగము, అధోభాగము రెండూ సమున్నతంగా ఉండడంవల్ల నడుము ఉన్నదా అన్న భావము కలుగుతున్నది. సన్నని నూగారు నడుము ఉన్నదని తెలియబరుస్తూన్నది. అట్టి దేవికి వందనాలు.


036. ఓం స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయాయై నమః

స్తనభారాధిక్యతచే నడుము వాలి పోవునేమోనన్న భీతితో బంగారుపట్టిని ముమ్మారు బంధించిరా అన్నట్టు వళిత్రయంతో శోభిల్లుతూన్న జననికి ప్రణామాలు.


037. ఓం అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీ తట్యై నమః

ఎఱ్ఱటి కౌస్తుభం సదృశవర్ణం కల పట్టుబట్టను ధరించి తేజరిల్లి పోతున్న పరమేశ్వరికి వందనాలు.


038. ఓం రత్నకింకిణికా రమ్య రసనాదామ భూషితాయై నమః

రత్నమయాలైన చిరుగంటలుకల బంగారు వడ్డాణం ధరించిన లలితాంబకు వందనాలు.


039. ఓం కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః

కామేశ్వరునకు మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఊరుద్వయంకల మాతకు నమస్కారాలు.


040. ఓం మాణిక్యమకుటాకార జాను ద్వయ విరాజితాయై నమః

మాణిక్య నిర్మిత మకుటాకారంతో శ్రీదేవి జాను(మోకాళ్ళు) ద్వయం విరాజిల్లుతున్నది.


041. ఓం ఇంద్ర గోపపరీక్షిప్త స్మరతూణాభ జంఘికాయై నమః

ఆరుద్ర కటక నిర్మితమైన మన్మథుని తూణాలవలె ప్రకాశించు జఘన (పిక్కలు) భాగంలో శ్రీదేవికి వందనాలు.


042. ఓం గూఢ గుల్ఫాయై నమః

గూఢ (బలిసిన) శాలమండలు కల దేవికి వందనాలు.


043. ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః

తాబేలు పృష్టభాగం కంటే పాదాల పైభాగం దృఢత్వంగా గల దేవికి వందనాలు.


044. ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః

తనకు నమస్కరించునట్టి భక్తజనుల అజ్ఞానాంధకారాన్ని రూపుమాపునట్టి నఖకాంతులుగల పరాశక్తికి ప్రణామాలు.


045. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః

పద్మముల మృదుత్వ, సౌకుమార్యాలను తిరస్కరించునట్టి చరణద్వయం కలిగిన శ్రీమాతకు ప్రణామాలు.


046. ఓం శింజాన మణిమంజీరమండిత శ్రీపదాంబుజాయై నమః

మణి ఖచితములైన అందెలతో భాసిల్లుచున్న చరణారవిందద్వయంకల శ్రీదేవికి వందనాలు.


047. ఓం మరాళీమందగమనాయై నమః

హంసినీ గమనంవంటి మంద మనోహరగమనం కల శ్రీదేవికి వందనాలు.


048. ఓం మహాలావణ్య శేవధియే నమః

మహాలావణ్య నిధి స్వరూపిణి అయిన శ్రీ దేవికి వందనాలు.


049. ఓం సర్వారుణాయై నమః

పరమేశ్వరి శరీరకాంతి, ఆమె ధరించునట్టి వస్త్రాభరణ పుష్పాదులన్నిటికిన్నీ అరుణవర్ణం కలవి. అట్టి సర్వారుణమూర్తికి నమస్కారాలు.


050. ఓం అనవద్యాంగ్యై నమః

దోషరహితమైన అంగములు గల పరమేశ్వరికి ప్రణామాలు.


051. ఓం సర్వాభరణభూషితాయై నమః

ఆపాదాదిశిరః పర్యంతం శాస్త్రోక్తాభరణ సర్వస్వాన్నీ ధరించి తేజరిల్లునట్టి శ్రీ లలితా పరమేశ్వరికి ప్రణామాలు.


052. ఓం శివకామేశ్వరాంకప్థాయై నమః

కామేశ్వరుని అంక స్థలంలో తేజరిల్లునట్టి పరమేశ్వరికి ప్రణామాలు.


053. ఓం శివాయై నమః

అగ్నియందలి దాహక శక్తివలె పరమశివునిలో అర్థాంగియై అభిన్నమూర్తియైన శివాస్వరూపిణికి ప్రణామాలు.


054. ఓం స్వాధీనవల్లభాయై నమః

తపస్సు ద్వారా పరమేశ్వరుణ్ణి స్వాధీనం చేసికొన్న పార్వతీమాతకు వందనాలు.


* * * ప్రథమ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in March 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!