Menu Close
Mutthevi Ravindranath Photo
'మనుస్మృతి'
ముత్తేవి రవీంద్రనాథ్
మనుస్మృతి సమగ్ర శాస్త్రీయ వ్యాఖ్య
నాల్గవ అధ్యాయము (అ)

బ్రాహ్మణుని జీవన విధానం

ద్విజుడు తన ఆయుః పరిమితిలో నాల్గవ భాగం బ్రహ్మచర్యాశ్రమంలో గురుకులవాసంలో గడిపిన తరువాత, వివాహం చేసుకొని రెండవ ఆశ్రమ ధర్మమైనట్టి గృహస్థాశ్రమం అవలంబించి ఆ మీదట ఇంట్లోనే ఉండాలి. దీనిని గార్హస్థ్య జీవనం అంటారు.

అద్రోహేణైవ భూతానా మల్పద్రోహేణ వా పునః |
యా వృత్తిస్తాం సమాస్థాయ విప్రో జీవేదనాపది || (4-2)

ఆపదలు లేనప్పుడు బ్రాహ్మణుడు తన జీవనోపాధి కోసం ఏ వృత్తిని ఆచరిస్తే, భూతములకు ద్రోహము వాటిల్లదో, లేక అతి తక్కువ ద్రోహం జరుగుతుందో ఆ వృత్తిని అవలంబించాలి.

ఇక్కడ ద్రోహము అంటే భూతములకు కలిగే బాధ అనీ, ఇది అనాపది అంటే ఆపదలు లేని కాలంలో అనుసరించదగిన ధర్మమనీ గ్రహించాలి. ఆపత్కాల ధర్మాలు వేరుగా ఉంటాయి.

ఒకసారి మహాత్మా గాంధీని ఆయన ప్రచారం చేస్తున్న సిద్ధాంతం ‘అహింస’ ఈ ప్రపంచంలో అసలు సాధ్యమేనా? అని కొందరు ప్రశ్నించినప్పుడు ప్రపంచంలో హింస ఒక తప్పనిసరి అంతర్భాగమనీ, ఒక జీవి బతకాలంటే మరొక జీవికి బాధ కలిగించక తప్పదనీ, అహింస అంటే అర్థం అసలు హింస చేయకుండా ఉండటం కాదనీ, అనవసర హింస చేయకుండా ఉండటమనీ, తాను జీవించడానికి అవసరమైన మేరకు మాత్రమే హింస చేయటం ఏ జీవికీ తప్పుకాదనీ వివరించారు. మేక పిల్ల కోసం ఉద్దేశించిన తల్లి మేక పొదుగులోని పాలను మనం పిదుకుకుని తాగటం, వేరుశనగ గింజలలోని మొలక నశిస్తుందని తెలిసినా మనం వేరుశనగ గింజలను వేయించుకుని తినటం అందుకే సమర్థనీయమేనన్నారాయన. వేయించిన వేరుశనగ గింజలు, మేకపాలు గాంధీజీకి అతి ఇష్టమైన ఆహారాలని అందరికీ తెలిసినదే. భూతములకు బాధ కలిగించకుండా జీవించటం ఏ జీవికీ సాధ్యంకాదనే ఎరుక కారణంగానే మనువు కూడా అల్పద్రోహేణ అంటూ భూతములకు వీలైనంత తక్కువ ద్రోహం (బాధ) కలిగించే వృత్తి అని చెప్పాడు.

యాత్రామాత్రప్రసిద్ధ్యర్థం స్వైః కర్మభిరగర్హితైః |
అక్లేశేన శరీరస్య కుర్వీత ధనసంచయమ్ || (4 - 3)

ఆపదలు లేని కాలంలో కేవలం జీవికను గడుపుకోవడం కోసమే అగర్హితమైన (నిందితములు కానట్టి) స్వకర్మలను అవలంబిస్తూ, అక్లేశేన (శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకుండా) ధనసంపదను కూడబెట్టాలి.

ఋతామృతాభ్యాం జీవేత్తు మృతేన ప్రమృతేన వా |
సత్యానృతాభ్యా మపి వా స శ్వవృత్త్యా కదాచన || ( 4-4)

ఆపదలు లేనికాలంలో ఋతము, అమృతము, మృతము, ప్రమృతము, సత్యము, అనృతము - వీటిచే బ్రాహ్మణులు తమ జీవితం గడపాలి. అంతే కానీ శ్వవృత్తి చేత (కుక్క లాగా ఒకరి వద్ద కొలువుచేస్తూ) జీవించరాదు. బ్రాహ్మణుడు ఒకరి వద్ద కొలువు చేస్తూ జీవించటం అంటే కుక్క జీవితం జీవించటమని మనువు అభిప్రాయం.

ఋతముఞ్ఛ శిలం జ్ఞేయమమృతం స్యాదయాచితమ్ |
మృతం తు యాచితం భైక్షం ప్రమృతం కర్షణం స్మృతమ్ || ( 4-5)

ఎవరికీ సంబంధంలేని ప్రదేశంలో రాలిపడిన ధాన్యపు గింజలను ఒక్కొక్కటిగా రెండు వేళ్ళతో ఏరటాన్ని ‘ఉంఛము’ అంటారు. పైన తెలిపినట్లే ఎవరికీ చెందని ప్రదేశంలోనే పడిన ధాన్యపు కంకులను ఏరుకుంటే దానిని ‘శిలము’ అంటారు. ఇలా పరిగ ఏరటం (gleaning) ద్వారా ఎవరినీ అడగకుండా అంటే అయాచితంగా లభించిన ఆహారం అమృతం లాగే సుఖప్రదమైనది. అందుకే దానిని ‘అమృతమ్’ అంటారు. యాచించి తెచ్చిన భిక్ష మృత పదార్ధం వంటిది. ఇక బ్రాహ్మణుడికి తాను స్వయంగా కర్షణం (వ్యవసాయం) చేయటం ద్వారా లభించే ధాన్యం ‘ప్రమృతం’ (మరింతగా మృతి చెందిన పదార్ధం). కనుక బ్రాహ్మణుడికి అయాచితంగా ఉంఛము, శిలము ద్వారా లభించిన ఆహారం అమృతం వంటిది కాగా యాచించి తెచ్చిన భిక్ష మృత పదార్ధం వంటిది, స్వయంగా వ్యవసాయం చేసి పండించిన ధాన్యం ప్రమృతం (మరింత మృతిచెందిన పదార్ధం) వంటిది కనుక స్వయంగా వ్యవసాయం చేయటం అనాపది కాలంలో ఒక బ్రాహ్మణుడికి చిట్టచివరి ప్రత్యామ్నాయం కావాలనేది మనువు అభిప్రాయం. లేత మామిడి చిగురువంటి కావ్యకన్యకను నరాంకితం చేసి రసజ్ఞత యించుకైనా లేని కూళల (కుత్సితుల) ను ఆశ్రయించి, ఆ పడుపుకూడు తినటం కంటే, సత్కవులు తమ భార్యాబిడ్డల ఉదరపోషణ కోసం అడవులలో దొరికే కందమూలాలు ఏరుకున్నా, లేక హాలికులై వ్యవసాయం చేసినా తప్పులేదని పోతన రచించినదిగా ప్రసిద్ధమైన ఒక పద్యంలో కవి వాపోతాడు.

సత్యానృతం తు వాణిజ్యం తేన చైవాపి జీవ్యతే |
సేవా శ్వవృత్తిరాఖ్యాతా తస్మాత్తాం పరివర్జయేత్ || ( 4-6).

సాధారణ పరిభాషలో అనృతము అంటే అసత్యము అని అర్థం. అయితే అనృతము అంటే కృషి లేక వ్యవసాయము అనే అర్థమూ ఉంది. మనువు వాణిజ్యాన్ని మాత్రం సత్యానృతము అన్నాడు. వ్యవసాయం ఒక బ్రాహ్మణుడి తప్పనిసరి చిట్టచివరి ప్రత్యామ్నాయం కావాలని భావించిన మనువు ఒక బ్రాహ్మణుడు తాను స్వయంగా వాణిజ్యం చేయకున్నా, తన ధనాన్ని ఇతరులకు వడ్డీకి ఇచ్చి ఆ ఆదాయం మీద జీవించినా అది సత్యానృతమే అవుతుందని భావించాడు. అయితే బ్రాహ్మణుడు ఎట్టి పరిస్థితులలోనూ సేవావృత్తిని మాత్రం స్వీకరించకూడదు. సేవావృత్తితో జీవించటమంటే శ్వవృత్తితో జీవించటం (శ్వ, శ్వాన, శున పదాలన్నీ కుక్కను సూచిస్తాయి. శ్వవృత్తి లేక సేవావృత్తి అంటే కుక్కలాగా జీవించటం) అని మనువు భావన. సత్యానృతం (వాణిజ్యం) చేయదగినదే కానీ అనృతం (కృషి లేక వ్యవసాయం) ఆపత్కాలంలో తప్పనిసరి అయినప్పుడు మాత్రమే చేయదగినది. సేవావృత్తి ఎట్టి పరిస్థితులలోనూ ఒక బ్రాహ్మణుడికి తగని పని.

నాలుగు తరహాల గృహస్థులు

కుసూలధాన్యకో వా స్యాత్కుంభీధాన్యక ఏవ వా |
త్య్రహైహికో వాపి భవేదశ్వస్తనిక ఏవ వా || (4-7)

నిత్యనైమిత్తిక ధర్మకార్యాలు చేయడం కోసం, సేవకుల పోషణకోసం, గృహ నిర్వహణకోసం, పాడి పశువులు, ఇతర పెంపుడు జంతువుల కోసం మూడు సంవత్సరాలకు సరిపడా తనవద్ద ధాన్యం నిల్వచేసుకునేవాడిని ‘కుసూల ధాన్యకుడు’ అంటారు. కుసూలము అంటే ధాన్యం పోసుకునే గరిసె. సంవత్సరానికి సరిపడా ధాన్యం నిల్వచేసుకునేవాడిని ‘కుంభీ ధాన్యకుడు’ అంటారు. కుంభీ అంటే పెద్ద కుండ. మూడు రోజులకు సరిపడా ధాన్యం నిల్వ కలిగివున్నవాడిని ‘త్య్రహైహికుడు’ అంటారు. కేవలం మరుసటి రోజుకు మాత్రమే సరిపడా ఆహార పదార్థాలు కలిగినవాడిని అశ్వస్తనికుడు అంటారు. ఆవులాగా ఆడగుర్రం (Mare) పెద్ద పొదుగు (Udders), నాలుగు చనుమొనలు(Teats) కలిగి ఉండదు. మానవ జాతిలో లాగే ఆడగుర్రం రెండు స్తనాలు (రొమ్ములు), ప్రతి రొమ్ముకూ ఒక చనుమొన కలిగి ఉంటుంది. ఆవు పొదుగులో ఉన్నట్లు గుర్రం రొమ్ముల్లో పుష్కలంగా పాలు ఉండవు. వాటిలోని పాలు గుర్రం పిల్ల (Foal)కే చాలీచాలనట్లుగా కొద్దిగానే ఉంటాయి. అందుకే ఇంట్లో కేవలం మరుసటిరోజుకు మాత్రమే సరిపడా ఆహారపదార్థాలు కలిగిన గృహస్థును ‘అశ్వస్తనికుడు’ అంటారు. ఒక బ్రాహ్మణ గృహస్థు ఈ నలుగురిలో ఎలాంటివాడుగానైనా ఉండవచ్చు.

అయితే ఈ నాలుగు రకాల గృహస్థులలో మొదటివానికంటే రెండవవాడు, వానికంటే మూడవవాడు, వానికంటే నాల్గవవాడు ఉత్తములు. కారణం సంపద పోగుచేసినవాడు దానిని పరిరక్షించుకొనటం, వృద్ధి చేసుకొనటం మీదనే ధ్యాస పెడతాడు. కానీ సంపదలేనివాడు జీవనోపాధి కోసం మాత్రమే కష్టపడుతూ, ఐహిక సుఖములపైన ఆసక్తి లేనివాడై, పరమాత్మచింతన చేయగలడని మనువు అభిప్రాయం.

షట్కర్మైకో భవత్యేషాం త్రిభిరన్యః ప్రవర్తతే |
ద్వాభ్యామేకశ్చతుర్థః స్తు బ్రహ్మసత్రేణ జీవతి || ( 4-9)

ఇంట్లో పోషించబడవలసినవారు ఎక్కువగా ఉన్న గృహస్థు ఋతము, అయాచితము, భైక్షము, కృషి, వాణిజ్యము అనే ఐదు కర్మలే కాక కుసీదము (సొమ్ము వడ్డీకి ఇచ్చి, ఆ వడ్డీ మీద జీవించటం) అనే ఆరవ కర్మతో సహా వీటిలో ఏ ఒక్కటో, లేక వీటన్నింటినీనో జీవనోపాధిగా చేసుకోవచ్చు. ఉంఛము, శిలము - ఈ రెంటినీ కలిపి ఋతము అంటారు. ఎవరికీ చెందని ప్రదేశంలో పడివున్న ధాన్యపు గింజల్ని ఏరుకోవటాన్ని ఉంఛము అనీ, అలాంటి ప్రదేశంలో రాలిన ధాన్యపు కంకులను ఏరుకోవటాన్ని శిలము అనీ అంటారు. ఎవరినీ అడగకుండా లభించినది అయాచితము. ఉంఛము, శిలము, అయాచితము ఈ మూడూ అమృతప్రాయమైనవి. భైక్షము అంటే బిచ్చమెత్తి జీవించటం. భిక్ష ద్వారా సేకరించే ఆహారం ఒక బ్రాహ్మణ గృహస్థుకు మృతప్రాయమైనట్టిది. కృషి లేక కర్షణం అంటే వ్యవసాయం. ఇక్కడ కుల్లూకభట్టు వ్యవసాయాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించాడు - ‘కర్షణం చ భూమిగత ప్రచుర ప్రాణి మరణ నిమిత్తత్వాత్ బహు దుఃఖ ఫలకమ్ ‘ దీని భావం - వ్యవసాయంలో అంతర్భాగమైన భూమిని దున్నటం అనే చర్య కారణంగా భూమిలో ఉండే క్రిములు, కీటకాల వంటి క్షుద్రప్రాణులు మరణించటం వల్ల ఆ దుఃఖఫలం నేరుగా వ్యవసాయం చేసినవారికి అంటుతుంది. కనుక ఒక బ్రాహ్మణ గృహస్థుకు తాను స్వయంగా వ్యవసాయం లేక కృషి (దీనినే అనృతం అనీ అంటారు) చేసి పండించే ఆహారం ప్రమృతం - అంటే మరింతగా మృతప్రాయమైనట్టిది. ఒక బ్రాహ్మణ గృహస్థు వాణిజ్యం తాను స్వయంగా చేసినా లేక వేరొకరికి తన ధనాన్ని వడ్డీకి ఇచ్చి, ఆ ఆదాయం మీద జీవించినా దానిని సత్యానృతం అంటారు. బ్రాహ్మణ గృహస్థు ఇలా కూడా జీవించవచ్చు. సేవా వృత్తి మాత్రం బ్రాహ్మణుడికి నిషిద్ధం. మనువు సేవావృత్తిని శ్వవృత్తి (కుక్క బతుకు) అన్నాడు. సాధారణంగా సేవక వృత్తిలో యజమాని సేవకుడిని హీనంగా చూస్తాడు. యజమాని ఛీ కొట్టినా, పరుషపు మాటలు మాట్లాడినా సేవకుడు ఓర్పుగా సహించాల్సి ఉంటుంది. యజమాని చేయమని ఆజ్ఞాపించిన నీచపు పనులేవైనా సరే ఎదురుచెప్పకుండా చెయ్యాల్సి ఉంటుంది. అందుకే సేవావృత్తి బ్రాహ్మణ గృహస్థుకు నిషిద్ధమన్నాడు మనువు.

షట్కర్మలు

ఈ క్రింది ఆరింటినీ సాధారణంగా బ్రాహ్మణ గృహస్థులు చేయవలసిన షట్కర్మలుగా భావిస్తారు -

  1. యజనము (యజ్ఞములు చేయటం)
  2. యాజనము (యజ్ఞములు చేయించటం)
  3. అధ్యయనము (వేదశాస్త్రములు చదవటం)
  4. అధ్యాపనము (ఇతరులకు వేదశాస్త్రములు నేర్పటం)
  5. దానము (ఇతరులకు దానధర్మములు చేయటం)
  6. ప్రతిగ్రహము (ఇతరులనుంచి దానములను స్వీకరించటం)

వీటిలో యజనము, అధ్యయనము, దానము ఒక బ్రాహ్మణ గృహస్థు విధులు. యజనము అంటే యజ్ఞము. ప్రతి గృహస్థు రోజూ అగ్నిహోత్రం చేస్తూ, దర్శపూర్ణ మాసములు (దర్శము అంటే అమావాస్య రోజున, పూర్ణమాసము అంటే పౌర్ణమి రోజున చెయ్యాల్సిన ఇష్టులు అంటే యజ్ఞాలను దర్శపూర్ణ మాసములు అంటారు), ఆగ్రయణేష్టి వంటి రోజూ చేయాల్సిన యజ్ఞాలను తప్పక చెయ్యాలి.

బ్రాహ్మణ గృహస్థు రోజూ తప్పనిసరిగా వేదాధ్యయనం చేయాలి. దీనినే స్వాధ్యాయము అనికూడా అంటారు. ఒక బ్రాహ్మణ గృహస్థుకు స్వాధ్యాయము ఎంతో ముఖ్యమైన దైనిక విధి. కనుకనే పతంజలి మహర్షి తాను రూపొందించిన అష్టాంగ యోగ మార్గంలోని రోజువారీ పాటించవలసిన నియమాలలో శౌచము, సంతోషము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము లతో పాటు స్వాధ్యాయాన్ని కూడా చేర్చాడు. అలాగే తనకు కలిగినంతలో ఇతరులకు దానం చేయటం కూడా ప్రతి బ్రాహ్మణ గృహస్థు విధి.

ఇక పైన చెప్పిన షట్కర్మలు ఆరింటిలో మిగిలిన మూడూ ప్రతి బ్రాహ్మణ గృహస్థు యొక్క హక్కులు. యజ్ఞం ద్విజుల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల) లో ఎవరైనా చేయవచ్చు- అయితే యాజనము (యజ్ఞం చేయించటం) మాత్రం బ్రాహ్మణుడి హక్కు.

వేదాధ్యయనం ద్విజులలో ఎవరైనా చేయవచ్చు ; అయితే అధ్యాపనం (విద్య నేర్పటం) మాత్రం బ్రాహ్మణుడి హక్కు. అలాగే ద్విజులలో ఎవ్వరైనా దానం ఇవ్వవచ్చు; కానీ ప్రతిగ్రహం (దాన స్వీకరణ) మాత్రం బ్రాహ్మణుడి హక్కు. తమ విధులు సక్రమంగా నిర్వహించటంలో బ్రాహ్మణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనువు ఈ హక్కులు ఏర్పరచాడు. మొదట్లో తమనూ, తమ పరివారాలనూ పోషించుకొనడానికి ఈ హక్కులు ఎర్పరచబడినా క్రమంగా అవి బ్రాహ్మణ వర్గం యొక్క ఆదాయ వనరులుగా మారి వారికి మనువు కల్పించిన సమున్నత సామాజిక స్థాయికి తోడు ఆ వర్గం శతాబ్దాలుగా ఆర్థికంగా, రాజకీయంగా కూడా బలపడటానికి దారితీసింది.

అయితే కుల్లూకభట్టు మనుస్మృతికి తాను రాసిన వ్యాఖ్యలో షట్కర్మలను బ్రాహ్మణుడి హక్కులు, బాధ్యతలుగా కాక వాటిని ఒక బ్రాహ్మణుడు తన జీవనోపాధికి అనుసరించాల్సిన మార్గాలుగా వర్ణించాడు. ఆయన షట్కర్మల గురించి ఇలా పేర్కొన్నాడు -

‘ఋతాయాచితభైక్షకృషివాణిజ్యైః పంచభిః ‘తేన చై’ వేత్య నేనైవ చ శబ్ద సముచ్చితేన కుసీదేనేత్యేవం షడ్భిః కర్మభిః షట్కర్మా భవతి’

దీనిప్రకారం ఋతము (ఉంఛము, శిలము), అయాచితము (అడగకుండా లభించేది), భైక్షము(యాచించి తెచ్చే భిక్ష), కృషి (వ్యవసాయం), వాణిజ్యం - ఈ ఐదింటితోపాటు కుసీదము (వడ్డీ వ్యాపారం) - ఇవి ఆరింటినీ షట్కర్మలు అంటారు.

కుసీదము లేక వడ్డీ వ్యాపారాన్ని ‘వృద్ధి జీవిక’ అని కూడా అంటారు. మేధాతిథి తన వ్యాఖ్యలో షట్కర్మలను వేరే విధంగా వివరించాడు. ఉంఛము, శిలములతో కూడిన ఋతము (పరిగ ఏరటం - Gleaning of Corn), అయాచితం (Acceptance of gifts given unasked), భైక్షము (Begging), కృషి లేక కర్షణం లేక అనృతం (వ్యవసాయం - Agriculture), వాణిజ్యం (Trade), అధ్యాపనం (Teaching). ఎవరికీ చెందని ప్రదేశంలో రాలిన ధాన్యపు గింజలను ఏరుకొనటం (ఉంఛము), అలాంటి ప్రదేశంలోనే రాలిన ధాన్యపు కంకులను ఏరుకొనటం (శిలము) కాగా ఈ రెంటినీ కలిపి ఋతము (సత్యము) అని పేర్కొని, వ్యవసాయాన్ని మాత్రం మనువు అనృతము (అసత్యము) అనడంలో అర్థమేమిటో బోధపడదు. పరిగ ఏరుకోవటం ద్వారా మనచేతికొచ్ఛే పంట తక్షణం మనకి లభించేది కనుక అది సత్యమనీ, పొలంలో ధాన్యం విత్తి ఎన్నెన్నో ఇడుముల నడుమ ఆ పంట ఎప్పటికి చేతికొస్తుందో తెలియని స్థితి, ఒక్కోసారి క్రిమికీటకాలు, చీడపీడలు, ఈతిబాధలు, ప్రకృతి ఉత్పాతాల వల్ల అసలు పంట చేతికొస్తుందో లేదో నమ్మకంలేని స్థితి కారణంగా ఆయన వ్యవసాయాన్ని అనృతము (అసత్యము) అనివుంటాడా?? ఇది ఆలోచనీయం.

గృహస్థులలో నాలుగు తరహాలవారు ఉంటారని మనం ముందే చెప్పుకున్నాం. బహుపోష్య వర్గం కలిగిన గృహస్థు అంటే కుసూల ధాన్యకుడు (నిత్యనైమిత్తిక ధర్మకార్యాలు చేయడం కోసం, సేవకుల పోషణకోసం, గృహ నిర్వహణకోసం, పాడి పశువులు, ఇతర పెంపుడు జంతువుల పోషణ కోసం మూడు సంవత్సరాలకు సరిపడా తనవద్ద ధాన్యం నిల్వచేసుకునేవాడు) అనే గృహస్థు ఈ షట్కర్మలు (ఆరు రకాల జీవనోపాధి మార్గాలు) అవలంబిస్తూ జీవించవచ్చు. కుసూలధాన్యకుని కంటే తక్కువ పరివారం కలిగిన కుంభీధాన్యకుడు (ఒక సంవత్సరం అవసరాలకు సరిపడా మాత్రమే ధాన్యాన్ని నిల్వచేసుకునేవాడు) యాజనం (యజ్ఞాలు చేయించటం), అధ్యాపనం (ఇతరులకు విద్య నేర్పటం), ప్రతిగ్రహం (ఇతరులిచ్చే దానాలు స్వీకరించటం) అనే మూడు వృత్తుల (జీవనోపాధి మార్గాల) ద్వారా జీవించవచ్చు. కుంభీధాన్యకుని కంటే తక్కువ పరివారం కలిగిన త్య్రహైహికుడు(మూడు రోజుల పోషణావసరాలకు మాత్రమే సరిపడా ధాన్యము/ద్రవ్యము కలిగినవాడు) ప్రతిగ్రహం (వేరొకరినుంచి దానం స్వీకరించటం) నీచమైన కర్మ అని భావించి యాజనం, అధ్యాపనం అనే రెండు వృత్తులతో చేకూరే ఆదాయంతోనే జీవిస్తాడు. ఇంకా అంతకంటే తక్కువ పోషణబాధ్యతలు కలిగిన అశ్వస్తనికుడు (మరుసటి రోజు అవసరాలకు సరిపడా మాత్రమే ఆహారం కలిగినవాడు) అనే గృహస్థు కేవలం బ్రహ్మసత్రం (వేదాధ్యాపనం) మాత్రమే చేస్తూ జీవిస్తాడు. ప్రాచీన కాలంలో విద్య గరపడం కోసం విద్యార్థుల నుంచి అధ్యాపకుడు రుసుము వసూలు చేయడం నిషిద్ధం. శిష్యులు అప్పుడప్పుడూ అయాచితంగా తెచ్చి ఇచ్చే ఆహారపదార్థాలు, కాయగూరలతోనే గురుకులంలో గురువుతో సహా అందరూ తృప్తిగా జీవించేవారు. వంటకు అవసరమయ్యే వంటచెఱకు, యజ్ఞాలకు అవసరమయ్యే చిదుగులు మొదలైనవాటిని అంతేవాసులే (శిష్యులే) సమకూర్చేవారు. అనంతరకాలంలో పాలకులు గురుకులాల అవసరాలను గమనించి తగు ఏర్పాట్లు చేసేవారు.

***సశేషం***

Posted in April 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!