Menu Close
SirikonaKavithalu_pagetitle

లోకం -- గంగిశెట్టి ల.నా.

లోకమంటే ఎక్కడ?
ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడంలో
నేనెప్పుడూ విఫలమౌతూనే ఉన్నాను
చిన్నప్పుడు ఏం కంఠస్థం చేశానో
ఏమప్పచెప్పి మొదటి దర్జాకెక్కానో
ఏం గుర్తు రావటం లేదు...
లోకమంటే కంటిచూపు అని తెలిసినప్పటినుంచి
చూపుకానిన మేర లోకమని ఎరుకపడ్డప్పటి నుంచి
ఎన్ని జనపదాలను చూశానో, ఎన్ని గిరిపథాలను తిరిగానో
ఎన్ని ఎడారిబొమ్మల కన్నానో, ఎన్ని జంతుశాలల దర్శించానో
ఎన్ని సస్య శ్యామల క్షేత్రాల సేవించానో,
ఎన్ని పుణ్యతీర్థాల క్రుంకులు వేశానో
ఎన్ని దేశాల పొలిమేరలు, బహిరంతస్సంఘర్షణలు కనుగొన్నానో
చరిత్ర పొరలు తవ్వి తవ్వి ఉష్ట్రపక్షిలా తల దాచుకొన్నానో
లోకం కనుగొనడానికి నన్ను నేను
ఎంత ప్రయోగశాలగా మార్చుకొన్నానో....
కంటి లోపల చిట్లిపోయే నరాల సాక్షిగా చెబుతున్నాను
నా లోకం నాకు కనబడలేదు
కనబడుతున్నలోకం నాది కావడం లేదు...
బహిరంతరాల మధ్య, బహుఅంతరాలు మధ్య లోలకం తప్ప లోకమెక్కడ?
భవరూపం బాహిరమై, భావం ఆంతరమై
అవలోకితమంతా రెండుగా విడిపోతున్నది
బహిరంతర కలాపంలో మనిషిని నిత్యం
తప్పిస్తున్నది.....

లోకాలోకాల మీమాంసలో
తనకు తానెపుడూ తప్పిపోయే మనిషీ!!
మీ మాం సెందుకు? ఆ పూజా కర్పూరం చూడు!
పరిమళాన్ని బాహ్యానికి పంచుతూ
పదార్థంగా తానదృశ్యమౌతోంది
కళ్లెదుటరూపానికి కలుషహారిణియై కళ్యాణహారతి పడుతున్నది...
ఆలోచించి చూడు!
అంతరంగమే హారతి పళ్ళెం!
నువ్వే వెలిగే  కర్పూరం!!
నిర్మలకాంతివై నీరాజనమందించు!!
వెలుతుర్లో వెలుతురువై జీవించు...!!

కాదేదీ ఒంటరిది ... -- విశ్వర్షి వాసిలి
•1•
చెలీ,
చూడు గిరిప్రదక్షిణ చేస్తున్న
     ఆ నదీ ప్రవాహాలను
చూడు కడలికెరటా లవుతున్న
     ఆ నదీ నాదాలను
చూడు వాయులీన సరాలవుతున్న
     ఆ భావ లహరులను.
చూడు చూడు,
కాదేదీ ఒంటరిది ఈ జగతిన
నీదీ నాదీ దివ్యబంధమే ఈ ధరిత్రిన!

•2•

చెలీ,
చూడు గగనాన్ని చుంబిస్తున్న
     ఆ గిరిశిఖరాలను
చూడు కడలిన సహజీవనం చేస్తున్న
     ఆ తరంగాలను
చూడు ఆకులమాటున తలెత్తిన
     ఆ పువ్వులను
చూడు చూడు,
కాదేదీ ఒంటరిది ఈ జగతిన
నీదీ నాదీ దివ్యబంధమే ఈ ధరిత్రిన!

•3•

చెలీ,
చూడు వొదిగిన పూతతో పరవశమైన
      ఆ వంగిన కొమ్మను
చూడు మెడ సాచి ఆకలి తీరుస్తున్న
      ఆ గోమాతను
చూడు చెంగున అమ్మతనాన్ని నెమకిన
      ఆ అమ్మని
చూడు చూడు,
కాదేదీ ఒంటరిది ఈ జగతిన
నీదీ నాదీ దివ్యబంధమే ఈ ధరిత్రిన!

•4•

చెలీ,
చూడు మట్టిని స్పృశిస్తూ భరోసానిస్తున్న
     ఆ భానుకిరణాలను
చూడు నీటిచెలమలతో బాసలుచేస్తున్న
     ఆ చంద్రబింబాలను
చూడు అలలతో
     అలకలు తీర్చుకుంటున్న 
     ఆ ఇసుకరేణువులను
చూడు చూడు,
కాదేదీ ఒంటరిది ఈ జగతిన
నీదీ నాదీ దివ్యబంధమే ఈ ధరిత్రిన!
మరక జల్లెడ -- రాజేశ్వరి దివాకర్ల

గట్టి పట్టు తల నెరిసిన మనిషి
నెనపు గాయాలకు చెక్కు చెదరని మనిషి
స్నేహ కషాయాల
కైలాస ఓషధులను
కాచి వడబోసిన
కనికట్టు మరక జల్లెడ మనిషి
అనాయాస పయనాన
చుక్కల వీధికి ఠక్కున చేరి
విస్మయము గొలిపిన
శైవాగమ జోషి.

అష్టదిగ్గజముల
వరుస కన్నడకవులకు
వందనములను సల్పి
సరసకు తన రాక తెల్పిన
శూన్య సంపాదనా మనస్వి
సరస జోళదరాశి

శ్రీ కృష్ణ దేవరాయని
సాహితీ విభవమ్మును
ఆశు కైతల గంపకు
గుచ్చి ఎత్తిన గుత్తి
పద్య సంపుట స్ఫూర్తి

బ్రతుకు తపమునకు దక్కిన
స్వర్గానుభవ మంటపమున
సునీతా క్రమముల గురి
తప్పని గృహమేధి.
అనయ కుటుంబ సఖ్య
ప్రమోద మూర్తి

అతని కతడే సాటి
చంద్ర శేఖర రెడ్డి,
హృదయ గాత్రునికిది
చిరు నివాళి.

పూల కవిసమ్మేళనం -- బులుసు

పూల కవిసమ్మేళనం -సుగం
ధాల కవితా లాలనం
అవనిరంగం మీద ఆమని
అభినయించే కీర్తనం !!

చేదుమేసిన గొంతులో -మృదు
స్వాదు రాగాలాపనం
పూలవాకిలి ముందు మ్రోసే
భ్రమర వీణా వాదనం !!

పాల వెన్నెల ఏటిలో -తా
నాలు చేసే గాలి కన్నెల
ఊసులన్నీ మోసి తెచ్చే
ఉదయ సంధ్యా దర్శనం !!

వేల చుక్కల గగనసుందరి
వోలె మెరిసే మల్లె పందిరి
మౌనగీతాలేవొ పాడే
ప్రణయ రజనీ నర్తనం !!

ఊహలన్నీ పువ్వులౌ -రస
మోహజగతికి వందనం
హృది పరిమళించే చందనం
హొయ్, భువికి జారే నందనం !!
(బులుసు .రచనాకాలం..1987)

మౌనం శరణం గఛ్చామి -- స్వాతి శ్రీపాద

సగం సగం తొణికిన భావోద్వేగాలు
అప్పుడప్పుడు రాలి పడుతూ ఉంటాయి
ఒణికే చేతులు జారిమధుపాత్ర పగిలిన శకలాలుగానో
నడిరాత్రి జుట్టు జుట్టూ పట్టుకున్న చుక్కల ముక్కలుగానో
పక్కకు తప్పుకుని నడవాలి తప్ప
పదును దేరిన మాటలపై అడుగులు వేస్తే
గాయపడేది మరెవరో కాదు గదా!

నిద్రలోనూ మెలుకువలోనూ
సూర్య చంద్రులను పెరట్లో రాటకు
కట్టేసుకున్నట్టే ఉంటుంది.
స్వప్నసీమల్లోనే వెన్నెల మైదానాలూ
నీరెండ స్వర్గాలూ జలతారు పరదాలై
అలవోకగా కదులుతాయి
నిజానికి
పుష్యమాసపూ మంచుసూదుల్లా
దోమ కాట్లూ
రోహిణీ కార్తె అగ్నిపర్వతపు లావాలో సెగలూ
అవేకదా పలకరింత వెనక దాగిన మిన్నాగులు

అలసిపోయాను , పూర్తిగా
రంగులు లేకుండానే రోజు రోజూ చూసే నాటకాలకు
కలుపు మొక్కలైనా పిచ్చిపూలు పోస్తూ
కల్పవృక్షాలనుకునే గుడ్డి గవ్వల వాచాలతకు
గుండె గొంతుకలోకి వస్తుంది
నిలదీసి నిజాయితీని ప్రశ్నించమని
కాని
మాట్లాడాలనిలేదు
మౌనం శరణం గఛ్చామి.

Posted in April 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!