Menu Close
ఆలంబన
-- అనిల్ ప్రసాద్ లింగం --

జిల్లా SPగారి కార్యాలయంలో కొత్త కేసుల గురించిన చర్చ జరుగుతుంది. అన్ని ఫైల్స్ పరిశీలించి ఒక్కొక్క దానిపై ఆయన తన నిర్ణయాన్ని తెలియచేస్తున్నారు. కొంత ఆందోళనగా తన వంతు కోసం వేచి ఉన్నాడు SI శ్రీకాంత్. తాను దర్యాప్తు చేసే కేసుల విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించే శ్రీకాంత్ ఎప్పుడూ అన్ని విషయాల్లో అలెర్ట్ గానే ఉంటాడు. కానీ ప్రస్తుతం తాను ప్రస్తావించబోయేది తన ఉద్యోగ పరిధిలోనిది కాదు అలాగే తన బంధువులకు సంబంధించింది, అందుకే కొంచెం సంకోచం. తనను పిలిచిన వెంటనే లోనికి వెళ్ళి సెల్యూట్ చేసాడు.

"చెప్పవయ్యా, ఏంటీ కేసు?" అడిగారు SPగారు.

"సార్, గత సంవత్సరం మా బంధువొకరు ఆర్ధిక ఇబ్బందులతో ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంట్లోనే, ముందు తన భార్యకు ఉరి బిగించి, తరవాత తానూ అలాగే చనిపోయాడు. ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇది ఆత్మహత్యేనని మన వాళ్ళు నిరూపించి కేసు మూసేసారు. కానీ అతని ఇద్దరు పిల్లల ఆచూకీ ఆనాటినుంచీ తెలియడంలేదు సార్. మనవాళ్ళు కొన్ని రోజులు వెదికి వదిలేశారు. అతనే వాళ్ళనీ చంపేసి ఎక్కడైనా పడేసాడా లేక వేరే వాళ్ళెవరైనా ఆ చిన్నారులని ఏమైనా చేసుంటారా అనేది శేష ప్రశ్నగా మిగిలిపోయింది సార్." చెప్పుకు పోయాడు శ్రీకాంత్.

"మీ వాడు ఆత్మహత్యకు ముందు ఏమైనా ఉత్తరం రాయడం, సెల్ఫీ వీడియోలు పెట్టడం వంటివేమన్నా చేశాడా?"

"లేదు సార్. కానీ అతని చావు గురించి మాకెటువంటి అనుమానాలూ లేవు. పిల్లలేమయ్యారనేదే బంధువులకి ఆందోళన కలిగిస్తుంది. అందుకే నా పరిధి కాకపోయినా చొరవ చేసి అక్కడి SI సహకారంతో దర్యాప్తు చేసాను. అతని చివరి రెండునెలల కాల్ రికార్డ్స్ పరిశీలించి కొంతమంది అనుమానితులని గుర్తించాము. అందరూ వాళ్ళకి రావాల్సిన డబ్బులగురించి గొడవ పడినవారే - కొందరు మాటలతో బెదిరిస్తే ఇంకొందరు ఇంటిదాకొచ్చి చేయిచేసుకున్నారు. ఇలా ఒక పది పదిహేను మంది ఉన్నారు. కానీ వీళ్ళెవరూ పిల్లలగురించి తమకేమీ తెలియదంటున్నారు. అలాగే ఓ లేడీ వ్యవహారం కొంత అనుమానాస్పదంగా ఉందిసార్."

"ఎవరావిడ?" "హైదరాబాదులో ఒక స్వచ్చంధ సంస్థ నడుపుతుంది సార్. ఒక ఇంట్లో బీద పిల్లలను పోగుచేసి చదువు చెపుతూ ఉంటుంది. అలాగే అనాథలైన పిల్లలను కూడా చేరదీస్తుంటుంది. మా బంధువు తనతో మాట్లాడింది నిజమేనని ఒప్పుకుంది గానీ పిల్లల గురించి తనకేమీ తెలియదంటుంది. మరి దేనిగురించి వీళ్లిద్దరి మధ్య సంప్రదింపులు నడిచాయనేది తెలియడం లేదు. అప్పట్లో ఈవిడ మా వాడిని కలవడానికి రెండుసార్లు వాళ్ళూరు వచ్చినట్టు దాఖలాలున్నాయి. అలాగే దేశమంతటా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటుంది." అంటూ ఫైల్లోని ఓ ఫోటును తీసి చూపాడు.

"యూ మీన్ చైల్డ్ ట్రాఫికింగ్? ఇంతకు ముందు ఏమైనా కేసులున్నాయా?" పరిశీలనగా చూస్తూ అడిగాడు పై అధికారి.

"లేదుసార్. ఈమె వ్యవహారమే కాదు - కొంతమంది ఫైనాన్సు వ్యాపారులు కూడా డబ్బులు కోసం కిడ్నాపులు చేసిన వాళ్ళూ ఉన్నారు సార్, వాళ్ళందరిని కూడా దర్యాప్తు చెయ్యాలని మీ పర్మిషన్ కోసం ఫైల్ పుటప్ చేసానుసార్."

"యూ ఆర్ మేకింగ్ సీరియస్ ఆలిగేషన్స్ - సరిగ్గా ఆధారాలు సేకరించలేకపోతే కేసు వీగిపోతుంది. ముందు మీరు ఎవరెవరి మీద నిఘా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఊళ్ళోని స్థానిక PSలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే మీ టీంలో ఓ లేడీ ఆఫీసర్ను పెట్టుకోండి. అన్నింటికీ మించి మీ చుట్టాల కేసు అనే సింపతీతో కాకుండా నిష్పక్షపాతంగా నేరాన్ని ఋజువు చెయ్యాలనే తపనతో పని చెయ్యండి. ఆల్ ది బెస్ట్" అని చెయ్యి ముందుకుచాచాడు.

"థాంక్యూ సార్. తప్పక జాగ్రత్త వహిస్తాను" అని చెయ్యి కలిపి, సెలవు తీసుకుని బయలుదేరాడు శ్రీకాంత్.

&&&

ఆ ఇంటి ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. ఎవరెవరో అటూ ఇటూ తిరిగేస్తున్నారు కొంతమంది కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. వరండాలో కుటుంబమంతా కలసి ఉన్నా ఓ ఫోటోకు దండ వేసి టేబుల్ పైన పెట్టి, దాని ముందు అగరొత్తులూ, పూలు పెట్టివుంచారు. వచ్చిన వాళ్లలో కొందరు అక్కడికెళ్లి ఆ కుటుంబానికి నివాళులు అర్పిస్తున్నారు. గుండు చేయించుకొని ఉన్నాయన కిందకూర్చొని కర్మ కాండలు జరిపిస్తున్నారు. ఇంతలో కూర్చున్న వాళ్లలో ఓ మధ్య వయస్కురాలు లేచి ముందుకు వచ్చి, "ఏమవుతారండీ మీరు?" అని ప్రశ్నించింది.

"అన్ననమ్మా. ఏదైనా ఉంటే కాసేపు ఆగండి. కార్యక్రమం పూర్తయ్యాక మాట్లాడుకుందాం. స్థానిక కార్పొరేటర్ గారికి ఈ ఇల్లు అప్ప చెప్పాము. దీనిని అమ్మి ఆయనే అందరికీ సర్దుతానన్నాడు." సమాధానం ఇచ్చాడు పూజలో కూర్చున్నాయన.

"డబ్బుల గురించి కాదండీ. ఇంత ఘోరం ఎలా జరిగిందా అని?" కింద కూర్చొని అడిగింది.

"ఏముందీ, దొరికిన చోటల్లా అప్పులు చేసి చివరికి తీర్చలేక ఇంట్లోవాళ్లందరినీ చంపి తానూ పోయాడు మా తమ్ముడు. ఇప్పుడు వచ్చిన వాళ్లందరికీ సమాధానం చెప్పలేక మేము చస్తున్నాం. తప్పదని ఈ కర్మ మాత్రం మా ఇంటి వాళ్ళం చేస్తున్నాం." నిష్ఠురంగా చెప్పాడు అన్న.

"అంత అసహనం వద్దండీ. మహా అయితే ఇంకొన్ని రోజులు మీకీ జవాబు చెప్పే బాధ్యత తర్వాత ఎవరూ వాళ్ళ గురించి పట్టించుకోరు. అప్పుడు మీకు పోయినోళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అంతే కదా. కానీ మీరూ, మీ ఇతర కుటుంబ సభ్యులూ ఈ రోజు ఇక్కడ ఇంత బాధ్యతగా వచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారే మరి వాళ్ళు బ్రతికుండగా మీరందరూ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చెయ్యలేదా?" మళ్ళీ అడిగింది ఆమె.

"తాహతుకు మించి ఆకాశానికి నిచ్చెనలేసింది ఆయన. తెలీని వ్యాపారంలో వేలు పెట్టి, వడ్డీలు కట్టలేక మళ్ళీ వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి తిప్పుకోలేక చివరికి నా చెల్లినీ, మేనల్లున్నీ కూడా మింగేశాడు. నా చెల్లికేన్నోసార్లు చెప్పాను, గాల్లో మేడలు కట్టొద్దని. వింటేనా, ఆయన ఎలాగో లాక్కొస్తాడని నమ్మింది. చివరికి ఆయన చేతుల్లోనే..." ఏడుస్తూ ముందుకొచ్చాడు బావ. "ఎవరైనా ఎంతని సాయపడతామండీ? మాకూ సంసారాలున్నాయి కదా. ఉన్నంతలో సర్దుకోవాలిగానీ, ఎవరికెవరు ఈ రోజుల్లో?" అని చెప్పాడు.

"వందలూ, వేలూ కాదు, లక్షలకు లక్షలు అప్పుచేసాడు. ఈ ఇల్లు అమ్మినా మొత్తం తీరదు. మీకెంత రావాలో వెళ్లి కార్పొరేటర్ గారికి చెప్పండి. ఆయనే మీకు ఏదో ముట్టచెప్తాడు. మమ్మల్ని గద్దించి మీరు సాధించేది ఏమి లేదు" సోదరుడు ఈ సారి నిస్సహాయంగా చెప్పాడు.

"అయ్యో నాకు డబ్బులేమీ ఇవ్వాల్సింది లేదండీ. మొన్న పేపర్లో చూసాను ఈ సంఘటన గురించి. పాపం అన్నంలో విషంకలిపి పెళ్ళానికీ, పిల్లాడికీ తినిపించి తర్వాత తానూ తిని చనిపోయాడని. ఈ వేళ కర్మ అని తెలిసి ఆయన బంధుగణం ఎంతమంది ఉన్నారా చూద్దామని వచ్చాను. బాగానే వచ్చారు, అలాగే చాలా ఖర్చు పెట్టి ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు కూడా. కానీ ఇంతమందిలో ఎవ్వరూ ఆయనకి తన కుమారుడిని చూసుకోగలుగుతారనే భరోసా ఇవ్వలేకపోవడమే బాధాకరం. మీరు చెప్పింది నిజమండీ. తన చేతలకి తానే బలయ్యాడు, అర్ధాంగి కాబట్టి ఆమె కూడా కొంతవరకూ బాధ్యురాలే. కానీ పసివాడేమి పాపం చేసాడండీ? మీ అందరిలో ఎవరూ ఆ పిల్లాడికి ఓ ముద్ద పెట్టి, మీ ఇంట్లో కొంచెం చోటిచ్చి, పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకొగలరనే విశ్వాసం ఆ పోయిన మనిషికి కల్పించలేకపోయారే అందుకు సిగ్గు పడాలండీ మీరందరూ."

"చెప్తే నా చెల్లిని నా ఇంటికి తీసుకెళ్ళే వాడినే మేడం. ఉన్నంతలో నా మేనల్లుడిని కూడా బాగా చదివించే వాడినే. కానీ ఆ పిరికి వాడు ఇంత పని చేసాడు."

"ఆఁ..! పంపితే నాకు ఇంకో కొడుకనుకొని నా పిల్లలతో సమానంగా చూసుకొనే వాడినే నా తమ్ముడి కొడుకుని. అలాగే జీవితంలో అన్నింటిలో ముందుండేలా తీర్చిదిద్దేవాడిని. అదేమీ పెద్ద విషయం కాదమ్మా మాకు"

"పంపిస్తే చూసేవాళ్ళూ, చెబితే చేసేవాళ్లూ బయటవాళ్ళండీ. మన అనే వాళ్ళు చొరబడి ఆదుకోవాలి. ఈవేళ ఎవరు మిమ్మల్ని పిలిచారని వచ్చి ఇదంతా చేస్తున్నారు? అలాగే మేమున్నామని ముందుకొచ్చి కలబడి సాయం చెయ్యాలి. అదే రక్త సంబంధం - అప్పులు తీర్చడానికి కాదు కానీ ఆ ఇంటి ఆడవాళ్ళనీ, చిన్నపిల్లల్ని అక్కున చేర్చుకోడానికి. ఏ..? మీరంతా ఆ పిల్లాడి మొదటి పుట్టిన రోజు వేడుకకి వచ్చి బహుమతులిచ్చి ఆశీర్వదించి ఉంటారే, అంతే మొత్తం వెచ్చించి తనకి తిండి పెట్టలేరా? వాడు మీ ఇంటికొచ్చినప్పుడు వాడి బుడ్డి చేతుల్లో ఎంతో కొంత సొమ్ము పెట్టుంటారే, అదే డబ్బుతో వాడి తండ్రి పోయాక వాడికి బట్టలు కొనిపెట్ట లేరా? చివరికి పాడే మీదకి చేర్చాక నలుగురు ఇంటి పేరిటివాళ్ళని ముందుగా పైకి లేపమంటారే, అదే నలుగురూ తలో చెయ్యేసి ఓ పిల్లాడి భవిష్యత్తుకి దారి చూపలేరా? బంధుత్వంలోని బాధ్యతను గుర్తెరిగి చేయూతనివ్వలేరా" ఆవేశంగా చెప్పుకు పోతుందావిడా.

"ఎన్ననుకొని ఇప్పుడేమి లాభమమ్మా? జరగాల్సిన ఘోరం జరిగిపోయింది." ఓ పెద్దావిడ నిటూర్చింది.

"అవునమ్మా ఇక్కడ అయ్యిపోయింది. కానీ ఇంకెక్కడా జరగకూడదనేది నా తపన. మీ కుటుంబంలో మళ్ళీ అస్సలు కాకూడదు. మీరంతా ఒకరికొకరు నేనున్నా లేకున్నా నా వాళ్ళకి నా పరివార బలగం ఉందనే భరోసా ఇచ్చుకోవాలి. ఏ కారణంవల్లనన్నా మీకో ఇంకెవరికో ఆ నమ్మకం లేకుంటే మాత్రం మీకు సాయ పడటానికి మా సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది." అని చేతి సంచిలోంచి విజిటింగ్ కార్డులు తీసి అక్కడున్నవారందరికీ పంచడం మొదలు పెట్టింది ఆ మహిళ.

ఏంటీ గోలని అందరూ విసుక్కో సాగారు. "ఈవేళ ఇక్కడ ఓ తండ్రి తన కొడుకుని ఈ ప్రపంచంలో విడిచి వెళ్ళడానికి జంకి తనతో బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. మేము అటువంటి పరిస్థితులలో మీ బిడ్డల సంరక్షణ బాధ్యత తీసుకుంటాము. ఆ పిల్లాడిని లోకం మీదకి వదిలేస్తేనో, మీలో పిల్లలు లేనివారెవరికన్నా అప్పచెప్పితేనో, ఏ అనాధాశ్రమంలోనో చేరిస్తేనో వాడి బ్రతుకు వాడు బ్రతికేవాడు కదా. ఆలోచించండి. మా సంస్థ గురించి అందరికీ తెలియచేయండి. ముక్కుపచ్చలారని పసివాళ్ల ప్రాణాలు కాపాడండి." అందరి చేతుల్లోకీ తన విజిటింగ్ కార్డు అందేలా పంచి, చేతులెత్తి నమస్కరిస్తూ అక్కడినుంచి నిష్క్రమించిందావిడ. తన చేతిలోని కార్డుని జేబులో పెట్టుకుంటూ ఆవిడ వెళ్లిన వైపు తీక్షణంగా చూసాడు అక్కడే మఫ్టీలో ఉన్నా SI శ్రీకాంత్.

&&&

ఫోను మ్రోగింది. ఆమె "హలో ఎవరూ?" అనింది. అటునుంచి సమాధానం లేదు. కాల్ కట్ అయ్యింది. మళ్ళీ కొంత సేపటికి అదే నెంబరునుంచీ కాల్ వచ్చింది. ఈ సారీ అటునుంచి జవాబు లేదు. ఆమె తన పనిలో పడిపోయింది. మరుసటి రోజు మళ్ళీ అదే విధంగా జరిగింది. ఈ సారి ఆమె తిరిగి కాల్ చేసింది.

"నా పేరు అమోఘ. నేనో సంఘసేవకురాలిని, ఒక స్వచ్చంధ సంస్థ నిర్వహిస్తాను. మీ సమస్య ఎటువంటిదైనా నిస్సంకోచంగా నాకు చెప్పండి, నాకు చేతనైన సాయం చేస్తాను" అని చెప్పింది. అయినా అటునుంచి మాట రాలేదు. "మీరు మాట్లాడితేనే నేను మీకు సాయ పడగలిగేది. ఏ భయం వద్దు. నన్ను నమ్మండి."మళ్ళీ చెప్పింది. ఈ సారి అటునుంచి స్పందన వినిపించింది. "హలో... మీ కార్డు చూసి చేశాను. నేను చాలా అప్పుల్లో కూరుకుపోయాను. ఇంకా ఈదలేక పోతున్నా. అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నా" గద్గద గొంతు, ఒక్కో మాటా చాలా దుఃఖంతోనిండి ఉంది.

"అయ్యో. నేను చెప్పేది వినండి. తొందర పడకండి. మీ అప్పులు ఎంత ఉన్నాయో చెప్పండి. ఎవరైనా సాయం చేస్తారేమో చూద్దాం." వెంటనే చెప్పిందావిడ.

"డబ్బులు కాదు. నా ఒక్కగానొక్క కూతురు..." మాట పెగల లేదు.  "ఏం కాదు. తనని నాకప్పచెప్పండి. నేను చూసుకుంటాను. మీరు పిచ్చి పనులేమీ చెయ్యకండి"

"నిజమా మీరు చూసుకుంటారా? అది ఎక్కడున్నా బాగుండాలనేది నా కోరిక."

"తప్పకుండా బాగుంటుంది. మీరేమి దిగులుపడకండి. మీ వివరాలు చెప్పండి. నేనొచ్చి కలుస్తాను." అనునయంగా పలికి అతని వివరాలు రాబట్టింది.

"మాది కృష్ణాజిల్లా గుడివాడ. నేను వ్యాపారంలో దెబ్బతిన్నాను. నమ్మిన వారందరూ నన్ను మోసం చేసారు. నిండా మునిగి పోయాను. ఇంకా నాకు వేరే మార్గం లేదు. కానీ గారాబంగా పెంచుకున్న నా చిట్టితల్లిని ఏం చెయ్యాలో తెలీడం లేదండీ. నాతో తనను... " చెప్పలేక పోయాడు.

"వద్దొద్దు...  అటువంటి పనులేవీ చెయ్యకండి. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. నాకు అప్పచెప్పండి మీ పాపని నేను చూసుకుంటాను." నిశ్చయంగా చెప్పిందావిడ.

"అదే.. మాట్లాడాలి. ఏమి చేస్తారు మీరు నా బిడ్డని తీసుకెళ్లి?"

"ఎక్కడైనా అనాధాశ్రమంలో చేరుస్తాను. తనకు చదువు, ఉండటానికి అన్ని ఏర్పాట్లూ చేస్తాను."

"ఎక్కడా?"

"దేశంలో ఎక్కడైనా, మంచి ఆశ్రమంలో వేస్తాను. మీరు దిగులు పడొద్దు. నాకు అప్పచెప్పండి." అటు నుంచీ ఏడుపు ఆగడం లేదు. కొంత సేపటికి కాల్ కట్ అయ్యింది. కొన్ని రోజుల తరవాత, వచ్చి పిల్లని తీసుకెళ్ళమని అటునుంచి కబురొచ్చింది. ఆ ఊరికి బయలుదేరింది అమోఘ.

&&&

శ్రీకాంత్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. వళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఇంత కాలం ఎంతో ధైర్యంగా ఉన్నాడు. కానీ ఈ రోజు మాత్రం ఆందోళన చెందుతున్నాడు. అతని భార్య కూతుర్ని గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది.

"నేను 24 నాలుగ్గంటలూ వెంబడిస్తాను మేడం. మీరు ధైర్యంగా ఉండండి." లేడీ కానిస్టేబుల్ చెప్పింది.

"పాప ఒంటిమీది సెన్సార్లు చాలా ఆధునిక పరిజ్ఞానం కలిగి ఉన్నాయండీ, అవి మనకు నిరాటంకంగా సిగ్నల్స్ పంపిస్తాయి. సో..  పాప మిస్ అవ్వడం జరగదు." ఇంకో పోలీసు వివరించాడు.

"మీరెన్ని చెప్పినా పిల్లని పంపించడం నాకస్సలు ఇష్టం లేదు. ఎవరికోసమో కన్న కూతుర్ని ఒడ్డు తార ఎవరైనా? ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధపడేది? నేనేగా." ఏడుస్తూనే అంటుంది శ్రీకాంత్ భార్య.

"ఏమీ కానివ్వనే. నేనూ వెంటే ఉంటాను. నా టీం కూడా 24 గంటలూ పాప కదలికలమీద కన్ను వేసి ఉంచేలా ఏర్పాటు చేసాను. నువ్వు భయపడకు - నాకు కంగారుగా ఉంది. కొన్ని రోజులు ఓపిక పట్టు. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. లింకు దొరికితే చాలు పిల్లను తప్పించి తీసుకొచ్చేస్తాను." అని భార్యను సముదాయించి, తన కూతుర్ని దగ్గరకు తీసుకొని, "బేబీ నే చెప్పాగా, ఓ ఆంటీ నిన్ను వాళ్ళ ఊరు తీసుకెళ్లుతుందంట కొన్ని రోజులు. జాగ్రత్తగా వెళ్లి రామ్మా. మళ్ళీ నేను వచ్చి తీసుకొచ్చేస్తాను సరేనా. ఈ లోపు నువ్వు అస్సలు అల్లరి చెయ్యకూడదు. నేను చెప్పింది గుర్తుందిగా ఆ ఆంటీ చెప్పింది విను. అలాగే ఈ చేతి గాజూ, మెళ్ళో తాయత్తు, మొల త్రాడు ఎప్పుడూ తియ్యమాకే. ఏడవ కూడదు, డాడీ వచ్చి నిన్ను తీసుకొచ్చేస్తాడు సరేనా. "అంటూ పిల్లని ముద్దాడి, "అన్నీ చెక్ చేసుకున్నారా? సెన్సర్లూ, మైక్రో స్పీకర్లు బాగా పనిచేస్తున్నాయా? నా మాటలు వినిపిస్తున్నాయా? మీ మొబైల్ ఆప్స్ కి సిగ్నల్స్ అందుతున్నాయా? క్షణం కూడా దృష్టి మల్లకూడదు. నా కూతురు - చిన్న పిల్ల గుర్తు పెట్టుకోండి." గంభీరమైన స్వరంతో తన సిబ్బందికి సూచనలిచ్చాడు పోలీసు అధికారి.

"అంతా ఒకే సార్. షీ విల్ బి సేఫ్. ఆ ట్రాన్స్ మీటర్లలో చాలా పవర్ఫుల్ చిప్స్ నిక్షిప్తం చేసున్నాయి. మీ వాయిస్సు చాలా క్లియర్గా వినిపిస్తుంది. పాప కొంచెం చిన్నది కదా సార్, పోనీ మీ బాబుని పంపిస్తే?" సహోద్యోగి అడిగాడు.

"వాడికి కొంచెం ఊహ తెలుసు. గబుక్కున మా డాడీ పోలీసు అన్నాడంటే మన శ్రమ వృథా అయ్యిపోతుంది. జస్ట్ పాపని ఏమి చేస్తుందో, ఎవరికి అప్పగిస్తుందో తెలుసుకుంటే ఆ తర్వాత మనం ఆ గ్యాంగుని వెంటాడవచ్చు. మీరు మాత్రం నిరంతరం అలెర్ట్గా ఉండాలి. ఎప్పుడైనా పాపని స్పృహ తప్పేలా చేసి ఏదైనా చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అలాగే ఈ ట్రాన్సమీటర్లు మొబైల్ ఫోన్ సిగ్నల్స్కి ఆటంకం కాకూడదు. వాళ్ళకి ఏ అనుమానం రాకూడదు. అన్నీ పరిశీలించారుగా?" కొన్ని రోజులుగా పెంచుతున్నా గడ్డాన్ని నిమురుకుంటూ మళ్ళీ హెచ్చరించాడు.

"అంతా ఓకే సార్. యూ డోంట్ హావ్ టూ వర్రీ." బృందంలోని అందరూ గట్టిగా చెప్పారు.

&&&

రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫార్మ్ మీద అమోఘ అసహనంగా తిరుగుతుంది. అప్పటికే మధ్యహ్నం 12 కావొస్తుంది. వస్తానన్న వ్యక్తి ఇంకా రాలేదు ఫోన్ చేస్తే తియ్యడం లేదు. ఇక తిరిగెళ్లిపోదామని రైలు బండి కోసం చూస్తుంది. ఇంతలో ఒక నడివయస్కుడు, తన కూతుర్ని ఎత్తుకొని ఆమెని సమీపించాడు. తైల సంస్కారం లేని జుట్టు, గుబురు గడ్డం, నలిగిన చొక్కా, మాసిన ఫాంటు, దుమ్ము కొట్టుకుపోయిన చెప్పులూ చూడంగానే బ్రతికి చెడ్డా వాడని అర్ధమయ్యేలాగా తయారయ్యి వచ్చాడు శ్రీకాంత్.

"మీరేనా నాకు ఫోను చేసింది?" అక్కడక్కడా నెరిసిన జుట్టు, పెద్దరికాన్ని తెలిపే కళ్ళజోడు, నిండుగా కట్టుకున్నా చీర గౌరవం కలిగించేదిగా ఉండగా, భుజానికి తగిలించుకున్నా గుడ్డ సంచి ఆమె సమాజ సేవా కోణాన్ని ప్రస్ఫుటంగా తెలియచేసేలా ఉంది. తల ఊపాడు అతను పాపను క్రిందకు దించుతూ, "వ్యాపారంలో నష్టం వచ్చిందండీ. మళ్ళీ నిలదొక్కుకుని నేనేంటో నిరూపించుకుందామని కసిగా అప్పులు చేసి ప్రయత్నించి విఫలమయ్యాను. ఇంకా నా వల్ల కావడం లేదు. ఓడిపోయాను కానీ ఈ పసిదాన్ని ఒంటరిగా లోకంలో విడచి పెట్టలేక, నా చేతులతో నేనే దీన్ని ... " చెప్పలేకపోయాడు.

పిల్లని తన దగ్గరకు తీసుకుంటూ, "అర్ధం అయ్యిందండీ. మీరేం బాధ పడకండి. నేను చూసుకుంటాను." చెప్పింది అమోఘ.

"ఆ మధ్య పక్క ఊరిలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి మీరొచ్చి మీ విసిటింగ్ కార్డు పంచిపెట్టారు. అప్పటినుంచీ ఇదే ఆలోచన, ఈ పాపకు కూడా మీరు దారి చూపిస్తారని ఆశ. అలాగన్నా ఈ నా తల్లి కలకాలం సంతోషంగా వర్ధిల్లుతుందని."

"తప్పకుండా. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మీరుకూడా ఇంకా ఇంకా ప్రయత్నించండి. ఏదో ఓ దారి దొరక్కపోదు. ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు."

"అన్ని ప్రయత్నాలూ చేసాను మేడం. ఇంకేం మిగలలేదు. నా గురించి కాదు ఈ పిల్ల గురించే నా బాధంతా."

"ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కతేనా?"

"ఆఁ..! ఒక్కతేనండీ. దీన్ని కూడా నేను..." కసిగా చెప్పాడు అతను పాత్రలో ఒదిగిపోతూ.

"నేనున్నాగా, నేను చూసుకుంటాన్లెండి"

"కాదూ...  మీరేం చేస్తారండీ పిల్లల్ని తీసుకెళ్ళి?" అడిగేశాడు తండ్రి.

"ఎక్కడో ఒక అనాథాశ్రమంలో చేర్పిస్తానండీ. బిడ్డ భవిష్యత్తుకి భరోసా ఉండేలా చూస్తాను." మామూలుగానే చెప్పిందావిడ. "ఎక్కడి అనాథాశ్రమం అండీ? మీరు నడుపుతారా?"

"లేదండీ. నాకు తెలిసిన ఎక్కడైనా ఓ ఆశ్రమంలో చేరుస్తాను. మంచి సంస్థను చూసి చేర్పిస్తాను. మీరేం భయపడకండి."

"అది కాదండీ. ఆడపిల్లల్ని అమ్మేయడం లాంటి వార్తలు వింటుంటామని మా ఆడాళ్ళు భయపడుతున్నారు. అందుకని..."

"అయ్యో నేనలాటిదాన్ని కాదండీ. మంచి అనాధాశ్రమంలోనే వేస్తాను, నన్ను నమ్మండి. ఈ మధ్యనిలా వివిథ కారణాలతో ఊపిరి తీసుకోవడం, తోడుగా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుపోవడం చూసి నాకు బాధేసిందండీ. అందుకే ఒక్క ప్రాణానైనా కాపాడాలనే ఉదేశ్యంతోనే ఇలా ఊరూరా తిరుగుతూ నా కార్డులు పంచుతుంటాను. మీలాటి పెద్దలు లోకం చూసేశారు. కానీ ఇలాటి పిల్లలు ఇంకా అసలు ఏమీ చూడకుండానే, కనీసం ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండానే, మీరు తినిపించినవి తిని మీతో పాటే అసువులు బాస్తున్నారు. ఈ విశాల ప్రపంచంలో ఇంత చిన్న పిల్ల బ్రతకడానికి చోటే దొరకదా? ఓ రైలెక్కించేస్తే ఎక్కడికో పోయి ఏదోలాగా తన పొట్ట పోసుకుని బ్రతుకీడ్చలేదా? లోకంలో ఎవరో ఒకరు చేరతియ్యక పోతారా అని ఎందుకు ఆలోచించరు? ఏమో వాళ్ళ తలరాత ఎలా రాసాడో దేవుడు. అయినా ఇంటి పెద్దవాళ్ళకి సహజ మరణం కలిగితే అప్పుడు ఆ పిల్లలు బ్రతకడం లేదా? పెద్దయి వాళ్ళెంత గొప్ప వాళ్ళు కాగల్గుతారోనని ఎందుకు యోచించరు? వాళ్ళ బ్రతుకు బాటకి నేను ఆలంబనగా నిలచి దారి చూపిస్తాను. ఆ పైన వాళ్ళ అదృష్టం. ఇప్పుడు మీ కష్టాలన్నీ తీరడానికి నేను లక్షలు సాయం చెయ్యలేనుగానీ ఈ పసిదానికి పిడికెడు అన్నం, ఉండడానికి చోటు, మంచి చదువు చెప్పించే ఏర్పాటు మాత్రం చెయ్యగలను. దానితో ఈమె జీవితం బాగుంటుంది. మీ ఆశీర్వాదంతో తానూ వృద్ధిలోకొచ్చి ఓ మంచి మనిషిగా ఎదిగి మరికొంతమందికి ఆదరువవుతుంది. వయసుకొచ్చాక తానూ తన మంచీ చెడూ తెలుసుకొనే విచక్షణ తెలిసాక తన భవిష్యత్తుని వెదుక్కుంటుంది. వదిలెయ్యండి తన త్రోవ తనని పోనివ్వండి. బ్రతికిపోతుంది." వివరంగా చెప్పింది ఆమె. ఈ సారి నిజంగానే కన్నీళ్ళు వచ్చేసాయి అతనికి.

"మీరూ పోరాడండి. ఆత్మహత్య మాహా పాపం." మధ్యలోనే అందుకున్నాడు శ్రీకాంతు, "ఇలాటివి చాలా విన్నాను మేడం. పడిపోతే ఇంకా లోతుకు తొక్కేసేవాళ్ళేతప్ప చేయూతనిచ్చి లేపి నిలపెట్టేవాళ్ళు లేరీ లోకంలో. మీరేంటీ ప్రాణాలు తీసుకునేవాళ్లంతా కష్టం కలగ్గానే దేనికో ఉరేసుకుని వేలాడతారనుకుంటున్నారా? ఎన్నో విధాల ప్రయత్నాలు చేసి, చిట్ట చివరిగా మాత్రమే అంతకు తెగిస్తారు. మీరిందాకా అన్నారే బిడ్డలకు ఏదో తినిపించి చంపేస్తారని, అల్లారు ముద్దుగా పెంచుకున్నా పిల్లలకు, తాళి కట్టిన పెళ్ళానికీ నమ్మించి విషం కలిపిన పదార్ధాలు పెట్టడం ఎంత కష్టమో తెల్సా మీకు? ఎన్ని సార్లు ప్రయత్నించినా నా వల్ల కాలేదు. కానీ ఈ సమాజం నా కుటుంబ సభ్యులను చూసే చిన్న చూపు, వాళ్ళూ వీళ్ళూ చేసే అవహేళనతో ఏదో రోజు నేనూ  తెగించేస్తాను. ఇంకా అవసరమా ఈ బ్రతుకు అనిపిస్తే ఒక్క క్షణం మేడం అంతే ఒకే ఒక్క క్షణం.. ఫినిష్. ఈ అప్పుల ఊబి నుండి బయటపడి, అవమానాల పరంపరకు చరమగీతం పాడేస్తాను." ఆవేశంగా తానూ తయారు చేసుకున్నా డైలాగులు అప్ప చెప్పేసాడు. మారు మాట్లాడ లేదు విన్నావిడ.

"మీరు చెప్పిందీ నిజమే. దీని జాతకంలో ఏం రాసివుందో. ఇంత కాలం కాలు కింద పెట్టకుండా, కోరిందల్లా తెచ్చిపెట్టి, నెత్తిన పెట్టుకు చూసుకున్నాను. ఇకపై ఎలా రాసుంటే అలా జరుగుతుంది. తీసుకెళ్లండి. ఈ తాయత్తు వాళ్ళమ్మ కట్టిన రక్ష, ఇది మాత్రం మెళ్ళో ఉండనియ్యండి." అని పాపని దగ్గరకు తీసుకొని రోదించాడు. కాసేపు వారినలా వదిలేసి, రైలు వస్తుందనే ప్రకటన రాగానే, తన బాగులోనుంచి కొన్ని కాగితాలు తీసింది అమోఘ. అవి పాపను ఎక్కడన్నా చేర్చడానికి అవసరమవుతాయని, ముందు ముందూ ఏ ఇబ్బందీ కలగకుండా, తండ్రినుంచీ అంగీకార పత్రమని తెలిపింది. ఓ సారి చదివి చూసుకొని సంతకం పెట్టాడు శ్రీకాంత్.

"మీరు మనసు మార్చుకొంటే నన్నేప్పుడైనా సంప్రదించవచ్చు. మీ పిల్లని మీకు అప్పచెప్తాను. అదీ కాక, ANR, NTRలు ఇదే గుడివాడ స్టేషన్ నుంచి బయలుదేరి ప్రపంచ ప్రఖ్యాతినొందారు - ఏమో మీ పాప కూడా అలా చరిత్రలో నిలచిపోతుందేమో" పాపని తీసుకుంటూ ధైర్యం చెప్పింది ఆవిడ. రైలు బండి వచ్చి ఆగాక, తండ్రి పిల్లని ఎత్తుకొని మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు చెప్పి ఎక్కించాడు. నిజంగానే వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకుంటూ తన బృందంకూడా ఎక్కారని నిర్ధారించుకొని, బరువెక్కిన గుండెతో బాధ్యతనెరిగి వెనుతిరిగాడు ఆ పోలీసు అధికారి.

&&&

రెండురోజులు తన ఇంటనే పిల్లను పెట్టుకున్నామె, మూడవ రోజు తనని తీసుకొని  రైల్లో బయలుదేరింది. మళ్ళీ రైలెక్కాక 'అమ్మ కావాలంటూ' మారం చేసింది పాపాయి. ఏదో చెప్పి తనను ఊరడిస్తూ ప్రయాణం కొనసాగించింది. వెన్నంటే కాపు కాస్తున్నా పోలీసు బృందం కూడా వారిని వెంటాడుతూ వెళ్ళింది. కోల్ కత్తాలోని ఒక ఆశ్రమంలో పిల్లని చేర్చి, వెనుతిరిగిన ఆమెను రైలులోనే అరెస్టు చేశారు పోలీసులు. వెనుక పాపను తీసుకొని మరో బృందం తిరిగొచ్చింది. రెండో రోజు జిల్లా SPగారి కార్యాలయంలో విచారణ ప్రారంభమైయింది.

&&&

తర్వాతి రోజు హైద్రాబాదు నుంచి ఒక పోలీసు ఉన్నతాధికారి వచ్చాడు. "ఇంత ఆపరేషన్ చేస్తున్నప్పుడు లోకల్ పోలీసులకి చెప్పాలి కాదయ్యా" రావడంతోనే శ్రీకాంతుని నిందించాడు ఆయన. "చెప్పాం సార్, ఆమె మీద నిఘా పెడుతున్నామని స్థానిక PSలో లెటర్ ఇచ్చాము." వివరణ ఇచ్చాడు అతను.

"ఏమో మీరేం ఇచ్చారో, మా వాళ్ళకేం అర్దమైయిందో. సరేగానీ మేడం గురించి మాకంతా తెలుసు. మీరనుకున్నట్టు ఆవిడ పిల్లల్ని తీసుకెళ్లి అమ్ముకునే ముఠా కాదు. ఏ పరిస్థితుల వల్లనైనా ఎవరైనా ఆత్మహత్యా ఆలోచనలు చేస్తే వాళ్ళకు కౌన్సెలింగ్ చెయ్యడానికి ఒక హెల్ప్ లైను నడుపుతుంది. అలాగే కొంతమంది తమ పిల్లల్ని కూడా తమతోపాటు చంపుకోవడం చూసి ఆ వైపు నుంచీ ప్రాణాలు కాపాడే ప్రయత్నం మొదలుపెట్టారు. మీరు మా PSలో లెటర్ ఇచ్చినట్టు, ఆవిడా తన దృష్టికొచ్చిన డిస్ట్రస్ కేసుల గురించి ఆఊరి పోలీసులకీ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖకీ తెలియచేస్తుంది. మీరు ఈ కేసులో బాగా ఇన్వాల్వ్ అయ్యి మీ స్టేషన్ కొచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకొని ఉండరు. గుడివాడ పోలీసులకి చెప్పారా అమ్మా?" ఎదురుగా ఉన్నా అమోఘని అడిగాడు అధికారి.

"హా.. నేనే స్వయంగా వెళ్లి పేరూ, ఫోన్ నెంబర్లతో రిపోర్ట్ ఇచ్చానండీ. ఆ తరవాతే ఈయన్ని కలిసాను. అలాగే నేను కలిసే అందరి వివరాలూ, నాకు అప్పచెప్పిన పిల్లల గురించిన సమాచారమంతా - వాళ్ళ వయసు, నేను తీసుకెళ్లి ఏ అనాధాశ్రమంలో చేర్పించాను వంటి సమాచారమంతా ఎప్పటికప్పుడు ప్రభుత్వ, పోలీసు శాఖలకు దఖలు చేస్తాను. మీ చుట్టాల పిల్లల గురించి కూడా నేను చెప్పగలను కానీ చాలా మంది పిల్లల వివరాలు తెలుసుకొని వెళ్లి అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేసి చేతులు దులుపుకొని వచ్చేస్తారు. తల్లితండ్రుల్ని అప్పుడప్పుడే మరిచి ఆ ఒంటరి జీవితాలకి అలవాటు పడుతున్నా పసివాళ్ళకి తమ వారు కనపడితే మళ్ళీ మనసు పాడైపోతుంది. పోనీ వెళ్లిన వాళ్ళు తమతో తీసుకొచ్చుకుంటారా అంటే అదీ ఉండదు. అటువంటప్పుడు ఎందుకు లేని పోనీ టెన్షన్లని నేను చెప్పడం మానేసాను. మీరు పోలీసని అప్పుడే చెప్పితే మీరు కోరిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందించేదాన్ని. ఇప్పటికైనా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండీ, ఒక కేసుగానే దర్యాప్తు చేశారుగానీ - మీరు గానీ, మీ బంధుగణంలో ఎవరైనా ఆ పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకుంటారా? చెప్పండి, వెళ్లి వెనక్కి తెచ్చేద్దాం." సవివరంగా చెప్పింది ఆవిడ. బదులివ్వలేక పోయాడు బంధువు.

"సార్ చెప్పినట్టు నా దృష్టికొచ్చి ఇబ్బందులు పడుతున్నా వ్యక్తులను కలిసి కాస్త మనోధైర్యం ఇచ్చి జీవితం చిన్నాభిన్నం చేసుకోవద్దని నాకు తోచిన రీతిలో సలహాలిస్తాను. ఆ రోజు మీకూ చాలానే చెప్పాను. కానీ ఎవరి పరిస్థితులు వాళ్ళయి. విసిగిపోయిన కొందరు మనం ఎన్ని చెప్పినా అర్దాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తమతో పాటు కుటుంబం మొత్తాన్నీ బలి చేస్తున్నారు. అటువంటి వారి పిల్లలనైనా కాపాడాలని ఇలా ప్రయత్నిస్తున్నాను. అలాగని ఆ పెద్ద వాళ్ళని వదిలెయ్యడంలేదు. మాకు చేతనైన విధంగా చేయూత నిచ్చే కార్యక్రమం చేస్తాము. కానీ మీకు తెలుసుకదా పెద్ద వాళ్ళు ఏదో విధంగా తాము అనుకున్నది సాధించుకుంటారు. బయటకెక్కడికో వెళ్ళి ఏదో పుణ్యక్షేత్రంలో, ఎక్కడో లాడ్జిలో ఏదో తినుబండారాలలో విషం కలుపుకొని సేవించి, ఏ చెట్టుకో వేలాడి, తమ వాహనాన్ని ప్రమాదానికి గురిచేసి ఇలా ఏదో విధంగా తామనుకున్నది సాధిందుకుంటారు. అందుకే వారి పిల్లల్ని వారి నుంచి వేరు చేసి రక్షించే ప్రయత్నం చేస్తున్నాను." ఆవిడ చెప్పింది విని, "మిమ్మల్నీ, మీ ప్రయత్నాన్నీ తప్పుగా అర్ధం చేసుకున్నాను. మన్నించండి. ఇకపై ప్రాణాలు కాపాడే పనిలో మీకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది." అని అభినందన పూర్వకంగా నమస్కారం చేసి చెప్పాడు శ్రీకాంత్.

*** సమాప్తం ***

Posted in April 2022, కథలు

1 Comment

  1. Anil అట్లూరి

    మామూలుగా అయితే ఆమోఘ చైల్డ్ trafficking చేస్తోందని అరెస్టు చేసి కథ ముగించేయడం ఒక పద్దతి.
    కానీ ఈ కథలో అది జరగలేదు. ఆమోఘ నిజంగానే సంఘ సేవిక. మలుపులు లేకుండా సాగిన కథ.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!