Menu Close
చేసుకున్నవాడికి చేసుకున్నంత..!
(పన్నెండు సామెతలతో ఒక కథ)
-- G.S.S.కళ్యాణి --

కొండయ్య, దానయ్యలు ఒకే ఊరివాళ్ళూ ఒకే వయసువాళ్ళూనూ. ఇద్దరూ ఒకే బడిలో చదువుకునే రోజుల్లో వారి భావనలూ, ఆలోచనలూ కలవడంతో బాల్యంలోనే వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. అయితే ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్లకు చదువుపై శ్రద్ధ బాగా తగ్గిపోయింది! దాంతో కొండయ్య, దానయ్యలు అనవసరమైన వ్యవహారాలతో కాలం వృధా చెయ్యసాగారు. అది గమనించిన వారి తల్లిదండ్రులు, 'మొక్కై వంగనిది మానై వంగదు!' అన్న ఉద్దేశంతో వారిని సరైన మార్గంలో పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి!

కళ్ళ ముందు తమ ఊరి పిల్లలు తమ భవిష్యత్తును పాడుచేసుకుంటూ ఉంటే చూసి ఓర్వలేని కొందరు ఊరి పెద్దలు, కొండయ్య, దానయ్యలను పిలిచి, “ఒరేయ్ పిల్లలూ! 'విద్య లేనివాడు వింత పశువు!' అని అంటుందీ లోకం! మీరిద్దరూ చక్కగా చదువుకుని బాగుపడండర్రా!”, అని నీతులు చెప్తూ ఉండేవారు. కానీ కొండయ్య, దానయ్యలు ఆ మాటలేవీ పట్టించుకోకపోవడంతో ఆ పెద్దల పరిస్థితి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉండేది!

ఏళ్ళు గడిచాయి. కొండయ్య, దానయ్యలకు యుక్త వయసు వచ్చింది. వాళ్ళని ఏదో ఒక పనిలో చేరి ప్రయోజకులు కమ్మని ఇంట్లోవాళ్ళు పోరు పెట్టడంతో తమకు ఇష్టం లేకపోయినా ఉద్యోగప్రయత్నాలు మొదలుపెట్టారు కొండయ్య, దానయ్యలు. కానీ వాళ్ళ తీరు ఆ ఊళ్ళో అందరికీ బాగా తెలిసి ఉండటంతో వారికి ఉద్యోగం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో కొండయ్య, దానయ్యలకు ఏ పనీ-పాటా లేకుండాపోయింది. చేసేదిలేక తమ ఊరి చివరనున్న చెరువు గట్టుపై కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ రోజులు వెళ్లదీయటం అలవాటు చేసుకున్నారు కొండయ్య, దానయ్యలు. వాళ్ళ ముచ్చట్లు చాలావరకూ కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాల గురించే ఉండేవి!

ఒక రోజు కొండయ్య, దానయ్యలు చెరువు గట్టుపై కూర్చుని ఉండగా ఒక పండితుడు పల్లకిలో వెడుతూ వారికి కనిపించాడు. ఆ పండితుడితోపాటు ఒక భోషాణంలాంటి పెద్ద పెట్టె కూడా ఉంది. అందులో ఆ పండితుడికి రాజుగారు ఇచ్చిన ధనమూ, కానుకలూ, వస్త్రాల వంటి విలువైన వస్తువులు ఉన్నాయి. వాటికి రక్షణగా ఉండేందుకు ఆ పండితుడి వెంట కొందరు రాజభటులు కూడా ఉన్నారు. ఆ దృశ్యం చూసిన కొండయ్య, దానయ్యలకు ఆ పండితుడి సొమ్మును దొంగిలించాలన్న దుర్బుద్ధి పుట్టింది! మర్నాడు వాళ్ళు ఆ పండితుడి ఇల్లు ఎక్కడుందో కనుక్కుని ఆ రాత్రికి ఆ పండితుడి ఇంటికి కన్నం వెయ్యాలని నిర్ణయించుకున్నారు!

"మనం అనుకున్న పని పూర్తయితే ఆ సొమ్ములో నా వాటాతో నేను ఇక్కడినుంచీ ఎక్కడికైనా దూరప్రాంతానికి వెళ్ళిపోయి, అక్కడ ఒక పెద్ద భవంతి కొనుక్కుని దానికి 'స్వర్గం' అని పేరు పెడతానురా!", అన్నాడు దానయ్య.

అది విని కొండయ్య, "నీ మొహం! ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అంటే అదే! అసలే ఇది మనం చెయ్యబోతున్న మొదటి దొంగతనం! మనం ఎవ్వరికీ పట్టుబడిపోకుండా ఎంతో కొంత సొమ్ము తీసుకుని జాగ్రత్తగా బయటపడితే అదే పదివేలు!", అన్నాడు.

"నిజమేరోయ్!", అన్నాడు దానయ్య.

ఆ రాత్రి తాము అనుకున్న ప్రకారం కొండయ్య, దానయ్యలు పండితుడి ఇంటికి చేరుకున్నారు. పండితుడి ఇల్లు చాలా పెద్దది. తన పాండిత్యంతో బోలెడు ధనాన్ని సంపాదించిన ఆ పండితుడు, రక్షణ కోసం ఇంటికి నాలుగు పక్కలా ఎతైన ప్రహరీ గోడలను కట్టించాడు. ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఒక మార్గం ఉంది. కానీ దానికున్న తలుపుకు లోపలినుండీ ఒక పెద్ద తాళం వేసి ఉంది. ఇంట్లోకి ప్రవేశించడానికి గోడను దూకటం ఒక్కటే తమకున్న మార్గమని అనుకున్నారు కొండయ్య, దానయ్యలు. వారికి ఆ పని కొత్త కావడటంతో ఒకరి మీదకొకరు ఎక్కి, నానాతిప్పలూ పడి, ఒళ్ళంతా గాయాలు చేసుకుని, ఎట్టకేలకు గోడను దూకగలిగారు. అలా చెయ్యటంలో దానయ్య మోకాళ్ళు రెండూ చెక్కుకుపోయి రక్తాలు కారాయి!

“ఇక నా వల్ల కాదురా బాబూ! లోపలికి నువ్వొక్కడివే వెళ్ళు! నేనిక్కడే కూర్చుంటా!!', అంటూ తను దిగిన చోటే కూలబడిపోయాడు దానయ్య.

“అదేవిట్రా? అలా అంటావ్?? ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే మొత్తం సొమ్ము నేనే తీసేసుకుంటా! నీకు అందులో వాటా ఇవ్వను!", అన్నాడు కొండయ్య చిరాకుగా.

"అయ్యో! అలా అనకురా! ఇదిగో! నేను కూడా వస్తున్నా!", అంటూ ఎలాగో కష్టపడి లేచి కొండయ్యను అనుసరించాడు దానయ్య.

కొండయ్య తన వెంట తెచ్చుకున్న పరికరంతో ఇంటి తలుపును సులువుగా తెరిచాడు. ఆ సమయానికి పండితుడు, ప్రయాణ బడలికవల్ల కలిగిన అలసటతో గాఢనిద్రలో ఉన్నాడు. కొండయ్య, దానయ్యలు చప్పుడు చెయ్యకుండా పండితుడి ఇల్లంతా ధనంకోసం గాలించారు. ఆఖరికి ఒక గదిలో వారికి భోషాణం కనపడింది! అందులో నగలూ, ధనమూ, ఖరీదైన బట్టలూ ఉన్నాయి. దానయ్య అమితానందంతో తన వెంట తెచ్చుకున్న సంచీలో వాటిని సద్దుకోవడం మొదలుపెట్టాడు. కొండయ్య సంచీని తెచ్చుకోవడం మర్చిపోవడంతో తన వాటాను కూడా దానయ్య సంచిలోనే పెట్టమన్నాడు.

అంతలో ఏదో అలికిడి కావడంతో, "ఒరేయ్ దానయ్యా! త్వరగా కానీరా! ఆలస్యం అమృతం విషం అన్నారు కదా! ఇక్కడ మనం ఎక్కువ సేపు ఉంటే తేలిగ్గా దొరికిపోతాం!", అని దానయ్యను కంగారు పెట్టాడు కొండయ్య.

దానయ్య సంచీని సొమ్ములతో పూర్తిగా నింపి మూట కట్టి దాన్ని తన భుజాన వేసుకున్నాడు. అసలే కాళ్ళకి గాయాలున్నాయేమో సంచీ దానయ్యకి చాలా బరువుగా అనిపించింది. త్వరగా అక్కడినుండి వెళ్లిపోవాలని కొండయ్య, దానయ్యలు ప్రహరీ గోడ వద్దకు చేరుకున్నారు. కొండయ్య తాడు సహాయంతో ప్రహరీని గబగబా ఎక్కి అవతలకు దిగేసి దానయ్యను రమ్మని కేక వేశాడు. తన కాళ్లకున్న గాయాలతో, బరువైన సంచిని మోసుకుంటూ ఆ ఎతైన ప్రహరీ గోడను ఎలా దూకాలో అంతుపట్టలేదు దానయ్యకు.

కొద్దినిమిషాలు గడిచాక, “ఒరేయ్ దానయ్యా! ఏం చేస్తున్నావురా? త్వరగా రా!", అంటూ మళ్ళీ కేకవేశాడు కొండయ్య.

"వస్తున్నారా!", అంటూ కాసేపటి తర్వాత దానయ్య తాడు పట్టుకుని గోడ ఇవతలకు దిగాడు.

"ఇక పారిపోదాం పద!", అన్నాడు కొండయ్య.

"ఒక్క నిమిషం ఆగి అటు చూడు!", అన్నాడు దానయ్య.

ప్రహరీ వైపుకి చూసిన కొండయ్యకు ఆ ప్రహరీ గోడను దిగుతూ మరొక వ్యక్తి కనిపించాడు.

"వీడెవడురా? పానకంలో పుడక లాగా?? పరిగెడదాం పద!!", అన్నాడు కొండయ్య కంగారుగా.

"ఆగరా! వాడు కూడా మనలాగే దొంగ! ఇందాక నా మూట బరువుగా ఉందని కాస్త సాయం చెయ్యమంటే చేశాడు!", అన్నాడు దానయ్య ధీమాగా.

"మరదే! అంబలి తాగే వాడికి మీసాలెత్తే వాడొకడని మనం చేసేదే పిచ్చి పని! దాంట్లో నీకు సాయం కావాల్సొచ్చిందా?", అన్నాడు కొండయ్య కోపంగా.

అంతలో ఆ వ్యక్తి కొండయ్య, దానయ్యల వద్దకు వచ్చి, "నా పేరు అంజి! ఇది మీ మొదటి దొంగతనం అనుకుంటా? అందుకే కాస్త కంగారుగా కనపడుతున్నారు!”, అన్నాడు.

అందుకు దానయ్య తడబడుతూ, "అబ్బే! లేదే!! మేము దొంగతనాల్లో ఆరితేరిన వాళ్ళం! ఇది మా వందో దొంగతనం! తెలుసా?", అన్నాడు.

అప్పుడు అంజి పళ్ళు కొరుకుతూ, "దొంగ వెధవల్లారా! ఎన్నో రోజులుగా ఈ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తున్నవాళ్ళకోసం మేం తెగ వెతుకున్నాం! ఇన్నాళ్టికి దొరికారన్నమాట! నేను మీలాంటి దొంగను కాదురా! మారువేషంలో ఉన్న రక్షక భటుడిని! పదండి రాజుగారి దగ్గరకి!", అంటూ మరికొంత మంది రక్షకభటులను పిలిచి కొండయ్య, దానయ్యల చేతులను వెనక్కి విరిచి కట్టి, వాళ్ళని ఎడ్లబండిలోకి ఎక్కించాడు.

"ఒరేయ్ దానయ్యా! నువ్వు అనవసరంగా మన గురించి వాడికి లేనిపోని గొప్పలు చెప్పబోయావ్! ఇప్పుడు చూడు ఏమైందో! అందుకే అంటారు 'అనువుగాని చోట అధికులమనరాదని'!", అన్నాడు కొండయ్య దుఃఖంతో.

కొండయ్య మాటలు విన్న దానయ్య అంజితో, "బాబ్బాబు! ఇందాకేదో ఉత్తినే అలా చెప్పాను! నిజానికి ఇది మా మొట్టమొదటి దొంగతనం! మేము కాజేసిన సొమ్మును మీరు తీసేసుకుని మమ్మల్ని విడిచిపెట్టెయ్యండి! ఇకపై బుద్ధిగా బతుకుతాం!", అన్నాడు!

"అదేం కుదరదు! కాలు జారితే తీసుకోగలము కానీ నోరు జారితే తీసుకోగలమా? నువ్వెన్ని చెప్పినా నానుండీ తప్పించుకోలేవు!", అన్నాడు అంజి.

"ఆమ్మో! ఇప్పుడు ఆ రాజుగారు మాకు ఏ శిక్ష వేస్తారో ఏమో!", అన్నాడు దానయ్య దిగులుగా.

"రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా?", అన్నాడు కొండయ్య భయంతో వణికిపోతూ.

అప్పుడు అంజి, “ఏం చేస్తాం? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నట్లు మీకు రాజుగారు ఏ శిక్ష వేసినా మీరు అనుభవించాల్సిందేగా!!" అని బిగ్గరగా నవ్వుతూ ఎడ్లబండిని ముందుకు నడిపాడు!

**సమాప్తం**

Posted in April 2022, కథలు

2 Comments

  1. Prasad UVPRK

    సామెతలతో కథ వ్రాయడం బాగుంది. “చెడుపనులకు తగ్గ శిక్ష అనుభవించేతీరాలి” అన్న ముగింపు కథకు వన్నె తెచ్చింది. అభినందనలు – శైలజప్రసాద్ ఉప్పలూరి

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!