Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
పేదల పెన్నిధి దామోదరం సంజీవయ్య
Damodaram Sanjeevayya

సమాజంలో సామాజిక, ఆర్ధిక అసమానతలు, మనుషులమైన మనం సృష్టించుకున్నవే. తద్వారా సామాజిక హోదాలు, మెరుగైన ఆర్ధిక స్థితిగతులు కల్పించుకొని కొన్ని వర్గాలు, కొంత శాతం మేర మనుషులు బాగుపడ్డారు. వారి పరంపర వారసత్వ తరాలు అన్నీ, ఆ సుఖాలను అనుభవిస్తూ నేటికీ ఆ అసమానతల వైవిధ్యాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈ సూత్రాన్ని, వ్యత్యాసాన్ని మనిషి మేధస్సుకు ఎవ్వరూ ఆపాదించలేరు. ఎన్ని అసమానతలు, వర్ణ వివక్షల విధానంలో సమాజమున్ననూ కూడా మేధా సంపత్తి అనేది పుట్టుకతోనే ప్రతి మనిషికీ అబ్బే ప్రధాన గుణం. దానిని పదునుపెట్టే విధానంలో ఆ మేధస్సు ఎంతో చురుకుగా వ్యవహరించి ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించి, మట్టిలో ఉన్న మాణిక్యం వలె మనిషి ఉనికిని సూచిస్తుంది. ఆ విజ్ఞాన గని అయిన మేధస్సుకు కుల, మత, వర్ణ, వర్గ విబేధాలు ఏవీ ఉండవు. అటువంటి మేధస్సును కలిగి సామాజిక అభివృద్ధి, సర్వ సమానత్వం కొరకు పాటుపడిన మహా మంచి మనిషి శ్రీ దామోదరం సంజీవయ్య నేటి మన ఆదర్శమూర్తి.

Damodaram-Sanjeevayya-PrathamikaSevaSamsthaఫిబ్రవరి 14, 1921 సంవత్సరంలో నేటి కర్నూల్ జిల్లాలోని పెదపాడు లో ఒక సామాన్య పేద దళిత కుటుంబంలో శ్రీ సంజీవయ్య గారు జన్మించారు. తన కుటుంబంలో అందరూ నిరక్షరాస్యులు మరియు కూలినాలి చేసుకుని పొట్టనింపుకునే వారే. కానీ సంజీవయ్య గారి మేథాసంపత్తిని గుర్తించి వారి అన్న గారు ఆయనను చదువుకోమని ప్రోత్సహించారు. పెద్దపాడులోనే ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తిచేసి పిమ్మట కర్నూల్ లోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరి ఎస్.ఎస్.ఎల్.సీ జిల్లాలోనే ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడు. బాల్యంనుండే విశ్లేషించే గుణాలు కలిగి ఎంతో ఉన్నతమైన భావాలను అందిపుచ్చుకుని అందరి దృష్టిలో మంచి పేరును సంపాదించారు.

అగ్రవర్ణాలు, నిమ్నజాతులు అనే బేధభావము అందరి మనసులలో ప్రస్ఫుటంగా ఉన్న ఆ రోజులలో కూడా తన సత్ప్రవర్తన, సేవాభావము, తెలివితేటలతో అన్నీ వర్ణాల ప్రజల మనసును దోచుకొని తన నిబద్దత కలిగిన జీవన శైలితో అన్ని వర్గాలకు చేరువైన మహా మనిషి శ్రీ సంజీవయ్య గారు. మంచి వక్తిత్వమే కాదు స్వతహాగా సంజీవయ్య మంచి వక్త కూడా. మాతృభాష తెలుగు మరియు ఆంగ్లభాష మీద మంచి పట్టు కలిగివుండి ధారాళంగా, జనులందరూ మెచ్చుకునే విధంగా లౌక్యంతో మాట్లాడేవారు. మనిషి మనుగడ సుఖ సంతోషాలతో సాధారణ జీవితానికి అవసరమైన కనీస వసతులను కలిగి ఉంటే చాలుననే భావన ఆయనలో భాగమైంది. కనుకనే ఎన్ని పదవులు, హోదాలు, డబ్బును అతి సులువుగా సంపాదించుకొనే అవకాశాలు ఆయన వెంట ఉన్ననూ ఎన్నడూ తన సిద్ధాంతాలను, విధానాలను విడిచి ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించలేదు. అదే ఆయనను ఆదర్శమూర్తిగా నిలిపింది.

తను చదువుకుంటున్న రోజుల్లో రాజకీయాల మీద దృష్టి పెట్టే అవకాశం గానీ, ఆసక్తి గాని సంజీవయ్య గారికి కలుగలేదు. న్యాయశాస్త్ర పట్టభద్రుడై న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్న పిదప కొంతమంది రాజకీయ నాయకుల పరిచయాలతో మరియు ప్రోత్సాహంతో రాజకీయ రంగంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయన ప్రమేయం లేకుండానే ఎన్నో శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆంద్ర రాష్ట్ర దీర్ఘకాలిగా ప్రయోజనాలను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించడానికి తెలుగు మాధ్యమం అతి ముఖ్యమైన సాధనమని నమ్మి తెలుగు భాష వాడుకను అధికం చేశారు. అలాగే భూసంస్కరణల అమలుకు ప్రభుత్వపరంగా చేయవలిసిన శాసనాలను చేసి ఎంతో మంది పేద రైతులకు చేయూతనిచ్చి వారికి ఎంతో సహాయం చేశారు. అంతేకాదు భావితరాలకు ఉపయోగకరంగా ఉండాలని ‘లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్’ అనే పుస్తకాన్ని రచించారు. గొప్ప విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ముద్రణాలయం అయిన  ఆక్స్ ఫర్డ్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇది సంజీవయ్య గారి మేథో పరిణతికి మరో తార్కాణం.

సంజీవయ్య గారు ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అపుడు ఎన్నో అభివృద్ధి పధకాలను అమలుపరచి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించారు. పదవిలో ఉన్ననూ, లేకున్ననూ ఆయన ఒకే జీవన విధానాన్ని పాటించారు. ఆయన నిరాడంబరతకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

1967లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం సంజీవయ్య గారికి ఒక దుర్దినం అని చెప్పాలి. ఆనాటి నుండి అనేక అనారోగ్య సమస్యలతో పోరాడి 1972 మే 7 న ఆయన స్వర్గస్తులయ్యారు. ఆయన పేరు మీద ఎన్నో ఉద్యానవనాలు మరియు పాఠశాలలు వెలిశాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ పేరును దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ గా మార్చి ఆ మహానుభావునికి ఒక గుర్తింపును కలిగించారు. అది నిజంగా ఎంతో ముదావహము.

Sources: Source 01, Source 02

Posted in April 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!