Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు
తిరువణ్ణామలై - అరుణాచలం

మరుసటి రోజు పొద్దున్నే మేము 5 గంటలకల్లా అరుణగిరీశ్వరుడి దేవాలయంలో ఉన్నాము. ముందర రోజు అలిసి ఉన్నాము, పైగా దాదాపు 3 గంటలు క్యూలో నిలుచున్నా, మాకు దర్శనం బాగా జరగ లేదు. అధికారులని తిట్టుకునే బదులు, పొద్దున్నే దర్శనానికి వెళితే కొంత వెసులుబాటుగా ఉంటుందని అనుకుని వెళ్ళాము. శివుడు మాకు మరొక దర్శనం కూడా అనుగ్రహించాడు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపం ముందు ఒక ఆవు ఉన్నది. దాని చుట్టూ అప్పుడే చాలా మంది చేరి ఉన్నారు. అది ఆలయ గోశాలలో ఉండే ఆవు. గొప్పదనం ఏమిటంటే అది పూర్తిగా ఒకే రంగు - ఒక విధమైన ఆకుపచ్చ, గచ్చకాయ రంగు కలిసిన రంగులో ఉన్నది. అది కపిల గోవు. నేను ఇదివరలో కపిల గోవుల్ని చూసాను కానీ, ఈ రంగులో చూడలేదు. ఎంతో ఆనందం కలిగింది; పొద్దున్నే అంత మంచి దృశ్యం చూసి. ఒక పది రూపాయలు ఇస్తే ఆ ఆవుని కాసే అతను మనకి ఒక రెబ్బ మేత ఇస్తాడు. అది మనం ఆవుకి తినిపించ వచ్చు. మేము అలా చేసి ఆవుకి ప్రదక్షిణం చేసుకుని, దణ్ణం పెట్టుకున్నాము. అమెరికాలో ఉండే ఆవులు నిజమైన ఆవులు కావు. అవి (జెర్సీ ఆవులంటారే, అవి) గేదె జాతికి చెందినవి. A1 టైపు పాలు ఇస్తాయి. మన దేశవాళీ ఆవులు అసలైన ఆవులు. అవి A2 టైపు పాలిస్తాయి. ఇవి మంచి పాలు. పసి పిల్లలకి ఆరోగ్యవంతమైన పాలు. రుచి కూడా బాగుంటుంది. మేము అమెరికాలో ఎదో ఆవు పాలనుకుని జెర్సీ గేదె పాలే తాగుతూ తృప్తి పడుతున్నాము.

ఈ ఆలయం చాలా పురాతనమైనదని చెప్పచ్చు. చాలా పెద్ద గుడి. పెద్ద పెద్ద స్తంభాలతో పొడుగైన దార్లు ఉన్నాయి. ఆవరణలో కొన్ని గుళ్ళున్నాయి. మొదటి ప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలున్నాయి. కింద ఫోటోలు చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. రెండో ప్రాకారంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, ప్రధాన ఆలయ భాగంగా విఘ్నేశ్వర ఆలయం ఉన్నాయి. ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు. అర్చకుడు చెయ్యెత్తి అభిషేకం చేద్దామన్నా అందనంత ఎత్తుగా ఉన్నాడు. పొద్దున్న అప్పటికే చాలా మంది ఉన్నా, దర్శనం బాగా అయింది. అదే అవకాశమనుకుని మళ్ళీ వెనక్కి వెళ్లి ఇంకోసారి దర్శనం చేసుకున్నాము. స్వామి వారి క్యూ మొదట్లో పెద్ద యక్షిణి విగ్రహాలున్నాయి. చేతిలో కత్తితో రక్షణ వ్యవస్థ నడుపుతున్నట్లున్నాయి. దీనివల్ల నాకు తెలిసిందేమిటంటే ఇదివరలో రక్షణకి ఆడ, మగ అనే తేడా లేకుండా పనితనం ఉన్నవారినే ఎంచుకునేవారని. రక్షక భటులలో లింగ భేదం పాటించేవారు కాదని.

ఈ ఆలయం చోళులకంటే ముందుదని అన్నారు. చోళులు దీనిని బాగా అభివృద్ధి చేసారు. అంటే ఇప్పటికి 1300 ఏళ్ల కంటే పురాతనమైనది. ఎంత పురాతనమైనదో నేను కనిపెట్టలేక పోయాను. కృష్ణదేవరాయలు దీనిని బాగా పోషించినట్లు అక్కడ శిలా శాసనాలు ఉన్నాయి. నాయక రాజులు కూడా దీనిని బాగా అభివృద్ధి చేశారు. గుడి ద్వారం ఇరుపక్కలా గొప్ప ద్వారపాలకుల శిల్పాలు ఉన్నాయి. ఆలయంలో బ్రహ్మ, పార్వతి, వైష్ణవి, వారాహి శిల్పాలు కనబడతాయి. అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ శివుణ్ణి విశేషంగా అర్చిస్తారు. మేము టికెట్టు కొన్నా, విశేష పూజ లభ్యం కాలేదు. ఎదో ఒకే సమయంలో చేస్తారట. కానీ శివుడి ముందుకు వెళ్ళేటప్పటికి ఇంతసేపు నిలుచున్న శ్రమ మర్చిపోతాం. చాలా బాగుంటుంది. ఆలయ ప్రధాన గోపురం 9 అంతస్తులతో 9 కలశాలతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ గోపురానికి రంగులు వెయ్యలేదు. ఒక్క బూడిద రంగు మాత్రమే వేశారు. దాంతో ఒక అందం వచ్చింది. ధ్వజ స్తంభం బంగారు తాపడంతో ఉన్నది.

శివాలయాన్ని ఆనుకునే అమ్మవారి ఆలయం ఉన్నది. అమ్మవారి ఆలయం ముందు నీరాజనం మనమే వెలిగించుకోవచ్చు. నవగ్రహ మంటపం చాలా పెద్దది; పూర్తిగా తెరిచే ఉంటుంది, కానీ మొత్తం ఆలయం కప్పు కిందే ఉంటుంది. ఆలయం లోపలకి వెళితే కుడి, ఎడమవైపులు రెండువైపులా మెట్లుంటాయి. కుడివైపు వెళితే గర్భ గుడికి కొంత దగ్గిరగా వెళ్ళచ్చు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందర, ధ్రువ విగ్రహం వెనకాల ఉంటాయి. అందమైన అమ్మవారు. తోపులాటలున్నా, భక్తిగా అమ్మవారికి దణ్ణం పెట్టుకుని బయటకు వచ్చాము.

నిన్న అనుకున్నట్లు 7.30 కల్లా రమణాశ్రమం చేరుకొని, అక్కడ మా గైడ్ ని కలిసి, కొండ ఎక్కడం మొదలు పెట్టాము. ఇది 2600 అడుగుల ఎత్తున్న కొండ.  దారి అంతా రాళ్లతోనే ఉంటుంది. ఈ కొండరాళ్ళని శాస్త్రీయంగా పరిశీలించారని, అవి అతి ప్రాచీనమైనవని, వాటి వయసు లెక్క కట్టడం సాధ్యం కాదని చెప్పారు. లింగోద్భవ కాలంలో బ్రహ్మ విష్ణులు జ్యోతిర్లింగం చివర్లు చూడడానికి పైకి, కిందకి వెళ్లగా చాతకాక వెనక్కి వచ్చిన కథ - నేను పూర్తిగా చెప్పట్లేదు - ఆ అగ్ని లింగమే ఈ కొండ అని చెప్పారు.

RamanaMaharshi-Pic-HillRoad
కొండదారిలో రమణమహర్షి చిత్రం
Stone-RamanaMaharshi-Sat
రమణమహర్షి తరచుగా కూర్చున్న శిల
Cement-Well
సిమెంటుతో కట్టిన బావి

అందుకే ఈ కొండ ఎక్కేటప్పుడు చెప్పులు వేసుకోరాదనీ చెప్పారు. ముందు రమణ మహర్షి మామూలుగా ఎక్కడ కూర్చునేవారో చూపించాడు మా గైడ్. పెద్ద రాయి ముందు చిన్న రాళ్లు కూర్చోడానికి బాగున్నాయి. ఆయన కూర్చున్న చోట మనం చేత్తో ముట్టుకోగలిగామని తృప్తి చెందాము. అయినా, నీకు ఆయన ఇక్కడే కూర్చునేవారని ఎలా తెలుసు? అని ప్రశ్నించాను. అతనన్నాడు, ఆయన బతికుండగా ఆయనతో ఈ కొండలు ఎక్కిన ఒకాయన ఇంకా బతికే ఉన్నాడనీ, ఆయనే ఇవన్నీ అందరికీ చూపించాడని, ఈ ప్రదేశాలు చాలామందికి తెలుసనీ చెప్పాడు. అలా కొన్ని చూసి, ఇంకా పైకి ఎక్కి ఒక చోట ఒక రాయిలో పల్లంగా ఉండడం, ఆ పల్లం చుట్టూతా సిమెంటుతో చిన్న గోడలాగా కట్టి ఉండడం చూసాము. వేసవి కాలంలో ఎప్పుడూ ఈ కొండా మీద మండిపోయే ఎండలుంటాయిట. ఎక్కడా చుక్క మంచి నీళ్లు దొరకక జంతువులూ, పక్షులు మలమల మాడుతుంటాయట. అది చూడలేని రమణ మహర్షి కింద ఆశ్రమం నించి ఒక బిందెలో నీళ్లు మోసుకుని వచ్చి ఈ రాయి మీద పోయంగానే రక రకాల పక్షులు, జంతువులూ వచ్చి ఆ నీళ్లు తాగేవిట. ఆయన్ని చూడగానే అక్కడకి చేరడం వాటికి అలవాటు అయిపోయిందట. చాలా కోతులు కూడా ఆయన దగ్గరకి వచ్చి ఆయనతో మాట్లాడేవిట.

Skandhashramam
స్కందాశ్రమం

రమణ మహర్షి 17 ఏళ్ళు ఈ కొండపైన 'విరూపాక్ష గుహలు ' అన్న చోట తపస్సు చేసి సిద్ధి పొందారుట. ఈ దారి సుమారు గంటన్నర పైన ఎక్కి, 'స్కందాశ్రమం ' అనే ఆశ్రమంకి చేరుకున్నాము. అక్కడ నించి కిందకి విరూపాక్ష గుహకి వెళ్లాలంటే చాలా శ్రమ అయింది. మొత్తానికి అక్కడకి వెళ్ళాము. ఒక ద్వారం నించి లోపలకి వెడితే ముందు ఒక చిన్న గదిలాగా ఉన్నది. ఒక రాయి మీద పడుకోడానికి దుప్పటి వేసి ఉన్నది. అక్కడ చాలా తక్కువ ఎత్తులో ప్రవేశం ఉన్న గుహ ఉన్నది. వంగి లోపలకి వెళితే నాకు కొన్ని నిమిషాలు ఏమీ కనబడలేదు. అంతా చీకటిగా ఉన్నది. కూర్చుండిపోయాము. చాలాసేపటి తరువాత కళ్ళు కొంచెం కనబడడంవల్ల జాగ్రత్తగా చూస్తే  ఆ గుహ లోపల ఎత్తుగానే ఉంది, వెనక ఒక చక్కటి వేదిక లాగా ఉన్నది. దానిపైన రమణ మహర్షి ఫోటో, దాని ముందర నీళ్లలో పూలు వేసిన ఒక పళ్లెం, చిన్న దీపం కనబడ్డాయి. ఇవన్నిటి కన్నా నాకు ఆ విరూపాక్ష గుహ లోకి వెళ్ళగానే చాలా వేడిగా, ఎవరో నన్ను పట్టుకున్నట్లు, అనిపించింది. భయం ఏమీ లేదు; ఇంకా కొంత మంది కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. మేము ఆలా కొంత సేపు కూర్చుని, బయటకు వచ్చేసాము. మళ్ళీ ఎక్కుతూ స్కందాశ్రమం చేరుకున్నాము. ఫోటోలు చూడండి. ఎక్కడా ఎవరూ మాట్లాడరు. నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని ఒక పాశ్చాత్యుడు నడుపుతున్నాడు. ఆయన కిందనించి కావిడ మోసుకుని చెప్పులు లేకుండా కొండ ఎక్కడం నేను చూసాను. అలాగే ఇంకొంత మంది పాశ్చాత్యులు, ఆడ, మగ ఎక్కడం చూస్తాము.

ఈ స్కందాశ్రమంలో రమణులు 7 సంవత్సరాలు గడిపారట. అక్కడ ఒక చిన్న గదిలో ఆయన ఫోటో ఒకటి పెట్టి చిన్న దీపం పెట్టి ఉన్నది. వెనక కొండ. పక్కలలో ఒక పక్క కొండ. రెండో పక్క మామూలు గోడ. నేను లోపలకి వెళ్లి, ఆ ఫోటోకి పక్కగా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. ఇప్పటికి 9, 9.30 అయింది, పొద్దున. లోపల కూర్చోగానే చాలా తీవ్రమైన వేడి తెలిసింది. మన చుట్టూతా మనం ఎదో కాలిపోతున్న ఫీలింగు. ఈ వేడి అంతా కొండ వైపు నించే అని మాత్రం తెలిసింది. నాకు మస్తిష్కంలో ఏమిటో తెల్ల తెల్లగా ఏవో రూపాలు అన్నట్లు తెలిసింది. అవి ఎందుకు ఆలా కనిపించాయి అనేది తెలియలేదు. చాలా సేపు అలోచించి, నేను బాగా అలిసిపోయాను కనుక, ఈ వేడిలో నాకు ఒక రకమైన భ్రాంతి కలిగిందని అనుకున్నాను. చదువరులలో ఎవరికైనా ఇక్కడ ఇలాంటి అనుభూతి కలిగి ఉంటే నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన.

ArunachalaTemple-AerialView
కొండపైనుంచి అరుణాచలేశ్వరాలయం

కొండ మీద దారి మధ్యలో  నిమ్మ షోడా దొరికింది. ఎవరో పుణ్యం కట్టుకున్నాడు. ఎక్కేటప్పుడూ, దిగేటప్పుడూ తాగాము. దిగడానికిఅంత సమయమూ పట్టింది. పూర్తిగా అలిసి పోయాము. ఎండా మాడుతున్నది. కొండ పైనించి అరుణేశ్వరుడి ఆలయం చాలా బాగా కనిపిస్తుంది. ఫొటోలో చూడండి. అన్ని వేల  ఏళ్ల క్రితం అంత మంచి కట్టడాలు - పెర్ఫెక్టు చతురస్రంలో - ఎలా కట్టారో ఆలోచిస్తే ట్రిగనామెట్రీ  కనిపెట్టింది మనవాళ్లే కదా, ఇది కట్టలేరా అని అనుకున్నాను.

కిందికి రాగానే ఆశ్రమంలో జన సామాన్యానికి భోజన సంతర్పణ చేస్తున్నారు. 6 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద పెద్ద గిన్నెల్లో చిత్రాన్నం, తోటకూర కూటు అన్నం, పెరుగన్నం ఎవరో తెచ్చారు. అవి ప్లేట్లలో పెట్టి ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరికీ ఉచితంగా పంచి పెడుతున్నారు. అది తినేటప్పటికి  మాకు కడుపు నిండి పోయింది. హాయిగా హోటలుకొచ్చి, కొంత సేపు విశ్రాంతి తీసుకుని, కంచికి బయలుదేరాము.

ఇదివరలో అన్నట్లు, ఎవరికైనా జీవితంలో 'అరుణాచలం వెళ్లక ముందర, అరుణాచలం వెళ్ళాక' అనే రెండు భాగాలుంటాయని అంటారు. అందరూ తప్పక చూడవలసిన క్షేత్రం. కొంచెం ఆలోచించి చూస్తే శిల్ప పరంగా, వాస్తు పరంగా, శాస్త్ర, పురాణ పరంగా, తత్వ పరంగా, మహనీయుల జీవిత విశేషాలతో చాలా అద్భుతంగా ఉండే ఈ క్షేత్రం సామాన్యమైనది కాదు. ఇంత అద్భుతమైన క్షేత్రం చూడడం నా అదృష్టం.

### సశేషం ###

Posted in April 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!